You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తమిళనాడు: విజయ్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం.. టీవీకేకు సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు
తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు. అందుకు ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ గవర్నర్‌ను కలవడం ఇది మూడోసారి.
గవర్నర్‌ను కలిసిన అనంతరం విజయ్ సీపీఎం, సీపీఐ కార్యాలయాలకు వెళ్లి ఆ పార్టీల నాయకులను కలిశారు.
కాగా సీపీఐ, సీపీఎంలు ఇప్పటికే విజయ్‌కు మద్దతు ప్రకటించాయి. ఆ రెండు పార్టీలకు రెండేసి చొప్పున మొత్తం నాలుగు సీట్లున్నాయి.
తమిళనాడులో రెండు సీట్లు గెలుచుకున్న మరో పార్టీ వీసేకే కూడా మద్దతిచ్చింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) కూడా మద్దతు తెలిపింది. విజయ్‌కు మద్దతిస్తామని ఆ పార్టీ నేరుగా ప్రకటించకపోయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏ పార్టీకైనా మద్దతిస్తామని తెలిపింది. ఐయూఎంఎల్‌కు రెండు సీట్లున్నాయి.
దీంతో విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం లభించినట్లవుతోంది.
విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకున్నా తాను రెండు చోట్ల నుంచి గెలవడంతో 107 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉన్న విజయ్ పార్టీ టీవీకే మెజారిటీ మార్క్ 118కి 11 సీట్లు దూరంలో నిలిచిపోయింది.
దీంతో ఆ పార్టీకి ఇతరుల మద్దతు అవసరమైంది. అయిదుగురు సభ్యులున్న కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించగా తాజాగా సీపీఐ, సీపీఎం బేషరతుగా మద్దతిచ్చాయి.
దీంతో టీవీకే బలం 116కి పెరిగింది. మెజారిటీ మార్క్‌కు ఇది రెండు సీట్ల దూరం.
రెండేసి సీట్లు ఉన్న మరో రెండు పార్టీలు విదుతలై చిరుతైగల్ కచ్చి(వీసీకే), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌లు మద్దతిస్తుండడంతో మ్యాజిక్ మార్క్‌ను విజయ దాటారు.
కాగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అంశంపై సీపీఎం, సీపీఐలు శుక్రవారం కీలక సమావేశం నిర్వహించాయి.
సీపీఐ, సీపీఎం నాయకులు సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో సీపీఐ తమిళనాడు కార్యదర్శి వీరపాండియన్ మాట్లాడుతూ.. ‘టీవీకే సీపీఐ, సీపీఎంలను సంప్రదించింది. తమిళనాడు ప్రజలు ఇప్పటికే టీవీకేను ఎన్నుకోవాలని నిర్ణయించారు. మేం కూడా ప్రజాస్వామిక విధానంలో నిర్ణయంతీసుకున్నాం’ అన్నారు.
సీపీఎం తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి టీటీ షణ్ముగం మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. విజయ్ మా రెండు పార్టీలకు లేఖ రాశారు. మే 10లోగా ప్రభుత్వం ఏర్పాటవకపోతే గవర్నర్ పాలన వస్తుంది. అందుకే విజయ్‌కు మద్దతివ్వాలని మా రెండు పార్టీలు నిర్ణయించాయి. మళ్లీ ఎన్నికలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం కేబినెట్లో చేరం’ అని చెప్పారు.
ఇప్పటివరకు ఏం జరిగిందంటే..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి.
- మొత్తం 234 స్థానాలున్న అసెంబ్లీలో విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, మెజారిటీ మార్కు 118కి 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది.
- విజయ్ రెండు చోట్ల విజయం సాధించడంతో, ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో టీవీకే బలం 107కి పడిపోయింది.
- ఎన్నికలు ముగిసిన వెంటనే కాంగ్రెస్ తన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతును విజయ్‌కు ప్రకటించి డీఎంకేతో బంధాన్ని తెంచుకుంది. దీంతో టీవీకే బలం 112కి చేరింది.
- గత రెండు రోజులుగా విజయ్ గవర్నర్‌ను రెండుసార్లు(మే 6, 7వ తేదీల్లో) కలిశారు. అయితే, మెజారిటీ నిరూపించుకునే వరకు ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించలేమని గవర్నర్ స్పష్టం చేశారు.
- రాజ్ భవన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. "తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్‌ను గురువారం (7.5.2026) చెన్నైలోని లోక్ భవన్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆహ్వానించారు. ఈ సమావేశంలో, తమిళనాడు శాసనసభలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు ఇంకా స్పష్టంగా లేదని గవర్నర్ వివరించారు" అని పేర్కొంది.
- ఒకానొక దశలో దశాబ్దాల ప్రత్యర్థులైన డీఎంకే (59 సీట్లు), ఏఐఏడీఎంకే (47 సీట్లు) చేతులు కలుపుతాయనే ప్రచారం జరిగింది. దీనిపై ఇరుపార్టీల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
టీవీకే నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీల వారీగా ప్రస్తుత బలం
టీవీకే 107 (విజయ్ రెండు స్థానాల నుంచి గెలవడంతో ఒక సీటు రాజీనామా తర్వాత)
కాంగ్రెస్ 5
సీపీఐ 2
సీపీఎం 2
వీసీకే 2
ఐయూఎంఎల్ 2
మొత్తం 120
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)