SIR : ‘ప్రసిద్ధ సంపాదకుడికే ఓటు హక్కు లేకుండా చేస్తే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి?’

ఫొటో సోర్స్, Kerala Literature Festival
- రచయిత, శర్లీన్ మోలన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
మాజీ ఎడిటర్ ఆర్ రాజగోపాల్‌కు ఓటు హక్కు, పాస్‌పోర్ట్ హక్కులను నిరాకరించడాన్ని భారత్‌లోని ఒక ప్రముఖ జర్నలిస్టుల సంఘం ఖండించింది.
'ది టెలిగ్రాఫ్' పత్రికలో పనిచేసిన రాజగోపాల్, పశ్చిమ బెంగాల్‌లో వివాదాస్పద ఓటర్ల జాబితా సవరణ సమయంలో తన పేరును తొలగించారని, దీనివల్ల తన పాస్‌పోర్ట్ రెన్యూవల్ నిలిచిపోయిందని పేర్కొన్నారు.
అనర్హులైన ఓటర్లను గుర్తించడానికి భారత ఎన్నికల సంఘం 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ప్రక్రియను కొనసాగిస్తోంది. కానీ ఈ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లను తప్పుగా తొలగించారని విమర్శకులు అంటున్నారు. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.
ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగా లక్షలాది మంది భారతీయులు అనుభవిస్తున్న ఇబ్బందులను రాజగోపాల్ కేసు స్పష్టం చేస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. రాజగోపాల్ లాంటి ప్రముఖ వ్యక్తికే ఓటు హక్కు లేకుండా చేస్తే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని పేర్కొంది.
రాజగోపాల్‌పై వచ్చిన నిర్దిష్ట ఆరోపణలపై ఎన్నికల సంఘం ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. దీనిపై వ్యాఖ్యానించాల్సిందిగా ఎన్నికల అధికారులను బీబీసీ కోరింది.

'తొలగించిన కారణం చెప్పలేదు'
2025 నవంబర్ 4న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాల నుంచి సుమారు 6 కోట్ల పేర్లను తొలగించారు. అలాతొలగించిన వాటిలో దాదాపు 90 లక్షల పేర్లు పశ్చిమ బెంగాల్‌లోనే ఉన్నాయి.
కోర్టులో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పీల్ చేసిన వేలాది మందిలో రాజగోపాల్ ఒకరు. ప్రస్తుతం 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ ప్రక్రియకు సంబంధించిన మరొక విడత కొనసాగుతోంది.
'ది వైర్' వార్తా వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక కథనంలో రాజగోపాల్ పలు వివరాలు రాశారు.
కోల్‌కతాలోని బల్లిగంజ్ నియోజకవర్గంలో తాము 25 ఏళ్లకు పైగా నివసిస్తున్నప్పటికీ, 2002 ఓటర్ల జాబితాలో తన పేరుకానీ, తన తండ్రి పేరు కానీ లేదనే కారణంతో తన పేరును తొలగించారని ఆయన తెలిపారు.
దేశవ్యాప్తంగా చివరిసారిగా జరిగిన సవరణ ఆధారంగా, ప్రస్తుత ఓటరు రికార్డులను 2002 జాబితాతో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ సరిపోల్చుతోంది.
తాను 2010 నుంచి ఓటరుగా ఉన్నానని, కోల్‌కతాకు చెందిన 'ది టెలిగ్రాఫ్' పత్రికకు ఏడేళ్లపాటు ఎడిటర్‌గా పనిచేశానని, అయినప్పటికీ తన పేరును తొలగించారని రాజగోపాల్ రాశారు.
"నా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ సమర్పించినప్పటికీ, ఓటర్ల జాబితా నుంచి నన్ను ఎందుకు తొలగించారో ఎటువంటి కారణం చెప్పలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునళ్లలో నా అప్పీల్ ప్రస్తుతం పరిశీలనలో ఉంది" అని రాజగోపాల్ ఆ కథనంలో ఆరోపించారు.
ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడం వల్లే తన పాస్‌పోర్ట్ రెన్యూవల్ పోలీస్ వెరిఫికేషన్ పూర్తి కాలేదని అధికారులు చెప్పినట్లు ఆయన తెలిపారు.
"పాస్‌పోర్ట్ రెన్యూవల్‌కు ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొనే ఎలాంటి బహిరంగ పత్రం నాకు కనిపించలేదు. ఇది నన్ను అయోమయానికి గురిచేసింది" అని రాజగోపాల్ రాశారు.
ఈ ఆరోపణలపై స్పందన కోరుతూ బీబీసీ ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది.
"జర్నలిజంలోనే జీవితాన్ని గడిపి, ఒక ప్రముఖ పత్రికకు ఎడిటర్‌గా పనిచేసిన వ్యక్తికే ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే, నిజంగా అణగారిన వర్గాల ప్రజలు ఇంకెన్ని కష్టాలు అనుభవించాలో ఊహించుకోవచ్చు" అని రాజగోపాల్ చెప్పారు.
సోషల్ మీడియాలో మద్దతు
రాజగోపాల్ కేసు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు ఆయనకు మద్దతు తెలుపుతూ, ఓటు హక్కును పునరుద్ధరించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్‌లో తాను రాజగోపాల్‌కు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
"భయపెట్టే విషయం ఏమిటంటే, ఇది ఎవరికైనా జరగవచ్చు" అని ఆయన రాశారు.
రాజగోపాల్ తన జర్నలిజానికి, బాధ్యతాయుతంగా ప్రశ్నించినందుకే ఈ మూల్యం చెల్లించుకుంటున్నారని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రినేత్ ఆరోపించారు.
మరోవైపు, దేశంలోని పేద, బలహీన వర్గాల ఓటు హక్కును ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ దూరం చేస్తుందని తమ పార్టీ ముందే హెచ్చరించిందని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ చెప్పారు.
"కానీ ఇప్పుడు, ఆర్ రాజగోపాల్ లాంటి మంచి పేరున్న ఎడిటర్, ప్రశంసలు పొందిన జర్నలిస్టుకు కూడా ఓటు హక్కు నిరాకరించారు" అని ఆయన 'ఎక్స్' లో రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























