ఒకే చోట పనిచేశారు.. ఒకేలా ఉన్నామనుకున్నారు.. కానీ వారిద్దరికీ తాము సొంత అక్కాచెల్లెళ్లమని తెలియదు.. చివరకు ఏమైందంటే..?

    • రచయిత, బీబీసీ వరల్డ్ సర్వీస్
  • చదివే సమయం: 6 నిమిషాలు

జులియా టినెట్టి, కస్సాండ్రా మాడిసన్‌కు చాలా విషయాల్లో సారూప్యతలున్నాయి.

ఒకే బార్‌లో పనిచేసే వీరిద్దరూ పరిచయమైన వెంటనే సన్నిహిత మిత్రులుగా మారిపోయారు. అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకయ్యారనే విషయం అప్పట్లో వారికి తెలియలేదు.

టినెట్టి, మాడిసన్ ఇద్దరూ 1990ల్లో అమెరికాలోని కనెక్టికట్‌లో పెరిగారు. చిన్నారులుగా ఉన్నప్పుడు వారిద్దరూ ఒకరికొకరు తెలియకపోయినప్పటికీ వారిద్దరూ 15 నిమిషాల ప్రయాణ దూరంలో మాత్రమే ఉండేవారు. ఇద్దరినీ దత్తత తీసుకున్నవాళ్లే పెంచి పెద్ద చేశారు.

ఓ అమ్మాయిగా మాడిసన్‌కు ఎప్పుడూ తనకు జన్మనిచ్చిన తల్లి గురించి తెలుసుకోవాలని ఉండేది. ఏదో ఒకరోజు ఆమెను కలుసుకోవాలని ఎదురుచూస్తుండేవారు మాడిసన్.

తనకు వారసత్వంగా అమ్మ నవ్వు వచ్చిందా...లేక కళ్లు వచ్చాయా అని మాడిసన్ ఆలోచిస్తుండేవారు. తనకు జన్మనిచ్చిన కుటుంబం కరేబియన్‌లోని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందినదని ఆమెకు తెలుసు.

సొంత దేశం జెండాలను టాటూలుగా వేయించుకుని

తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తనను దత్తత ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, దీనికి కారణం వాళ్లు చాలా పేదవాళ్లని, తనను పెంచి పెద్దచేసే ఆర్థిక పరిస్థితులు వాళ్లకు లేవని మాడిసన్ చెప్పారు.

మాడిసన్ యుక్త వయసుకు వచ్చిన తర్వాత తనకు జన్మనిచ్చిన కుటుంబం వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆమెకు జనన ధ్రువీకరణ పత్రం లేదు. అయితే ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మాడిసన్ 19ఏళ్ల వయసులో డొమినికన్ రిపబ్లిక్ జెండాను తన చేతిపై టాటూగా వేయించుకున్నారు. తన వారసత్వాన్ని గుర్తుపెట్టుకునేందుకు ఆమె ఇలా చేశారు. డొమినికన్‌గా ఉండడం తనకు చాలా గర్వకారణమైన విషయమని ఆమె అన్నారు.

ఐదేళ్ల తర్వాత మాడిసన్ ఓ బార్‌లో వెయిట్రెస్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. అక్కడే ఆమె తన సహోద్యోగి టినెట్టిని కలుసుకున్నారు. మాడిసన్ చేతిపై డొమినికన్ రిపబ్లిక్ జెండా టాటూ ఉండటాన్ని టినెట్టి గుర్తించారు.

టినెట్టి వీపుపైనా డొమినికన్ రిపబ్లిక్ జెండా టాటూగా ఉంది. మాడిసన్‌కు కూడా అలాంటి టాటూనే ఉండడం టినెట్టికి ఆశ్చర్యం కలిగించింది. తాను ఎక్కడ పుట్టాను అనే విషయానికి గుర్తుగా టాటూ వేయించుకోవాలని 22 ఏళ్ల వయసులో టినెట్టి నిర్ణయించుకున్నారు.

తామిద్దరం దత్తతకు వెళ్లినవారమేనని టినెట్టి, మాడిసన్‌ త్వరగానే అర్ధం చేసుకున్నారు.

‘‘ఒకేలా కనిపిస్తున్నామా?’’

‘‘నన్ను ఆ ప్రాంతం నుంచే దత్తత తీసుకున్నారు’’ అని చెబుతుండగానే.. టినెట్టి కూడా ‘‘ఆగాగు.. నన్ను కూడా ఆ ప్రాంతం నుంచే దత్తత తీసుకున్నారు’’ అని చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచిందన్నారు మాడిసన్.

అప్పటి నుంచి ‘‘మేమిద్దరం ఒకేలా కనిపిస్తున్నామా?’’ అని అందరినీ అడగడం మొదలుపెట్టాం... ‘‘అవును మీరిద్దరూ ఒకలానే ఉన్నారు’’ అనే సమాధానం వినిపిస్తుండే దని గుర్తుచేసుకున్నారు టినెట్టి. అంతకుముందు తామిద్దరం అప్పచెల్లెళ్లమని సరదాగా చెబుతుండేవారు. తాము మరింతబాగా ఒకేలా కనిపించేందుకు ఒకేరకమైన దుస్తులు వేసుకుందామని మాడిసన్ చెబుతుండేవారు.

ఇదంతా సరదా కోసం చేసినా..ఒకానొక సమయంలో తామిద్దరికీ ఏమన్నా సంబంధం ఉందా అనే ఆలోచన రావడంతో దత్తత పేపర్లను పోల్చిచూసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పుట్టినట్టు ఆ పేపర్లలో ఉంది. వాళ్ల తల్లుల ఇంటిపేర్లు కూడా వేర్వేరు.

కొంతకాలం తర్వాత వాళ్లిద్దరికీ కొత్త ఉద్యోగాలొచ్చి విడిపోయారు. టినెట్టి కనెక్టికట్‌లో ఉండేవారు. మాడిసన్ వర్జీనియాకు వెళ్లిపోయారు. కానీ ఒకరికొకరు టచ్‌లోనే ఉండేవారు. కానీ దూరం వల్ల గతంలోని సాన్నిహిత్యం తగ్గింది.

ఎయిర్‌పోర్టులో కుటుంబమంతా నిరీక్షణ

కొన్నేళ్ల తర్వాత మాడిసన్‌కు జన్యు పరీక్షల కిట్ క్రిస్మస్ బహుమతిగా అందింది. దాని ద్వారా ఆమె తన కజిన్‌ను గుర్తించారు. తనకు జన్మనిచ్చిన తల్లి 2015లో చనిపోయినట్టు తెలుసుకుని మాడిసన్ చాలా బాధపడ్డారు. అయితే ఆ కజిన్ వల్ల తనకు జన్మనిచ్చిన తండ్రితోపాటు ఇతర కుటుంబసభ్యులను కూడా ఆమె గుర్తించగలిగారు.

తన చిన్నతనంలో మాడిసన్ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడ్డారని ఆ కజిన్ మాడిసన్‌కు చెప్పారు. మాడిసన్ తన తండ్రి అడ్రైనో లునా కొల్లాడొతో ఫోన్‌లో మాట్లాడేందుకు ఆ కజినే ఏర్పాట్లు చేశారు. ఏ పరిస్థితుల్లో దత్తత ఇవ్వాల్సి వచ్చిందో తండ్రి ఆమెకు వివరించారు. చాలా పేద కుటుంబమని, మట్టి నేలపై నిద్రపోయేవారమని ఆయన మాడిసన్‌కు తెలిపారు.

మాడిసన్ తల్లి గర్భంతో ఉన్నప్పుడు, మాడిసన్ సోదరుడు అనారోగ్యం పాలయ్యారని, కుటుంబం మనుగడ సాగించడానికి మాడిసన్‌ను దత్తత ఇవ్వడమే పరిష్కారమని తాను నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు.

తర్వాత డొమినికన్ రిపబ్లిక్ వెళ్లాలని మాడిసన్ అనుకున్నారు. ఆమెకు జన్మనిచ్చిన కుటుంబం మొత్తం ఎయిర్‌పోర్టులో ఆమె కోసం ఎదురుచూస్తోంది. వాళ్లంతా మాడిసన్ ఫోటో ముద్రించిన టీషర్టులు ధరించారు. విమానం దిగగానే మాడిసన్ తండ్రి దగ్గరకు వెళ్లారు. తండ్రీ కూతుళ్లిద్దరూ ఒకరినొకరు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ట్విస్ట్‌తో తిరిగొచ్చిన మాడిసన్

తన కుటుంబాన్ని కలుసుకుని ఓ అద్భుత ప్రయాణం చేసిన మాడిసన్ ఓ ట్విస్ట్‌తో వర్జినీయాకు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో మొల్లీ అనే మహిళ మాడిసన్‌తో టచ్‌లోకి వచ్చారు. ఆమె టినెట్టికి బాల్యస్నేహితురాలు. పిల్లలను దత్తత తీసుకునేందుకు వాళ్ల తల్లిదండ్రులు అమెరికా నుంచి డొమినికన్ రిపబ్లిక్‌కు కలిసి ప్రయాణించారు.

తాను జన్మతః మాడిసన్‌కు సోదరి అయి ఉంటానని మొల్లీకి అనిపించింది. వీరిద్దరి జనన ధృవీకరణ పత్రాలలో ఒకే తల్లి పేరు ఉంది. కానీ డీఎన్ఏ పరీక్షలలో వారు అప్పచెల్లెళ్లు కారని, కేవలం దూరపు బంధువులని వెల్లడైంది. అలాగే జనన ధృవీకరణ పత్రాలలో ఉన్న తల్లి పేరు కూడా తప్పు అని తెలిసింది.

మొల్లీ దగ్గర మాడిసన్‌ తల్లి ఫోటో ఉంది. ఆమె అచ్చం టినెట్టిలా కనిపించేవారు. ఈ పోలికలు చూసి, మాడిసన్, టినెట్టి అక్కాచెల్లెళ్లు అయి ఉంటారని మొల్లీ అంటుండేవారు.

దీంతో మాడిసన్ తన తండ్రికి వీడియోకాల్ చేసి, తనతోపాటు మరో బిడ్డను కూడా దత్తత ఇచ్చారా అని అడిగారు.

''ఆ మాట విన్న తర్వాత ఆయన చాలా నిరుత్సాహంగా కనిపించారు. అవును..ఇచ్చాం'' అన్నారు. ఆయన మాటలు విన్న వెంటనే ''ఓ మై గాడ్..మీరెప్పుడూ ఈ విషయం నాకు చెప్పలేదు'' అన్నారు మాడిసన్.

‘ఇదో అద్భుతమైన కథ’

తనతోపాటు మరొకరిని కూడా దత్తతకు ఇచ్చారనే విషయం తెలియగానే మాడిసన్ క్షణం కూడా ఆలస్యం చేయదలుచుకోలేదు. మరో జన్యుపరీక్షల కిట్ తీసుకుని 8గంటలు ప్రయాణించి టినెట్టి నివసించే చోటుకు వెళ్లారు.

టెస్టు ఫలితాలు రావడానికి రెండున్నర వారాల సమయం పట్టింది. ఈ నిరీక్షణ ఇద్దరికీ చాలా కష్టంగా అనిపించింది. తాము చేసే ఉద్యోగాల మీద ఏమాత్రం దృష్టిపెట్టకుండా టెస్టు ఫలితం కోసం ఎదురుచూశారు.

చివరకు ఫలితం వచ్చిన రోజు మెసేజ్ ఓపెన్ చేయగానే టినెట్టికి అర్ధమయింది. తాను, మాడిసన్ అక్కాచెల్లెళ్లమని.

''నిజంగా ఇది చాలా సంతోషం కలిగించే విషయం. మాకు తెలియకుండానే మేం అక్కాచెల్లెళ్లలాగానే కలిసి మెలిసి ఉన్నాం'' అని టినెట్టి చెప్పారు.

విషయం తెలిసిన వెంటనే మాడిసన్ చలించిపోయారు. టినెట్టిని ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా కలుసుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్న తండ్రితో మాడిసన్ ఈ విషయం చెప్పారు. డొమినికన్ రిపబ్లిక్ వెళ్లాలని అక్కాచెల్లెళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు.

వాళ్లిద్దరూ వెళ్లేసరికి కుటుంబమంతా మరోసారి వాళ్లకోసం ఎదురుచూస్తోంది. ఈ సారి వాళ్లంతా ఇద్దరు అక్కాచెల్లెళ్లు ముఖాలున్న టీ షర్టులను వేసుకున్నారు. తండ్రి టినెట్టి దగ్గరకు వేగంగా వెళ్లి..ఎంతో ఆప్యాయంగా ఆమెను కౌగిలించుకున్నారు. ఆయన భావోద్వేగంతో 'నా కూతురు' అన్నారు.

అక్కాచెల్లెళ్లుగా వాళ్లిద్దరూ కలిసి చేసిన ఆ మొదటి ప్రయాణం చాలా సంతోషంగా గడిచింది. సంగీతం వింటూ, డ్యాన్స్ చేస్తూ వాళ్లు ఆనందంగా గడిపారు. తన కూతుళ్లను తిరిగి కలవడం దేవుడు తనకిచ్చిన అతిపెద్ద, గొప్ప బహుమతని కొల్లాడొ చెప్పారు.

''నేను చాలా సంతోషంగా ఉన్నా. వాళ్లు నన్ను చూడడానికి వచ్చినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అన్ని కుటుంబాలు చేసినట్టుగానే ప్రేమ, అభిమానంతో మేం వాళ్లను ఆహ్వానిస్తాం. ఇదొక అద్భుతమైన కథ. ప్రతి ఒక్కరికీ ఇలాంటి కథ చెప్పే అదృష్టం ఉండదు'' అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.