కీటకాల నుంచి మనుషులు ఏం నేర్చుకోవచ్చు? చీమలు, మిడతలు, బొద్దింకలు, ఈగల ప్రవర్తన చెప్పే పాఠమేంటి?

చీమలు, బొద్దింకలు, మిడతలు, తేనెటీగలు, ఈగలు

ఫొటో సోర్స్, Pavich Sattalerd via Getty Images

ఫొటో క్యాప్షన్, చీమ
    • రచయిత, సోఫియా ఖ్వాగ్లియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

ఆలోచన, తర్కించగల సామర్థ్యం కారణంగా మనుషులు పరిణామ క్రమంలో అగ్రస్థానంలో ఉన్నామని భావిస్తుంటారు.

అయితే చాలాసేపు ఆలోచించి చర్చించిన తర్వాత కూడా కొన్నిసార్లు మనుషులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.

దీనికి విరుద్ధంగా అత్యంత చిన్న మెదడు ఉన్న కీటకాలు తమ నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. వీటి నైపుణ్యం నుంచి ప్రేరణ పొందిన మనుషులు నిజ జీవితంలో మెరుగైన, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనేక పద్ధతులను (అల్గారిథమ్‌లను) అభివృద్ధిచేశారు.

కీటకాలు నిర్ణయాలు తీసుకునే విధానం నుంచి మనం నేర్చుకోగల ఐదు ముఖ్యమైన విషయాలున్నాయి.

మనుషులు మరింత తెలివిగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి సహాయపడతాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చీమలు, బొద్దింకలు, మిడతలు, తేనెటీగలు, ఈగలు

ఫొటో సోర్స్, Muhammad Owais Khan via Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రయాణించే మార్గంలో చీమలు పలుచని ఫెరోమోన్ రసాయన వాసనను వదులుతాయి
కీటకాలు

ఒక పనికి ఉత్తమమైన విధానాన్ని ఎంచుకోవడం సులభం కాదు. ముఖ్యంగా ఒకేసారి అనేక అవకాశాలున్నప్పుడు. ఈ పరిస్థితిని "అవకాశాల భారం" అంటారు.

ఆహారం కోసం స్థలాన్ని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు చీమలు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటాయి. అనేక చీమల జాతులు ఈ సమస్యను ఎదుర్కోవడానికి ఒక సులభమైన పద్ధతిని అభివృద్ధి చేసుకున్నాయి.

మొదటగా చీమలు తమగూళ్ల నుంచి బయటకు వచ్చి సమీపంలో మంచి ఆహారం దొరికే ప్రదేశం కోసం వెతుకుతాయి. ఆహార లభ్యత అవకాశాలను పరిశీలించడానికి ఈ చీమలు యాదృచ్ఛికంగా వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తాయి.

అవి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు నేలపై పలుచని ఫెరోమోన్ అనే రసాయన వాసనను వదిలి వెళ్తాయి. దీంతో ఇతర చీమలు తరువాత అదే మార్గాన్ని అనుసరించగలవు.

ఫెరోమోన్ అంటే కీటకాలు, కొన్ని జంతువులు తమ శరీరాల నుంచి విడుదల చేసే ఒక రకమైన రసాయన పదార్థం.

ఫెరోమోన్ వాసన కాలక్రమేణా తగ్గుతుంది. కాబట్టి చీమలు ఫెరోమోన్ వాసన ఎక్కువగా ఉన్న మార్గాన్ని ఇష్టపడతాయి.

ఉత్తమమైన, సులభమైన మార్గాన్ని గుర్తించిన చీమలు ఆహారంతో త్వరగా తిరిగి వస్తాయి. ఫెరోమోన్ వాసన పూర్తిగా తగ్గిపోయేలోపు అవి అదే మార్గంలో మళ్ళీ ఫెరోమోన్‌ను వదులుతాయి.

దీంతో మరిన్ని చీమలు కూడా ఆ దారిని ఉపయోగించడం మొదలుపెడతాయి. క్రమంగా చాలా చీమలు ఆ మార్గంలోనే తిరగడంతో అక్కడ మరింత ఫెరోమోన్ పేరుకుపోతుంది. అందువల్ల ఆ దారి వాసన మరింత బలపడి, చీమలు దానిని మరింత సులభంగా గుర్తించగలుగుతాయి.

కాలక్రమేణా మంచి మార్గంలో ఎక్కువ ఫెరోమోన్ పేరుకుపోతుంది. ఇతర మార్గాల్లో మాత్రం వాసన క్రమంగా తగ్గిపోతుంది.

చివరికి చీమల గుంపు మొత్తం కలిసి అత్యుత్తమ మార్గాన్ని కనుగొంటుంది.

‘‘కేంద్రీకృత నియంత్రణ లేకపోయినా, సమష్టిగా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చని ఇది మనకు బోధిస్తుంది" అని బెల్జియంలోని యూనివర్సిటీ లిబ్రే డి బ్రస్సెల్స్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కో డైరెక్టర్ మార్కో డొరిగో అన్నారు.

"చీమలు చాలా చిన్న జీవులు. వాటిసామర్థ్యం పరిమితం. పరిసరాలపై ఉండే అవగాహనా పరిమితమే. అయినప్పటికీ అవి కలిసి చాలా సంక్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలవు" అని ఆయన అన్నారు.

ఈ పద్ధతిని 'యాంట్ కాలనీ ఆప్టిమైజేషన్' అని పిలుస్తారు. దీనిని కంప్యూటర్ అల్గారిథమ్‌గా కూడా ఉపయోగిస్తున్నారు.

దీని సహాయంతో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల పని సమయాల ప్రణాళిక, టెలీకమ్యూనికేషన్, రవాణా, సరుకుల పంపిణీ వ్యవస్థలను మెరుగుపరుస్తున్నారు.

రైల్వేల ప్రణాళికల రూపకల్పనలో కూడా దీన్ని ఉపయోగించారు.

మార్కో డొరిగో 'యాంట్‌నెట్' అనే వ్యవస్థను కూడా రూపొందించారు. ఇది కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సమాచారాన్ని వేగంగా, సమర్థవంతంగా చేరవేయడంలో సహాయపడుతుంది.

చీమలు, బొద్దింకలు, మిడతలు, తేనెటీగలు, ఈగలు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images

ఫొటో క్యాప్షన్, కీలక నిర్ణయాల విషయంలో తేనెటీగలు ప్రత్యేకంగా ఉంటాయి.
కీటకాలు

కొత్త తేనెతుట్టెను నిర్మించుకోవడానికి స్థలాన్ని వెతుకుతున్నప్పుడు తేనెటీగలు కూడా చీమలు అనుసరించే మార్గాన్ని పోలి ఉండే విధానాన్నే అనుసరిస్తాయి.

చీమల లాగే తేనెటీగలు కూడా తమకు కొత్త గూడు కట్టుకోవడానికి ఒక స్థలాన్ని వెతుక్కోవడానికి కలిసి పనిచేస్తాయి.

కొన్ని తేనెటీగలు వేర్వేరు ప్రదేశాలకు ఎగిరిపోతాయి. కానీ చీమలలాగా ఫెరోమోన్‌లను విడుదల చేయడానికి బదులుగా ఏ ప్రదేశం మంచిదో ఇతర తేనెటీగలకు చెప్పడానికి అవి తిరిగి వస్తాయి. ఆ ప్రదేశం గురించి తెలియజేయడానికి అవి "వ్యాగిల్ డాన్స్" చేస్తాయి. ఒక కొత్త ప్రదేశం ఎంత సురక్షితంగా, దగ్గరగా, విశాలంగా ఆహ్లాదకరంగా ఉందో సూచించడానికి అవి తమ శరీరాలను నిర్దిష్ట రీతులలో కదిలిస్తాయి.

ప్రదేశం ఎంత బాగుంటే తేనెటీగలు అంతబాగా నాట్యం చేస్తాయి.

కాలక్రమేణా ఒక నిర్దుష్ట ప్రదేశం వాటికి ఇష్టమైనదిగా మారుతుంది. సుమారు 20-25 తేనెటీగలు అదే ప్రదేశానికి తిరిగి వచ్చి అది మంచి ప్రదేశమని సూచించడానికి ఒక నృత్యం చేస్తాయి.

తగినన్ని తేనెటీగలకు ఒక ప్రదేశం నచ్చినప్పుడు అవన్నీ కలిసి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటాయి.

ఇది కొంతవరకు మనుషులు ప్రజాస్వామ్యంలో మెజారిటీతో నిర్ణయాలు తీసుకోవడం లాంటిది.

నిర్ణయాలను అప్పటికప్పుడు మార్చుకునే నైపుణ్యం మిడతలకున్నట్టు అధ్యయనంలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిర్ణయాలను అప్పటికప్పుడు మార్చుకునే నైపుణ్యం మిడతలకున్నట్టు అధ్యయనంలో తేలింది.
కీటకాలు

ఒక సమూహంలో రెండు విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పుడు ప్రజలను తమ అభిప్రాయాన్ని మార్చుకునేలా ఒప్పించడం చాలా కష్టం.

క్రమేణా ఆ సంభాషణ ముదిరి "ఇది ఒప్పు, అది తప్పు" అనే స్థాయికి ఆ వాదన చేరుకుంటుంది. ఇది ప్రతి ఒక్కరినీ తమ తమ అభిప్రాయాల విషయంలో మరింత పట్టుదలతో ఉండేలా చేస్తుంది.

చిన్న వయసు మిడతలకు ఎగరడం తెలియదు కాబట్టి అవి ఒకచోటు నుండి మరొక చోటుకు నడుస్తూ వెళ్తాయి.

యూకేలోని బాత్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అయిన క్రిస్టియన్ (కిట్) యేట్స్ తన ప్రయోగంలో మిడతల గుంపులను ఒక వృత్తాకార ప్రదేశంలో ఉంచారు.

మిడతలు ఏ దిశగా వెళ్లాలో సమష్టిగా నిర్ణయించుకుంటాయని ఆయన గమనించారు.

మిడతలు కాసేపు ఆగిన తర్వాత లేదా గందరగోళానికి గురైన తర్వాత పదేపదే తమ దిశను మార్చుకుంటాయని ఆయన గమనించారు.

మొదట ఒక దిశలో వెళ్లాలని నిర్ణయించుకుని, ఆపై ఆగి మరో దిశలో తిరుగుతాయి.

మిడతల దండు ఒక దిశలో కదులుతున్నప్పుడు కొన్ని మిడతలు కాసేపు కదలడం ఆపేసి ఏ దారినీ ఎంచుకోకుండా అలాగే ఉంటాయి.

ఈ చిన్న విరామం చాలా కీలకమైనది. ఇది మొత్తం గుంపు ఒక నిర్ణయం నుంచి మరొక నిర్ణయానికి సజావుగా మారడానికి వీలు కల్పిస్తుంది.

యేట్స్ 19 మంది మనుషులపై ఇలాంటి ప్రయోగాన్నే నిర్వహించారు. వారు 'ఎక్స్' లేదా 'వై' లలో ఒకదాన్ని ఎంచుకోవాలని చెప్పారు. కానీ కొంత కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా ఉండే అవకాశం కూడా ఇచ్చారు.

ఫలితంగా ప్రజలకు కొంతకాలం పాటు నిర్ణయం తీసుకోవడాన్ని వాయిదా వేసుకునే అవకాశం ఇచ్చినప్పుడు మొత్తం గుంపు త్వరగా, సులభంగా ఒకే నిర్ణయానికి వస్తుందని తేలింది.

కొన్నిసార్లు వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంతసేపు వేచి ఉండటం మొత్తం బృందం ఒక నిర్ణయానికి రావడానికి సాయపడుతుంది.

మిడతల మాదిరిగానే మనుషులలో కూడా ఏ ఎంపికనూ ఎంచుకోకుండా ఉండే అవకాశం ఇచ్చినప్పుడు అది సమూహం మరింత త్వరగా ఒక నిర్ణయానికి రావడానికి సహాయపడిందని యేట్స్ చెప్పారు.

''చాలా మంది ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి అభిప్రాయం మారినా పెద్ద తేడా ఉండదని యేట్స్ అంటారు. కానీ కొంతమంది కొంతకాలం పాటు నిర్ణయం తీసుకోవడం మానేస్తే నిర్ణయం తీసుకునే వారి సమూహం చిన్నదైపోతుంది. నిర్ణయాలు తీసుకునేవారు తక్కువగా ఉన్నప్పుడు వారి అభిప్రాయాలను సులభంగా మార్చవచ్చు" అని యేట్స్ అంటారు.

వెంటనే ఒక పక్షం వహించడం కంటే, కొన్నిసార్లు విషయాల గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకోవడం మంచిదని మిడతల దండు మనకు నేర్పుతుందని యేట్స్ అంటారు. ఇది ప్రతిఒక్కరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించి, చివరికి ఒక ఏకాభిప్రాయానికి రావడానికి వీలు కల్పిస్తుంది.

చీమలు, బొద్దింకలు, మిడతలు, తేనెటీగలు, ఈగలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కొన్ని బొద్దింకలు చాలా ధైర్యంగా ఉంటాయని అధ్యయనంలో తేలింది.
కీటకాలు

పలువురు ప్రభావవంతులైన వ్యక్తులు ఓ చర్చలో పాల్గొన్నప్పుడు ఆ బృందం ఏకాభిప్రాయానికి రావడం కష్టమవుతుంది. తామే అత్యంత ముఖ్యమైన వాళ్లమని భావించే కొందరు వ్యక్తులు చర్చను తమ దిశగా నడిపించి తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దే అవకాశం ఉంటుంది.

అయితే బొద్దింకలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ఒక గుంపులో విభిన్న స్వభావాలు ఉన్నప్పుడు నిర్ణయం తీసుకునే ప్రక్రియ వాస్తవానికి వేగవంతం అవుతుందని తేలింది.

కొన్ని బొద్దింకలు ధైర్యంగా ఉంటాయి. మరికొన్ని భయపడే స్వభావంతో ఉంటాయి.

జపాన్‌లోని టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ఐజాక్ ప్లానాస్ సిట్జా, బొద్దింకలు సామూహికంగా ఒక ప్రదేశాన్ని ఎలా ఎంచుకుంటాయో అధ్యయనం చేయడానికి కంప్యూటర్ నమూనాలను ఉపయోగించారు.

అందులో బొద్దింకలు దాక్కోవడానికి రిఫ్రిజిరేటర్ వెనుక ఉన్న చీకటి మూలను ఎలా ఎంచుకుంటాయో చూపించడానికి వారు ప్రయత్నించారు. వారు మూడు నమూనాలను రూపొందించారు. మొదటిది అన్ని బొద్దింకలు ఒకే విధంగా ప్రవర్తించేది. రెండోది కొన్ని బొద్దింకలు విభిన్న స్వభావాలను కలిగి ఉండేది. మూడోది అనేక బొద్దింకలు విభిన్న స్వభావాలను కలిగి ఉండేది.

బొద్దింకలన్నీ ఒకే విధంగా ప్రవర్తించినప్పుడు అవి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం తక్కువగా ఉందని తేలింది. అయితే వాటి స్వభావాలు వేర్వేరుగా ఉన్నప్పుడు ఆ గుంపులోనివి ఒకదానితో ఒకటి ఎక్కువగా సమాచారాన్ని పంచుకోవడం వల్ల అవి మరింత త్వరగా నిర్ణయాలు తీసుకున్నాయి.

"నేను చాలా ఆశ్చర్యపోయాను. కొన్ని మార్పులు వస్తాయని ఊహించాను కానీ ఇంత స్పష్టమైన ఫలితం వస్తుందని అస్సలు ఊహించలేదు" అని ప్లానాస్ సిట్జా అన్నారు.

దీని అర్థం ఏంటంటే ఆ గుంపులో అత్యంత చురుకైన, తిరిగే బొద్దింకలు మాత్రమే ఉంటే అవి నిరంతరం తిరుగుతూ ఉండటం వల్ల సరైన స్థలాన్ని ఎంచుకోవడంలో ఇబ్బంది పడతాయి.

మరోవైపు గుంపులో బాగా సిగ్గరి అయిన బొద్దింకలు ఉంటే అవి త్వరగా ఒక స్థలాన్ని ఎంచుకుంటాయి. కానీ ఆ స్థలం మంచిది కానవసరం లేదు.

"ఒక సమూహంలో కలిసి పనిచేయడం, వ్యక్తిగతంగా ప్రవర్తించడం మధ్య సరైన సమతుల్యత ఆ సమూహం సమష్టి అవగాహనకు దోహదపడుతుంది. ఇంత చిన్న జీవుల్లో వ్యక్తిత్వం ఇంత ప్రభావం చూపుతుంటే, మరింత సంక్లిష్టమైన సామాజిక సమూహాలలో నివసించే జీవులపై దీని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండవచ్చు" అని ప్లానాస్-సిట్జా చెప్పారు.

కీటకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నిర్ణయాలు తీసుకునేముందు అనేక రకాల సమాచారాన్ని ఫ్రూట్ ఫ్లైలు సేకరిస్తాయని అధ్యయనంలో తేలింది.
నిర్ణయాలు తీసుకునేముందు అనేక రకాల సమాచారాన్ని ఫ్రూట్ ఫ్లైలు సేకరిస్తాయని అధ్యయనంలో తేలింది.

కొన్నిసార్లు మన అంతరాత్మ చెప్పేది అణచివేసి మనసులో అవి తప్పు అనిపించినా తార్కికంగా అనిపించే నిర్ణయాలు తీసుకుంటాం. మరికొన్నిసార్లు గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో విఫలమై మన నమ్మకాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం.

మన నిర్ణయాలపై మరింత అవగాహనతో ఎలా ఉండాలనే విషయంలో చిన్న ఈగలు ( ఫ్రూట్ ఫ్లై) మనకు చాలా నేర్పించగలవు.

ఈగలు పరిస్థితులకు అనుగుణంగా మారగలవని, తమ చర్యలపై నిర్ణయాలు తీసుకోవడానికి బాహ్య సమాచారాన్ని, అంతర్గత సమాచారాన్ని మిళితం చేస్తాయని తెలుస్తోంది. ఉదాహరణకు ఒకేలా ఉన్న రెండు వాసనల్లో ఒకటి ఎంచుకోడానికి ఫ్రూట్ ఫ్లైలు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అవి రెండు ఆప్షన్లలో లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నట్టు అనిపిస్తుంది.

రుచిగా ఉండి పోషకాలు లేని ఆహారం, లేదా చేదుగా ఉండి పోషకాలున్న పదార్థం ఉన్నప్పుడు ఫ్రూట్ ఫ్లైలు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. పొట్ట నింపుకోడానికి అవి రుచి బాగోలేని ఆహారాన్ని కూడా తింటాయి.

ఈ ఫ్రూట్ ఫ్లైలు సాధారణంగా పెద్ద ప్రతిఫలం కోసం ప్రమాదంలో పడడం కంటే, చిన్నదైనా సురక్షితమైన ప్రయోజనాన్ని ఎంచుకోవడానికే ఇష్టపడతాయి.

అయితే అవి చాలా ఆకలితో ఉన్నప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు వాటి నిర్ణయం మారవచ్చు. ఫ్రూట్ ఫ్లైలకు అనుకూలమైన లేదా ప్రతికూలమైన వాసన ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఫ్రూట్ ఫ్లైలు తమకు పరిచయం లేని వాటిని కూడా ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒత్తిడికి గురైన ఫ్రూట్ ఫ్లైలు రిస్క్ తీసుకోవడాన్ని నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఫ్రూట్ ఫ్లైల్లాగే మన మానసిక స్థితులు కొన్నిసార్లు మన నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. కానీ మన అంతరాత్మ ప్రబోధాలు, గత అనుభవాలు కూడా సరైన అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయపడతాయి. ఈ భావాలు మన గత అనుభవాలు, మన గురించి, ఇతరుల గురించి మనకున్న అవగాహన, అభిప్రాయాల ద్వారా ఏర్పడతాయి.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)