యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే కాన్పు, తల్లి మృతి

    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

(ఈ కథనంలోని అంశాలు కలవర పెట్టొచ్చు)

ఇంట్లోనే కాన్పు అనే వీడియోను యూట్యూబ్‌లో చూసిన తరువాత , ఆస్పత్రికి వెళ్లకుండా, ఎటువంటి వైద్య సలహాలు పొందకుండా ఇంట్లోనే ప్రసవించిన తల్లి మృతి చెందింది. అయితే పుట్టిన బిడ్డకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ మరణానికి సంబంధించి ఆమె భర్తపై కేసు నమోదు చేశారు. కానీ, ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్‌లో జరిగింది.

ఆరేళ్ల క్రితం సిజేరియన్ ద్వారా ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈ దంపతులు, ఈసారి సహజ ప్రసవం ద్వారా బిడ్డను కనాలని ముందే నిర్ణయించుకున్నట్లు వైద్యాధికారులు జరిపిన విచారణలోవెల్లడైంది. వారు బంధువుల నుంచి కూడా ఎలాంటి సలహా తీసుకోలేదని అధికారులు తెలిపారు.

గర్భిణులకు 12వ వారం నుంచి బిడ్డ పుట్టిన తరువాత కూడా ఆరోగ్య శాఖ అందించే టీకాలు, మందులు, సాయం గురించి అవగాహన ఉన్నప్పటికీ, వాటిలో దేనినీ వారు తీసుకోలేదని తెలిసింది.

ఇంట్లోనే కాన్పు జరిగే కేసులలో తల్లీబిడ్డ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని ప్రసూతి వైద్యురాలు గీత అన్నారు.

సొంతంగా కాన్పు

తిరుప్పూర్ జిల్లాలోని ఉతుకుళి సమీపంలో పుంచై తలవాయిపాళ్యంకు చెందిన 40 ఏళ్ల కుళందైసామి, ఆయన భార్య 32 ఏళ్ల శశికళ ఇద్దరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు.

కుళందైసామి తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఈ దంపతులకు ఆరేళ్ల కుమార్తె ఉంది.

శశికళ మరోసారి గర్భం దాల్చారు. జూన్ 23న శశికళకు పురిటినొప్పులు వచ్చాయి. ఇంట్లోనే ప్రసవించారు. ఆ తర్వాత.. ఆమె పరిస్థితి క్షీణించడంతో కోయంబత్తూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా.. జూన్ 28న మరణించారు. ఆరోగ్య శాఖాధికారి ఫిర్యాదు మేరకు.. ఉతుకుళి పోలీసు స్టేషన్‌లో దీనిపై కేసు నమోదైంది.

భార్యాభర్తలు తమ బంధువులెవరినీ సంప్రదించకుండా స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉతుకుళి పోలీసులు తెలిపారు.

''జూన్ 23వతేదీ రాత్రి 9.45 గంటలకు శశికళకు పురిటినొప్పులు రావడం మొదలైన తర్వాత.. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వెంటనే వచ్చారు. తనను ఆసుపత్రికి తీసుకువెళ్లవద్దని, ప్రసవాన్ని తామే చూసుకుంటామని శశికళ వారితో చెప్పారు. పిలిచే వరకు గదిలోకి రావద్దని కూడా చెప్పారు. అందుకే వారు రాత్రంతా ఇంట్లోకి వెళ్లకుండా బయటే వేచి ఉన్నారు" అని ఉతుకుళి పోలీసు ఇన్‌స్పెక్టర్ శరవణన్ తెలిపారు.

''కేవలం శశికళ, ఆమె భర్త మాత్రమే కాన్పు కోసం గదిలో ఉన్నారు. శశికళ తల్లిదండ్రులను అడిగినప్పుడు, సహజ పద్ధతిలో ప్రసవం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వారికి ముందే తెలుసని తెలిపారు. కానీ వాళ్ల మధ్య ఏదైనా ఏకాభిప్రాయం కుదిరిందేమో నాకు తెలియదు. వారి కుమార్తె మరణంపై ఫిర్యాదు చేయమని అడిగినప్పుడు, వారు నిరాకరించారు'' అని తెలిపారు.

కున్నత్తూరు జిల్లా వైద్యాధికారి నిత్య నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. నిర్లక్ష్యం వల్ల మరణించడం, సరైన వైద్య విద్య, రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య చికిత్స చేయడం వంటి ఫిర్యాదు సహా జాతీయ వైద్య కమిషన్ చట్టంలోని సెక్షన్ల కింద ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ శరవణన్ బీబీసీకి తెలిపారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, జూన్ 23వతేదీ రాత్రి సుమారు 10 గంటలకు కుళందైసామి యూట్యూబ్ చూస్తూ శశికళ ప్రసవాన్ని పర్యవేక్షించారు.

మరుసటి రోజు ఉదయం ఆమె ఒక పాపకు జన్మనిచ్చారు. ఆ తర్వాత శశికళ తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయారు. ఆమెను వెంటనే సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, వారు ప్రథమ చికిత్స చేసి పెరుందురైలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపించారు.

శశికళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. కోయంబత్తూర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆస్పత్రిలో చేర్చమని సూచించారు. దీంతో, ఆమెను కోయంబత్తూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు.

ఆమెకు అక్కడ చికిత్స అందిస్తున్నప్పటికీ, జూన్ 28న మరణించారు. పుట్టిన పాపకు ప్రస్తుతం పెరుందురై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

శశికళకు, కుళందైసామికి 2019 ఫిబ్రవరి 23న పెళ్లయింది. ఆ తర్వాత ఏడాది సిజెరియన్‌ ద్వారా ఒక పాపకు జన్మనిచ్చారు. ఆపైన తన భార్య శశికళ పలు కారణాల వల్ల అల్లోపతి వైద్యంపై విశ్వాసాన్ని కోల్పోయారని కుళందైసామి చెప్పినట్లు ఉతుకుళి పోలీసులు తెలిపారు.

ఆమె రెండోసారి గర్భం దాల్చినప్పటి నుంచి వైద్య పరీక్షల కోసం కూడా ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. తాను ఇంట్లోనే ప్రసవించనున్నట్లు శశికళ గతంలోనే తన మామయ్య, అత్తయ్యకి, అలాగే తన తల్లిదండ్రులకు చెప్పినట్లు పోలీసులు అందించిన సమాచారంలో తెలిసింది. ఆరోగ్య శాఖ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.

తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి అరుణ్‌రాజ్ జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న తిరుప్పూర్‌లో ఈ మరణం సంభవించడంతో, ఆరోగ్య శాఖ ఈ విషయంపై నిశితంగా దృష్టి సారించి దర్యాప్తు నిర్వహిస్తోంది.

''పాప పుట్టిన తర్వాత.. మాయ బయటికి రాలేదు. దీనివల్ల రక్తస్రావం పెరిగింది. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు, వాళ్లు కేవలం ప్లాసెంటాను మాత్రమే తొలగించి, పెరుందురై వైద్య కళాశాల ఆస్పత్రికి పంపించారు. అక్కడికి వెళ్లిన తర్వాత, శశికళ పరిస్థితి విషమించడంతో, ఆమెను కోయంబత్తూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని సూచించారు. వారు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరణించిన మహిళ నివసించే ప్రాంతం తిరుప్పూర్, ఆమెకు చికిత్స చేసిన పెరుందురై మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఈరోడ్ జిల్లాలో ఉంది. ఆమె మరణించిన ప్రైవేట్ ఆస్పత్రి కోయంబత్తూర్‌లో ఉంది. అందుకే, ఈ కేసును మూడు జిల్లాల అధికారులు దర్యాప్తు చేస్తున్నారు'' అని బీబీసీకి చెప్పారు కన్నన్ మహారాజన్.

ఈ ఘటనలో మూడు జిల్లాల పరిధిలో జరగడంతో, ఆ మూడు జిల్లాల ఆరోగ్య శాఖాధికారుల నుంచి నివేదికలు సేకరిస్తామని తిరుప్పూర్ జిల్లా జాయింట్ డైరెక్టర్ కన్నన్ మహారాజన్ తెలిపారు.

గర్భిణుల డేటాను ఎలా నమోదుచేస్తారు

తమిళనాడు ప్రభుత్వ ప్రజారోగ్య, రోగనిరోధక డైరెక్టరేట్ వెబ్‌సైట్ పీఐసీఎంఈలో తమ పేర్లను నమోదు చేసుకుంటే గర్భిణీలకు ఒక రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ (ఆర్‌సీహెచ్) నెంబర్ ఇస్తారు. ఈ నెంబర్‌ను స్థానిక వైద్యాధికారులు నమోదు చేస్తారు. గర్భం దాల్చిన తొలి నెల నుంచే వారు గర్భిణులను పర్యవేక్షిస్తారు. అవసరమైన మందులను, టాబ్లెట్లను ఇస్తూ.. చెక్ చేస్తుంటారు.

గర్భిణికి వివిధ దశల్లో ప్రసూతి ప్రయోజనాల కింద రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు తమిళనాడు ప్రభుత్వం అందిస్తుందని వైద్యాధికారులు వివరించారు. ఈ రికార్డు బట్టి, గర్భిణుల కోసం ప్రత్యేక ఫైల్ నిర్వహిస్తారు. అవసరమైన నెలల్లో సరైన చికిత్స అందిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత.. బర్త్ సర్టిఫికేట్, వ్యాక్సినేషన్లు ఇచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తారు.

నీలగిరి జిల్లా ముదుమలై టైగర్ రిజర్వులోని దట్టమైన అడవుల్లో ఉండే పలు గిరిజన గ్రామాల్లో కూడా ఇలాంటి వైద్య రికార్డులు, చికిత్సలు అందిస్తున్నారు. ''ఒకసారి ఆర్‌సీహెచ్ నెంబర్ వచ్చిన తర్వాత.. మొదటి నెల నుంచే ఈ మహిళను చూడటం మొదలు పెడతాం. మహిళకు చివరి పీరియడ్ అయిన రోజు నుంచి మా పర్యవేక్షణ మొదలై, బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొనసాగుతుంది" అని బీబీసీకి తెలిపారు మసినకుడి గ్రామ నర్సు శ్రీదేవి.

తమిళనాడు ప్రభుత్వం గర్భిణీలకు 4వ నెల, 6వ నెల చివరిలో ఒక 'కిట్'ను అందిస్తుంది. దీనిలో రూ.2 వేల విలువైన పోషకాలతో కూడిన పానీయం, రెండు బాక్సుల కర్జూర పండ్లు, ఐరన్ సప్లిమెంట్లు, నెయ్యి వంటివి ఉంటాయని శ్రీదేవి తెలిపారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా, పోలియో చుక్కలతో మొదలుపెట్టి 5, 6, 16 ఏళ్ల వయస్సు వరకు టీకాల ప్రక్రియను ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తోందని అధికారులు వివరించారు.

కానీ, శశికళ తన ప్రెగ్నెన్సీని దాచిపెట్టారు. ఆమె గురించి కనీసం ఏ వైద్యాధికారులకు తెలియదని తిరుప్పూర్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ జయంతి తెలిపారు.

గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఎలాంటి వైద్య సాయం తీసుకోకుండా వారు చాలా దారుణ నిర్ణయం తీసుకున్నారన్నారు. కనీసం వారి కుటుంబ సభ్యులను, బంధువులను కూడా సంప్రదించలేదని పేర్కొన్నారు.

''మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఆమెకు ఆర్‌సీహెచ్ నెంబర్ వచ్చింది. సిజెరియన్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. అవసరమైన చికిత్స అంతా పొందారు. ఆమె మరోసారి రిజిస్టర్ అయి, దానికి అనుగుణంగా చికిత్స పొందాల్సింది. కానీ, ఈ దంపతులు అల్లోపతి వైద్యాన్ని కొట్టిపారేశారు. సొంతంగా చికిత్స చేసుకున్నారు'' అని జయంతి తెలిపారు.

"ఇద్దరూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లే అయినప్పటికీ, ఇలా చేయమని వారికి ఎవరు సలహా ఇచ్చారో మేం తెలుసుకోలేకపోయాం. ఆ విషయం తెలిస్తే, వారిపై కూడా ఫిర్యాదు చేస్తాం. కానీ, ఆమె కుటుంబ సభ్యులెవరూ ఈ విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ విషయంలో ఆరోగ్య శాఖ అధికారి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాం" అని డాక్టర్ జయంతి అన్నారు.

తమ్ముడి కుటుంబం కూడా అదే ఇంట్లో నివసిస్తోందని, ఆయన భార్య ఆసుపత్రిలో చికిత్స పొంది ఒక బిడ్డకు జన్మనిచ్చిందని డిప్యూటీ డైరెక్టర్ జయంతి తెలిపారు. ఆ బిడ్డకు పోలియో చుక్కలు కూడా వేసినప్పటికీ, ఈ విషయాన్ని ఆమె ఆరోగ్య శాఖ సిబ్బందికి తెలియజేయలేదని డాక్టర్ జయంతి ఆవేదన వ్యక్తం చేశారు. తమ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని వారు చెప్పడం వల్లే తాము ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని తమ్ముడి భార్య అన్నట్లు తెలిపారు.

ఇంట్లో ప్రసవం -తల్లీబిడ్డకు ప్రమాదం

బిడ్డ పుట్టకముందు, పుట్టే సమయంలో మహిళకు కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి కోయంబత్తూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ప్రసూతి, గైనకాలజీ విభాగపు హెడ్ గీత వివరించారు.

అలాగే ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రసవించడం ఒక మహిళకు ఎంత ప్రమాదకరమో కూడా ఆమె వివరంగా తెలియజేశారు.

''బిడ్డను కనేటప్పుడు సాధారణంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక మహిళ గర్భిణీ అయినప్పుడు, అధిక రక్తపోటు,రక్తహీనత, మధుమేహంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ. అందుకే, గర్భిణులకు ప్రతినెలా రక్తపోటును, చక్కెరలో రక్త స్థాయిని, హిమోగ్లోబిన్ పరీక్షలను చేస్తుంటాం. వీటిని ప్రాథమిక దశలో కనుగొంటేనే.. వారికి సరైన సమయంలో చికిత్స అందించగలం'' అని డాక్టర్ గీత బీబీసీకి తెలిపారు.

''ఒకవేళ ఈ పరీక్షలు చేయకపోతే , మహిళ ఎలా ప్రసవిస్తుందో అంచనా వేయడం సాధ్యం కాదు. వీటిని నియంత్రించకపోతే కష్టమవుతుంది. ప్రసవ సమయంలో గర్భాశయం వ్యాకోచించాల్సి ఉంది. ఇందుకోసం, 'యాక్టివ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ది థర్డ్ స్టేజ్ ఆఫ్ లేబర్ (ఏఎంటీఎస్ఎల్)' అనే చికిత్స అందిస్తారు. తగిన ఇంజెక్షన్లు, మందులు ఇస్తారు. ఇదంతా ఆసుపత్రిలో మాత్రమే సాధ్యమవుతుంది" అని డాక్టర్ గీత వివరించారు.

''ఒక మహిళకు ఒకసారి సిజేరియన్ జరిగితే, తర్వాతిసారి జరిగే ప్రసవంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. ముందు ప్రసవంలో కుట్లు వేసి ఉండవచ్చు. ఆ కుట్లు ఊడిపోయి, గర్భాశయం చిట్లిపోయే అవకాశం ఉంటుంది. అలా జరిగితే, తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడటం చాలా కష్టమవుతుంది. వారు ఆసుపత్రిలో ఉంటే, వారిని నిశితంగా పర్యవేక్షించి, తగిన చికిత్స అందించవచ్చు" అని డాక్టర్ గీత అన్నారు.

''కారు డ్రైవింగ్ తెలిసినంత మాత్రనా.. ట్రక్కు నడపలేరు కదా. యూట్యూబ్‌లో వీడియో చూస్తూ విమానం నడపినంత ప్రమాదకరం ఇంట్లోనే బిడ్డను కనడం. ఈ మధ్యకాలంలో నార్మల్ డెలివరీ మాత్రమే మంచిదనే ఆలోచన చాలా మందిలో పెరుగుతోంది. ఇది తప్పు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది" అని ప్రసూతి వైద్యురాలు గీత తెలిపారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)