ఫేస్బుక్లో స్నేహం, ప్రేమ, పెళ్లి: పదేళ్ల తర్వాత ఒక ఫోన్‌కాల్ కారణంగా పోలీసులు వాళ్లింటికి వచ్చారు, అది వారి జీవితాన్నే మార్చేసింది...

ఫొటో సోర్స్, Tarun Patel
- రచయిత, తేజస్ వైద్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
'ప్రేమకు హద్దులు లేవు' అంటారు. కానీ, గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా లంబవేల్ గ్రామానికి చెందిన తరుణ్ పటేల్ జీవితంలో ఈ హద్దే పెద్ద అడ్డంకిగా మారింది.
బంగ్లాదేశ్‌కు చెందిన మహిళను పెళ్లి చేసుకున్న ఈ యువకుడు, ఇప్పుడు తన కుటుంబం ఛిన్నాభిన్నం కాకుండా చూడాలని పోరాడుతున్నారు. పదేళ్ల కిందట సరిహద్దులను దాటి జరిగిన వీరి పెళ్లి, ప్రస్తుతం ఆ కుటుంబానికి చట్టపరమైన చిక్కులను తీసుకొచ్చింది.
భారత్‌లో ఈ బంగ్లాదేశీ మహిళ అక్రమంగా నివసిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని స్థానిక అధికారులు చెప్పారు. ఆమెను స్వదేశానికి తిరిగి పంపించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
గుజరాత్ పోలీసులు 'ఆపరేషన్ డెల్టా హంట్' ప్రారంభించేంత వరకు అంతా సజావుగానే సాగింది. కానీ, ఈ ఆపరేషన్.. తరుణ్ పటేల్ కుటుంబ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.
ప్రస్తుతం తన పిల్లలను వాళ్ల అమ్మకు దూరం కాకుండా చూడటమే తరుణ్ పటేల్ ఏకైక లక్ష్యంగా మారింది.

'ఒక ఫోన్ కాల్ వారి జీవితాన్నే మార్చేసింది.. '
తరుణ్ పటేల్ జూన్ 2వ తేదీని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఆ రోజు పోలీసులు వారి ఇంటికి వచ్చారు. కేవలం ఒక్క ఫోన్ కాల్ కారణంగా ఈ మొత్తం సంఘటన జరిగింది.
''కాజల్ తల్లి బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నారు. అక్కడ పరిస్థితులు బాగా లేకపోవడంతో, తల్లి గురించి కాజల్ చాలా ఆందోళన చెందింది. అందుకే, ఆమె తన తల్లికి కాల్ చేసింది. ఈ ఫోన్ కాల్‌ను ట్రేస్ చేసిన పోలీసులు, నేరుగా మా ఇంటికి వచ్చారు'' అని తరుణ్ పటేల్ తెలిపారు.
''పోలీసులు ఫోన్‌ను చెక్ చేశారు. కాజల్ మామ్ అన్న పేరుతో సేవ్ చేసిన నెంబర్‌ను వారు చూశారు. ఈ నెంబర్ ఎవరిదని వారు అడిగారు'' అని చెప్పారు.
అప్పుడు తన భార్య బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ అని, ఆమె తన తల్లికి ఫోన్ చేసినట్లు తరుణ్ పటేల్ పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత కాజల్‌ను ప్రశ్నించిన పోలీసులు, స్టేషన్‌కు తీసుకెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
కాజల్ భారతీయ పౌరురాలు అనడానికి ఆ కుటుంబం దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవని పోలీసులు చెప్పారు. పాస్‌పోర్టు లేదని, పెళ్లి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆధారం కూడా లేదని తెలిపారు. అందుకే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

ఫొటో సోర్స్, Tarun Patel
కాజల్ తరచూ బంగ్లాదేశ్‌లో ఉన్న కుటుంబంతో మాట్లాడేవారా?
ఈ ప్రశ్నకు స్పందించిన తరుణ్ పటేల్.. ''ఎప్పుడో ఒకసారి కాజల్ ఆమె తల్లితో మాట్లాడేది. పోలీసులు ట్రేస్ చేసిన ఆ ఫోన్ కాల్ ఆమె తల్లికి సర్జరీ జరుగుతున్న సమయంలో చేసింది. అదే సమయంలో, బంగ్లాదేశ్‌లో పరిస్థితులు బాగా లేవు. అందుకే, కాజల్ ఆందోళన చెందింది'' అని చెప్పారు.
''ఆమె బాగా ఏడుస్తూ, ఒకసారి అమ్మతో మాట్లాడాలని ఉందని చెప్పింది. అందుకే, నా మొబైల్ నుంచి ఇంటర్నేషనల్ (ఐఎస్డీ) కాల్ చేశాను. వారు మాట్లాడుకున్న మొత్తం సంభాషణలో.. 'అమ్మ ఎలా ఉన్నావు? ఏదైనా సీరియస్ ఇబ్బంది ఉందా?' అని మాత్రమే అడిగింది'' అని తరుణ్ పటేల్ తెలిపారు.
''అంతే, ఆ ఫోన్ కాల్‌ను ట్రేస్ చేశారు. ఆమె ఎప్పుడూ తప్పుడు ప్రాంతానికి ఫోన్ చేయలేదు'' అని స్పష్టం చేశారు తరుణ్ పటేల్.
''గుజరాత్లో కాజల్ అక్రమంగా నివసిస్తున్నట్లు'' ఆనంద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు జీజీ జసాని చెప్పారు.
''బంగ్లాదేశ్ నుంచి గుజరాత్‌కు ఆమె వచ్చినప్పుడు, ఆమెకు పాస్పోర్టుగానీ, అలాగే వివాహ నమోదుకు సంబంధించి ఎలాంటి రుజువుగానీ లేదు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, NACHIKETA MEHTA
'ఫేస్బుక్ స్నేహం నుంచి పెళ్లి వరకు ప్రయాణం'
బంగ్లాదేశ్‌లోని గోపాల్పూర్ గ్రామానికి చెందిన 'కాజులి'ని 2012లో ఫేస్బుక్లో కలిశారు తరుణ్ పటేల్. వారి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
పాస్‌పోర్టు తీసుకుని, గుజరాత్‌కు రావాలని తరుణ్ ఆమెను అడిగారు. అదే సమయంలో, బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువకుడిని పెళ్లి చేసుకోవాలని వారి కుటుంబం ఆమెని ఒత్తిడి చేస్తూ వచ్చింది.
కాజులి పాస్‌పోర్టు చేయించుకునేందుకు ఒక ఏజెంట్‌కు దాదాపు రూ.12 వేలు ఇచ్చారు. కానీ, ఆ ఏజెంట్ ఆమెను మోసం చేశారు.
కుటుంబ ఒత్తిడి కారణంగా.. ఆమె బంగ్లాదేశ్ నుంచి పారిపోయి, తొలుత కోల్‌కతా వచ్చి, ఆ తర్వాత ఆనంద్ జిల్లాకు వచ్చారు. అక్కడ, తరుణ్, కాజులి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత 'కాజులి' తన పేరును 'కాజల్'గా మార్చుకున్నారు.
అయితే, అవసరమైన పత్రాలు లేకపోవడం వల్ల, వారి పెళ్లి చట్టబద్ధంగా నమోదు కాలేదు.
''భవిష్యత్‌లో ఇది ఇంత పెద్ద సమస్య అవుతుందని మేం అస్సలు ఊహించలేదు'' అని తరుణ్ పటేల్ అన్నారు. '' అప్పట్లో ఆమె ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకురాలేకపోయింది'' అని చెప్పారు.
కాజల్ ముస్లిం. పెళ్లి తర్వాత ఆమె హిందువుగా మారారు. ఒకవేళ ఆమెను బంగ్లాదేశ్ పంపిస్తే.. ఆమె కుటుంబం ఆమెను అంగీకరించదని తరుణ్ భయపడుతున్నారు.

ఫొటో సోర్స్, NACHIKETA MEHTA
కుటుంబానికి పెద్ద షాక్
కాజల్‌ను కస్టడీలోకి తీసుకోవడంతో తరుణ్ పటేల్, ఆయన కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రస్తుతం ఆనంద్‌లోని మహిళల సంక్షేమ గృహంలో కాజల్ ఉన్నారు.
''నా పిల్లలు రోజూ ఏడుస్తున్నారు. అమ్మ తిరిగి ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. దానికి నా దగ్గర సమాధానం లేదు. ఒకవేళ కాజల్‌ను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపిస్తే.. మా కుటుంబం ఛిన్నాభిన్నమవుతుంది'' అని తరుణ్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు.
''కాజల్‌ను తీసుకెళ్లిన తర్వాత.. మాలో ఎవరూ కూడా సరిగ్గా తినలేదు. పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు. వారి పరిస్థితిని చూస్తుంటే, నా కళ్లల్లో నీళ్లొస్తున్నాయి. కాజల్ కేవలం మాకు కోడలు మాత్రమే కాదు. మా కూతురు లాంటిది'' అని కాజల్ అత్త ఇందూబెన్ పటేల్ తెలిపారు.
''కాజల్ లేకపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్లు అనిపిస్తుంది. ఆమె తిరిగి ఇంటికి రావాలని ప్రార్థిస్తున్నాను'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Tejas Vaidya/BBC
''కాజల్ నిత్యం మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నిత్యం ఏడుస్తూనే ఉన్నారు. ఆమె కుటుంబాన్ని ముఖ్యంగా ఇద్దరి పిల్లల్ని బాగా మిస్ అవుతున్నారు. ఒకవేళ బంగ్లాదేశ్ పంపితే, మళ్లీ ఎప్పటికీ భారత్‌కు రాలేమోనన్నదే ఆమె అతిపెద్ద భయం'' అని జాగృతి మహిళ సంఘటన అధ్యక్షురాలు ఆశా దలాల్ బీబీసీతో అన్నారు.
''అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత.. దూరం నుంచి మేం అప్పుడప్పుడు తన పిల్లలను చూసుకునేందుకు ఆమెకు అనుమతిస్తున్నాం. ఇది ఆమెకు కొంత ఊరటను ఇస్తుంది'' అని తెలిపారు.
''కానీ, ఆమె ఇంకా బాధగానే ఉన్నారు. మేం ఆమెకు తరచూ పరిస్థితిని వివరిస్తూ, భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. కానీ, ఆమె కూడా ఒక మనిషే కదా, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు'' అని చెప్పారు.
''ఆశ్రమంలో కాజల్ అందరితో కలిసిపోతున్నారు. ఇతరులకు సాయం చేస్తున్నారు. ప్రస్తుతం మేం కాజల్‌ను జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ప్రభుత్వం, కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం'' అని ఆశా దలాల్ తెలిపారు.

కోర్టులో న్యాయపోరాటం
ప్రస్తుతం తరుణ్ పటేల్ లక్ష్యం.. ఎట్టి పరిస్థితుల్లో కాజల్‌ను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపకుండా చూడటమే. దీనికోసం వారు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో హైకోర్టును కూడా వారు ఆశ్రయించారు.
''కాజల్‌కు భారత పౌరసత్వం ఇప్పించేందుకు మేం రాజ్యాంగ నిబంధనలను కోర్టుకు తీసుకెళ్తాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21.. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను కల్పిస్తుంది'' అని ఆమె న్యాయవాది జైనాబ్ సయ్యద్ బీబీసీతో అన్నారు.
''ఈ హక్కు కేవలం భారతీయ పౌరులకు మాత్రమే కాదు, భారత్‌లో నివసించే ప్రతి ఒక్క వ్యక్తికి. కోర్టు ముందు మేం ఈ సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తాం'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Tejas Vaidya/BBC
''ఒక వ్యక్తి భారతీయ పౌరుడిని వివాహం చేసుకుని, ఆయనతో చాలా సంవత్సరాల పాటు భారత్‌లో కలిసి నివసిస్తుంటే.. అప్పుడు పరిస్థితులను, అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని, ఆ వ్యక్తి భారత పౌరసత్వానికి అర్హులు కావొచ్చు'' అని జైనాబ్ చెప్పారు.
''కాజల్‌ను తిరిగి బంగ్లాదేశ్‌కు పంపించకుండా.. ఆమెకు భారత పౌరసత్వం లభించేలా కృషి చేస్తాం'' అని తెలిపారు.
తరుణ్ పటేల్ ఆనంద్ ఎంపీ మితేష్ పటేల్ సాయం కోరారు.
''నేను దిల్లీ వెళ్లినప్పుడు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ఈ విషయాన్ని చర్చిస్తాను'' అని ఎంపీ పటేల్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, ANI
ఆపరేషన్ డెల్టా హంట్
"గుజరాత్లో అంతర్గత భద్రత, శాంతి, సురక్షిత వాతావరణాన్ని కాపాడటానికి" పోలీసులు 'ఆపరేషన్ డెల్టా హంట్' అనే ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు గుజరాత్ ప్రభుత్వం చెప్పింది.
2026 జూన్ మొదటి వారంలో 362 మంది 'అక్రమ బంగ్లాదేశీ' పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 103 మంది పురుషులు, 188 మంది మహిళలు, 71 మంది పిల్లలు ఉన్నారు.
అదనంగా, 782 మందికి పైగా 'అనుమానిత బంగ్లాదేశ్' పౌరులను విచారించారు.
ఈ వ్యక్తులకు నకిలీ పత్రాలు అందించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ఏజెంట్లు, వారి సహచరులపై సాంకేతిక పరిజ్ఞానం, నిఘా సహాయంతో పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయని కూడా గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన పత్రిక ప్రకటన పేర్కొంది.
గుజరాత్లో గతంలోనూ అక్రమ బంగ్లాదేశీ పౌరులను అదుపులోకి తీసుకున్నారు.
అహ్మదాబాద్‌లోని చందోలా సరస్సు ప్రాంతంలో పోలీసులు భారీ కూల్చివేత ఆపరేషన్‌ను కూడా చేపట్టారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























