కొండా సురేఖ: మంత్రి వర్గం నుంచి తప్పిస్తూ రేవంత్ రెడ్డి నిర్ణయం.. బర్తరఫ్ తరువాత సురేఖ ఏమన్నారు

ఫొటో సోర్స్, kondasurekha/facebook
తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్త్ రఫ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కొండా సురేఖను 'వెంటనే' మంత్రివర్గం నుంచి తప్పిస్తూ గవర్నర్‌కు లేఖ రాసినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల తర్వాత.. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ రగడ నడుస్తోంది.
తాజాగా కొండా సురేఖను మంత్రి పదవిని నుంచి తప్పిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.చిన్నారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

జి.చిన్నారెడ్డి స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. తనను బర్తరఫ్ చేయడంపై కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. తనను బర్తరఫ్ చేయడం చెల్లదని, తన వివరణ తీసుకోకుండా ఎలా బర్తరఫ్ చేస్తారని అన్నారు.
అంతేకాదు.. తన కుమార్తె వ్యాఖ్యలకు తననెలా బలి చేస్తారని ఆమె ప్రశ్నించారు.
‘మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పాలనతో సంతోషంగా ఉన్నారా? ఈ రోజు నాకు జరిగింది రేపు మీకు జరుగుతుంది.. ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడండి. మనం ఇస్తామన్న హామీలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సర్వే చేేయించాలని సూచిస్తున్నాను’’ అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఈ అంశంపై స్పందించారు. కొండా సుస్మిత వ్యాఖ్యలను సురేఖ ఖండించకపోవడంతో చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, kondasurekha/facebook
రెండు రోజులుగా దిల్లీలో కీలక పరిణామాలు
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారంటూ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.
ఆమెపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ కూడా ఓ నివేదికను ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపించింది.
సెప్టెంబరు 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ వెళ్లారు. కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చర్చించారు.
ఇదే సమయంలో కొండా సురేఖ కూడా దిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిశారు.
''తాను బీసీ సామాజికవర్గానికి చెందిన బిడ్డనని, తన భర్త మున్నూరు కాపు అని.. తమ సామాజికవర్గం ఓట్లు తెలంగాణలో పెద్దసంఖ్యలో ఉన్నాయి.'' అని మీడియాతో చెప్పారు.
తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనకు ఏం సంబంధం ఉంటుందని అన్నారు.
అయితే, కొండా సురేఖ ఇచ్చిన వివరణతో కాంగ్రెస్ హైకమాండ్ సంతృప్తి చెందలేదని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆమెను మంత్రిగా తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.

ఫొటో సోర్స్, kondasurekha/facebook
కొండా సురేఖ వివాదం ఎక్కడ మొదలైందంటే..
ఆగస్టు 16న పరకాలలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్జప్తి చేశారు.
ప్రస్తుతం కూడా రేవూరి ప్రకాష్ రెడ్డే పరకాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగానే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నుంచి పోటీ చేస్తారనే సంకేతాలు ఇచ్చారు.
అయితే, గీసుకొండలో ఆగస్టు 19న జరిగిన కొండా సురేఖ పుట్టిన రోజు వేడుకల్లో ఆమె కుమార్తె కొండా సుస్మిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
''రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అవ్వగానే కళ్లు నెత్తికెక్కాయా..?'' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ కావడానికి తన తండ్రి కొండా మురళి ఎంతో సాయం చేశారన్నారు.
''వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించాలని ఎలా ప్రకటిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠనం చూసుకుంటుంది.
అయినా రెండేళ్ల వరకు ఎందుకు.. ఇప్పుడే రేవూరి ప్రకాష్ రెడ్డిని రాజీనామా చేసి రమ్మంటే ఉప ఎన్నికల్లో తేల్చుకుందామంటూ సవాల్ విసిరారు.
కొండా కుటుంబం నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తారంటూ రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించుకోలేరని చెప్పారు.
మరోవైపు, తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో లండన్ పర్యటనకు వెళ్లే ముందు దిల్లీలో మంత్రులు, కాంగ్రెస్ నేతల వద్ద రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, kondasurekha/facebook
కొండా సురేఖకు షోకాజ్ నోటీసు
రేవంత్ రెడ్డిపై సుస్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో కొండా సురేఖకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసు జారీ చేసింది.
అయితే, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ వివరణ ఇచ్చారు.
''నా కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదు. నా కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధం'' అని పేర్కొన్నారు సురేఖ.
అయితే, ఇదే సమయంలో కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని లేదా ఆమెను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు గాంధీ భవన్‌లో మీడియా సమావేంలో డిమాండ్ చేశారు.
ఆ తర్వాత పీసీసీ క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు కొండా సురేఖ.
''నన్ను నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగంగా అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి.'' అని కొండా సురేఖ రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook/kondasurekha/ktr
కొండా సురేఖ చుట్టూ గతంలోనూ వివాదాలు
2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సందర్భంలో మహబూబాబాద్ లో ఓదార్పు యాత్రకు వైఎస్ జగన్ వచ్చిన నేపథ్యంలో పెద్దఎత్తున హింస చెలరేగింది.
అప్పట్లో తెలంగాణవాదులపై దాడులు జరగడంపై ఇప్పటికీ చర్చ సాగుతుంటుంది. తెలంగాణ వాదులపై కొండా సురేఖ కుటుంబం అండతోనే దాడులు చేశారన్న ఆరోపణలున్నాయి.
అయితే, దాడులను అప్పట్లో కొండా దంపతులు ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2024 సెప్టెంబరులో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు(కేటీఆర్) సినీ తారల ఫోన్లు ట్యాప్ చేయించి, వారి వ్యక్తిగత సంభాషణలు వారికే వినిపించి బెదిరించారని.. ఓ కుటుంబంలో విడాకులకు కేటీఆర్ కారణమయ్యారని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
దీనిపై పెద్దఎత్తున వివాదం రేగింది. ఈ విషయంపై కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. కేసు కోర్టులో పెండింగులో ఉంది.
ఆ తర్వాత తను సమంత, నాగార్జున కుటుంబాల గురించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా కొండా సురేఖ చెప్పారు.
నిరుడు అక్టోబరులో కొండా సురేఖకు ఓఎస్డీగా ఉన్న సుమంత్ అప్పట్లో ఓ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను బెదిరించారంటూ పోలీసులుకేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన్ను మంత్రి పేషీ నుంచి ఓఎస్డీగా తొలగించింది.
అప్పల్లో సుమంత్ ను కొండా సురేఖ కుమార్తె సుస్మిత ఇంట్లో ఉండటం, పోలీసులు నుంచి తప్పించుకునేందుకు సుమంత్ ను తన కారులో సుస్మిత తరలించడం వివాదం రేగింది.
మరోవైపు సుమంత్ పై తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిపై దాడిచేశారన్న ఫిర్యాదుతో ఆయనపై కేసు పెట్టి గాలిస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC/Samantha/FB
మేడారం టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాస్
కలగజేసుకుంటున్నారంటూ సురేఖ గతంలో సీఎం, అధిష్ఠానికి ఫిర్యాదు చేయడంతో వివాదం రేగింది. అయితే, తమకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య ఎలాంటి విభేదాలు లేవని తర్వాత కొండా మురళి చెప్పారు.
ఫైళ్ల క్లియరెన్సుల విషయంలోనూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
ఇక తనకు చెప్పకుండా దేవాదాయ శాఖాధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష చేయడంపై కొండా సురేఖ బహిరంగంగానే విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
అయితే, తన నియోజకవర్గానికి సంబంధించి సమీక్షించానని కడియం శ్రీహరి చెప్పారు.
ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపు
కొండా సురేఖ దాదాపు 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు.
ఆమె భర్త కొండా మురళీధర్ రావు రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు.
కొండా సురేఖ 1995లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వంచనగిరి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచి గీసుకొండ ఎంపీపీగా పనిచేశారు.
ఆ తర్వాత 1999, 2004లో శాయంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
2009లో పరకాల నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు కొండా సురేఖ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు.
అనంతరం అప్పటి టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) పార్టీలో చేరి 2014లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.
2018లో కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఫొటో సోర్స్, Jillela Chinna Reddy/facebook
చిన్నారెడ్డి విషయంలో ఏం జరిగిందంటే..
వనపర్తి నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు చిన్నారెడ్డి.
1989, 1999, 2004, 2014లో విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలుత చిన్నారెడ్డిని పేరును ప్రకటించింది అధిష్ఠానం.
అయితే తర్వాత అభ్యర్థిని మార్చి తూడి మేఘారెడ్డికి అక్కడ టికెట్ కేటాయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ హోదాలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి చేపట్టారు చిన్నారెడ్డి. ప్రజావాణి కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్నారు.
అయితే, మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య ముందునుంచీ ప్రోటోకాల్ వివాదం కొనసాగుతున్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ఆగస్టు 16న మండలపార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఏళ్ల తరబడిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ వ్యాఖ్యానించారు. డబ్బులకు ఆశపడి టికెట్లు ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు.
చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మేఘారెడ్డి ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు.
''డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారనే వ్యాఖ్యలు ఖండిస్తున్నా. కార్యకర్తలకు పార్టీలో సముచిత న్యాయం జరుగుతోంది.'' అంటూ మేఘారెడ్డి చెప్పారు.
అలాగే ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేయగా, ఆగస్టు 19న వివరణ ఇచ్చారు చిన్నారెడ్డి.
''నేనెవర్నీ వ్యక్తిగతంగా అనలేదు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నాకు దేవాలయాలు వంటివి'' అని చెప్పారు.
షోకాజ్ నోటీసుకు వెనక్కి తీసుకోవాలని తన వివరణలో కోరారు.
అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే ఆయన నియామాకాన్ని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
కాగా పార్టీ నిర్ణయంపై చిన్నారెడ్డి ఇంకా స్పందించలేదు.
భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోలేదు; చిన్నారెడ్డి
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పించాక చిన్నారెడ్డి మీడియాతో మాట్లాడారు.
తాను ఎలాంటి తప్పు చేయలేదని, కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తూ వచ్చానని చెప్పారు.
భవిష్యత్తు కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























