మూవీ రివ్యూ: రవిబాబు యాక్షన్ సినిమా ‘రేజర్’ ఎలా ఉంది?

 సురేశ్ ప్రొడక్షన్, రవిబాబు, చైల్డ్ సెంటిమెంట్

ఫొటో సోర్స్, FB/SureshProductions/

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 4 నిమిషాలు

న‌టుడు, ద‌ర్శ‌కుడు ర‌విబాబు సినిమాలు డిఫ‌రెంట్‌గా వుంటాయి. హింసాత్మకంగానూ వుంటాయి. రేజ‌ర్ సినిమాకి హీరో, దర్శ‌కుడు ఆయ‌నే. భారీ ప్ర‌మోష‌న్స్ కూడా చేశాడు. మరి రేజ‌ర్ ఎలా వుందంటే...

సింఫుల్‌గా క‌థ చెప్పాలంటే ముఖ్య‌మంత్రి సీటుపై హోంమంత్రి క‌న్నేస్తాడు. రాజీనామా చేయ‌డానికి సీఎం తిర‌స్క‌రిస్తాడు. దాంతో హోంమంత్రి, ఆయ‌న కొడుకులు ఫార్మ్‌హౌస్‌లో ముఖ్య‌మంత్రిని హ‌త్య చేస్తారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేసిన‌ప్ప‌టికీ గోడ బ‌య‌ట ఉన్న ఒక కెమెరాలో ఇది రికార్డ్ అవుతుంది.

సీసీ కెమెరాల నిర్వాహ‌కుడు ఇది గుర్తిస్తాడు. ఈ విష‌యం హోంమంత్రి కొడుక్కి తెలిసి అత‌ని ఇంటికి వ‌చ్చి, వీడియో కోసం భార్యాభ‌ర్త‌ల్ని చంపేస్తాడు.

ర‌హ‌స్యంగా అల్మారాలో దాక్కున్న వాళ్ల ఏడేళ్ల పాప ఈ హ‌త్య‌ని చూస్తుంది. అదే స‌మ‌యానికి ఆ ఇంటికి వ‌చ్చిన డాగ్ గ్రూమ‌ర్ (కుక్క‌ల‌కి స్నానం చేయించే వ్య‌క్తి) ర‌విబాబు పాప ప్ర‌మాదంలో వుంద‌ని గుర్తిస్తాడు.

హ‌త్య‌ల‌కు సాక్ష్యంగా వున్న పాప‌ని అంతం చేయ‌డానికి హోంమినిస్ట‌ర్ మ‌నుషులు ప్ర‌య‌త్నిస్తూ వుంటే హీరో అడ్డుకుంటాడు. అస‌లీ రుద్ర ఎవ‌రు?పాప‌ని ఎలా ర‌క్షించాడు? ఇదీ మిగతా క‌థ‌.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘లాజిక్ అడ‌గ‌డం అన‌వ‌స‌రం’

ఇలాంటి సినిమాల్లో క‌థలో కొత్త‌ద‌నం వుండ‌దు. ప‌సివాడి ప్రాణం నుంచి అనేక ఇంగ్లీష్ సినిమాల్లో చూసిన ఇతివృత్త‌మే. క‌థ‌నంలోని వేగం, కొత్త‌ద‌నం మాత్ర‌మే సినిమాని న‌డిపించాలి.

ర‌విబాబు కూడా స్క్రీన్ ప్లేని , యాక్ష‌న్నే న‌మ్ముకున్నాడు. అయితే అన్నీ ద‌ర్శ‌కుడికి క‌న్వీనియంట్‌గా జ‌రుగుతూ వున్న‌ట్టు అనిపిస్తుంది. ఎక్క‌డా పెద్ద‌గా కాన్‌ఫ్లిక్ట్ ఉండ‌దు.

ఇలాంటి క‌థ‌ల్లో లాజిక్ అడ‌గ‌డం అన‌వ‌స‌రం. అయితే హోంమంత్రి ఇంట్లో పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకుని, ఒక కంప్యూట‌ర్ నిపుణుడితో హీరో క‌ద‌లిక‌లు ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూ వుంటాడు.

అదే విధంగా హీరో ఒక‌మ్మాయి, ఇద్ద‌ర‌బ్బాయిలను అసిస్టెంట్ల‌గా పెట్టుకుని కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానంతో వీడియో వెతుకుతుంటాడు. ఇదంతా చూడ‌డానికి కొత్త‌గా అనిపించినా, సిటీలో కొన్ని వేల సీసీ కెమెరాలు ఉన్న‌ప్పుడు హీరో ఎక్క‌డికెళ్లినా తెలుసుకోవ‌డం సిల్లీగా అనిపిస్తుంది.

 సురేశ్ ప్రొడక్షన్, రవిబాబు, చైల్డ్ సెంటిమెంట్

ఫొటో సోర్స్, FB/SureshProductions/

పిల్లలు చూడొచ్చా?

ముఖ్య‌మంత్రి హ‌త్య వీడియోని ర‌క‌ర‌కాల లేయ‌ర్స్‌తో , కోడ్‌వ‌ర్డ్స్ ఉప‌యోగించి దాచాల్సిన అవ‌స‌రం ఏమిటో అర్థంకాదు. దాన్ని బ‌య‌ట పెట్టాల‌ని అనుకుంటే మీడియాకి అప్పుడే విడుద‌ల చేయొచ్చు క‌దా?

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఈ సినిమాలో చూపించినంత హింస ఈ మ‌ధ్య‌కాలంలో ఏ సినిమాలో చూసి వుండం. ర‌క‌ర‌కాల ఆయుధాల‌తో హీరో ర‌క‌ర‌కాలుగా చంపుతూ వుంటాడు. అవి మ‌న ఊహ‌కి కూడా అంద‌వు.

ఈ సినిమాలో ర‌విబాబు మిన‌హా పెద్ద న‌టులెవ‌రూ లేరు. అయితే ఖ‌ర్చు గ‌ట్టిగానే అయ్యింది. అదంతా దేనికంటే ఎర్ర రంగుకి (ర‌క్తం), ర‌క‌ర‌కాల ఆయుధాల‌కి, త‌ల‌లు, కాళ్లు, చేతులు న‌రికే గ్రాఫిక్స్ సీన్స్‌కి.

సినిమా మొత్తం గ్యాప్ లేకుండా యాక్ష‌నే. సున్నిత మ‌న‌స్కులు చూడ‌క‌పోవ‌డ‌మే మంచిది. చూస్తే నిద్ర‌లో కూడా గుర్తొచ్చే భ‌యంక‌ర దృశ్యాలున్నాయి.

 సురేశ్ ప్రొడక్షన్, రవిబాబు, చైల్డ్ సెంటిమెంట్

ఫొటో సోర్స్, sureshproductions/insta

ప్ల‌స్ పాయింట్స్ః

1.బీజీఎం

2.యాక్ష‌న్ సీన్స్‌

మైన‌స్ పాయింట్స్ః

1.విప‌రీత‌మైన హింస‌

2.లాజిక్ లేని క‌థ, క‌థ‌నాలు

ఫైన‌ల్‌గా ఇది చిన్న పిల్ల‌ని ర‌క్షించే క‌థే కానీ, చిన్న పిల్ల‌లు చూసేది కాదు. మ‌నుషుల్ని ఇన్ని ర‌కాలుగా చంప‌డం బ‌హుశా గ‌రుడ పురాణంలో కూడా ఉండ‌క‌పోవ‌చ్చు.

(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.