You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఫైజానుల్లా : నోటితో పరీక్షరాసి టెన్త్ టాపర్‌గా నిలిచిన విద్యార్థి
- రచయిత, మొహమ్మద్ సర్తాజ్ అలం
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 6 నిమిషాలు
పదోతరగతి ఫలితాలు వచ్చినప్పుడు సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న మహమ్మద్ ఫైజానుల్లాకు సంబంధించిన వీడియో ఒకటి ప్రజల హృదయాలను గెలుచుకుంది.
ఆ వీడియోలో ఆయన తన పళ్ళ మధ్య పెన్ను పెట్టుకుని కాగితంపై రాస్తూ కనిపించారు. నిజానికి సెర్రిబల్ పాల్సీ కారణంగా ఫైజానుల్లాకు చిన్నప్పటి నుంచే కాళ్లు,చేతులు సరిగ్గా పనిచేసేవి కావు. అయినా బాగా చదువుకోవాలని ఆయనతోపాటు, ఆయన కుటుంబం కూడా బలంగా కోరుకుంది.
ఝార్ఖండ్ టెన్త్ బోర్డు పరీక్షలో 93 శాతం మార్కులు సాధించి " వికలాంగుల విభాగం"లో టాపర్‌గా నిలిచారు ఫైజానుల్లా. పరీక్ష రాయడానికి సహాయకుడు అందుబాటులో ఉన్నప్పటికీ ఎక్కువ భాగం ఫైజానుల్లా పళ్లమధ్య పెన్నపెట్టుకుని స్వయంగా రాశారు.
పుట్టుకతోనే పోరాటం మొదలు
గొడ్డా పట్టణానికి చెందిన ఫైజానుల్లా అనారోగ్యం వల్ల ఇతర పిల్లల్లా ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేకపోయాడు. కానీ ఆయనకు కుటుంబం, ఉపాధ్యాయులు అండగా నిలిచారు.
"నేను బడిలో చదువుకోలేకపోయాను. కానీ, ఇప్పుడు దాని గురించి బాధపడటం లేదు. ఎందుకంటే కనీసం చదువు విషయంలోనైనా నేను సాధారణ పిల్లల కంటే ఏమాత్రం తక్కువ కాదని నా మార్కులే చూపిస్తున్నాయి" అన్నారు ఫైజానుల్లా.
ఫైజానుల్లా కుటుంబం శివాజీ నగర్‌లోని రెండు గదుల ఇంట్లో నివసిస్తోంది.
ఈ చిన్న గదులలో ఒకటి దుకాణం నడపడానికి ఉపయోగిస్తుండగా మరొక గదిలో కుటుంబం మొత్తం నివసిస్తోంది.
ఫైజానుల్లాకు 6 నెలల వయసు ఉన్నప్పుడు ఆయన అనారోగ్యం గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది. బిడ్డలో కదలికలు లేకపోవడాన్ని ఆయన అమ్మమ్మ గమనించారు.
"మా అబ్బాయి సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధితో బాధపడుతున్నాడని స్థానిక డాక్టర్ ద్వారా మాకు తెలిసింది" అని ఫైజానుల్లా తండ్రి మహమ్మద్ అన్వర్ ఆలం బాధగా అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
‘స్పష్టంగా మాట్లాడగలడు’
కొడుకు పుట్టుకతోనే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని డాక్టర్ మాటల ద్వారా ఫైజానుల్లా తండ్రి అన్వర్‌కు అర్థమైంది. ఆ సమయంలో అన్వర్‌కు ఆ వ్యాధి గురించి ఏమాత్రం తెలియదు. బంధువుల సలహా మేరకు ఆయన తన కుమారుడికి కోల్‌కతాలో చికిత్స చేయించారు. ఏళ్లు గడిచినా పరిస్థితి మెరుగుపడలేదు.
అయితే ఇతర ఆరోగ్యకరమైన పిల్లల్లాగే సరైన వయసులో ఫైజానుల్లా మాట్లాడటం మొదలుపెట్టినప్పుడే తమకు ఓ ఆశ కలిగిందని తల్లి నజ్మా చెప్పారు.
"ఫైజానుల్లా కదలలేకపోయేవాడు. నిలబడలేకపోయేవాడు. కూర్చోలేకపోయేవాడు. కానీ వయసు పెరిగేకొద్దీ మాట్లాడటం మొదలుపెట్టాడు. సాధారణ పిల్లల్లానే ఫైజానుల్లా మాట్లాడగలగడం మా భవిష్యత్తుకు ఒక ఆశ కల్పించింది" అని ఆమె తెలిపారు.
ఐదేళ్ల వయస్సు నుంచి అన్వర్ క్రమంగా మాటల ద్వారా ఫైజానుల్లాకు బోధించడం ప్రారంభించారు. అన్వర్ ఒక ప్రైవేట్ మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.
ఇంట్లోనే కుమారుడికి ఉర్దూ, అరబిక్, హిందీ, ఇంగ్లీష్, గణితం నేర్పించేవారు. ఫైజానుల్లాకు ఎనిమిదేళ్లు నిండినప్పుడు స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. అయితే కాళ్లు, చేతులు సరిగా పనిచేయకపోవడంతో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లలేకపోయాడు.
ఆ తర్వాత స్థానిక ఉపాధ్యాయుడైన ఆదిల్ హుస్సేన్ ఫైజానుల్లాకు ఇంట్లోనే పాఠాలు చెప్పడం ప్రారంభించారు.
ఒక ఉపాధ్యాయుడిగా కేవలం మౌఖిక విద్య సరిపోదని ఫైజానుల్లా తండ్రి అన్వర్‌కు తెలుసు. ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫైజానుల్లాకు రాయడం నేర్పించలేకపోయారు.
"శివాజీ నగర్‌లోని హయ్యర్ అప్‌గ్రేడెడ్ స్కూల్లో ఫైజానుల్లా ఆరో తరగతిలో చేరినప్పుడు అక్కడి ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్ భగత్ మాకు ఒక దేవదూతలా కనిపించారు" అని అన్వర్ చెప్పారు.
నోటి రాత ప్రాక్టీస్ చేయించిన టీచర్
ఝార్ఖండ్ విద్యా ప్రాజెక్ట్ కింద గొడ్డాలోని బ్లాక్ రిసోర్స్ సెంటర్లో వికలాంగ పిల్లలకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్ భగత్‌ను ప్రత్యేక బోధనా నిపుణుడిగా నియమించారు.
"ఫైజానుల్లా పాఠశాలకు రాకపోవడానికి కారణం తెలిసిన తర్వాత నేనే స్వయంగా వాళ్ల ఇంటికి వెళ్ళాను. ఫైజానుల్లా ఐక్యూ స్థాయి, ఆత్మవిశ్వాసం, బలమైన సంకల్ప శక్తి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి"
"ఎలాగైనా ఫైజానుల్లా చదువుకునేలా చేయాలని నిర్ణయించుకున్నాను. అతనికి ఇంట్లోనే బోధించడం ప్రారంభించా" అని జితేంద్రకుమార్ భగత్ చెప్పారు.
రాయలేకపోవడమే ఫైజానుల్లాకు అతిపెద్ద సమస్య అని ఆయనన్నారు.
మొదట్లో పెన్నుకు దారం కట్టి ఫైజానుల్లాతో రాయించడానికి కూడా జితేంద్రకుమార్ ప్రయత్నించారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.
"2022లో ఫైజానుల్లా పళ్ళ మధ్య పెన్ను ఉంచి ఓ గీత గీసేలా ప్రయత్నించమని చెప్పాను. క్రమంగా ఈ ప్రయత్నం ఫలించినట్టు అనిపించింది. ఫైజనుల్లా రాయగలిగాడు. తరువాత అతని దస్తూరి మెరుగుపడింది’’
"నేను ఎనిమిదో తరగతికి వచ్చేసరికి నా రాత ఎంత చక్కగా తయారయ్యాందంటే... మరో పిల్లాడు రాసినది, నేను రాసింది పక్కపక్కనే పెట్టి చూస్తే, నేను రాసింది ఏదో, సాధారణ పిల్లాడు రాసింది ఏదో ఎవరూ తేడా చెప్పలేకపోయేవారు" అని ఫైజానుల్లా చెప్పారు.
ల్యాప్‌టాప్ బహుమతి
ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్ భగత్ కృషి, ఫైజానుల్లా అంకితభావం ఫలితంగా అతను 8 , 9 తరగతుల పరీక్షలను స్వయంగా రాసి పాఠశాలలోని జనరల్ కేటగిరీలోనూ టాపర్‌గా నిలిచాడు.
ఈ ఫలితాల తర్వాత 2025 ఫిబ్రవరిలో జిల్లా విద్యాశాఖ నిర్వహించిన 'విద్య ప్రాముఖ్యత' అనే వక్తృత్వ పోటీల్లో మొదటి స్థానం సాధించి బహుమతిగా ల్యాప్‌టాప్‌ను అందుకున్నప్పుడు ఫైజానుల్లా మానసిక ధైర్యం మరింత బలపడింది.
"నా వేళ్లు సరిగ్గా కదలవు. కానీ రెండు వేళ్లతో ల్యాప్‌టాప్ కీబోర్డ్‌ను వాడగలను" అని ఫైజానుల్లా చెప్పాడు.
ల్యాప్‌టాప్ వచ్చిన తర్వాత ఫైజానుల్లా ఎంఎస్ ఎక్సెల్, పవర్‌పాయింట్, ఏఐ వాడటం కూడా నేర్చుకున్నాడు.
ఇప్పుడు ఆయన తన చదువులో టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాడు.
''నేను ఎన్సీఈఆర్టీలోని ప్రతి చాప్టర్ పీడీఎఫ్‌ను చాట్‌జీపీటీలో అప్లోడ్ చేసి దానికి సంబంధించిన అన్ని ప్రశ్నలను అందించమని అడుగుతాను. ఆ తర్వాత నేను ఆ ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు రాసుకుంటాను'' అని ఫైజానుల్లా చెప్పాడు.
"దీని వల్ల ఫైజానుల్లా రోజురోజుకీ రోజురోజుకూ మెరుగుపడ్డాడు" అని జితేంద్ర కుమార్ భగత్ చెప్పారు.
ఈ విధంగా సన్నద్ధమవుతుండడంతో తాను బోర్డు పరీక్షలో మంచి మార్కులతో పాసవ్వగలనని 10వ తరగతి మధ్యలో ఉండగానే ఫైజానుల్లాకు అనిపించింది.
''జితేంద్ర సర్ నిరంతరం రివిజన్ చేయమని పట్టుబట్టేవారు. నేను కంఠస్థం చేసిన సమాధానాలను మర్చిపోకుండా ఉండేందుకు వాటిని పదిసార్లు రాయించేవారు" అని ఫైజానుల్లా తెలిపాడు.
‘సొంతంగా రాస్తేనే సంతృప్తి’
పరీక్షల్లో రాయలేని వారి కోసం ఒక సహాయకుణ్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఫైజానుల్లా అతనిపై పూర్తిగా ఆధారపడలేదు.
నోటితో రాసి అలిసిపోయినప్పుడు కొంత సహాయం తీసుకునేవాణ్ణని ఫైజానుల్లా చెప్పాడు.
"ఒక విషయాన్ని ఇతరులకు చెప్పి రాయించడం కంటే, దాన్ని స్వయంగా రాస్తే కలిగే సంతృప్తి వేరు. ఉదాహరణకు గణితం విషయాన్నే తీసుకోండి. ఈ పేపర్‌ను నేను ఇతరులకు ఎలా చెప్పగలను? అందుకే మ్యాథ్స్ ఎగ్జామ్‌ను నేనే స్వయంగా రాశాను" అని ఫైజానుల్లా చెప్పారు.
గణితంలో 98 మార్కులు సాధించిన ఫైజానుల్లాకు ఒకవైపు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని కలవాలనే కోరిక, మరోవైపు సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే ఆకాంక్ష ఉన్నాయి.
ఫైజానుల్లా సాధించిన ఘనతపై శివాజీ నగర్‌లోని అతని పాఠశాల ఉచ్చ ఉత్క్రమిత్ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎల్.ఎఫ్. మరాండీ సంతోషం వ్యక్తంచేశారు.
"ఫైజానుల్లా లాంటి విద్యార్థి ఉండటం, ఐదేళ్లుగా అతడిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు జితేంద్ర కుమార్ భగత్ సేవలు మాకు లభించడం గర్వకారణం. ఇద్దరూ అమూల్యమైనవారు. ఇద్దరికీ భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండాలని కోరుకుంటున్నా" అని ఆయన సంతోషంతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)