బరువు తగ్గాలంటే ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినాలా? రీసర్చ్‌లో ఏం తేలిందంటే..

ఆరోగ్యం, ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మెలిస్సా హోగెన్‌బూమ్
    • హోదా, సీనియర్ హెల్త్ కరస్పాండెంట్
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

మనం ఏం తింటున్నామనేదే కాదు, దాని గురించి ఎలా ఆలోచిస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. మన మెదడు, శరీరానికి మధ్య ఉన్న కనెక్షన్ ఆకలిని ప్రభావితం చేస్తుంది.

ఎందుకంటే మనం తిన్న ఆహారంపై మనకున్న కోరిక...ఆకలి, కడుపు నిండిన భావనలపై మెదడు చూపించే ప్రతిస్పందనను మారుస్తుంది.

అంటే కావాల్సింది తిన్నాను అని మనం ఫీలైతే మెదడు ఆకలిని ఆపేస్తుంది. లేదూ... ఇష్టమైనది సరిగా తినలేకపోయాను అని అనుకుంటే.. ఆకలిని కొనసాగించమని మెదడు మన శరీరానికి చెబుతుంది.

మీ ముందు ఒక రుచికరమైన చాక్లెట్ బార్, తక్కువ క్యాలరీలతో సహజంగా తీపినిచ్చే మరొక ప్రత్యామ్నాయం ఉంటే, మీరు దేనిని ఎంచుకుంటారు? మనలో చాలామందికి రెండో దానినే ఎంచుకోవాలని తెలివైన ఆలోచన ఉన్నప్పటికీ, రుచికరమైన పదార్థాలను వద్దనుకోవడం చాలా కష్టం.

బరువు తగ్గాలని డైట్ చేసే వారికి నియమాలను పాటించడం దీనివల్లే సమస్య అవుతుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏం తిన్నామన్నది కాదు...

ఎక్కువ శక్తినిచ్చే తీపి పదార్థాలను కోరుకోవడం మన శరీర తత్వంలోనే ఉంది. దీనికి కారణం ఏమిటంటే, మన పూర్వీకులు ఆహారం తక్కువగా దొరికినప్పుడు ఇలాంటి శక్తిమంతమైన ఆహారంపైనే ఆధారపడేవారు.

ఈ సవాలుకు తోడు, మన చుట్టూ ఇప్పుడంతా క్యాలరీలు ఎక్కువగా ఉండే అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార పదార్థాలే. వీటిని తిన్నప్పుడు మన ఆహారపు అలవాట్లపట్ల మనలో అపరాధభావం పెరిగిపోతుంటుంది.

"అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు ఎలా ఉంటాయంటే, ఒక భారీ 'హెవీ మెటల్' సంగీత కచేరీలో ఉన్నట్లుగా ఉంటాయి. అవి మిగతా అన్ని శబ్దాలను వినిపించకుండా అణచివేసేలా తయారయ్యాయి. అందుకే, పండ్లు లేదా కూరగాయల్లో ఉండే 'శాస్త్రీయ సంగీతం' వంటి సున్నితమైన రుచులను ఆస్వాదించడం ప్రజలకు చాలా కష్టమవుతుంది'' అని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌కు చెందిన సైకాలజీ ప్రొఫెసర్ ఆష్లే గేర్‌హార్డ్ చెప్పారు.

అయితే, ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవాలంటే మనం కేవలం ఏమి తింటున్నామనే దానిపైనే కాకుండా, ఆహారంపట్ల మన ఆలోచనా దృక్పథంపై కూడా దృష్టి పెట్టాలని పరిశోధనలు సూచిస్తున్నాయి.

వాస్తవానికి, ఆహారాన్ని ఆస్వాదించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఎందుకంటే, తిన్న ఆహారం పట్ల మనకున్న ఆపేక్ష, ఆ తర్వాత మనకు ఎంత ఆకలి వేస్తుందనేదీ నిర్ణయిస్తుంది.

ఆరోగ్యం, ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

తృప్తినివ్వని 'ఆరోగ్యకరమైన' మిల్క్‌షేక్‌లు

మనం ఏమి తింటున్నామని నమ్ముతామో, అది మన శరీరం స్పందించే విధానాన్ని ప్రభావితం చేస్తుందని 15 ఏళ్ల కిందట జరిపిన ఒక ప్రఖ్యాత ప్రయోగంలో శాస్త్రవేత్తల బృందం కనుగొంది.

అమెరికాలోని స్టాన్‌‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సైకాలజిస్ట్ అలియా క్రమ్ నేతృత్వంలోని బృందం ఒక విషయాన్ని నిరూపించింది.

ప్రయోగంలో పాల్గొన్న వ్యక్తులు తాము అధిక క్యాలరీలు ఉన్న ఒక రుచికరమైన మిల్క్‌షేక్‌ను తాగుతున్నామని అనుకున్నప్పుడు వారి శరీరంలోని హార్మోన్ల స్పందన వారు నమ్మిన దానిపై ఆధారపడి ఉంది, కానీ వారు వాస్తవంగా తీసుకున్న క్యాలరీలపై కాదు.

వారందరికీ ఒకే రకమైన మిల్క్‌షేక్‌ను ఇచ్చారు. కానీ ఒక బృందానికి అది కేవలం 140 క్యాలరీల 'ఆరోగ్యకరమైన' షేక్ అని చెప్పారు. మరొక బృందానికి అది 620 క్యాలరీల 'ఇండల్జెంట్' షేక్ అని చెప్పారు. వాస్తవానికి, ఆ మిల్క్‌షేక్‌‌లో 380 క్యాలరీలే ఉన్నాయి.

ఆ అధిక క్యాలరీల ఇండల్జెంట్ షేక్ తాగుతున్నామని వారు నమ్మినప్పుడు, వారిలో గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ స్థాయిలు గణనీయంగా పడిపోయాయి.

సాధారణంగా ఈ హార్మోన్ మనకు ఆకలి వేసినప్పుడు పెరుగుతుంది, కడుపు నిండినప్పుడు తగ్గుతుంది.

అయితే, వారు తాగుతున్నది తక్కువ క్యాలరీల ఆరోగ్యకరమైన షేక్ అని చెప్పినప్పుడు, వారి గ్రెలిన్ స్థాయిలలో స్వల్ప మార్పు మాత్రమే కనిపించింది.

ఆహారం పట్ల మనకు ఉండే ఆలోచనా దృక్పథం, అంచనాలు మన శరీరం స్పందించే తీరును ఎలా మారుస్తాయో ఇది వెల్లడించింది.

''మనం తగినంత తింటున్నామని అనుకోవడం వల్ల, మన శరీరం కూడా తగినంత ఆహారం అందినట్లే స్పందిస్తుంది'' అని క్రమ్ చెప్పారు.

ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడంలో ఇది చాలా కీలకం. ఎందుకంటే, గ్రెలిన్ మన జీవక్రియ (మెటబాలిజం)ను ప్రభావితం చేస్తుంది.

మనకు కడుపు నిండినట్లు అనిపించకపోతే మెటబాలిజం మందగిస్తుంది. దీనివల్ల ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయలేం. కాబట్టి, ఆహారంపై నియంత్రణ విధించుకోవాలనే ఆలోచనా ధోరణి బరువు తగ్గడానికి అడ్డుగా మారవచ్చు.

''మీరు బరువు తగ్గడానికి చక్కెర, కొవ్వులు, క్యాలరీలను తగ్గించినప్పటికీ, మీ మనస్తత్వం మాత్రం ఆహారాన్ని నియంత్రిస్తున్నామనే బాధాకరమైన భావనలో ఉంటే, అది మీరు బరువు తగ్గకుండా అడ్డుకుంటుంది'' అని క్రమ్ అన్నారు.

కడుపు నిండినట్లుగా భావించడానికి మన జన్యుపరమైన అమరిక ఎలా దోహదపడుతుందో అనే విషయంలో కూడా క్రమ్ ఇటువంటి ఫలితాలనే కనుగొన్నారు.

'మీకు త్వరగా కడుపు నిండేలా చేసే జన్యువులు ఉన్నాయి' అని ఏ వ్యక్తులకైతే చెప్పారో, వారి శరీరంలో బరువును నియంత్రించే జీఎల్‌పీ-1 అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యింది.

వాస్తవానికి వారిలో అటువంటి జన్యువులు లేకపోయినప్పటికీ, కేవలం అలా భావించడం వల్లే ఆ హార్మోన్ విడుదల పెరగడం గమనార్హం.

ఆరోగ్యం, ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

లేబులింగ్ ఎందుకు ముఖ్యం?

ఆహారానికి ఇచ్చే పేర్లు లేదా లేబులింగ్ కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.

మరొక అధ్యయనంలో, పాల్గొన్న వ్యక్తులను ఒక ప్రోటీన్ బార్ తినాలని సూచించారు. కొన్ని బార్‌లపై 'టేస్టీ' అని, మరికొన్నింటిపై 'హెల్తీ' అని లేబుల్ అంటించారు.

కానీ వాస్తవానికి ఆ రెండింటిలోనూ పోషక విలువలు ఒకేలా ఉన్నాయి.

ఇక మూడో బృందాన్ని కేవలం ఆ బార్ చూడటానికి ఎలా ఉందో రేటింగ్ ఇవ్వమని మాత్రమే కోరారు.

'ఆరోగ్యకరమైనది' (హెల్తీ) అని లేబుల్ ఉన్న బార్‌ను తిన్నవారు, తమకు తక్కువ సంతృప్తి కలిగిందని, ఇంకా ఆకలిగా ఉందని చెప్పారు. వీరు ఆ బార్‌ను అస్సలు తినని వారితో పోల్చినా కూడా, ఆ తర్వాత ఎక్కువ ఆహారాన్ని తీసుకున్నారు.

ఆహార పదార్థాల ప్యాక్‌లపై ఉండే 'హెల్తీ' అనే లేబుళ్లు, ఆ ఆహారం వల్ల కలిగే ఆనందాన్ని లేదా తృప్తికి సంబంధించిన అంచనాలను తగ్గిస్తాయని ఇది చూపిస్తుంది.

అంటే, ఆరోగ్యకరమైనవిగా చెప్పే ఆహార పదార్థాలు మనకు తక్కువ సంతృప్తిని ఇస్తాయనే భావన కలిగిస్తాయి.

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వాటిలోని 'పోషక విలువల' కంటే, వాటి 'రుచి, ఆనందం' తెలిసేలా ప్రచారం చేయడం వల్ల ప్రజలు వాటిని ఎక్కువగా ఇష్టపడి తినే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అదేవిధంగా, చాక్లెట్ కేక్ వంటి ఇష్టమైన పదార్థాలను తిన్నప్పుడు అపరాధ భావానికి లోనయ్యేవారు బరువు తగ్గడంలో తక్కువ విజయం సాధిస్తారని తేలింది.

ఆరోగ్యం, ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ప్రయోగాలతో ఏం తేలింది?

ఈ ప్రయోగాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి.

నా సహోద్యోగి డేవిడ్ రాబ్సన్ తన పుస్తకం 'ది ఎక్స్‌పెక్టేషన్ ఎఫెక్ట్'లో వివరించినట్లుగా, ఇష్టమైన పదార్థాలను పూర్తిగా దూరం చేసుకోవడం వల్ల మీరు మొత్తం మీద తక్కువ క్యాలరీలు తీసుకుంటున్నారని అర్థం కాదు. వాస్తవానికి, అణచివేత లేదా నియంత్రణ అనేది ఆ తర్వాత మీరు మరింత అతిగా తినడానికి దారితీయవచ్చు.

దీనికి బదులుగా మనం దేనిపై దృష్టి పెట్టాలంటే, మన శరీరాన్ని మనం నమ్మడం, 'లైట్', 'లో', లేదా 'రెడ్యూస్డ్' అని చెప్పే ఆహారంలో ఏదో తక్కువగా ఉందనే అర్థాన్నిచ్చే పదాలకు దూరంగా ఉండటం.

''మనం తగినంత ఆహారం తీసుకోవట్లేదు అనే భావన, మీరు చేసే డైటింగ్ ఫలితాలను తలకిందులు చేయవచ్చు'' అని క్రమ్ చెబుతున్నారు.

గేర్‌హార్డ్ కూడా దీనితో ఏకీభవిస్తూ, ఆహారాన్ని కేవలం పోషకాలు, క్యాలరీల కోణంలోనే చూడకుండా ఒక ఆనందాన్నిచ్చే అంశంగా భావించడం మనకు మేలు చేస్తుందని చెబుతున్నారు.

''మనం మనల్ని మనం పరిమితం చేసుకున్నప్పుడు, అది ఒక పనిలా భారంగా మారుతుంది'' అని ఆమె అన్నారు.

దీనికి బదులుగా, మనం ప్రాసెస్ చేయని ఆహార పదార్థాలు, ప్రోటీన్లు, సమృద్ధిగా లభించే పండ్లు, కూరగాయలపై దృష్టి పెట్టాలని గేర్‌హార్డ్ చెబుతున్నారు.

''మానవ శరీరానికి పోషణనివ్వడానికి, మనకు సంతృప్తిని, ఆకర్షణను కలిగించడానికి ప్రకృతిసిద్ధంగా ఉన్న ఆహారం ఇదే"నని అన్నారు.

అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారపదార్థాలను తగ్గించడం కూడా ఇందుకు సహాయపడుతుంది. ఎందుకంటే, అవి మనకు కావలసిన పోషకాలను అందించకపోగా, మనల్ని ఇంకా కావాలని కోరుకునేలా చేస్తాయి.

దీన్ని మనం 'ఆస్వాదించే మనస్తత్వం'తో కూడా చేయవచ్చని క్రమ్ వాదిస్తున్నారు.

అంటే, ఆహారాన్ని నియంత్రించడంపై కాకుండా, మీ శరీరానికి సరిగ్గా ఏమి కావాలో దానిని అందించడంపై దృష్టి పెట్టడం.

''సరైన సమయంలో, సరైన ఆహారం కోసం మీ శరీరం ఆకలిని కలిగిస్తుందని మీపై, మీ శరీరంపై నమ్మకం ఉంచండి'' అని క్రమ్ చెబుతున్నారు.

మితమైన సమతుల్య ఆహారంతో పాటు, అప్పుడప్పుడు మీకు ఇష్టమైన పదార్థాలను తింటూ వాటిని ఆస్వాదించడమనేది ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడంలో స్పష్టమైన పాత్ర పోషిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)