నేపాల్ వరదలు భారత్‌కు ఆందోళన కలిగించడానికి కారణమేంటి?

నేపాల్ వరదలు

ఫొటో సోర్స్, AFP via Getty Image

ఫొటో క్యాప్షన్, టిబెట్ సరిహద్దు వెంబడి సంభవించిన వినాశకరమైన వరదల కారణంగా నేపాల్‌లో మృతుల సంఖ్య 1,200 దాటింది.
    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు, ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాని ఒక ముప్పును బయటపెట్టాయి.

భారత్, నేపాల్ దేశాలు హిమాలయాల్లో పుట్టే నదులను పంచుకుంటున్నాయి. కానీ నేపాల్‌లోని వరదలకు, భారత్‌లో విపత్తులకు మధ్య ఉన్న సంబంధం కేవలం నీటి ప్రవాహానికి సంబంధించిన ఒక సాధారణ కథ కంటే చాలా సంక్లిష్టమైనదని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని వరదలు పర్వతాల నుంచి వేగంగా ఉప్పొంగి, తమతో పాటు పెద్ద మొత్తంలో బురద, రాళ్లు, ఇతర వ్యర్థాలను తీసుకువస్తాయి.మరికొన్ని మైదానాలను చేరేసరికి తమ శక్తిని కోల్పోయి, కేవలం వరద నీరుగా మాత్రమే మారతాయి.

ఆ నీరు భారత్‌లో విపత్తును కలిగిస్తుందా లేదా అనేది కేవలం నేపాల్‌లోని వర్షపాతంపైనే కాకుండా, భారత్‌లోని వర్షపాతం, నదీ జలాల మట్టాలు, కట్టలు, మురుగునీటి పారుదల, అభివృద్ధిపై కూడా ఆధారపడి ఉంటుంది.

నేపాల్‌లోని వరదలు భారత్‌కు ఒక హెచ్చరిక. ఎందుకంటే, కేవలం నీరు సరిహద్దు గుండా దక్షిణం వైపు ప్రవహించడమే కాకుండా, విస్తారమైన, అంతకంతకూ అస్థిరంగా మారుతున్న హిమాలయ నదీ వ్యవస్థను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌లోకి ఎన్ని నేపాల్ నదులు ప్రవహిస్తాయి?

నేపాల్‌లో 6,000 కంటే ఎక్కువ నదులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు దక్షిణం వైపు భారత్‌లోకి ప్రవహించి గంగానదిలో కలుస్తాయి.

ఇక్కడ మూడు ప్రధాన జల వ్యవస్థలు ఉన్నాయి. తూర్పున కోసి, మధ్యలో గండకి (భారత్‌లో గండక్), పశ్చిమాన కర్నాలి (భారత్‌లో ఘాగ్రా), పశ్చిమ సరిహద్దు వెంబడి మహాకాళి (శారద) నది ప్రవహిస్తోంది.

శివాలిక్, చురే పర్వత శ్రేణుల నుంచి ఉద్భవించే బాగ్మతి, కమల, రాప్తి, వంటి డజను చిన్న నదులు, వాటి చిన్న, నిటారుగా ఉండే పరీవాహక ప్రాంతాల కారణంగా ఊహించని వరదలకు కారణం అవుతున్నాయి.

నదులు

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాల్ నుంచి ఆరుకు పైగా నదులు భారత మైదానాల్లోకి ప్రవహిస్తాయి.

ఏ రాష్ట్రాలకు ప్రమాదమెక్కువ?

నేపాల్ నుంచి ఏడు నుంచి తొమ్మిది ప్రధాన నదులు భారత మైదానాల్లోకి ప్రవహిస్తాయని, ఈ నదులే భారత్‌లో వరదలకు కారణమవుతున్నాయని ఇంటర్ నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎంఓడీ) లోని జలవిజ్ఞాన శాస్త్రవేత్త మనీష్ శ్రేష్ట చెప్పారు.

కోసి, గండక్, బాగ్మతి, ఘాగ్రా నదులను కొన్ని ప్రధాన సరిహద్దు నదులుగా భారత కేంద్ర జల సంఘం గుర్తించింది.

భారత్‌లో అత్యంత వరద ముప్పు ఉన్న రాష్ట్రం బిహార్. ఉత్తర బిహార్‌లో దాదాపు ముప్పావు వంతు ప్రాంతాన్ని అధికారికంగా వరద ముప్పు ప్రాంతంగా గుర్తించారు.

బిహార్‌లో వరదలకు కారణమయ్యే దాదాపు అన్ని ప్రధాన నదులు నేపాల్‌లోనే పుడతాయి. వాటిలో కోసి నదిని "బీహార్ దు:ఖదాయని"గా పిలుస్తారు. దీని తర్వాత గండక్, బాగ్మతి, కమలా నదులు ఉన్నాయి.

కానీ ఈ ప్రమాదం బిహార్‌కే పరిమితం కాదు.

ఘాగ్రా, రాప్తి, గండక్ నదులతో తూర్పు ఉత్తరప్రదేశ్ బాగా ప్రభావితమవుతుంది. గోరఖ్‌పూర్, బహ్రైచ్, లఖింపూర్ ఖేరీ, శ్రావస్తి వంటి జిల్లాలు తరచూ ప్రభావితమవుతున్నాయి.

ఉత్తరాఖండ్ రాష్ట్రం మహాకాళి-శారదా నదులను పంచుకుంటోంది. మెచ్చి, మహానందాన్ని నీరు ఉత్తర బెంగాల్‌లోకి ప్రవహిస్తాయి.

"గణాంకాల పరంగా బిహార్ ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఉత్తర ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది, కానీ దాని గురించి తరచుగా తక్కువగా నివేదిస్తారు" అని ఐసీఐఎంఓడీలోని జలవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రదీప్ మాన్ డాంగోల్ అన్నారు.

ఈ ప్రమాదం వల్ల అత్యధిక భారం బిహార్‌పై పడుతున్నప్పటికీ... ఉత్తరప్రదేశ్ కూడా ఇందులో ఒక ముఖ్యమైన, తరచుగా విస్మరణకు గురయ్యే భాగంగా ఉంటోంది.

 బీహార్‌లోని వరదలు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 2008లో బీహార్‌లోని వరద ప్రభావిత జిల్లాలోని ఒక దృశ్యం

భారత్‌లోని ఏ పరిస్థితులు వరదను విపత్తుగా మారుస్తాయి?

దీనిని మూడు భాగాలుగా చూడాలంటారు నిపుణులు.

1. వర్షం: అది ఎక్కడ పడుతోంది, ఎంత తీవ్రంగా పడుతోంది అన్నది.

భారత్‌కు చేరే వరదల గరిష్ఠ ప్రవాహాలు తరచుగా ఎత్తైన హిమాలయాల్లో కాకుండా, దిగువ ప్రాంతాల్లోని శివాలిక్ కొండలు, చూర్ ప్రాంతం, తరాయి ప్రాంతాల్లో ఏర్పడతాయి. అక్కడ చిన్నదైన, ఏటవాలు ఎక్కువగా ఉన్న నదీ పరీవాహక ప్రాంతాల్లో తీవ్రంగా రుతుపవన వర్షాలు పడవచ్చు.

2. నది.

నేపాల్‌లోని నదులు పర్వతాల అడుగు భాగానికి చేరే సమయంలో ఒక్కసారిగా వాలు తగ్గే ప్రాంతాన్ని దాటుతాయి. అక్కడ అవి తమతో తెచ్చిన మట్టిని, ఇసుకను వదిలి, మైదానాల్లో అల్లుకున్న, తరచూ మారే నదీ ప్రవాహ మార్గాలుగా విస్తరిస్తాయి.

3. ఆ నీరు భారత్‌లోకి చేరినప్పుడు ఏం జరుగుతుంది?

వరద ఎంత తీవ్రంగా మారుతుందనేది భారత్ వైపు పడిన వర్షపాతం పరిమాణం, గంగా నదిలో అప్పటికే ఉన్న నీటి మట్టం, కరకట్టలు బ్యారేజీలు, అలాగే రోడ్లు, రైల్వేలు, నివాస ప్రాంతాల వల్ల వరద మైదానాల్లో నీటి పారుదలకు ఏర్పడే అడ్డంకులు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

అందువల్ల సరిహద్దు వద్ద నది గరిష్ఠ ప్రవాహాన్ని ప్రధానంగా నేపాల్‌లో కురిసిన వర్షపాతం నిర్ణయిస్తుంది. కానీ వరద ఎంత తీవ్రంగా మారుతుందనేది కనీసం అంతే స్థాయిలో భారత్‌లోని పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.

2008లో జరిగిన కోసి విపత్తు దీనికి ఉదాహరణ. కరకట్ట తట్టుకునేలా రూపొందించిన పరిమితి కంటే చాలా తక్కువ నీటినే ఆ సమయంలో నదిలో ప్రవహిస్తోంది. కానీ ఆ విపత్తుకు అసాధారణ స్థాయిలో వచ్చిన వరద కారణం కాలేదు.కరకట్టకు గండిపడటమే.

సరిహద్దుకు చేరే గరిష్ఠ ప్రవాహానికి ప్రధానంగా నేపాల్ వర్షపాతమే కారణం. కానీ ఆ ప్రవాహం భారత్‌కు చేరుకున్న తర్వాత, వరదల తీవ్రతకు భారత్‌లోని పరిస్థితులు కూడా అంతే బాధ్యత వహిస్తాయని ఇంటర్‌నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్‌కు చెందిన శశ్వత్ సన్యాల్ చెప్పారు.

 ధౌలిగంగా, రిషిగంగా నదుల సంగమం

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్‌లోని చమోలి జిల్లాలో ధౌలిగంగా, రిషిగంగా నదుల సంగమం.

నేపాల్‌లో వర్షాలు, భారత్‌లో వరద ముప్పుగా ఎలా?

2008 నాటి కోసి విపత్తునే దీనికి బలమైన ఉదాహరణ.

నేపాల్‌లోని కోసి నది కట్ట తెగిపోవడంతో బీహార్‌లో దాదాపు 400 మంది మరణించారు. కానీ, ఆశ్చర్యకరంగా, ఇది అసాధారణంగా పెరిగిన నదీ ప్రవాహం కారణంగా జరగలేదు.

నది నీటి ప్రవాహం అది నిర్వహించగలిగే సామర్థ్యంలో పదో వంతు మాత్రమే ఉంది. అయితే, దశాబ్దాల క్రితం నిర్మించి, సరిగ్గా నిర్వహించని కట్టకు గండి పడటం వల్ల ఈ విపత్తు సంభవించిందని ఐఐటి కాన్పూర్‌లోని జియోలజీ ప్రొఫెసర్ రాజీవ్ సిన్హా చెప్పారు.

"1950, 1960లలో నిర్మించిన కట్టలను సరిగ్గా నిర్వహించలేదు. అవి కోతకు గురై, చివరికి బలహీనంగా మారాయి. ఇలా బలహీనంగా మారిన ప్రాంతాలలో నది కట్టను తెంచుకుని, 100 ఏళ్లుగా వరదలు చూడని భారత్‌లోని ప్రాంతాల్లోకి ప్రవేశించింది" అని సిన్హా అన్నారు.

ఈ వైఫల్యం వ్యవస్థాగతమైనదని సన్యాల్ చెప్పారు.

నేపాల్ నుంచి భారత్‌కు హెచ్చరికలు అందుతున్నాయా?

సాధారణ రుతుపవన వరదల విషయంలో, నీరు దిగువకు ప్రవహించే వేగాన్ని బట్టి భారత్‌కు "సుమారు 12 గంటల నుంచి రెండు రోజుల ముందుగానే హెచ్చరిక" అందుతుందని సన్యాల్ చెప్పారు.

నేపాల్‌లోని పర్వత ప్రాంతం నుంచి కోసి, గండక్ నదుల ద్వారా బీహార్ మైదానాలకు నీరు చేరడానికి సుమారు ఒక రోజు పట్టొచ్చు. ఘాగ్రా నది ద్వారా అయితే కొంచెం ఎక్కువ సమయమే పట్టొచ్చు.

చురే నది నుంచి వచ్చే ఆకస్మిక వరదల వల్ల మాత్రం గంటల వ్యవధిలోనే ప్రమాదం సంభవించవచ్చు.

మంచు చరియలు విరిగిపడటం, ఆనకట్టల వైఫల్యం లేదా శిథిలాల ప్రవాహం వంటి సంఘటనలు మరింత తీవ్రంగా ఉండవచ్చు.

ప్రస్తుత వరదలో రసువా నుంచి గరిష్ఠ నీటి ప్రవాహం సుమారు ఏడున్నర గంటల్లో భారత సరిహద్దు సమీపంలోని త్రివేణికి చేరుకుంది.

భారత్, నేపాల్ స్టేషన్ల నెట్‌వర్క్ నుంచి రియల్ టైమ్‌లో కురిసిన వర్షపాతం, నదీ మట్టాల డేటాను పంచుకుంటాయి.

నేపాల్‌కు చెందిన హైడ్రాలజీ, మెట్రాలజీ డిపార్ట్‌మెంట్ వర్షపాతం, నదీ మట్టాల డేటాను భారత్‌లోని కేంద్ర జల సంఘానికి పంపుతుంది. దీనిని వరద అంచనా కోసం ఉపయోగిస్తారు.

అయితే, దీనిలో ఇంకా గణనీయమైన లోపాలు ఉన్నాయని సన్యాల్ చెప్పారు.

వీటిలో, చురే నది అత్యంత వేగంగా ప్రవహించే పరీవాహక ప్రాంతాలలో రియల్-టైమ్ పర్యవేక్షణ కేంద్రాల సంఖ్య చాలా తక్కువగా ఉంది.

పైగా, రెండు దేశాల మధ్య ఉమ్మడి అంచనా నమూనా ఏదీ లేదు.కట్టల పరిస్థితి, నదీ ప్రవాహ మార్గంలో మార్పులు, అవక్షేపాలపై జరిగే క్రమబద్ధమైన సమాచార మార్పిడి కూడా పరిమితంగానే ఉంది.

ఆ తర్వాత, అన్నిటికన్నా ముఖ్యంగా చివరి దశ వస్తుంది.

జిల్లా కార్యాలయానికి హెచ్చరిక పంపడం, ప్రమాదంలో ఉన్న కుటుంబానికి హెచ్చరిక పంపడం వేరువేరు.

ఈ సరిహద్దు నదుల విషయంలో, "ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై సమాచార మార్పిడి, సహకారం చాలా కీలకం. హిమనీనద సరస్సులు, కాలక్రమేణా వాటిలో వచ్చే మార్పులను వేగంగా, నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది" అని సిన్హా సూచించారు.

ధారాలి విపత్తు

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, ధారాలిలో క్లౌడ్ బరస్ట్

భారత్‌లో వరదల గురించి నేపాల్‌పై ఉన్న అపోహ ఏంటి?

భారత్‌లోకి నేపాల్ నీటిని విడుదల చేస్తుందనేది ఒక సాధారణ అపోహ అని శాస్త్రవేత్తలు అన్నారు.

నేపాల్‌లో ఇలా చేయగల పెద్ద జలాశయాలు దాదాపుగా లేవు. దాని ప్రధాన నిల్వ ఆనకట్ట అయిన కులేఖాని, ఒక క్యూబిక్ కిలోమీటరులో పదో వంతు కన్నా తక్కువ నీటిని నిల్వ చేస్తుంది. ఇది విడుదల చేయడానికి ఏమీ లేదని సన్యాల్ చెప్పారు.

ప్రధానంగా ఎగువ ప్రాంతాలలో కురిసే భారీ వర్షపాతం కారణంగా వరద నీరు సరిహద్దుకు చేరుతుంది. అంతేకానీ నేపాల్ డ్యామ్‌లను తెరవడం వల్ల కాదు.

అయితే, ఉత్తర బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లలో సంభవించే వరదలలో అధిక భాగం నేపాల్‌లో కురిసే వర్షపాతం వల్లే వస్తాయి. అందువల్ల, నేపాల్‌లో కురిసే వర్షపాతం భారత్‌లో వరదల తీవ్రతను కూడా ప్రభావితం చేస్తుంది.

గంగానది సగటు వార్షిక ప్రవాహంలో సుమారు 40 శాతం, వేసవి కాలంలో అంతకంటే చాలా ఎక్కువ నేపాల్ అందిస్తుంది. అందువల్ల దాని జల వ్యవస్థ భారత్‌కు చాలా ముఖ్యమైనది.

భారత్ దేని గురించి ఎక్కువగా ఆందోళన చెందాలి?

"భారత్ ఆందోళన చెందాలి, కానీ అది నేపాల్‌లోని కోసి నది కారణంగానే కానవసరం లేదు" అని రాజీవ్ సిన్హా చెప్పారు.

హిమాలయాల్లో నీరు, రాళ్లు, మంచు పలకలు, భారీ మొత్తంలో అవక్షేపాలు అకస్మాత్తుగా కలిసిపోయినప్పుడు ఏమి జరుగుతుందన్నదే అసలైన హెచ్చరిక అంటున్నారు నిపుణులు.

ఇటీవలి సంవత్సరాలలో భారత్‌లో జరిగిన 2021 నాటి చమోలీ విపత్తు, 2025లో ఉత్తరాఖండ్‌లో జరిగిన ధారాలి విపత్తు వంటి అనేక వినాశకరమైన సంఘటనల మాదిరిగానే నేపాల్‌లో ఇటీవల జరిగిన విపత్తు కూడా ఉందని సిన్హా చెప్పారు. నేపాల్ సంఘటన "బహుశా ఐదు నుంచి పది రెట్లు పెద్దది" అని ఆయన తెలిపారు.

"ముఖ్య విషయం ఏమిటంటే ఇవి సాధారణ వరదలు కావు" అని సిన్హా చెప్పారు.

సాధారణంగా వరదలో ప్రధానంగా నీరే ఉంటుంది. కానీ, భారీ వర్షపాతం, కరిగే మంచు లేదా ఆకస్మిక వరదనుంచి వచ్చే నీరు అధిక మొత్తంలో అవక్షేపంతో కలిసినప్పుడు, అది తన మార్గంలో ఉన్న దాదాపు దేన్నైనా నాశనం చేయగల చిక్కటి, అధిక శక్తివంతమైన బురదను సృష్టించగలదు.

2021లో ఉత్తర భారత్‌లోని చమోలీ లోయలో హిమాలయ హిమనీనదంలో ఒక పెద్ద భాగం కూలిపోయి, శిథిలాలు నీటి వరదను దిగువకు నెట్టివేసింది. 200 మంది ప్రాణాలు కోల్పోవడం, జలవిద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వంటి విపత్తు సంభవించింది.

2025లో ఉత్తరాఖండ్‌లోని ధారాలిలో కూడా ఇదే స్పష్టమైంది. అక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, శిథిల ప్రవాహాలు సంభవించి, గ్రామంలోని కొన్ని ప్రాంతాలు అనేక మీటర్ల శిథిలాల కింద కూరుకుపోయాయి.

ఇక వాతావరణ మార్పు కూడా ఉంది.

వర్షాల తీవ్రత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని మిగతా ప్రాంతాల కంటే ఈ ప్రాంతం వేగంగా వేడెక్కుతోంది.

వేడెక్కిన వాతావరణం ఎక్కువ తేమను నిలుపుకుంటుంది. రుతుపవనాలు తక్కువ సమయంలో ఎక్కువ వర్షాన్ని కురిపిస్తున్నాయి. వర్ష తీవ్రత పెరుగుతోంది.

ఎత్తైన పర్వత ప్రాంతాలలో కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. శాశ్వత మంచు కరగడం వల్ల హిమనీనద సరస్సులు ఉప్పొంగడం, అవలాంచ్‌లు ఏర్పడుతున్నాయి. దీనివల్ల అకస్మాత్తుగా, అధిక వేగంతో రాళ్లు, బురదతో వరదలు సంభవించవచ్చు. వీటిని అంచనా వేయడం కష్టం.

విపత్తులు పెరిగేకొద్దీ, మంచు చరియలు విరిగిపడటం కూడా పెరుగుతుంది. నదులు పూడికతో నిండిపోతాయి. దీనివల్ల నదీగర్భాలు ఎత్తు పెరిగి, వాటి నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గుతుంది. దీని ప్రభావం సరిహద్దుకు ఇరువైపులా ఉంటుంది.

ఈ సంఘటనలన్నీ హిమాలయాల్లో పెరుగుతున్న విపత్తు ప్రమాదంలో భాగమే. ఇవి భారత్‌కు ముప్పును గణనీయంగా పెంచుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)