‘గోదారి గట్టుపైన’ మూవీ రివ్యూ: ఆటో డ్రైవర్, ఇంజినీరింగ్ అమ్మాయి ప్రేమ కథ ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Red Puppet Productions/Facebook
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- చదివే సమయం: 3 నిమిషాలు
మేమ్ ఫేమస్‌తో యువతని ఆకర్షించిన సుమంత్ ప్రభాస్ రెండో సినిమా "గోదారి గట్టుపైన". ప్రమోషన్లు గట్టిగా చేయడంతో యూత్‌లో బజ్ క్రియేట్ చేసింది. సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ ఏమంటే గోదావరి ప్రాంతంలో ఆటో నడిపే రాజు (సుమంత్ ప్రభాస్) ఇంజనీరింగ్ స్టూడెంట్ మాయ (నిధి ప్రదీప్) ప్రేమలో పడతాడు.
మొదట ఆమె పట్టించుకోకపోయినా తర్వాత ఇష్టపడుతుంది. అయితే ఆమెకి తండ్రి శ్యాంబాబు (జగపతిబాబు) అంటే చాలా ఇష్టం. అతని మాట జవదాటదు.
శ్యాంబాబుకి తన కూతురు కష్టాలు పడకూడదని , మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని కోరిక.
మరి ఆటో డ్రైవర్‌తో పెళ్లికి అంగీకరిస్తాడా? ఏం జరుగుతుంది? ఇది మిగతా కథ.

ఈ కథలో కొత్తదనం ఏమీ లేదు. సీతాకోకచిలుక, జయం నుంచి దశాబ్దాలుగా చూస్తున్న సినిమాలు. ప్రేమకథలు దేవదాసు కాలం నుంచి ఇలాగే ఉంటాయి, ఉన్నాయి. అయితే కథనం కొత్తగా వుండాలి.
ఈ సినిమాకి అన్ని హంగులూ ఉన్నాయి. ఫొటోగ్రఫీ, పాటలు, సుమంత్ ప్రభాస్, నిధిల స్క్రీన్ ప్రెజెన్స్ , జగపతిబాబు , లయల సపోర్టింగ్ ఇన్ని వున్నా లేనిది రైటింగ్.
అక్కడక్కడ తప్పితే మిగతా అంతా బలహీనమైన రచన. అసలు స్క్రిప్టుపైన దృష్టి పెట్టకుండా , అప్పటికప్పుడు ఏవో సీన్స్ అనుకుని రాసుకున్నట్టు అనిపిస్తుంది.
ఏ ఒక్క పాత్రకీ రౌండప్ వుండదు, ఆర్క్ లేదు. నాన్‌సింక్‌లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ వుంటాయి.
సుదర్శన్ తదితరులు కామెడీ పేరుతో ఏదేదో మాట్లాడుతూ వుంటారు. హీరోకి గోదావరి యాస కుదరలేదు.

ఫొటో సోర్స్, Red Puppet Productions/Facebook
సినిమా సాగతీతకి కారణం ఎడిటింగ్ లోపం. కళ్లు మూసుకుని 20 నిముషాలకి కత్తెర వేయొచ్చు.
సినిమాకి అంతోఇంతో బలం జగపతిబాబు. క్లైమాక్స్‌లో జగపతిబాబు, రాజీవ్ కనకాల నటన బాగుంది. కథ ప్రిడిక్టబుల్ కావడం ఒక లోపమైతే , సన్నివేశాలన్నీ అనేక సినిమాల్లో చూసినవే.
హీరోయిన్ నిధి కళ్లతోనే నటించింది. తొలిరోజుల జయసుధని గుర్తుకు తెచ్చింది.
సుమన్ ఈజ్‌గా నటించాడు. మహాలక్ష్మిగా నటించిన అమ్మాయి గుర్తుండిపోతుంది. మంచి నటి లైలాకి గట్టి సీన్ పడలేదు.
హీరోయిన్ తన తికమక ప్రవర్తనకి మూడ్స్ స్వింగ్ అని కారణం చెబుతూ వుంటుంది.
అయితే డైరెక్టర్ సుభాష్ చంద్రకే మూడ్స్ స్వింగ్ ఉన్నట్టుంది. ఎందుకంటే ఒక మంచి సీన్ చూసి ఊపిరి పీల్చుకునేలోగా నాలుగు రొడ్డ కొట్టుడు సీన్స్ వస్తాయి.
సెకెండాఫ్‌లో వచ్చే పోలీస్‌స్టేషన్ సీన్ సహనానికి పరీక్ష.
నార్మల్‌గా ప్రారంభమైన ప్రేమ కథ, ఉన్నట్టుండి హిందూ-క్రిస్టియన్ మతాలకి మారడం కూడా ప్రేక్షకుడిని గందరగోళపరుస్తుంది.
హీరో తల్లి ముస్లిం కావడం వల్ల కథకి అదనంగా వచ్చిన ప్రయోజనం కూడా ఏమీలేదు.
ఎందుకంటే మత సమైక్యత సినిమా కాదు. జాగ్రత్తగా సన్నివేశాలు రాసుకుని, రెండు గంటలకి కుదించి వుంటే ఇది మంచి సినిమా అయ్యేది.
ప్లస్ పాయింట్స్ః
1.హీరో హీరోయిన్ల స్క్రీన్ ప్రెజెన్స్
2.కెమెరా, సంగీతం
3.క్లైమాక్స్‌లో జగపతిబాబు నటన
మైనస్ పాయింట్స్ః
1.బలహీనమైన రైటింగ్
2.నిడివి
3.ఆల్రెడీ చూసినట్టు అనిపించడం
ఫైనల్‌గా గోదారి అందాలు ఎంత బాగున్నా, గట్టెక్కడం కొంచెం కష్టమే.
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























