మదనపల్లి సభలో ఏం జరిగింది? నిర్మలా సీతారామన్ తన ప్రసంగాన్ని మధ్యలో ఎందుకు ఆపేశారు.. సభకు వచ్చినవారిని చంద్రబాబు ఎందుకు మందలించారు?

నిర్మల సీతారామన్
ఫొటో క్యాప్షన్, నిర్మలాసీతారామన్
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తున్న సమయంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు కాంగ్రెస్, ఎన్డీయే మధ్య రాజకీయ వివాదానికి కారణమైంది.

అక్టోబర్ 2న మదనపల్లిలో జరిగిన 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్' కార్యక్రమానికి సంబంధించిన సుమారు 30 సెకన్ల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆ వీడియోలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతుండగా... సభలో కొంతమంది గట్టిగా అరుస్తున్నట్టు, ఆమె వారిని కాసేపు తన మాట వినాలని కోరుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైక్ తీసుకుని సభికులను శాంతింపజేసే ప్రయత్నం చేయడం కనిపిస్తుంది.

ఈ వీడియోను కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ తన 'ఎక్స్' అకౌంట్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ సభలో ఏం జరిగింది. దీనిపై కాంగ్రెస్ ఆరోపణలకు ఎన్డీయే కూటమి నేతలు ఏం చెప్పారు? తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మదనపల్లి సభలో సీరియస్ అయిన చంద్రబాబు

అక్టోబర్ 2న మదనపల్లిలో 'గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రాయలసీమ రైజింగ్' ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.

ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ తదితరులు హాజరయ్యారు.

రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల ఆధారిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రకటించింది.

అదే కార్యక్రమంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు కూడా శంకుస్థాపన జరిగింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ సభకు సంబంధించిన వీడియోలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నప్పుడు సభలో కాస్త కలకలం నెలకొంది. సభలో ప్రేక్షకుల నుంచి అరుపులు, ఈలలు వినిపించాయి.

నిర్మలాసీతారామన్, చంద్రబాబు, అనంత్ అంబానీ, నారా లోకేశ్
ఫొటో క్యాప్షన్, నిర్మలాసీతారామన్, చంద్రబాబు, అనంత్ అంబానీ, నారా లోకేశ్

దీంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ "ఒక్క నిమిషం.. ఒక్క నిమిషం నా మాట వినండి.. ఒక్క నిమిషం.. నా మాట వినండి..’’ అని అన్నారు.

అయితే సభలో కేకలు ఆగకపోవడంతో ప్రసంగం ఆపేశారు.

సరిగ్గా అప్పుడే సీఎం చంద్రబాబు తన కుర్చీలోంచి లేచి మైక్ దగ్గరకు వెళ్లారు.

"తమ్ముళ్లూ దయచేసి కూర్చోవాలి. ఇది కరెక్ట్ కాదు.. ఇది రాయలసీమ రైతు జీవితాల్లో మార్పు తెచ్చే కార్యక్రమం. కేంద్ర మంత్రి గారి సందేశం చాలా ముఖ్యం. దయచేసి కూర్చోవాలి. మీ ఉత్సాహం నాకు అర్థమైంది. కానీ, కూర్చోవాలి. తర్వాత మేం బయటికిస్తాం... అప్పుడు కావాలంటే మీరు స్లోగన్స్ ఎంత కావాలంటే అంత ఇవ్వొచ్చు.. దయచేసి కూర్చోవాలి" అని అన్నారు.

తర్వాత కింద ప్రేక్షకుల వైపు వేలు చూపిస్తూ "ఏ తమ్ముళ్లూ దిగండి.. చెప్పేది మీకే...వినాలి. నా మాట వినాలి మేం గౌరవంగా చెబుతున్నాను. మీరు గౌరవం ఇవ్వాలి, గౌరవం ఇవ్వకపోతే మదనపల్లి బయటివాళ్లు అనుకుంటారు. కూర్చోవాలి" అన్న తర్వాత కూడా ప్రజలు సద్దుమణగపోవడంతో.. కాస్త సీరియస్ స్వరంతో "వన్ మినిట్‌లో కూర్చోవాలి... మీరేనయ్యా.. చెప్పింది వినాలి.. ప్లీజ్... సిట్‌డౌన్.. నా మాట వినండి... నేనూ పవన్ కల్యాణ్ ఎప్పుడూ వస్తావుంటాం... మనకొక అరుదైన అవకాశం. కేంద్రమంత్రి గారు చెప్పే సందేశం చాలా ముఖ్యమైనది.. దయచేసి వినాలి.. అందరూ కూర్చోవాలి" అనగానే సభలో కాస్త అరుపులు తగ్గడం, ఆ తర్వాత నిర్మలా సీతారామన్ తన ప్రసంగం కొనసాగించడం జరుగుతుంది.

జైరాం రమేశ్
ఫొటో క్యాప్షన్, సులేమాన్ ఖాన్ పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియోను రీట్వీట్ చేసిన జైరాం రమేశ్

జైరాం రమేశ్ ఏమన్నారు?

కేంద్ర మంత్రి హాజరైన సభలో ప్రేక్షకుల అరుపులు, సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి రావడం చర్చనీయాంశం అయింది.

ఇదే వీడియోను తమ ఎక్స్ అకౌంట్లో రీపోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ "ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో కేంద్ర మంత్రి స్వయంగా చూశారు. ప్రజలను ముఖ్యమంత్రి శాంతింపజేయాల్సి వచ్చింది" అని రాశారు.

సులేమాన్ ఖాన్ పేరుతో ఉన్న ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియోను రీట్వీట్ చేసిన జైరాం రమేశ్ పై విధంగా స్పందించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

నారా లోకేశ్
ఫొటో క్యాప్షన్, నారా లోకేశ్

కూటమి నేతలు ఏమన్నారు?

జైరాం రమేశ్ పోస్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను ఖండించారు.

ఇది ఉద్యోగాల కోసం తెలిపిన నిరసన కాదని, తమ నాయకులను కలవాలనే ఉత్సాహంతో టీడీపీ, జనసేన కార్యకర్తలు చేసిన హడావుడి అని చెప్పారు.

జైరాం రమేశ్ అక్టోబర్ 4న సుమారు 4.15 నిమిషాలకు ఈ పోస్ట్ చేయగా ఆయన వ్యాఖ్యలపై అదే రోజు సాయంత్రం 7.04 నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు.

"నమ్మలేకపోతున్నా, జైరామ్. మీరింత ఆవేశపరులని నేను అనుకోలేదు. @JaiTDP, @JanaSenaParty కార్యకర్తలు తమ నాయకులైన @ncbn, @PawanKalyan ప్రసంగాలు వినాలని ఆసక్తిగా ఉన్నారు. కార్యక్రమం పూర్తయ్యాక వారు వచ్చి మాట్లాడతామని ముఖ్యమంత్రి చెప్పారు. అంతకు మించి ఏమీ లేదు" అని ఆమె సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

జైరాం రమేశ్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు.

జైరాం రమేశ్ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన చంద్రబాబు.. "జైరామ్ జీ, జరిగిన దానిపై మీరు చేసిన వ్యాఖ్య వాస్తవానికి చాలా దూరంగా ఉంది. మీరు ప్రజాగ్రహంగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నది, వాస్తవానికి ప్రజల నుంచి వచ్చిన ఉత్సాహభరితమైన స్పందన.

సభలోని వారి ఉత్సాహం కారణంగా, కార్యక్రమం సజావుగా కొనసాగేందుకు నేను జోక్యం చేసుకోవలసి వచ్చింది’’ అని అన్నారు.

‘‘ప్రజల ఉత్సాహాన్ని ఆగ్రహంగా పొరబడటం, మీరు ఆంధ్రప్రదేశ్, భారత ప్రజల మనోభావాలకు ఎంతగా దూరంగా ఉన్నారనేది వెల్లడిస్తుంది’’ అని చంద్రబాబు అందులో పోస్టు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 3

చంద్రబాబు నాయుడు
ఫొటో క్యాప్షన్, మదనపల్లి సభకు హాజరైన ప్రజలు

అసలేం జరిగింది?

సభలో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

వైరల్ వీడియోలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్న సమయంలో ఉద్యోగాలు కావాలనే నినాదాలు ఏవీ వినిపించలేదని ఆ సమయంలో సభలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ఉమాకాంత్ బీబీసీతో చెప్పారు.

"జరిగిన ఇష్యూకు, ఉద్యోగాలకు ఏమి సంబంధం లేదు. అయితే, మదనపల్లి స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాష, బయటకు వెళ్లి తిరిగి మళ్లీ స్టేజ్ పైకి వస్తున్నారు. ఆ సమయంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. ఆయన వేదిక పైకి వచ్చే సమయంలో ప్రజలకు అభివాదం చేశారు. ముందర ఉన్నది ఆయనకి సంబంధించిన మనుషులే. అందుకే వాళ్లు చెయ్యి ఊపుతూ ఈలలు అరిచారు. అది ఉత్సాహంతో అరిచారు. అంతేగాని ఉద్యోగాల కోసం వాళ్లు అరవలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళని అరవద్దండి అని నివారించారు"అని సీనియర్ జర్నలిస్ట్ ఉమాకాంత్ అన్నారు.

అక్కడ అరిచింది పవన్ కల్యాణ్ అభిమానులని, పవన్ ప్రసంగం వాళ్లు కోరుకున్నంత ఎక్కువ సమయం లేకపోవడంతో వారు అలా చేశారని అదే సభను కవర్ చేసిన స్థానిక జర్నలిస్ట్ కిరణ్ చెప్పారు.

''నిర్మలా సీతారామన్ కంటే ముందు చాలామంది నాయకులు మాట్లాడారు. ఎక్కువ పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడ అరిచారు. పవన్ కళ్యాణ్ పేరు వినిపించినప్పుడల్లా అరుస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సబ్జెక్టు మాత్రమే మాట్లాడి కూర్చున్నారు. ఇక వాళ్లు వెళ్లిపోతారేమో అని అరిచారు. నిర్మలా సీతారామన్ ఒక నిమిషం నా మాట వినండి అని అన్న కూడా వాళ్లు తగ్గలేదు. దీంతో చంద్రబాబు నాయుడు వారిని ఉద్దేశించి నేను పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉంటాం, కేంద్ర మంత్రి మాటలు వినాల్సిన అవసరం మనకు ఉంది అని అనడంతో అప్పుడు తగ్గారు'' అని కిరణ్ బీబీసీతో అన్నారు.

అయితే, ప్రేక్షకుల్లో ఒకరి చేతిలో అనంత్ అంబానీని ఉద్దేశిస్తూ ప్రదర్శిస్తున్న ఒక ప్లకార్డు కనిపించిందని ఆయన అన్నారు.

ఆంగ్లంలో ఉన్న ఆ ప్లకార్డులో "మా సొంత ఊరికి దూరంగా మా నాన్న పనిచేస్తున్నారు. మా నాన్నలా ఎంతోమంది తమ కుటుంబాలకు దూరంగా పనిచేస్తున్నారు. అందుకే మీ కొత్త ప్రాజెక్టులో మరింత మందికి ఉద్యోగాలు ఇవ్వండి. ఇది నా అభ్యర్థన" అని ఉంటుంది.

అయితే దానిని ప్రదర్శించింది ఎవరు అనేది తెలియలేదు. ఉద్యోగాలు ఇవ్వాలి అని ఇంకెవరు కూడా నినాదాలు చేయలేదు. ఆ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తికి, అక్కడ అరిచిన వాళ్లకు కూడా సంబంధం లేదు'' అని సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ అన్నారు.

అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నప్పుడు.. సభలో కొందరు అరుపులు, కేకలతో హడావుడి చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్ ప్రత్యక్ష ప్రసారం చేసిన వీడియోలో కనిపిస్తోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)