రెంచ్ అటాక్స్: ‘నా భార్య కడుపులో బిడ్డను చంపేస్తామన్నారు’-దొంగల దాడిలో రూ.కోట్లు పోగొట్టుకున్న ఓ క్రిప్టో వ్యాపారవేత్త చెప్పిన భయానక ఘటన

క్రిప్టో కరెన్సీ, దొంగతనం, దాడి, క్రైమ్ స్టాపర్స్, క్రిప్టో వాలెట్
ఫొటో క్యాప్షన్, క్రిప్టో దొంగలు ఇంట్లో వ్యక్తిపై దాడి చేసి గర్భవతి అయిన ఆయన భార్యను బెదిరించారు
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

హెచ్చరిక: ఈ కథనంలో కలచి వేసే అంశాలున్నాయి

ముఖాలకు ముసుగులు వేసుకున్న కొందరు వ్యక్తులు ఒక వ్యాపారవేత్త ఇంట్లోకి చొరబడి ఆయనను దారుణంగా కొట్టారు.

కొన్ని నెలల కిందట బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్‌కు సమీపంలోని సోలిహల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

లక్షల పౌండ్ల విలువైన క్రిప్టో కరెన్సీని తమకు బదిలీ చేయకపోతే నిండు గర్భిణీ అయిన ఆయన భార్యను చంపేస్తామని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ దాడి ‘అత్యంత భయానకమైనదని’ ఆ దంపతులు బీబీసీతో చెప్పారు.

పుట్టబోయే తమ బిడ్డ ప్రాణాల గురించి తీవ్రంగా భయపడ్డామని వారు చెప్పారు. ఆ వ్యాపారవేత్త తన వద్ద ఉన్న క్రిప్టోను వారికి బదిలీ చేసిన తర్వాత, బయట కారులో వేచి ఉన్న మరో వ్యక్తి సహాయంతో అక్కడి నుంచి పరారయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితుల సమాచారం ఇచ్చిన వారికి క్రైమ్‌ స్టాపర్స్ సంస్థ 10,000 పౌండ్లు ( సుమారు రూ.12.7 లక్షల) రివార్డును ప్రకటించింది.

క్రిప్టో పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఇలాంటి దాడులను నిపుణులు "రెంచ్ అటాక్స్" అని పిలుస్తున్నారు.

క్రిప్టో కరెన్సీ, దొంగతనం, దాడి, క్రైమ్ స్టాపర్స్, క్రిప్టో వాలెట్
ఫొటో క్యాప్షన్, 'జేమ్స్' తల, చేతులు, పక్కటెముకలకు తీవ్రమైన గాయాలయ్యాయి.

క్రిప్టో కరెన్సీల విలువ పెరగడంతో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా హింసాత్మక దొంగతనాలు ఎక్కువయ్యాయి.

ఒకసారి నిధులు బదిలీ అయ్యాక, వాటిని తిరిగి దక్కించుకోవడం చాలా కష్టంగా మారొచ్చు.

గోప్యత కోసం బాధితుడిని 'జేమ్స్' అనే మారుపేరుతో పిలుస్తోంది బీబీసీ.

సోలిహల్‌లోని తమ ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి సుమారు 45 నిమిషాల పాటు దాడి చేశారని జేమ్స్ తెలిపారు.

చొరబాటుదారులు సుత్తితో జేమ్స్ ముఖం, తల, పక్కటెముకలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఏడు నెలల గర్భిణీ అయిన ఆయన భార్యను సోఫాపై అదిమిపట్టి, ముఖంపై దిండు ఉంచి ఊపిరి ఆడకుండా చేశారు.

"నాకు ఊపిరి ఆడటం లేదు" అని ఆమె అరుస్తున్న మాటలు తనకు వినిపించాయని జేమ్స్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోన్ అన్‌లాక్ చేసి ఇవ్వమని అడిగేంత వరకు వారు ఎందుకు వచ్చారో ఆ దంపతులకు అర్థం కాలేదు. తన దగ్గర క్రిప్టోకరెన్సీ ఉందని వారికి తెలుసు కానీ, దాన్ని ఎలా బదిలీ చేసుకోవాలో వారికి తెలియదని జేమ్స్ చెప్పారు.

దుండగులు ఫేస్‌టైమ్ వీడియో కాల్ ద్వారా మరొక వ్యక్తి సూచనలు పాటిస్తున్నారు.

భారీగా నిధులు ఉన్న క్రిప్టో వాలెట్‌ను వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తి గుర్తించిన తర్వాత వారి బెదిరింపులు మరింత తీవ్రమయ్యాయి.

"నువ్వు ఇప్పుడు ఈ డబ్బును పంపించకపోతే, కత్తితో పొడిచి నీ భార్యను, కడుపులోని బిడ్డను చంపేస్తాం" అని వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తి బెదిరించారు.

ఆ ఒత్తిడికి తన బిడ్డ ఏమవుతుందోనని ప్రాణభయంతో వణికిపోయానని జేమ్స్ భార్య చెప్పారు. ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకు ఆ బిడ్డ సురక్షితంగా జన్మించింది. ఆ చిన్నారి వారికి మూడో సంతానం.

2025 డిసెంబర్‌లో ఈ దోపిడీ జరిగింది.

జేమ్స్ తన దగ్గర ఉన్న లక్షలాది పౌండ్ల క్రిప్టో మొత్తాన్ని ఆ వీడియో కాల్‌లోని వ్యక్తి వాలెట్‌కు బదిలీ చేశారు.

వెళ్తూవెళ్తూ కొన్ని ఖరీదైన రోలెక్స్ వాచీలను కూడా చొరబాటుదారులు ఎత్తుకెళ్లారు.

"మీరు తలా 10 వేల పౌండ్లు తీసుకోండి, మిగతాదంతా నాకే" అని వీడియో కాల్‌లో ఉన్న వ్యక్తి తన అనుచరులతో అనడం జేమ్స్ విన్నారు.

క్రిప్టో కరెన్సీ, దొంగతనం, దాడి, క్రైమ్ స్టాపర్స్, క్రిప్టో వాలెట్
ఫొటో క్యాప్షన్, ప్రజలు నేరస్థులను గుర్తించగలరని క్రైమ్‌స్టాపర్స్ ఆశిస్తోంది.

పెరుగుతున్న 'రెంచ్ అటాక్స్'

సంప్రదాయ బ్యాంకుల మాదిరిగా కాకుండా, క్రిప్టోకరెన్సీలు నేరుగా డిజిటల్ వాలెట్ల ద్వారా యజమానుల నియంత్రణలోనే ఉంటాయి.

క్రిప్టో కరెన్సీ లావాదేవీలు క్షణాల్లో బదిలీ కావడం, బదిలీ చేసిన వారి గుర్తింపు తెలియకపోవడం, వెనక్కి తీసుకోలేకపోవడం వంటి అంశాలు నేరస్థులకు అనుకూలంగా మారుతున్నాయి.

2026లో జూన్ నాటికి ఇలాంటి హింసాత్మక దోపిడీలలో 30 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.290 కోట్లు) చోరీకి గురయ్యాయని చైనాలిసిస్ పరిశోధనలో తేలింది.

అమెరికా, బ్రెజిల్, థాయ్‌లాండ్, ఫ్రాన్స్‌లో ఇలాంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫ్రాన్స్‌లో టాక్స్ ఆఫీస్ డేటా లీక్ కావడంవల్ల నేరస్థులు సులభంగా క్రిప్టో పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నారు.

2020లో క్రిప్టోలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన జేమ్స్, 2023 నాటికి తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిస్థాయి ట్రేడర్‌గా మారారు.

ఇప్పుడు తన సంపదనంతా కోల్పోవడంతో తిరిగి మునుపటి ఉద్యోగం వెతుక్కునే పనిలో ఉన్నారు.

పోలీసులు ఇంకా నిందితులను గుర్తించలేదు.

సుమారు 20 ఏళ్ల వయసున్న ఆ ముగ్గురు యువకులను, బయట కారులో ఉన్న డ్రైవర్‌ను, వీడియో కాల్‌లో మాట్లాడిన ప్రధాన సూత్రధారిని పట్టుకోవడానికి గాలిస్తున్నారు.

పోయిన డబ్బు తిరిగి వస్తుందన్న ఆశ లేకపోయినా, ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి కఠిన శిక్ష పడాలని జేమ్స్ కోరుకుంటున్నారు.

"వాళ్లు నా భార్యాబిడ్డలను బెదిరించారు. క్రిప్టో పెట్టుబడుల వెనుక ఉన్న భౌతిక ప్రమాదాలను ప్రజలు గ్రహించాలి" అని ఆయన హెచ్చరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)