తిమింగాలకు యుద్ధ భయం

Whale

ఫొటో సోర్స్, Ullstein Bild via Getty Images

    • రచయిత, మయేనీ జోన్స్
    • హోదా, ఆఫ్రికా కరస్పాండెంట్
  • చదివే సమయం: 3 నిమిషాలు

మిడిల్ ఈస్ట్‌లో ఘర్షణల కారణంగా నౌకలు ప్రయాణించే మార్గాలు మారడంతో దక్షిణాఫ్రికా నైరుతి తీరంలో తిమింగలాలకు ముప్పు ఏర్పడొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తిమింగలాలను ఓడలు ఢీకొట్టే ప్రమాదం ఉందంటున్నారు.

2023లో యెమెన్ సమీపంలో హూతీ తిరుగుబాటుదారులు బ్రిటన్‌కు చెందిన ఒక నౌకను హైజాక్ చేసినప్పటి నుంచి కొన్ని ఓడలను దక్షిణాఫ్రికా మీదుగా మళ్లిస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతంలో తిమింగలాలను నౌకలు ఢీకొనే ప్రమాదం గణనీయంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ ఘర్షణల కారణంగా ఆసియా, యూరప్ మధ్య సరకు రవాణా చేసే నౌకలు మిడిల్ ఈస్ట్‌ మీదుగా ప్రయాణాన్ని తప్పించడానికి ఆఫ్రికా చుట్టూ ప్రయాణిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్) పోర్ట్‌వాచ్ నివేదికను ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చ్, ఏప్రిల్ మధ్య సుమారు 89 వాణిజ్య నౌకలు కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించాయి.

2023లో ఇదే కాలంలో ప్రయాణించిన 44 నౌకల సంఖ్యతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.

యూనివర్సిటీ ఆఫ్ ప్రిటోరియాకు చెందిన వేల్ యూనిట్ చీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఎల్స్ వెర్మెయులెన్ బృందం తమ పరిశోధన ఫలితాలను ఇటీవల అంతర్జాతీయ వేలింగ్ కమిషన్‌కు సమర్పించింది.

పశ్చిమ కేప్ ప్రాంతంలోని వివిధ తిమింగలాల జాతుల విస్తరణ నమూనాలను తాము పరిశీలించామని, ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించడానికి ఆ నమూనాలను ఓడల ప్రయాణ మార్గాలతో పోల్చి చూశామని ఆమె బీబీసీకి వివరించారు.

అయితే, ప్రస్తుతం తగినంత డేటా అందుబాటులో లేనందున, ఓడలు ఢీకొని ఎన్ని తిమింగలాలు చనిపోతున్నాయనేది కచ్చితంగా అంచనా వేయడం కష్టమని వెర్మెయులెన్ పేర్కొన్నారు.

తిమింగలం

ఫొటో సోర్స్, Getty Images

చాలా వరకు ప్రమాదాలు తీరానికి దూరంగా లోతైన సముద్రంలో జరుగుతాయని, దీనివల్ల చనిపోయిన జంతువులు తీరానికి కొట్టుకురావడానికి బదులుగా సముద్రం అడుగుభాగానికి చేరుకుంటాయని ఆమె పేర్కొన్నారు.

దీనిని కనిపించని మరణాలు(క్రిప్టిక్ మోర్టాలిటీ) అని పిలుస్తారు. ఈ కారణం వల్లే సమస్య తీవ్రతను అంచనా వేయడం సవాల్‌గా మారినట్లు తెలిపారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి వెర్మెయులెన్ కొన్ని సూచనలు చేశారు. ఓడల ప్రయాణ మార్గాలలో స్వల్ప మార్పులు చేయడం, ఏడాదిలో కొన్ని నిర్దిష్ట సమయాల్లో నౌకల వేగాన్ని తగ్గించడం వంటివి ఇందులో ఉన్నాయి.

అయితే మరిన్ని వివరాలు సేకరించే వరకు, పరిష్కారాలను సిఫారసు చేయడం కష్టమని ఆమె తెలిపారు.

తిమింగలం

ఫొటో సోర్స్, Getty Images

వెర్మెయులెన్, ఆమె బృందం విమానాలు, బోట్‌ల సాయంతో సముద్ర తీరానికి దూరంగా ఉన్న తిమింగలాల జనాభాపై ఒక క్రమబద్ధమైన సర్వే చేయాలని యోచిస్తున్నారు. కానీ ఈ పని కోసం తమకు మద్దతు అవసరమని ఆమె బీబీసీతో చెప్పారు.

ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రజలు ఎంతగా కలిసి రావాలనుకుంటున్నారో చూడటం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సముద్ర గర్భంలో ఉన్న తిమింగలాల జనాభాపై విశ్వసనీయమైన డేటాను అందించాల్సిన బాధ్యత ఇప్పుడు శాస్త్రవేత్తలపై ఉందని ఆమె అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)