పాకిస్తాన్: ‘మాకు నీళ్లు రాకుండా భారత్‌ అడ్డుకోవడం యుద్ధ ప్రయత్నమే’

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

భారత్‌తో తమకు ఎలాంటి ఘర్షణ, లేదా వివాదం వద్దని, అయితే సింధు జలాల ఒప్పందం ప్రకారం పాక్‌కు రావాల్సిన నీటిని అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది.

సింధు జలాల ఒప్పందంపై మంగళవారం పాకిస్తాన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ, సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేసేందుకు భారత్‌ వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని, అంతర్జాతీయ చట్టంలోనూ దీనికి ఆస్కారం లేదని అన్నారు.

అయితే, ఇషాక్ దార్ ప్రకటనపై భారత్ ఇంకా స్పందించలేదు.

పహల్గాం దాడిని పాకిస్తాన్ ప్రేరేపిత చర్యగా పేర్కొన్న భారత్, అందుకు ప్రతీకారంగా 2025 ఏప్రిల్‌లో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం గమనార్హం.

ఈ వాదనలను తిరస్కరించిన పాకిస్తాన్, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టును ఆశ్రయించింది.

భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం సాధ్యం కాదని నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌ నగరంలో ఉన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయాన్ని భారత్ తిరస్కరించింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేతను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

పహల్గాం దాడి, సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వంటి పరిణామాల నేపథ్యంలో, పాక్‌కు రావాల్సిన నీళ్లను నిలిపివేసేందుకు లేదా మళ్లించేందుకు భారత్ చేసే ఏ ప్రయత్నాన్నైనా యుద్ధ చర్యగా పరిగణిస్తామని గత ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ (జాతీయ భద్రతా కమిటీ) పేర్కొంది.

పాకిస్తాన్ 'సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేంత వరకు' సింధు జలాల ఒప్పందం నిలిపివేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జూన్ 5న ఒక ప్రకటనలో తెలిపారు.

పాక్ ఉప ప్రధాని ఇంకా ఏమన్నారు?

పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ ప్రకటనను ప్రస్తావిస్తూ.. పాక్ తన వైఖరిని కొనసాగిస్తుందని, తన హక్కులకు భంగం కలగకుండా చూసుకుంటుందని పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అన్నారు.

"వివాదాల పరిష్కారానికి చర్చలు, దౌత్యం, పరస్పర అంగీకారంతో కూడిన విధానాలకే పాకిస్తాన్ ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిచ్చింది. అయితే, సింధు జలాల ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు ఉన్న జల హక్కులను హరించే ఏ ప్రయత్నమైనా ప్రాంతీయ శాంతి, భద్రతల విషయంలో తీవ్రమైన, సుదీర్ఘ పరిణామాలకు దారితీస్తుందనే విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు" అని ఆయన అన్నారు.

మంగళవారం జరిగిన ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఇతర రాజకీయ పార్టీల నాయకులు, నిపుణులు కూడా పాల్గొన్నారు.

చీనాబ్ నదీ ప్రవాహంలో మార్పులకు సంబంధించి గత ఏడాది ఏప్రిల్ నుంచి భారత్‌కు నాలుగు లేఖలు రాసినప్పటికీ, ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా రాలేదని పాకిస్తాన్ సింధు జలాల కమిషనర్ మహమ్మద్ మెహర్ అలీ షా అన్నారు.

చీనాబ్ నదీ ప్రవాహంలో వచ్చే హెచ్చుతగ్గులు కేవలం ఒక 'సాంకేతిక సమస్య' కాదని, అది వ్యూహాత్మక ముప్పు అని ఆయన పేర్కొన్నారు.

‘‘సింధు జలాల నిలిపివేతతో పాక్‌కు ముప్పు’’

"2025 ఏప్రిల్ నుంచి తీవ్ర ఆందోళనకరమైన అనేక చర్యలను పాకిస్తాన్ చూసింది. వీటిలో చీనాబ్, జీలం నదీ ప్రవాహాల్లో ఆకస్మిక, అసాధారణ హెచ్చుతగ్గులు. అలాగే, సింధు జలాల ఒప్పందం కింద పాక్‌కు కేటాయించిన జలాలను నియంత్రించగలిగిన మౌలిక సదుపాయాల నిరంతర విస్తరణ ప్రయత్నాలు ఉన్నాయి" అన్నారు.

"అంతర్జాతీయ సరిహద్దులు దాటే నదులకు సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాన్ని బలహీనపరచడం, ఉమ్మడి నీటి వనరులను ఆయుధంగా వాడుకోవడం, ఘర్షణ వైఖరిని అవలంబించడం, అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘనల వంటి చర్యలకు పాల్పడితే మనం ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో కూడా తెలుసుకోవాలి" అని ఆయన అన్నారు.

పాకిస్తాన్‌కు ఇది కేవలం ఒక చట్టపరమైన చర్చ కాదు, "దాదాపు 25 కోట్ల మందికిపైగా ప్రజలకు నీరే జీవనాధారం. మన వ్యవసాయం, మన భద్రత, మన ఇంధన ఉత్పత్తి, అర్థిక అభివృద్ధి వంటివి నిరంతరాయంగా సాగే ఈ నీటి ప్రవాహంపైనే ఆధారపడి ఉన్నాయి" అని దార్ అన్నారు.

"నదుల పరిరక్షణ మన జాతీయ భద్రతకు అత్యంత కీలకం" అని ఇషాక్ దార్ పేర్కొన్నారు.

"యుద్ధం వంటి పరిస్థితులను సృష్టించడం, ఉమ్మడి జలవనరులను వివాదాలకు కేంద్రంగా మార్చడం, ప్రాంతీయ శాంతిభద్రతలకు ముప్పు కలిగించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని భారత్‌కు గట్టిగా సలహా ఇస్తున్నాం" అని ఇషాక్ దార్ అన్నారు.

నదులపై భారత్ ప్రణాళికలు

భారత్ ఇటీవల 'చీనాబ్ - బియాస్ లింక్ టన్నెల్'(సొరంగ మార్గం) ప్రాజెక్టును ప్రకటించింది. దీని ద్వారా చీనాబ్ నది నీటిని బియాస్ కాలువల వ్యవస్థకు అనుసంధానిస్తారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే భారత్ టెండర్లను కూడా ఆహ్వానించింది.

మే 22న, బీజేపీ తన ఫేస్‌బుక్ పేజీలో ఇలా రాసింది, "సింధు జలాల ఒప్పందం నిలిపివేత అనంతరం.. జలవిద్యుత్, నీటి భద్రత, ఇంకా వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా పశ్చిమ నదుల సామర్థ్యాన్ని భారత్ పూర్తిగా వినియోగించుకోగలుగుతుంది."

బీజేపీ చేసిన ఆ పోస్ట్ ప్రకారం, ఈ సొరంగ మార్గం సుమారు 8.7 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఇది చీనాబ్ నది నుంచి అదనపు జలాలను బియాస్ నది వైపు మళ్లిస్తుంది.

భారత్ ప్రభుత్వ సంస్థ "నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(ఎన్‌హెచ్‌పీసీ)" ఈ టన్నెల్ నిర్మాణానికి టెండర్ జారీ చేసింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని కోక్సర్ ప్రాంతంలో ఈ టన్నెల్ నిర్మించనున్నారు.

ఈ చీనాబ్ బియాస్ లింక్ ప్రాజెక్ట్ సుమారు రూ.2,620 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

కొద్దిరోజుల కిందట, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కవీందర్ గుప్తా కూడా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు.

"చీనాబ్ బియాస్ నదుల అనుసంధాన ప్రాజెక్ట్ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఒక కీలక ముందడుగు. భారతదేశపు నీటిని ముందుగా ఇక్కడి ప్రజలు, రాష్ట్రాల అవసరాలను తీర్చేందుకు వినియోగించాలి" అని గవర్నర్ అన్నట్లు ఏఎన్ఐ వెల్లడించింది.

అయితే, ఈ ప్రాజెక్టుల నిర్మాణం సింధు జలాల ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనంటూ పాకిస్తాన్ ఈ విషయాన్ని సంబంధిత ట్రిబ్యునల్‌కు తీసుకెళ్లింది.

మరోవైపు, భారత్ కూడా తన వైఖరిపై కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.

"ఈ ఒప్పందం నిలిచిపోయింది. ప్రధాన మంత్రి మోదీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఒక్క చుక్క నీరు కూడా అటువైపు (పాకిస్తాన్) వెళ్లకుండా చూసుకునేలా సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి" అని భారత జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్ కొద్దివారాల కిందట అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)