స్టీవ్ ఇర్విన్ మరణించి 20 ఏళ్లు.. సముద్రపు చేప 'స్టింగ్రే' పొడవడంతో చనిపోయిన ఈ 'క్రొకడైల్ హంటర్' గురించి ఆయన కూతురు ఏమంటున్నారు?

స్టీవ్ ఇర్విన్, వన్య ప్రాణి సంరక్షణ, ఆస్ట్రేలియా, బిందీ ఇర్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తనకు బాగా ఇష్టమైన మొసలి పేరును స్టీవ్ ఇర్విన్ తన కుమార్తెకు పెట్టారు.
    • రచయిత, లానా లామ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ప్రముఖ వన్యప్రాణి సంరక్షకుడు స్టీవ్ ఇర్విన్ 20వ వర్ధంతి సందర్భంగా ఆయన కూతురు, ఆస్ట్రేలియాకు చెందిన పర్యావరణ పరిరక్షకురాలు బిందీ ఇర్విన్ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు.

'క్రొకొడైల్ హంటర్‌'గా ప్రసిద్ధి చెందిన స్టీవ్ ఇర్విన్.. 2006 సెప్టెంబర్ 4న మరణించారు.

గ్రేట్ బ్యారియర్ రీఫ్ వద్ద ఓ డాక్యుమెంటరీ షూటింగ్ కోసం సముద్రంలో ఉన్నప్పుడు ఆయన ఛాతీపై స్టింగ్రే (ఒక రకం చేప) దాని ముల్లుతో పొడిచి గాయపరచడంతో ఆయన ప్రాణాలు విడిచారు.

స్టీవ్ చనిపోయినప్పుడు బిందీకి ఎనిమిదేళ్లు.

శుక్రవారం చేసిన పోస్టులో తన తండ్రి 'సూపర్ హీరో' అని బిందీ పేర్కొన్నారు.

"రెండు దశాబ్దాలుగా నా కుటుంబం సహా ప్రపంచం మొత్తం నా తండ్రి మరణం పట్ల బాధ వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నా" అని ఆమె రాసుకొచ్చారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"వన్యప్రాణి సంరక్షణే నా తండ్రి వారసత్వం అని నేను ఎప్పుడూ భావించేదాన్ని. కానీ అది, భూమిపై ఒకరిపట్ల ఒకరు చూపించాల్సిన ప్రేమ అని తర్వాత తెలుసుకున్నా" అని బిందీ (28) ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు.

తన తండ్రి మరణం.. తల్లి టెర్రీ, సోదరుడు రాబర్ట్‌పై (22) ఎలాంటి ప్రభావం చూపిందో బిందీ వివరించారు.

"నా తల్లి సర్వస్వాన్ని కోల్పోయారు. నేను, నా తమ్ముడు ఒక గొప్ప తండ్రిని కోల్పోయాం. నిజానికి శోకం మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మా గమనం అందులోనే" అని బిందీ ఆవేదన చెందారు.

స్టీవ్ ఇర్విన్, వన్య ప్రాణి సంరక్షణ, ఆస్ట్రేలియా, బిందీ ఇర్విన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్టీవ్ ఇర్విన్ 2006లో మరణించారు. ఆయనకు ఇద్దరు పిల్లలు బిందీ, రాబర్ట్

తన కూతురు సైతం తాను ఎన్నడూ కలవని తన తాత(స్టీవ్ ఇర్విన్‌)తో ఎలాంటి అనుబంధం ఏర్పరచుకుందో బిందీ వెల్లడించారు.

"నాకు ఐదేళ్ల కూతురు ఉంది. తను రోజూ ఉదయాన్నే మా నాన్న డాక్యుమెంటరీలను చూస్తుంటుంది. నాన్నను ఎప్పుడూ కలవకున్నా.. నా కూతురు ఆయన పట్ల విపరీతమైన అభిమానం పెంచుకుంది" అని బిందీ చెప్పారు.

స్టీవ్ మరణించినప్పటి నుంచి క్వీన్స్‌లాండ్‌లోని ఆస్ట్రేలియా జూని ఆయన కుటుంబమే నిర్వహిస్తోంది.

"భావి తరాలను ప్రభావితం చేసేలా మా నాన్న చెరగని ముద్ర వేశారు. ఆయన జీవితం, వారసత్వం కొనియాడదగినవి" అని బిందీ ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కుటుంబానికి సంబంధించి అన్ని విధాలుగా రక్షకుడిగా ఉన్న తన తండ్రికి బిందీ కృతజ్ఞతలు తెలియజేశారు. మనస్పూర్తిగా ఆయనను ఎప్పుడూ అభిమానిస్తూనే ఉంటానని చెప్పారు.

స్టీవ్ ఇర్విన్, వన్య ప్రాణి సంరక్షణ, ఆస్ట్రేలియా, బిందీ ఇర్విన్

ఫొటో సోర్స్, Justin Sullivan/Getty Images

ఫొటో క్యాప్షన్, 2002 జూన్ 26న శాన్‌ఫ్రాన్సిస్కో జూలో మూడడుగుల పొడవున్న మొసలితో స్టీవ్ ఇర్విన్.

కూతురు పుట్టడమే నా జీవితంలో అత్యద్భుతం: స్టీవ్

"నా జీవితంలో అత్యద్భుతమైన సందర్భం.. నా కూతురు బిందీ జన్మించడమే" అని ఎంతో ఉత్సాహంతో స్టీవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

తన కూతురిని మొదటిసారి ఎత్తుకున్నప్పుడు ఏం పేరు పెట్టాలో అప్పుడే ఆయనకు తట్టింది.

"తొలుత నాకేం అర్ధం కాలేదు. అప్పుడే అనుకోకుండా ఓ పేరు పుట్టుకొచ్చింది. అదే 'బిందీ' అని. అది నాకు ఎంతో ఇష్టమైన మొసలి పేరు." అని పెద్దగా నవ్వుతూ చెప్పారు.

స్టీవ్ కుమారుడు రాబర్ట్ ఇర్విన్ కూడా తన తండ్రికి నివాళి అర్పించారు.

చిన్నతనంలో తండ్రి తనను ఎత్తుకున్న ఫొటోను షేర్ చేస్తూ 'మీ వారసత్వం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.' అని పేర్కొన్నారు.

గతేడాది నవంబర్‌లో అమెరికా డాన్స్ పోటీ 'డాన్సింగ్ విత్ స్టార్స్' విజేతగా నిలిచారు రాబర్ట్. దశాబ్దం క్రితం అదే టైటిల్‌ని బిందీ సైతం గెలుచుకున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)