విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41మంది మరణించిన కరూర్‌ జిల్లాలో ఏ పార్టీకి ఫలితాలు ఎలా వచ్చాయంటే..

    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

విజయ్ గతేడాది పాల్గొన్న ప్రచార సభలో 41 మంది మరణించిన కరూర్ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. ఆ ఘటన జరిగిన ప్రాంతం ఉన్న నియోజకవర్గంలో అన్నాడీఎంకే గెలిచింది.

మిగతా 2 నియోజకవర్గాల్లో డీఎంకే విజయం సాధించింది. 2021 ఎన్నికల్లో ఈ జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో డీఎంకే గెలిచింది.

కరూర్‌లో 2 నియోజకవర్గాలను కోల్పోయిన డీఎంకే, ఈ ఎన్నికల్లో కోయంబత్తూరులో అదనంగా 3 నియోజకవర్గాలను గెలుచుకుంది.

అదే సమయంలో కరూర్‌లో ఒక నియోజకవర్గాన్ని గెలుచుకున్న అన్నాడీఎంకే, కోయంబత్తూరు జిల్లాలో 9 నియోజకవర్గాలను కోల్పోయింది.

కోయంబత్తూరులో 10లో 6 నియోజకవర్గాలను గెలిచిన టీవీకే పార్టీ, కరూర్‌లో 4 స్థానాల్లో ఒకటే గెలవడం చర్చనీయాంశంగా మారింది.

41 మంది మరణించిన కరూర్ నియోజకవర్గంలో టీవీకే ఓటమి

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లోని వేలుసామిపురం ప్రాంతంలో వాహనంలో ప్రచారం చేస్తున్నప్పుడు తొక్కిసలాట జరిగింది.

ఆ తొక్కిసలాటలో 41 మంది మరణించారు.

ఈ ఘటనకు సంబంధించి టీవీకే నాయకుల్లో కొందరిని అరెస్ట్ చేశారు. విచారణ కోసం విజయ్‌ను దిల్లీ సీబీఐ కార్యాలయానికి పిలిపించారు.

తన ప్రచార సభలో జరిగిన విషాదం తర్వాత, విజయ్ ఆసుపత్రికి వెళ్లకుండా విమానంలో చెన్నై వెళ్లడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

ఆయన ఆలస్యంగా రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని డీఎంకే ఆరోపించింది.

తర్వాత విజయ్ ఎం.కె. స్టాలిన్ పేరును ప్రస్తావిస్తూ ఒక వీడియోను విడుదల చేసి, అప్పటి నుంచి డీఎంకేను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

కరూర్ ఘటనలో మృతుల కుటుంబాలను చెన్నైకి పిలిపించి స్వయంగా నష్టపరిహారం అందించిన విజయ్, ఆ తర్వాత మళ్లీ కరూర్‌కు వెళ్లలేదు.

దీనిపై కూడా మీడియాలో, సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా విజయ కరూర్‌కు వెళ్లలేదు.

ఇంకా ప్రమాదాలు జరగకూడదనే, పోలీసులు చెప్పినందుకే విజయ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారని టీవీకే పార్టీ తెలిపింది.

వీడియో కాల్‌లో బాధిత కుటుంబాలతో మాట్లాడిన విజయ్, "త్వరలోనే వచ్చి కలుస్తా" అని వారితో చెప్పారు.

విజయ్ ప్రచారం చేయకపోవడంతో కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తింది. అయితే ఓట్ల లెక్కింపు తర్వాత తేలిందేంటంటే ఘటన జరిగిన వేలుసామిపురం ఉన్న కరూర్ నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే విజయం సాధించిందని.

అంతకుముందు ఓడిపోయిన మాజీ మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ ఈసారి గెలిచారు. ఆయనకి 71,542 ఓట్లు వచ్చాయి.

టీవీకే పార్టీఅభ్యర్థి మతియళగన్ 69,711 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. కేవలం 1,821 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

డీఎంకే అభ్యర్థి త్యాగరాజన్‌కు 67,256 ఓట్లు వచ్చాయి.

నామ్ తమిళర్ కట్చి పార్టీ అభ్యర్థికి 5,465 ఓట్లు మాత్రమే వచ్చాయి.

అరవకురిచి నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి ఇళంగో 70,827 ఓట్లు సాధించి గెలుపొందారు.

ఆయనకు తన సమీప ప్రత్యర్థి, టీవీకే పార్టీ అభ్యర్థి కార్తికేయన్ (51,445 ఓట్లు) కంటే 19,382 ఓట్లు ఎక్కవగా వచ్చాయి. ఏఐఏడీఎంకే అభ్యర్థి సెల్వకుమార్ 49,289 ఓట్లు, నామ్ తమిళర్ కట్చి పార్టీ అభ్యర్థి నారాయణ్ 5,154 ఓట్లు సాధించారు.

కుళితలై నియోజకవర్గంలో కూడా డీఎంకే గెలిచింది. డీఎంకే అభ్యర్థి సూర్యనూర్ చంద్రన్ 68,138 ఓట్లు సాధించి, టీవీకే పార్టీ అభ్యర్థి బాలసుబ్రమణియం (67,559)ను 579 ఓట్ల తేడాతో ఓడించారు.

ఈ నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే అభ్యర్థి కరుణాకరన్‌కు 60,317 ఓట్లు, ఎన్డీఏ అభ్యర్థి సెల్వ నన్మారన్‌కు 7,978 ఓట్లు వచ్చాయి.

నాలుగు నియోజకవర్గాలలో మూడింటిలో ఓడిపోయిన టీవీకే పార్టీ, కృష్ణరాయబ్ (రిజర్వ్) నియోజకవర్గంలో విజయం సాధించింది.

టీవీకే పార్టీ అభ్యర్థి హెచ్. సత్య 62,378 ఓట్లు సాధించి, ఏఐఏడీఎంకే అభ్యర్థి దివ్య (58,875 ఓట్లు)ను 3,503 ఓట్ల తేడాతో ఓడించారు.

డీఎంకే అభ్యర్థి సి.కె. రాజాకు 57,292 ఓట్లు, ఎన్డీఏ అభ్యర్థి సత్యకు 6,102 ఓట్లు వచ్చాయి.

కోయంబత్తూరులో డీఎంకేకు 3 సీట్లు

2021 అసెంబ్లీ ఎన్నికల్లో కరూర్ జిల్లాలోని 4 స్థానాలనూ డీఎంకే గెలుచుకుంది. ఇప్పుడు వాటిలో రెండింటిని కోల్పోయింది. ఆ ఎన్నికలలో కరూర్ నియోజకవర్గం నుంచి గెలిచిన సెంథిల్ బాలాజీ మంత్రి అయ్యారు.

ఈసారి ఆయన కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లోనూ ఏఐఏడీఎంకే కూటమి విజయం సాధించింది. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటికీ, కోయంబత్తూరు జిల్లాలో ఒక్క నియోజకవర్గంలో కూడా గెలవలేదు. అందుకే కోయంబత్తూరు జిల్లా బాధ్యతను సెంథిల్ బాలాజీకి అప్పగించారు.

అందుకే ఈ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పార్టీ నాయకత్వం ఆయనకు అవకాశం కల్పించింది. సెంథిల్‌బాలాజీ 59,724 ఓట్లు సాధించి, టీవీకే అభ్యర్థి సెంథిల్‌కుమార్‌ను 2,271 ఓట్ల తేడాతో ఓడించారు. కోయంబత్తూరు దక్షిణ, వాల్పరై, పొల్లాచి నియోజకవర్గాల్లో డీఎంకే గెలిచింది.

గత 2021 ఎన్నికలలో మొత్తం 10 స్థానాలను గెలుచుకున్న ఏఐఏడీఎంకే కూటమి, ఈసారి కేవలం ఒక స్థానానికే పరిమితమైంది. తొండముత్తూరు నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణి 93,316 ఓట్లు సాధించగా, ఆయన టీవీకే అభ్యర్థి కె.పి.ఆర్. సతీశ్ (78,591 ఓట్లు)పై 14,725 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కరూర్ జిల్లాలో 2 సీట్లు కోల్పోయిన డీఎంకే, కోయంబత్తూరు జిల్లాలో 3 సీట్లు గెలుచుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ (ఏఐఏడీఎంకే పొత్తుతో) గెలుచుకున్న ఒక సీటుతో సహా, మొత్తం 10 సీట్లకు గాను 10 సీట్లు గెలుచుకున్న ఏఐఏడీఎంకే, ఈసారి 9 సీట్లు కోల్పోయింది.

టీవీకే తన మొదటి ఎన్నికలోనే కోయంబత్తూరు జిల్లాలోని 10 సీట్లకు గాను 6 సీట్లు గెలుచుకుంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)