కోనసీమ: ‘గల్ఫ్‌లో వేధింపుల బాధితులం’ అని ఆరోపణలు చేసేవారు ఇక్కడ ఎందుకు పెరుగుతున్నారు?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
షేక్ అమ్మి. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదురుకావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని తన సొంతూరుకు తిరిగి వచ్చేశారు.
గల్ఫ్‌లో ఉపాధితోపాటు, కాస్త డబ్బు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయని వెళ్లి ఇబ్బందులు పడ్డామని చెప్పినవారు అమ్మి ఒక్కరే కారు. ఆపదలో ఉన్నాం రక్షించండి అంటూ సోషల్ మీడియాలో పురుషులు, మహిళలు వీడియోలు పెడుతున్న ఘటనలు అనేకం జరిగాయి.
విదేశాల్లో ఇలా ఇబ్బంది పడుతున్న జిల్లా వాసులను వెనక్కి తీసుకురావడానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్‌ను ఏర్పాటు చేశారు. పనిలో పెట్టుకున్నవాళ్లు వేధిస్తున్నారన్న ఆరోపణలను నిశితంగా పరిశీలిస్తామని ఈ సెంటర్ చెబుతోంది.
అయితే, పనిలో పెట్టుకున్న గల్ఫ్ దేశాల్లోని కుటుంబాలపై అమ్మి లాంటి బాధితులు చేసిన ఆరోపణలను బీబీసీ స్వయంగా ధృవీకరించడం లేదు.
గల్ఫ్‌కు ఉపాధి పనుల కోసం వెళుతున్న వారిని సమస్యలు ఎందుకు వెంటాడుతున్నాయి? వీళ్లు సరైన మార్గంలోనే వెళుతున్నారా? అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

షేక్ అమ్మి విషయంలో ఏం జరిగింది?
కోనసీమ జిల్లా ద్రాక్షారామానికి చెందిన అమ్మి.. కడియం ప్రాంతానికి చెందిన సుల్తానా (ఈ మహిళ పేరు మార్చాం) ద్వారా 2025 డిసెంబర్‌లో ఖతార్ వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో వంట, ఇతరసహాయక పనుల కోసం కుదిరారు.
''అక్కడ చాలా పనిచేయించేవాళ్లు, కానీ తిండి సరిగ్గా పెట్టేవాళ్లు కాదు. కొద్దిగా రైస్ కారంతో తినాలి అంతే. దాంతో కడుపు నొప్పి వచ్చేసింది. అక్కడ కిందే నిద్రపోవాలి. రెండు నెలలకే నాకు జబ్బు చేసింది. ఫిట్స్ లాగా వచ్చి ఓ రోజు సీరియస్ అయితే ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ‘నీరసంగా ఉంది, పనులు చేయలేరు’ అని డాక్టర్ చెప్పారు. దీంతో ఆ యజమానులు రెండు లక్షలు కట్టి వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు'' అని బీబీసీకి వివరించారు అమ్మి .
''డబ్బులు కట్టేవరకూ పంపేది లేదన్నారు. ఏజెంట్‌కి ఫోన్ చేస్తే తనకేం సంబంధమని అన్నారు. దాంతో ఓ దశలో అక్కడే నా ప్రాణం పోతుందనుకున్నాను. ద్రాక్షారామంలో ఉన్న మా అబ్బాయి డబ్బులు కోసం ప్రయత్నించాడు. కానీ ఎవరూ ఇవ్వలేదు. చివరికి అధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు. వాళ్లు స్పందించి అక్కడి ఎంబసీ వాళ్లతో మాట్లాడితే గానీ నన్ను వదల్లేదు'' అని అమ్మి వివరించారు.
అయితే, అమ్మి ఆరోపణలను ఖండించారు ఆమెను ఖతర్ పంపించిన సుల్తానా.
తాను ఏజెంట్‌ను కాదని, దుబాయ్‌లో తెలిసిన వాళ్లు ఉన్నారనీ, అక్కడికి పనుల కోసం వెళ్తామని ఎవరైనా అడిగితే పంపిస్తుంటానని సుల్తానా బీబీసీతో చెప్పారు.
అలాగే షేక్ అమ్మి కూడా అడిగితే పంపానని, కానీ అక్కడికు వెళ్లిన తర్వాత ఆ వాతావరణం ఆమెకు సరిపోక వచ్చేశారనీ, ఈమెతో పాటు వెళ్లిన వాళ్లు బాగానే ఉన్నారని సుల్తానా అన్నారు.

గోదావరి జిల్లాలు టు గల్ఫ్
ఉపాధి కోసం గోదావరి జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వేలమంది వలస వెళ్లడం ఎప్పటి నుంచో జరుగుతోంది.
తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల నుంచి విద్యావంతులు వైట్ కాలర్ (ఆఫీస్) ఉద్యోగాల కోసం వెళుతుంటే, పెద్దగా చదువుకోని వాళ్లు అక్కడ బ్లూకాలర్(శారీరక శ్రమతో కూడిన) పనులకు వెళుతుంటారు.
వంట పనులు, ఇంటిపనులు, నిర్మాణరంగంలో మేస్త్రీలు, కార్పెంటర్‌లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వెల్డర్లు... ఇలా శారీరక శ్రమ అవసరమైన నైపుణ్యంతో కూడిన పనులు చేసేందుకు గల్ఫ్ దేశాలకు వెళ్లడం రెండు, మూడు దశాబ్దాలుగా జరుగుతూ ఉంది.
అయితే ఇటీవల కాలంలో గుర్తింపు లేని ఏజెంట్ల మోసాలు, గల్ఫ్ దేశాలలో కొంతమంది యజమానుల వేధింపులు ఎక్కువ కావడంతో తిరిగి స్వదేశానికి అర్థంతరంగా వచ్చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికారులు చెబుతున్నారు.
ఇటీవల కోనసీమ జిల్లాకి చెందిన 80 మందికి పైగా కార్మికులు జిల్లా అధికారుల సహకారంతో తిరిగి సొంత ఊళ్లకు వచ్చేశారని వారు చెప్పారు.

అనేక ఆరోపణలు
అన్నమయ్య జిల్లా వయలపాడుకు చెందిన షెహనాజ్ ఒమన్ వెళ్లారు. పని కోసం ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నానని, తనను కాపాడాలంటూ సోషల్ మీడియా ద్వారా ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు షెహనాజ్.
ఈ విషయం తన దృష్టికి రాగానే, తగిన చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖను కోరానని, వారి సహకారంతో ఆమెను సురక్షితంగా ఏపీకి తీసుకొచ్చారని పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అంతకుముందు గుడివాడ సమీపంలోని జొన్నపాడుకు చెందిన జనార్దనపురం దుర్గ ఉపాధి కోసం మస్కట్‌కు వెళ్లి ఇబ్బంది పడుతున్నారని అసిలేటి నిర్మల అనే యూజర్ 2025 జులైలో నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై నారా లోకేశ్ స్పందించారు.
దుర్గను ఆమె సొంతూరికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా తన టీమ్‌ను కోరినట్టు లోకేశ్ ట్వీట్ చేశారు.

‘‘ఏది దొరికితే దాంతోనే కొట్టేది’’
వంట, ఇతర పనులు చేసేందుకు కువైట్ వెళ్లిన వానపల్లికి చెందిన కొల్లాడ ధనలక్ష్మిది మరో కథ. ఈమె కూడా ఇటీవలే తిరిగి సొంతూరికి వచ్చేశారు.
‘‘కువైట్ వెళ్లి రెండుమూడేళ్లు ఉండి డబ్బులు సంపాదించుకు వస్తే ఇల్లు కట్టుకోవచ్చన్న ఆశతో అక్కడికెళ్లాను. తీరా వెళ్లాక నేను పనిచేసి ఆ ఇంట్లో పెద్దావిడ టార్చర్ పెట్టేది. ఏది దొరికితే దాంతో కొట్టేది. చంపేస్తా అనేది. ఆ టార్చర్ తట్టుకోలేక మా ఆయనకు ఫోన్ చేస్తే ఆయన కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్లి మాట్లాడిన తర్వాత ఎంబసీ వాళ్లు కాల్ చేశారు. అలా అక్కడి నుంచి తిరిగి వచ్చేశాను'' అని ధనలక్ష్మి వివరించారు.
ధనలక్ష్మిని కువైట్‌కు పంపించిన కాకినాడకు చెందిన రాజు, రవీందర్‌లతో (పేర్లు మార్చాం) బీబీసీ మాట్లాడింది.
''మేం అధికారిక ఏజెంట్లం కాదు. తెలిసిన వాళ్లు అడిగితే పంపిస్తుంటాం. మేం పంపించిన వాళ్లలో ఎవరికీ ఇలాంటి ఇబ్బంది రాలేదు. ధనలక్ష్మికే వచ్చింది. మాకు ముందుగా తెలిస్తే అలా పంపించం కదా'' అని వారు వ్యాఖ్యానించారు.
పని ఒకచోట అని చెప్పి, మరొకచోట ఇప్పిస్తారని కొత్తపేటకు చెందిన శేషారత్నం వివరించారు.
‘‘ నేను జారిపడి కాలుకి దెబ్బతగిలింది. కానీ అక్కడి యజమానులు పట్టించుకోలేదు. ఆ దెబ్బ పెద్ద పుండులా మారి బాగా ఇబ్బందైంది. దీంతో నెలా పదిహేను రోజులకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు క్లీన్ చేసి, ఈమెకి షుగర్ వచ్చిందని చెప్పారు. గాయం పూర్తిగా తగ్గేందుకు టైం పడుతుంది, అప్పటి వరకు పనులు చేయకూడదు అన్నారు. దీంతో వెంటనే యజమానులు నన్ను ఆఫీస్‌కి పంపేశారు. పైగా తిరిగి లక్షా 60 వేలు కట్టాలన్నారు. అయితే ఇక్కడి అధికారులు మాట్లాడి నన్ను ఇండియాకు తీసుకొచ్చారు'' అని శేషారత్నం బీబీసీతో చెప్పారు.
శేషారత్నాన్ని మస్కట్‌కు పంపించిన పి.గన్నవరం ప్రాంతానికి చెందిన అనధికార ఏజెంట్ సంపత్‌తో (పేరు మార్చాం) మాట్లాడేందుకు బీబీసీ యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
రెస్టారెంట్ పని అప్పగిస్తానని చెప్పి ఎడారి ఎండలో పనులు చేయించేవారనీ, కడుపు నిండా భోజనం కూడా పెట్టకుండా ఎడారిలో పనిచేయించడంతో తట్టుకోలేక తిరిగి వచ్చేశానని అమలాపురానికి చెందిన శ్రీను చెప్పారు.
శ్రీనుని దుబాయ్‌కి పంపించిన అల్లవరం ప్రాంతానికి చెందిన అమర్‌తో బీబీసీ మాట్లాడగా... తాను ఏజెంట్‌ను కాదని, దుబాయ్‌లో ఉన్న బంధువుల ద్వారా ఇక్కడి వారిని పనుల నిమిత్తం అప్పుడప్పుడూ పంపిస్తుంటానని చెప్పారు. శ్రీనుకు అక్కడి వాతావరణం పడక వెనక్కి వచ్చేశాడని, అతనితోపాటు వెళ్లిన మరో ఇద్దరు అక్కడే పనులు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.
గల్ఫ్‌లో తాము పనికి కుదిరినచోట యజమానుల నుంచి వేధింపులను ఎదుర్కొన్నామని కొందరు చేసిన ఆరోపణలను బీబీసీ స్వయంగా ధృవీకరించడం లేదు. అక్కడి ఏజెంట్లను, వారిని పనిలో పెట్టుకున్న కుటుంబాలను సంప్రదించేందుకు బీబీసీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
బాధితులుగా చెప్పుకుంటున్నవారుగానీ, అధికారులుగానీ యజమానుల వివరాలు ఇవ్వలేకపోయారు. దీంతో బీబీసీ వారిని సంప్రదించలేక పోయింది.

బాధితులు చెప్పిన అంశాలను, వాస్తవ స్థితిగతులను తాము పరిశీలిస్తున్నామని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ మేనేజర్ రమేశ్ బీబీసీతో అన్నారు.
''గతంలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి ఉందని నిర్థరించుకున్న తర్వాత ఇక్కడి నుంచి కార్మికులు సొంత ఖర్చులతో అక్కడికి వెళ్లేవారు. అయితే ఇటీవలికాలంలో ఈ సంప్రదాయం కాస్త మారిందనే చెప్పాలి. కొందరు ఏజెంట్లు అక్కడ ఉపాధి కల్పించే వారి నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడ వీరికి టిక్కెట్లు ఇతర ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా వెళ్లొచ్చు అని చాలామంది ఉత్సాహపడి అక్కడికి వెళ్తున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సదరు ఉపాధి కల్పించిన వాళ్లు వీళ్లతో రోజుకి 18 నుంచి 20 గంటలపాటు పనిచేయించడం, మరికొందరు వేధించడం వంటివి చేస్తున్నారు'' అని రమేశ్ అన్నారు.
ఇలా అనధికార ఏజెంట్ల ద్వారా గల్ఫ్ దేశాలకు పనుల కోసం వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా జరుగుతూ ఉంటుందనీ, తెలిసిన వారి ద్వారా విదేశాలకు వెళ్లడం ఈ మధ్యకాలంలో పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
విదేశాల్లో ఇలా ఇబ్బంది పడుతున్న జిల్లావాసులను వెనక్కి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రమేశ్ తెలిపారు. ఈ క్రమంలోనే గల్ఫ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్న 80మంది జిల్లా వాసులను సురక్షితంగా వెనక్కి రప్పించామని చెప్పారు.
అదే విధంగా వివిధ కారణాలతో చనిపోయిన ఏడుగురి మృతదేహాలను కూడా ఇక్కడికి తెప్పించి బంధువులకు అప్పగించామన్నారు. విదేశాలకు వెళ్లాలనుకున్నవారు తమ సెంటర్‌ను సంప్రదిస్తే యజమానులు ఎవరు, ఏజెంట్ గుర్తింపు తదితర విషయాలను పరిశీలిస్తామని రమేశ్ అన్నారు.

గల్భ్ దేశాల్లో ఇబ్బంది పడుతున్న తెలుగు వాళ్లను ఎలా వెనక్కి తీసుకొస్తారో రమేశ్ వివరించారు.
‘‘ఫిర్యాదు రాగానే వారిని గల్ఫ్ దేశాలకు పంపించిన ఏజెంట్‌ను పిలిచి మాట్లాడతాం. వారిని బాధితులతో మాట్లాడిస్తాం. ఈ ఏజెంట్లకు కూడా నేరుగా అక్కడి స్పాన్సర్లు (పనిలో పెట్టుకున్న వాళ్లు) తెలియదు. దాంతో వారు ముందుగా అక్కడ పని కుదిరించిన హవాలా ఏజెంట్లతో మాట్లాడతారు. స్పాన్సర్లకు, ఇక్కడి ఏజెంట్లకు మధ్యవర్తులే ఆ హవాలా ఏజెంట్లు. ఆ హవాలా ఏజెంట్లతో మాట్లాడిన తర్వాత వారు స్పాన్సర్లతో మాట్లాడతారు. స్పాన్సర్లు కూడా తమ వద్ద పనిచేస్తున్న వారిపై కంప్లయింట్ చేసినా, లేదంటే వారి పనితీరుపై అయిష్టంగా ఉన్నా వెంటనే ఇక్కడికి పంపించే ఏర్పాటు చేస్తారు. ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనిపిస్తే స్పాన్సర్లే ఇద్దరితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారు. సమస్య తీవ్రంగా ఉందనిపిస్తే.. వెంటనే అక్కడి నుంచి రప్పించే ఏర్పాటు చేస్తారు’’ అని రమేశ్ చెప్పారు.
స్పాన్సర్లు డబ్బులు డిమాండ్ చేస్తే అధికారులు అక్కడి ఎంబసీ కార్యాలయంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తారనీ, కొన్ని సందర్భాల్లో నేరుగా స్పాన్సర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామని రమేశ్ వెల్లడించారు.
అక్కడి స్పాన్సర్లు అందరినీ ఒకే గాటన కట్టడానికి వీలులేదని రమేశ్ అన్నారు.
అనధికారిక ఏజెంట్లపై ఫిర్యాదులుగానీ, ఏజెంట్ల వల్ల మోసపోయామన్న ఫిర్యాదులుగానీ తమకు ఇంతవరకు రాలేదని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా బీబీసీతో అన్నారు. ఫిర్యాదులొస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అయితే ఫిర్యాదు చేసే శక్తి తమకు ఎక్కడిదని కొందరు బాధితులు అంటున్నారు.
‘‘బతుకుతెరువుకు వెళ్లాంగానీ, కేసులు పెట్టడానికి వెళ్లలేదు కదా. కేసులు, కోర్టులంటూ ఎక్కడ తిరుగుతాం'' అని షేక్ అమ్మీ బీబీసీతో అన్నారు.

'అక్కడ ఇబ్బందైతే మేమేం చేయగలం'
పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అనధికార ఏజెంట్ బీబీసీతో మాట్లాడుతూ, ''గల్ఫ్ దేశాలకు ఈ ప్రాంతాలనుంచి వేలమంది వెళ్తుంటారు. మేమే వందలమందిని పంపించాం. అందులో కొద్దిమందికి మాత్రమే స్పాన్సర్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై మేమేం మాట్లాడగలం. అన్నీ మేం ఊహించలేం కదా'' అని అమలాపురంకి చెందిన ఆ ఏజెంట్ అన్నారు.
మరోవైపు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నకిలీ ఏజెంట్లను పోలీసుల సాయంతో గుర్తిస్తున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేశ్ కుమార్ బీబీసీతో అన్నారు.

‘ఇది చిన్న సమస్యకాదు..’
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం అనేది చిన్న సమస్య కాదనీ, సంస్థాగతంగా పెద్ద సమస్యగా గుర్తించామనీ, ఒక్క కోనసీమ జిల్లా నుంచే 15వేలమంది వెళ్లారని జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేశ్ కుమార్ బీబీసీకి తెలిపారు. అందుకే ఈ సమస్యపై సీరియస్‌గా దృష్టిసారించామని అన్నారు.
''జిల్లాలో సుమారు 18 లక్షల పాపులేషన్ ఉంటే దాదాపు 15వేల మంది వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో పని చేస్తున్నారు. ఇక్కడి వారి కుటుంబసభ్యులను కలుపుకుంటే ఓవరాల్‌గా లక్షన్నరమందిపై ప్రభావం చూపుతుంది. ఇది ఈ ఒక్క జిల్లాలోనే. అందుకే కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అనేది ఏర్పాటు చేశాం. ఎవౖరికైనా ఇబ్బంది అయితే కలెక్టరేట్‌కి వచ్చి చెబితే ఆయా దేశాల ఎంబసీలతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం'' అని కలెక్టర్ బీబీసీతో అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























