తమిళనాడు: టీవీకే గెలుపు ఏం చెబుతోంది, ‘కూటములపై’ ప్రజలు ఏం చెప్పారు?

    • రచయిత, సంజయ్ కుమార్,
    • హోదా, విశ్లేషకుడు
    • రచయిత, విభ అత్రి, అరిందమ్ కబీర్
    • హోదా, పరిశోధకులు, లోక్‌నీతి, సీఎస్‌డీఎస్
  • చదివే సమయం: 6 నిమిషాలు

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే విజయం మెజారిటీ రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే గణనీయమైన సంఖ్యలో సీట్లు, ఓట్ షేర్ సాధిస్తుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ, ఈ స్థాయి విజయాన్ని ఎవరూ ఊహించలేదు.

108 స్థానాలు, 34.92 శాతం ఓట్లతో తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది.

దశాబ్దాలుగా డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీల ఆధిపత్యం కొనసాగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఇటువంటి ఫలితం చాలా అరుదు.

ఒక కొత్త పార్టీ ఈ స్థాయి విజయాన్ని సాధించడం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ఓ కీలక మార్పును సూచిస్తోంది.

ఎన్నికల అనంతరం 'పోల్స్‌మ్యాప్' అందించిన గణాంకాల ప్రకారం, అధికార డీఎంకే పై ఉన్న బలమైన ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఫలితాన్ని నిర్దేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తితో ఉన్న ఓటర్లు ఈ తీర్పునిచ్చారు.

అదే సమయంలో విజయ్‌కున్న ప్రజాదరణ, ఆయన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న గట్టి నమ్మకంతో పాటు యువత, పట్టణ ప్రాంత ఓటర్లు, మహిళా ఓటర్ల నుంచి లభించిన మద్దతు టీవీకేకు ఎంతగానో కలిసివచ్చాయి.

ఈ గణాంకాలు డీఎంకే ప్రభుత్వంపై ఉన్న స్పష్టమైన అసంతృప్తిని సూచిస్తున్నాయి. ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు కనిపిస్తోంది.

'మార్పు' కోరుకున్న తమిళనాడు ప్రజలు...

డీఎంకే ప్రభుత్వ పనితీరుపై కేవలం 22 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా, 28 శాతం మంది పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. మెజారిటీ ఓటర్లు మార్పును కోరుకోవడం ఈ సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేస్తోంది.

ప్రతి ఐదుగురు ఓటర్లలో దాదాపు ముగ్గురు (58%) డీఎంకేకు మరో అవకాశం ఇవ్వకూడదని చెప్పగా, కేవలం 34 శాతం మంది మాత్రమే ఆ పార్టీ కొనసాగింపును సమర్థించారు.

ఈ అసంతృప్తి ఓటర్ల తీర్పుపై కూడా ప్రభావం చూపింది. డీఎంకే ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఓటర్లు ఏఐఏడీఎంకే కూటమి వైపు లేదా టీవీకే వైపు మొగ్గు చూపారు. అయితే, ఏఐఏడీఎంకేతో పోలిస్తే టీవీకేను ఎంచుకున్న ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వం పట్ల కొంతవరకు సంతృప్తిగా ఉన్న వారి మద్దతు డీఎంకే, టీవీకేల మధ్య దాదాపు సమానంగా (వరుసగా 35 శాతం, 32 శాతం) చీలిపోయింది.

టీవీకే కేవలం అసంతృప్తితో ఉన్న ఓటర్లనే కాకుండా, కొంతవరకు సంతృప్తిగా ఉన్న ఓటర్లలో కూడా గణనీయమైన వాటాను ఆకర్షించగలిగింది.

దీన్నిబట్టి, టీవీకే కేవలం ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాకుండా, అంతకు మించిన విస్తృతమైన ప్రజాదరణతో విజయం సాధించిందని అర్థమవుతోంది.

కూటములపై వ్యతిరేకతే కాదు..

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం కూడా టీవీకేకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

పాలనాపరమైన అంశాల్లో సాంప్రదాయ కూటములైన డీఎంకే, ఏఐఏడీఎంకేలలో దేనికీ ఓటర్లు స్పష్టమైన ప్రాధాన్యం ఇవ్వలేదని గణాంకాలు సూచిస్తున్నాయి.

అభివృద్ధి, ఉద్యోగ కల్పన, ధరల నియంత్రణ వంటి సమస్యలను పరిష్కరించడంలో ఏ పార్టీ ఉత్తమమైనదని ఓటర్లను ప్రశ్నించినప్పుడు, ప్రతి పది మందిలో ముగ్గురు (సుమారు 30 శాతం) ఏ పార్టీ కూడా సరైనది కాదని సమాధానమిచ్చారు.

ఇది ఇప్పటికే ఉన్న రాజకీయ ప్రత్యామ్నాయాలపై ప్రజల్లో నెలకొన్న అపనమ్మకాన్ని సూచిస్తోంది. ఈ రాజకీయ శూన్యతే టీవీకే వంటి కొత్త పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా తనను తాను నిలబెట్టుకోవడానికి అవకాశం కల్పించింది.

టీవీకే ప్రదర్శనకు ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న అవగాహన కూడా తోడైనట్లు కనిపిస్తోంది.

దాదాపు ప్రతి 10 మంది ఓటర్లలో 8 మంది టీవీకే గురించి విన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది ఒక కొత్త రాజకీయ పార్టీ ప్రజల్లోకి విజయవంతంగా దూసుకెళ్లిందని, విస్తృత స్థాయి ఓటర్లకు చేరువైందని సూచిస్తోంది. ఇదే ఆ పార్టీకి తన ఎన్నికల ఉనికిని చాటుకోవడంలో ముందస్తు ప్రయోజనాన్ని చేకూర్చింది.

విజయ్‌పైనే విశ్వాసం...

కేవలం టీవీకే పార్టీపై అవగాహనే కాకుండా, విజయ్ పై ఓటర్లకు విశ్వాసం కూడా ఎక్కువే ఉంది.

విజయ్ తమిళనాడు రాజకీయాల్లో అర్థవంతమైన మార్పు తీసుకురాగల సమర్థుడైన నాయకుడని 54 శాతం మంది ఓటర్లు భావించగా,ఆయనకు రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల ఆయన సామర్థ్యంపై 35 శాతం మంది సందేహం వ్యక్తం చేశారు.

విజయ్‌ను సమర్థుడైన నాయకుడిగా భావించిన వారిలో, ప్రతి పది మందిలో ఆరుగురు టీవీకేకు ఓటు వేశారు. విశేషమేమిటంటే, ఆయన సామర్థ్యంపై సందేహాలు ఉన్న వారిలో కూడా పది మందిలో ఒకరు టీవీకేకు ఓటు వేశారు.

విజయ్ నాయకత్వంపై ఉన్న నమ్మకం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వ ప్రాధాన్యాల్లో కూడా ప్రతిబింబించింది.

34 శాతం మంది ఓటర్ల మద్దతుతో విజయ్ అందరికంటే ఇష్టమైన నాయకుడిగా నిలిచారు. ఇది కె.పళనిస్వామి (24 శాతం), తాజా మాజీ ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (23 శాతం) కంటే చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం.

విజయ్‌కు ముఖ్యంగా యువ ఓటర్లలో అత్యంత బలమైన మద్దతు లభించింది.

18-25 ఏళ్ల వయస్సు గల ఓటర్లలో ప్రతి పది మందిలో ఆరుగురు టీవీకేకు ఓటు వేశారు. ఇది డీఎంకే, ఏఐఏడీఎంకే కూటముల కంటే చాలా ఎక్కువ.

అలాగే, 26-35 ఏళ్ల వయస్సు వర్గంలో కూడా టీవీకే 42 శాతం మద్దతును సాధించి, అగ్రగామిగా నిలిచింది.

వయస్సు పెరిగేకొద్దీ మద్దతు తగ్గినప్పటికీ, యువ ఓటర్ల నుంచి లభించిన ఈ భారీ మద్దతు టీవీకేకు నిర్ణయాత్మకమైన ఆధిక్యాన్ని ఇచ్చింది. యువతలో ఆ పార్టీని ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టింది.

మహిళా, పురుష ఓటర్లవారీగా ఓటింగ్ సరళిని పరిశీలిస్తే పార్టీల మద్దతులో ఒక ముఖ్యమైన వ్యత్యాసం కనిపిస్తుంది.

డీఎంకే, టీవీకే రెండు పార్టీలు కూడా పురుషులలో దాదాపు సమాన స్థాయి మద్దతును పొందాయి. అలాగే ఏఐఏడీఎంకే కూడా ఈ వర్గంలో బలంగానే నిలిచింది.

దీనికి భిన్నంగా, మహిళా ఓటర్లలో టీవీకే స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది.

డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పోలిస్తే మహిళల నుంచి టీవీకేకు అత్యధిక స్థాయి మద్దతు లభించింది

పట్టణ ప్రాంతాల్లో టీవీకే గణనీయంగా మెరుగైన ప్రదర్శన కనబరిచింది.

గ్రామీణ ప్రాంతాల్లో టీవీకేకు 28 శాతం మద్దతు లభించగా, పట్టణాల్లో ఏకంగా 42 శాతం ఓటర్లు మద్దతు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో టీవీకే బలం సాపేక్షికంగా తక్కువగా ఉండగా, డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములు అక్కడ గట్టి పోటీని ఇచ్చాయి.

ఈ సరళినిచూస్తే, టీవీకే సందేశాలు, సెలబ్రిటీ నాయకత్వం, యువతను ఆకర్షించే విధానాలు పట్టణాల్లో మరింత ప్రభావవంతంగా పనిచేసినట్లు అర్థమవుతోంది.

టీవీకే భవిష్యత్తు పయనం...

టీవీకే భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఇది ఒకే ఒక్కసారి వచ్చిన అరుదైన విజయంలా మిగిలిపోతుందా లేదా రాష్ట్రంలో ఒక ప్రముఖ దీర్ఘకాలిక రాజకీయ శక్తిగా స్థిరపడుతుందా అనేది చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

నాయకుడి ప్రజాదరణ ఆధారంగా ఏర్పడిన ఒక సరికొత్త 'మూడవ పార్టీ' ఒక శక్తిమంతమైన రాజకీయ పక్షంగా ఎదిగి, రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందనడానికి టీవీకే భారత రాజకీయాల్లో ఒక నిదర్శనంగా నిలుస్తుంది.

అయితే, తన మొదటి ఎన్నికల్లోనే ఓట్ల శాతం, సీట్ల సంఖ్యా పరంగా ఇంతటి భారీ మద్దతును పొందిన రాజకీయ పార్టీ, భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తూ కొనసాగుతుందనేది అత్యంత ఆసక్తికరమైన అంశం.

(అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)