పీసా టవర్: శతాబ్దాలుగా ఒరిగి ఉంటున్నా ఎందుకు పడిపోదు? ఇలాంటి మరికొన్ని నిర్మాణాల పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, Sol de Zuasnabar Brebbia via Getty Images
- రచయిత, Daisy Stephens
- హోదా, BBC World Service
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఇటలీలోని అత్యంత ప్రసిద్ధ కట్టడాలలో లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఒకటి.
ఒక పక్కకు వంగి ఉన్న కట్టడం ఇదొక్కటే కాదు.
నెదర్లాండ్స్‌లోని 'డ్యాన్సింగ్ హౌసెస్' నుంచి చైనాలోని 'టైగర్ హిల్ పగోడా' వరకు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఒరిగినట్లుండే కట్టడాలు చాలానే ఉన్నాయి.
కానీ అవి ఎందుకు వంగుతాయి?
వంగినంత మాత్రాన అవి కచ్చితంగా కూలిపోతాయని అనుకోవాల్సిన పనిలేదా? ఎందుకు?

నెదర్లాండ్స్‌లోని డెల్ఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, డెల్టారెస్ సంస్థలో జియోటెక్నికల్ ప్రాక్టీస్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మాండీ కోర్ఫ్ ఒక మాట అంటారు.
భవనాలు ఒక పక్కకు వంగడానికి అనేక కారణాలు ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో, నెదర్లాండ్స్‌లోని ప్రసిద్ధ 'డ్యాన్సింగ్ హౌసెస్' మాదిరిగా, అవి నిర్మించిన పునాదుల రకాన్ని బట్టి ఈ వాలు ఏర్పడుతుంది.

ఫొటో సోర్స్, Karl Hendon via Getty Images
కలప స్తంభాలపైనే డ్యాన్సింగ్ హౌసెస్
"ఆమ్‌స్టర్‌డామ్ నగర కేంద్రంలో మెజారిటీ ఇళ్లు కలప స్తంభాలపై నిర్మించినవే'' అని కోర్ఫ్ చెప్పారు.
భవనాల గోడలు, ముఖ ద్వారాల కింద ఈ స్తంభాలను జంటలుగా అమర్చుతారని ఆమె వివరించారు.
మెత్తని మట్టి, పీట్ (కుళ్లిన వృక్షసంబంధిత పదార్థం) లేదా ఇసుకతో కూడిన నేలలోకి ఈ స్తంభాలు సుమారు 12 మీటర్ల లోతు వరకు ఉంటాయి.
"అవి అలా ఉండి, స్తంభాలు దృఢంగా ఉన్నంత కాలం ఇళ్లకు ఏమీ కాదు" అని కోర్ఫ్ అన్నారు.
కానీ అవి పాడవటం లేదా కుళ్లిపోవడం మొదలైతే, గోడలపై పగుళ్లు ఏర్పడతాయని ఆమె తెలిపారు.
ఒకవైపు బాగుండటం, మరోవైపు కుళ్లిపోవడంలాంటి సమస్యలు రావడం, వాటి మీద పడే బరువులో తేడాలు ఉండటం వల్ల కాలక్రమేణా భవనాలు ఒకపక్కకు వాలిపోవచ్చని వివరించారు.
పీసా టవర్‌కు ఏమైంది...
నేల పరిస్థితులు కూడా భవనాలు ఒక పక్కకు వాలిపోవడానికి కారణమవుతాయి. ఇటలీలోని ప్రసిద్ధ పీసా టవర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
పీసా విశ్వవిద్యాలయంలో సాయిల్ మెకానిక్స్, ఫౌండేషన్స్ విభాగంలో ప్రొఫెసర్ నున్జియాంటే స్క్వేగ్లియా ఈ టవర్ వాలును పర్యవేక్షించే బృందంలో సభ్యుడు.
''నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచే ఈ టవర్ వంగడం మొదలైంది. ఎందుకంటే అక్కడ నేల అత్యంత మెత్తగా ఉంది. ఇది సుమారు మూడు నుంచి నాలుగు మీటర్ల వరకు నేలలోకి కుంగిపోయింది'' అని బీబీసీ రేడియో కార్యక్రమం 'విట్నెస్ హిస్టరీ'లో స్క్వేగ్లియా వివరించారు.
నేలలో మానవ నిర్మిత మార్పుల వల్ల కూడా భవనాలు వంగవచ్చు. ఉదాహరణకు, డెల్ఫ్ట్‌లోని ఔడే కెర్క్ టవర్.
''పీసా టవర్ తరహాలోనే ఇది కూడా వంగి ఉంది. కానీ దీని గురించి చాలా తక్కువమందికి తెలుసు'' అని కోర్ఫ్ చెప్పారు.
''ఇది కాలువవైపు వంగి ఉంది. ఎందుకంటే, కాలువ కోసం ఒక పక్కన మట్టిని తవ్వడం వల్ల, అక్కడ నేల మెత్తబడింది. దీనివల్ల భవనం నిటారుగా ఉండటానికి అవసరమైన ఒత్తిడి ఒక వైపు తగ్గింది. వారు దానిని నిర్మించినప్పుడు, అది మెల్లగా వంగడం ప్రారంభించింది'' అని వివరించారు.

ఫొటో సోర్స్, Sergio Amiti via Getty Images
భూగర్భ జలాల్లో వచ్చే మార్పులు కూడా భవనాలు వంగిపోవడానికి కారణమవుతాయి. అయితే, కొన్నిసార్లు భవనాలను ఉద్దేశపూర్వకంగానే వంగి ఉండేలా నిర్మిస్తారని కోర్ఫ్ చెప్పారు.
"ఆమ్‌స్టర్‌డామ్‌లోని చాలా ఇళ్లు ముందుకు వంగి ఉండేలా నిర్మించారు. ఎందుకంటే గతంలో వ్యాపారుల ఇళ్లను అదే పద్ధతిలో కట్టేవారు" అని ఆమె తెలిపారు.
''సామాగ్రిని నిల్వ చేయడానికి, వాటిని సులభంగా ఇంటి లోపలికి చేరవేయడానికి వీలుగా, వీటిని తరచుగా కాలువల వెంబడి ముందుకు వంగి ఉండేలా నిర్మించేవారు. కాబట్టి, అవి ముందుకు వంగి ఉంటే దాని అర్థం అక్కడ ఏదో సమస్య ఉందని కాదు. కానీ, అవి పక్కలకు వంగితే మాత్రం, అది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసినది కాదని మీకు అర్థమవుతుంది'' అని వివరించారు.

ఫొటో సోర్స్, PhotoFires via Getty Images
పీసా టవర్‌కు మరమ్మతులు
ఇన్ని కట్టడాలు వంగి ఉన్నప్పటికీ, మనం ఎందుకు పెద్దగా ఆందోళన చెందడం లేదు?
డాక్టర్ కోర్ఫ్ అభిప్రాయం ప్రకారం, ఒక భవనం వంగి ఉన్నంత మాత్రాన అది నిర్మాణపరంగా బలహీనంగా ఉన్నట్లు కాదు. ‘‘నిర్మాణం అస్థిరంగా మారాలంటే అది చాలా ఎక్కువగా వంగి ఉండాలి’’ అని ఆమె చెబుతున్నారు.
కానీ కొన్నిసార్లు దీని సరిచేయవలసి ఉంటుంది. పీసా టవర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది.
ఈ టవర్ నిర్మాణం ప్రారంభమైన కొద్ది కాలానికే వంగడం మొదలైనప్పటికీ, 20వ శతాబ్దంలో తీసిన కొలతలు ఆ వంగుబాటు క్రమంగా పెరుగుతూ, పరిస్థితి మరింత దిగజారుతున్నట్లు చూపించాయి.
‘‘ఆ పరిస్థితి నిజంగా ఆందోళనకరంగా ఉండేది’’ అని స్క్వెగ్లియా చెబుతున్నారు.
ఆ తర్వాత, 1989లో ఇటలీలోని పావియా నగరంలో ఉన్న 'సివిక్ టవర్' కూలిపోయింది. స్క్వెగ్లియా ప్రకారం, ఆ సంఘటనతో మరుసటి ఏడాదే పీసా టవర్‌ను మూసివేశారు.
పీసా టవర్‌ను సురక్షితంగా మార్చడం కోసం, దానిని కొద్దిగా నిటారుగా ఎలా తీసుకురావాలనే దానిపై అనేక ఆలోచనలు వచ్చాయి.
‘‘చివరికి మట్టిని వెలికితీసే పద్ధతిని ఎంచుకున్నాం'’’ అని స్క్వెగ్లియా చెప్పారు.
‘‘టవర్‌ను ఏమాత్రం తాకకుండానే, దాని పునాదికి ఉత్తరంవైపు నుంచి 37 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించాం’’ అని చెప్పారు.
దీని తర్వాత, 11 ఏళ్ల విరామం అనంతరం పీసా టవర్‌ను తిరిగి సందర్శకుల కోసం తెరిచారు.

ఫొటో సోర్స్, Antonello NUSCA/Gamma-Rapho via Getty Images
‘ఇదొక ప్రత్యేక కేసు’
కోర్ఫ్ అభిప్రాయం ప్రకారం, ఒక భవనాన్ని నిటారుగా చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగించడం అంత సాధారణమేమీ కాదు.
‘‘ఇది పీసా టవర్ కోసం ఉపయోగించిన ఒక ప్రత్యేక పద్ధతి. సాధారణ పరిస్థితుల్లో ఎవరూ ఇలా చేయరు’’ అని ఆమె చెబుతున్నారు.
‘‘ఒకవేళ వంగి ఉన్న భవనానికి ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఇళ్ల మాదిరిగా చెక్క పునాదులు ఉంటే, ఆ పునాదులను మార్చడం ద్వారా ఆ ఒరుగుబాటును మరింత పెరగకుండా ఆపవచ్చు. కానీ ఇది చాలా పెద్దపని. ఎందుకంటే ఇందులో గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది’’ అని చెప్పారు.
కారును జాకీతో పైకి లేపినట్లే, ఇంటిని కూడా 'జాకింగ్' పద్ధతి ద్వారా పైకి లేపి, ఆ లీనింగ్‌ను సరిచేయడం సాధ్యమే అని కోర్ఫ్ చెప్పారు. కానీ కొన్నిసార్లు ఇది భవనానికి నష్టం కూడా చేయవచ్చు.
‘‘ఒకవేళ ఇల్లు నిజంగా బాగా వంగి ఉంటే, దానిని నిటారుగా మార్చడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ ఇల్లు ఇప్పటికే ఆ వాలుకు తగ్గట్లుగా సర్దుకొని ఉంటుంది’’ అని కోర్ఫ్ అన్నారు.
‘‘కనీసం పరిస్థితిని మరింత దిగజార్చకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని అభిప్రాయపడ్డారు.
కొన్ని భవనాలను నిలబెట్టడం సాధ్యమే అయినప్పటికీ, వాటిలో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.
‘‘భవనాలతో ఇలాంటివి ఏవైనా చేయవచ్చు, అన్నీ సాధ్యమే. కానీ దానికి చాలా ఖర్చవుతుంది, చాలా క్లిష్టమైన ప్రక్రియ కూడా’’ అని కోర్ఫ్ వివరించారు.

ఫొటో సోర్స్, Bloomberg / Contributor via Getty Images
వాతావరణ మార్పుల ప్రభావం
కోర్ఫ్ పరిశోధన ప్రకారం, నెదర్లాండ్స్‌లోనే సుమారు 75 వేల ఇళ్లు చెక్క పునాదుల మీద కట్టారు. అవి దెబ్బతినే ప్రమాదంలో ఉన్నాయి.
అంతేకాకుండా, లోతు తక్కువగా ఉండే పునాదుల కారణంగా దీనికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ ఇళ్లు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి.
ఈ సమస్యలు భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
‘‘వాతావరణ మార్పులు, భూగర్భ జలాల్లో వచ్చే మార్పుల వల్ల, కొన్నిసార్లు ఈ నష్టం చాలా వేగంగా జరుగుతుండటాన్ని గమనిస్తున్నాం’’ అని కోర్ఫ్ చెప్పారు.
‘‘భూగర్భ జలమట్టాలు తగ్గితే, ఆ చెక్క పునాదులకు గాలి తగిలే పరిస్థితి వస్తుంది. దీనివల్ల అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, భూగర్భ జలాల్లో మార్పులు భూమి పొరలపై కూడా ప్రభావం చూపుతాయి. ఇది వివిధ రకాల పునాదులు ఉన్న ఇళ్లకు వరసగా సమస్యలను కలిగిస్తుంది. అయితే, ఇదంతా నెమ్మదిగా జరిగే ప్రక్రియ’’ అని ఆమె తెలిపారు.
ఇక పీసా టవర్ విషయానికి వస్తే, 11 ఏళ్ల పాటు సాగిన మరమ్మతుల తర్వాత 2001లో పూర్తయ్యాయి. దాని వాలు 40 సెంటీమీటర్లకు పైగా తగ్గింది.
ఇంజనీర్ల నమ్మకం ప్రకారం, రాబోయే కనీసం 200 ఏళ్ల వరకు ఈ టవర్ సురక్షితంగా ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























