You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైనా-బంగ్లాదేశ్ మధ్య ఒప్పందం.. భారత్‌కు ఇబ్బందికరమా?
బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనా పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో మోంగ్లా పోర్ట్, తీస్తా ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించాయి.
సంయుక్త ప్రకటన విడుదలైన తర్వాత.. భారత్‌లో అత్యంత ఎక్కువగా చర్చనీయాంశమైంది ఈ రెండు అంశాల గురించే.
బంగ్లాదేశ్‌లో రెండో అతిపెద్ద నౌకాశ్రయం మోంగ్లా. చైనా ఇక్కడ ఒక ఎకనమిక్ జోన్‌ను ఏర్పాటు చేయబోతుంది.
వాస్తవానికి, ఈ భూమిని చైనాకు బదులుగా భారత్‌కు ఇవ్వాలని గతంలో ప్లాన్ ఉండేది. కానీ, 2025లో మహ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం దీనిని భారత జాబితా నుంచి తొలగించింది.
ఇప్పుడు ఈ ప్రాజెక్టు దక్కడం వల్ల, బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో చైనాకు ఉనికి మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. చైనా ఇప్పటికే పాకిస్తాన్‌లో గ్వాదర్ నుంచి ఆఫ్రికాలోని జిబౌటి వరకు పలు నౌకాశ్రయాల్లో పెట్టుబడులు పెట్టింది.
దీనితోపాటు చైనా, బంగ్లాదేశ్‌లు చిట్టగాంగ్‌లో ఆర్థిక, పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అంగీకారానికి వచ్చాయి. అదే సమయంలో తీస్తా నది నిర్వహణలో సహకరిస్తామని కూడా చైనా వాగ్దానం చేసింది.
తీస్తా నది నిర్వహణపై భారత్‌లో పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నది భారత్, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు సమీపంలో ప్రవహిస్తుంది. భారత భద్రత కోణంలో చూస్తే ఇది చాలా సున్నితమైన అంశంగా పరిగణిస్తున్నారు.
భారత్‌లో పెరుగుతున్న ఆందోళనలపై స్పందించిన చైనా.. బంగ్లాదేశ్‌తో పెంచుకుంటున్న తమ సహకారం ఏ మూడో పక్షానికి వ్యతిరేకంగా కాదని పేర్కొంది.
మోంగ్లా పోర్టు భారత్ చేతుల్లోంచి ఎందుకు వెళ్లిపోయింది..
మోంగ్లాలో ఎకనమిక్ జోన్ నిర్మించడానికి చైనా ప్రభుత్వ సంస్థతో బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బంగ్లాదేశ్ వార్తాపత్రిక ది బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది.
ఈ కథనం ప్రకారం.. జూన్ 25న బీజింగ్‌లోని చైనా సివిల్ ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్ కోఆపరేషన్‌తో బంగ్లాదేశ్ ఎకనమిక్ జోన్స్ అథారిటీ (బీఈజెడ్ఏ) ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం కింద.. బాగెర్హాట్ జిల్లాలోని మోంగ్లా నౌకాశ్రయానికి సమీపంలో 110 ఎకరాల భూమిలో మోంగ్లా పోర్టు ఎకనమిక్ జోన్ ఏర్పాటు కాబోతుంది.
ఈ భూమిని గతంలో భారత్‌తో ఎకనమిక్ జోన్ కోసం కేటాయించారు. దీన్ని 2015లో రెండు దేశాల మధ్య ప్రారంభించారు.
మోంగ్లా నౌకాశ్రయం కోల్‌కతాకు సమీపంలో ఉండటం వల్ల సరుకు రవాణా సమయం తగ్గి, వ్యాపారం వేగవంతం అవుతుంది.
కానీ, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు భారత్ చేతుల్లోంచి వెళ్లిపోయింది. భారత్ నుంచి ఎంపిక చేసిన డెవలపర్లు అనుకున్న సమయం లోపల పనిని ప్రారంభించలేదని బంగ్లాదేశ్ ఎకనమిక్ జోన్స్ అథారిటీ చెప్పింది.
అందువల్ల, భారత్‌కు అప్పజెప్పిన ఈ ప్రాజెక్టును జాబితా నుంచి తొలగించినట్లు 2025 అక్టోబర్‌లో మధ్యంతర ప్రభుత్వం పేర్కొంది.
జూన్ 2025 లో, ఢాకాలోని చైనా రాయబార కార్యాలయం అదే ప్రదేశంలో చైనీస్ ఎకనమిక్ జోన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది.
ఆ తర్వాత మహ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వం భారత ప్రాజెక్టును అధికారికంగా జాబితా నుంచి తొలగించింది.
'ఇది చాలా పెద్ద మార్పు'
మోంగ్లా ఎకనామిక్ జోన్‌లో పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి చైనా పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని బంగ్లాదేశ్ ఎకనమిక్ జోన్స్ అథారిటీ (బీఈజెడ్‌ఏ) ఎగ్జిక్యూటివ్ మెంబర్ మేజర్ జనరల్ (రిటైర్డ్) మొహమ్మద్ నజ్రుల్ ఇస్లాం 'ది బిజినెస్ స్టాండర్డ్'తో చెప్పారు.
టెలికాం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాలని చైనా పెట్టుబడిదారులు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. గిడ్డంగులు నిర్మించడానికి కూడా ఆసక్తి ఉన్నట్లు తెలిపారు.
''ప్రస్తుతం, ఈ ఒప్పందం ప్రభుత్వ స్థాయిలోనే ఉంది. చైనా వైపు మాస్టర్ ప్లాన్ రూపొందుతుంది. ఆ తర్వాత మా సాంకేతిక, సంప్రదింపుల కమిటీలు దాన్ని పరిశీలిస్తాయి. తదుపరి ఒప్పందాలపై సంతకాలు పెడతాం'' అని తెలిపారు.
2024 జూన్‌లో అప్పటి బంగ్లా ప్రధాని షేక్ హసీనా పర్యటన సందర్భంగా జారీ చేసిన సంయుక్త ప్రకటనతో చైనా, బంగ్లాదేశ్‌లు తాజాగా జారీ చేసిన సంయుక్త ప్రకటనను పోలిస్తే.. ఈ ప్రకటనలలో చాలా వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుందని బంగ్లాదేశ్‌కు మాజీ భారత హైకమిషనర్ వీణా సిక్రీ ఎన్‌డీటీవీతో అన్నారు.
2024 ప్రకటనలో మోంగ్లా ఓడరేవు ఆధునీకరణ, తీస్తా నీటి నిర్వహణ ప్రాజెక్టు బాధ్యతను భారత్‌కు అప్పగించారు. కానీ, ఇప్పుడు మోంగ్లా ప్రాజెక్టును చైనాకు అప్పగించడం పెద్ద మార్పు అని సిక్రీ అన్నారు.
‘‘మోంగ్లా పోర్ట్ టెర్మినల్ నిర్వహణ భారత్ వాణిజ్య అనుసంధానాన్ని, ప్రాంతీయ ప్రభావాన్ని గణనీయంగా బలోపేతం చేసి ఉండేది. 2018లో రవాణా, కార్గో షిప్పింగ్ కోసం చిట్టగాంగ్, మోంగ్లా ఓడరేవులకు సంబంధించిన పూర్తి యాక్సెస్‌ను భారత్‌కు బంగ్లాదేశ్ ఇచ్చింది. ఈ నిర్ణయం అప్పటికే ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యానికి పెద్ద ఊతాన్ని ఇచ్చింది" అని సిక్రీ అన్నారు.
హిందూ మహా సముద్రంలో 17 ఓడరేవులతో చైనా కంపెనీలకు లింక్ ఉంది. వాటిలో 13 నౌకాశ్రయాల నిర్మాణంలో వాటి పాత్ర ఉండగా.. 8 ప్రాజెక్టులలో వాటికి భాగస్వామ్యం ఉంది.
ఈ ప్రాంతంలో తమ పట్టును నిలుపుకోవడం చైనాకు చాలా ముఖ్యం. ఎందుకంటే, తన ఇంధన దిగుమతుల్లో దాదాపు 80 శాతం హిందూ మహాసముద్రం గుండానే వెళ్తాయి.
బంగ్లాదేశ్ 2016లో చైనా బెల్ట్, రోడ్డు ఇనీషియేటివ్ ప్రాజెక్టుతో చేతులు కలిపింది. బీజింగ్ ఆర్థిక వనరులను ఉపయోగించుకుని తన మౌలిక సదుపాయాలను, ఆర్థిక అనుసంధానాన్ని బలోపేతం చేసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.
బంగ్లాదేశ్‌లో చైనా ప్రధాన పెట్టుబడిదారి. చిట్టగాంగ్‌లో 750 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి, చిట్టగాంగ్ నౌకాశ్రయం వద్ద సింగిల్ పాయింట్ మూరింగ్ సిస్టమ్ ( సముద్రంలో నిలిపిన ఓడల నుంచి చమురు, గ్యాస్ తదితరాలను పైప్ లైన్ ద్వారా ఎక్కించడం, దించడం లాంటివి చేసే సదుపాయం) వంటివి అందులో ముఖ్యమైన ప్రాజెక్టులు.
'భారత భద్రతకు ముప్పు'
ఇరు దేశాల నేతల మధ్య జరిగిన సమావేశంలో చాలా ముఖ్యమైన అంశం తీస్తా నది నిర్వహణ అని బంగ్లాదేశ్ పీఎంఓ అధికార ప్రతినిధి మహ్దీ అమీన్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహాయం అందించడానికి, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు చైనా ఆసక్తి కనబరిచిందన్నారు.
''2024 సంయుక్త ప్రకటనలో బంగ్లాదేశ్ వైపు తీస్తా నీటి నిర్వహణ ప్రాజెక్టును భారత్ సహకారంతో పూర్తవుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితిలో.. ఈ ప్రాంతంలో చైనాను చేర్చడం భారత్‌కు భద్రతపరంగా రిస్క్‌గా చూస్తారు. ఈ విషయాన్ని భారత్ ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేసింది'' అని వీణా సిక్రీ తెలిపారు.
మహ్మద్ యూనస్ ప్రభుత్వం చేసిన మార్పులను ప్రధాని తారిక్ రెహమాన్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. కానీ, భారత్-బంగ్లాదేశ్ స్నేహాన్ని బలోపేతం చేస్తామని ఆయన ఇచ్చిన వాగ్దానానికి ఇది అనుగుణంగా లేదన్నారు.
''తీస్తా నది నిర్వహణపై చైనా-బంగ్లాదేశ్ ఏకాభిప్రాయం భారత్‌కు దిగ్భ్రాంతిని కలిగించి, నిరాశపరిచింది. ఈ మొత్తం పరిణామాన్ని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది'' అని వీణా సిక్రీ తెలిపారు.
భారత్ కూడా ఈ ప్రాజెక్టుపై ఒక నిఘా ఉంచుతోంది. ఎందుకంటే, వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్‌కు (చికెన్ నెక్) దగ్గరగా ఈ ప్రాజెక్టు ఉంది.
ఇది ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారత్‌తో కలుపుతోంది. భారత భద్రత కోణం నుంచి చూసుకుంటే, ఇక్కడ చైనా ఇంజనీరింగ్, పెట్టుబడుల కార్యకలాపాలు చాలా సున్నితమైనవి.
ఏ మూడో దేశానికి వ్యతిరేకం కాదంటున్న చైనా
తీస్తా నది భారత్, ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుకు సమీపంలో ప్రవహిస్తుంది. ఈ విషయంలో భారత్ ఆందోళనను చైనా ఎలా చూస్తుంది? చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
''తీస్తా నది పునర్నిర్మాణం బంగ్లాదేశ్ ప్రజలకు చాలా ముఖ్యం. ఈ పనిలో చైనా వీలైనంత వరకు సాయపడుతుంది. చైనా-బంగ్లాదేశ్ సహకారం ఏ మూడో దేశానికి వ్యతిరేకం కాదు. బయటి వ్యక్తుల ద్వారా మేం ప్రభావితం కాకూడదు'' అని ఆయన అన్నారు.
బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత.. 25 ఏళ్ల మైత్రీ బంధం రూపంలో భారత్‌తో మొదటి ఒప్పందంపై సంతకం చేసింది. ఆ తర్వాత వెంటనే, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరింది.
యుద్ధంతో అతలాకుతలమైన బంగ్లాదేశ్‌కు ఈ వాణిజ్య ఒప్పందం అత్యంత ప్రాముఖ్యమైనదిగా నిలిచింది.
1975 వరకు ఇరు దేశాల మధ్య సహకారం వేగంగా పెరిగిందని చెప్పవచ్చు. 1975లో అవామీ లీగ్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించిన తర్వాత.. ఫరక్కా బ్యారేజీతో పాటు పలు సమస్యలతో భారత్‌తో సంబంధాలు క్షీణించాయి.
హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ పాలనలో ద్వైపాక్షిక సంబంధాలలో ఒడిదుడుకులు చాలా తక్కువగా ఉండేవి. 2009లో అవామీ లీగ్ అధికారంలోకి వచ్చిన తరువాత ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ పుంజుకున్నాయి.
ఆ సమయంలో, రెండు దేశాల మధ్య చాలా విషయాల్లో సహకారం మెరుగైంది. అవామీ లీగ్ ప్రభుత్వం అధికారాన్ని పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో రాజకీయ మద్దతు ప్రయోజనాన్ని కూడా పొందింది. కానీ, అవామీ ప్రభుత్వం వైదొలిగిన తర్వాత.. భారత్‌తో సంబంధాలపై నమ్మకం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)