‘అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు’ అని 1996లో రజినీకాంత్ ఎందుకన్నారు?

    • రచయిత, శంకరనారాయణన్ సుడలై
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

‘‘అత్యున్నత స్థాయి సినీజీవితాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాను’’ రాజకీయ సభల్లో ఈ మాటను టీవీకే అధినేత విజయ్ తరచూ చెబుతూ వచ్చారు. ఈ మాటలను ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తల ప్రచారంగా మలచగా, మరోవైపు ప్రతిపక్షాల విమర్శలకు కూడా కారణమైంది.

విజయ్‌లాగే సినీరంగంలో అత్యున్నతస్థాయిని అందుకున్న అనేకమంది నటులకు రాజకీయాలపై ఆసక్తి ఉండి ఉండొచ్చు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరిచిన రజినీకాంత్, రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో పోటీచేసిన కమల్ హాసన్ వంటివారు ఈ కోవలోకే వస్తారు.

అయితే జయలలిత, కరుణానిధి మరణం తరువాత తమిళనాడు రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ ఇద్దరు గొప్ప నాయకులు ఇంకా రాజకీయాల్లో ఉన్నప్పుడే విజయకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించి, 2011 ఎన్నికలలో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని ప్రతిపక్షంగా నిలిచారు. అయితే విజయ్‌లా భారీ విజయాన్ని అందుకునే స్థాయికి విజయ్‌కాంత్ పార్టీ ఎదగలేకపోయింది.

తమిళ రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత తర్వాత మరే సినీ నటులు ఆ స్థాయిలో ఎదగలేకపోయారు.

2026 ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించనప్పటికీ విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.

అయితే రజినీకాంత్, కమల్ హాసన్ చేయలేనిది విజయ్ ఎలా సాధించారు?

1996 ఎన్నికల్లో ‘రజినీ వాయిస్’

తమిళ సినీరంగంలో అగ్రస్థానంలో కొనసాగిన రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే చర్చలు 1990ల మధ్యకాలంలోనే మొదలయ్యాయి. 1996 ఎన్నికల సమయంలోనే తొలిసారి ‘‘రజినీ వాయిస్’’ అనే పదం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘‘బాషా’’ చిత్ర శతదినోత్సవ వేడుకలో రజినీకాంత్ ‘‘తమిళనాడులో బాంబుల సంస్కృతి పెరుగుతోంది’’ అంటూ వ్యాఖ్యానించడం పెద్ద చర్చకు దారితీసింది.

ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన అప్పటి రాష్ట్రమంత్రి ఆర్.ఎం. వీరప్పన్ కూడా ఆ సమయంలో అదే వేదికపై ఉన్నారు.

దీని తరువాత వీరప్పన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించారు. దీనిపై ఇటీవల ఆయన జీవితం ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ లో రజినీకాంత్ స్పందిస్తూ తాను అలా ఎందుకు వ్యాఖ్యానించాల్సి వచ్చిందో వివరించారు.

ఇక 1996 ఎన్నికల సమయంలో ఈ వివాదం మరింత పెద్దదిగా మారింది. ఈ పరిస్థితులలో ఏఐఏడీఎంకేతో పొత్తును వ్యతిరేకిస్తూ జీకే మూపనార్ కాంగ్రెస్‌నుంచి బయటకు వచ్చి తమిళమానిల కాంగ్రెస్‌ను స్థాపించి డీఎంకేతో చేతులు కలిపారు.

అప్పట్లో ఏఐఏడీఎంకేకు వ్యతిరేకంగా ఏర్పడిన ఈ కూటమికి మద్దతుగా నిలిచిన రజినీకాంత్.. ‘‘ఏఐఏడీఎంకే తిరిగి అధికారంలోకి వస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓటమిపాలైంది.

ఈ ఓటమికి అనేక కారణాలున్నప్పటికీ రజినీకాంత్ మద్దతు కూడా ప్రధాన చర్చగా మారింది.

2017లో ప్రకటన.. మూడేళ్ల తరువాత విరమణ

సినీజీవితం అత్యున్నతస్థాయిలో ఉన్న సమయంలోనే రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని అభిమానుల్లో అంచనాలు పెరిగినా, రెండుదశాబ్దాలుగా రజినీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు.

కానీ, 2017లో రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ప్రకటించారు. తదుపరి మూడేళ్ల తరువాత కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి రావడం లేదంటూ ప్రకటించారు.

దీంతో రజినీ రాజకీయ ప్రయాణం ప్రారంభం కాకముందే ముగిసింది.

దీనిపై రాజకీయ విశ్లేషకుడు రాము మణివణ్ణన్ బీబీసీతో మాట్లాడుతూ ‘‘రజినీకాంత్ ఓ కీలకమైన అవకాశాన్ని కోల్పోయారు’’ అన్నారు.

ఎంజీ రామచంద్రన్, జయలలితల మాదిరిగా రజినీకాంత్‌కు రాజకీయ పునాది లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఎంజీఆర్ వియానికొస్తే పార్టీ స్థాపనకు ముందే ఆయన డీఎంకేలో కోశాధికారిగా పనిచేశారు. జయలలిత ఏఐఏడీఎంకేలో ప్రచార కార్యదర్శిగా ఉన్నారు’’ అని గుర్తు చేసిన రాము మణివణ్ణన్, ‘‘రాజకీయాలపై రజినీకాంత్ స్థిరమైన ఆసక్తి చూపకపోవడం కూడా ఆయనపై నమ్మకం తగ్గడానికి కారణమై ఉండొచ్చని’’ చెప్పారు.

కమల్ ‘ఎంఎన్ఎం’

తమిళనాట మరో అగ్రనటుడు కమల్‌‌హాసన్ 2018లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యంతో రాజకీయాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో కమల్ ‘‘మక్కల్ నీది మయ్యం’’ అనే పార్టీని స్థాపించారు.

ఈ పార్టీకి 2019, 2021 ఎన్నికల్లో చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 3.7శాతం ఓట్లు సాధించిన ఈ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతు ప్రకటించింది.

తదుపరి కమల్ రాజ్యసభ సభ్యుడయ్యారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ పోటీచేయలేదు. కానీ డీఎంకేకు మద్దతు ఇచ్చింది.

రజినీకాంత్ లానే కమల్‌హాసన్‌కు కూడా బలమైన రాజకీయ పునాది లేదని రాజకీయ విశ్లేషకుడు రాము మణివణ్ణన్ అభిప్రాయపడ్డారు.

రజినీ, కమల్ లాంటివారు సినీరంగంలో విజయం సాధించినా, కేవలం సినీ విజయాలే రాజకీయ విజయాలకు హామీ ఇవ్వలేవవంటారు రాము.

‘టైమింగే’ విజయ్ బలమా?

రజినీకాంత్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించకుండానే వెనక్కి తగ్గగా, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా మార్పు తీసుకురాలేకపోయారు. ఇద్దరికీ లేని రాజకీయ పునాది, ఆర్థిక బలం విజయ్‌కు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుడు రాము మణివణ్ణన్ అభిప్రాయపడ్డారు.

సరైన సమయాన్ని ఉపయోగించుకోవడంతోనే ఎన్నికల్లో విజయ్ ప్రభావం చూపగలిగారని ఆయన అంటున్నారు. సినిమా ద్వారా వచ్చిన ప్రజాదరణను నాయకత్వంగా మలచుకోవడంలో ఆయన కొంతవరకు విజయవంతమయ్యారని కూడా అభిప్రాయపడ్డారు.

అయితే ప్రజాదరణ పొందిన పూర్తి స్థాయి నాయకుడిగా విజయ్‌ ఇంకా ఎదగాల్సి ఉందని, , ప్రజల భావోద్వేగాలతో అనుసంధానమయ్యే నాయకుడిగా ఆయన మారటం భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

పాలనపై దృష్టి పెట్టడం, పార్టీని బలమైన సంస్థగా తీర్చిదిద్దడం వంటి అంశాలపైనే విజయ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యార్థి ఉద్యమాల ద్వారా ఎదిగిన ద్రావిడ రాజకీయ శక్తులు, అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను రాజకీయంగా చైతన్యవంతం చేయడంలో విఫలమయ్యాయని భావిస్తున్నానని రాము మణివణ్ణన్ చెప్పారు. ఈ నేపథ్యంలో విజయ్ సాధించిన విజయాన్ని ఆయన "తమిళనాడుకు జెన్ జెడ్ క్షణం"గా అభివర్ణించారు.

డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల్లో విద్యార్థి విభాగాలు బలహీనంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

యాభై ఏళ్లు దాటినవారు కూడా విద్యార్థి, యువజన సంఘాల్లో కొనసాగడం ఈ దుస్థితికి అద్దం పడుతోందన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)