You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పింక్ ప్యాంటీ ధరించినందుకు అందరూ నోరెళ్లబెట్టారు, కొత్త నిబంధనలు తీసుకొచ్చారు..
- రచయిత, ఎల్లీ వైలట్ బ్రామ్లీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
1962లో బ్రెజిలియన్ టెన్నిస్ క్రీడాకారిణి మారియా బ్యూనో గులాబీ రంగు అంచు ఉన్న టెన్నిస్ దుస్తులు, అదే రంగు నిక్కర్లు ధరించి వింబుల్డన్‌లో బరిలోకి దిగడంతో తీవ్ర వివాదం చెలరేగింది.
ఈ ఘటన తర్వాత మరింత కఠినమైన దుస్తుల నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే వింబుల్డన్‌లో దుస్తులు వివాదానికి దారితీయడం అది మొదటిసారి కాదు. చివరిసారి కూడా కాదు.
మరి టెన్నిస్ దుస్తుల చుట్టూ ఇంత హంగామా ఎందుకు?
1962 వేసవిలో ఒక గాయం కారణంగా కొంతకాలం టెన్నిస్ నుంచి విరామం తీసుకున్న మారియా బ్యూనో, మళ్లీ వింబుల్డన్‌కు తిరిగి వచ్చారు. సెంటర్ కోర్టులో అడుగుపెట్టిన ఆమె తెల్లటి దుస్తుల్లో కనిపించడంతో ఆల్ ఇంగ్లండ్ క్లబ్ అమలు చేస్తున్న (ఆల్-వైట్) అంటే కేవలం తెలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలన్న సంప్రదాయానికి అనుగుణంగానే ఉన్నారని అందరూ భావించారు.
కానీ ఆమె సర్వీస్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది.
ఆమె గౌనుకు గులాబీ రంగు అంచు ఉండటంతో పాటు ఆమె వేసుకున్న నిక్కర్లు కూడా అదే రంగులో ఉన్నాయి.
‘‘ఆ దుస్తులు పెద్ద చర్చకు దారితీశాయి’’ అని ఏస్: ది టైమ్స్ అండ్ స్టైల్ ఆఫ్ టెన్నిస్ రచయిత సునీతా కుమార్ నాయర్ బీబీసీతో అన్నారు.
కొన్నేళ్ల తర్వాత అప్పటికే రెండు వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిళ్లు గెలిచి, మరో టైటిల్ కూడా సాధించిన బ్యూనో ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ "కోర్టు ఒక చివర నుంచి ఒక్కసారిగా ఆశ్చర్యకరమైన స్పందన వినిపించింది. మరోవైపు ఉన్నవారికి ఎందుకో అర్థం కాలేదు. నేను కోర్టు మారి అవతలివైపు నుంచి సర్వ్ చేసిన తర్వాతే వారికీ తెలిసింది" అని చెప్పారు.
"తర్వాత క్లబ్ రంగులను పోలి ఉండే ఆకుపచ్చ, ఊదా రంగు లోదుస్తులు ధరించాను. దాంతో క్లబ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం పూర్తిగా తెలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది" అని ఆమె తెలిపారు.
ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రాకెట్ క్లబ్ 1877లో స్థాపితమైనప్పటి నుంచే తెలుపు రంగు దుస్తులు ధరించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే అది అప్పటివరకు కేవలం ఆనవాయితీ మాత్రమే. టెడ్ టిన్లింగ్ రూపొందించిన బ్యూనో దుస్తులే కఠినమైన నిబంధనలకు కారణమయ్యాయని చెబుతారు. సునీతా కుమార్ నాయర్ తన పుస్తకంలో "1962లో వింబుల్డన్ ప్రతిస్పందనగా 'ప్రధానంగా తెలుపు రంగునే ధరించాలి' అనే నిబంధనను తీసుకొచ్చింది. దీంతో పోటీదారులంతా దాదాపు పూర్తిగా తెలుపు రంగు దుస్తులే ధరించాల్సి వచ్చింది" అని పేర్కొన్నారు.
"సంప్రదాయవాద సంస్థగా ఉన్న ఆల్ ఇంగ్లండ్ క్లబ్... బ్యూనో దుస్తుల్లోని అలంకరణలను మహిళలకు తగనివిగా, అసభ్యంగా భావించింది. 1960లలో క్లబ్ వెలుపల జరుగుతున్న సామాజిక మార్పులను వారు అంగీకరించడానికి సిద్ధంగా లేరు" అని టెన్నిస్ చరిత్రకారుడు రాబ్ లేక్ చెప్పారు.
ఆ సమయంలో, 1980ల వరకు కూడా క్లబ్ కమిటీ సభ్యులంతా పురుషులేనని లేక్ తెలిపారు. వారు రాజకీయ సంబంధాలు, ఇతర ఉన్నత వర్గ సంస్థలతో అనుబంధాలు కలిగి, సంప్రదాయవాదానికి ప్రతినిధులుగా ఉన్నారని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించే సామాజిక మార్పులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా లేరని ఆయన అన్నారు.
పురుషులతో పోలిస్తే మహిళలు ఎలా కనిపించాలనే విషయంపై క్లబ్‌కు మరింత కఠినమైన అభిప్రాయం ఉండేదని, మహిళల దుస్తుల విషయంలోనే ఎక్కువగా హెచ్చరికలు జారీ చేసేదని లేక్ పేర్కొన్నారు.
1967లో ఇటాలియన్ టెన్నిస్ క్రీడాకారిణి లియా పెర్సికోలీ ధరించిన పొట్టి దుస్తులు మరోసారి వివాదానికి దారితీశాయి. అవి కూడా టెడ్ టిన్లింగ్ రూపొందించినవే. 'వింబుల్డన్ విజార్డ్'గా పేరొందిన టిన్లింగ్... మహిళల టెన్నిస్ దుస్తుల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 20వ శతాబ్దంలో ఆయన ప్రభావం విశేషమని పేర్కొంటూ, 1940 నుంచి 1980 వరకు వింబుల్డన్‌లో పోటీ చేసిన మహిళల్లో 75 శాతం మంది ఆయన రూపొందించిన దుస్తులే ధరించారని ఏస్ పుస్తకంలో పేర్కొన్నారు.
టిన్లింగ్ను "క్రీడల కోసం ప్రత్యేకంగా పనిచేసిన తొలి ఫ్యాషన్ డిజైనర్"గా సునీతా కుమార్ నాయర్ అభివర్ణించారు.
వింబుల్డన్ తెలుపు రంగును ఎంచుకోవడానికి కూడా చారిత్రక కారణాలున్నాయి. 19వ శతాబ్దం చివర్లో ఈ సంప్రదాయం ప్రారంభమైనప్పుడు తెలుపు రంగు ఉన్నత వర్గానికి ప్రతీకగా ఉండేది. "ధనవంతులే తెలుపు రంగు దుస్తులను కొనుగోలు చేసి, వాటి శుభ్రతను చూసుకోగలుగోవారు. మిగతా వారికి ప్రత్యేక క్రీడా దుస్తులను కొనుగోలు చేసి వాటిని చూసుకునేందుకు ఆర్థిక స్థోమత ఉండేది కాదు" అని సునీతా కుమార్ నాయర్ రాశారు.
"మొదట్లో తెలుపు రంగు టెన్నిస్‌కు సాధారణ రంగు మాత్రమే. తర్వాత వింబుల్డన్ తన సంప్రదాయాన్ని కాపాడేందుకు దానిని కఠిన నిబంధనగా మార్చుకుంది" అని చెప్పారు.
మహిళల దుస్తులపై వివాదం బ్యూనోతో ప్రారంభం కాలేదు. అంతకుముందు 1949లో అమెరికా క్రీడాకారిణి గస్సీ మోరాన్ కూడా టెడ్ టిన్లింగ్ రూపొందించిన దుస్తులు ధరించి సంచలనం సృష్టించారు.
ఏస్ పుస్తకం ప్రకారం, లేస్ అంచులతో కూడిన ఆమె లోదుస్తులు మహిళ శరీరంలోని కొన్ని భాగాలపై దృష్టి మళ్లించాయని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రంగు నిబంధనలను ఉల్లంఘించకపోయినా అవి సామాజిక ప్రమాణాలకు విరుద్ధమని భావించారు. టెన్నిస్‌లో అసభ్యతను, పాపాన్ని తీసుకొచ్చారని కూడా ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
అయితే అనుచితంగా వ్యవహరించింది మోరాన్ కాదని టిన్లింగ్ తర్వాత వ్యాఖ్యానించారు.
"ఆ ప్యాంటీలు ప్రతి మూడు నిమిషాలకు ఒక్కసారి మాత్రమే కనిపించేవి. కానీ చరిత్రలో తొలిసారి ఫోటోగ్రాఫర్లు నేలపై పడుకుని చిత్రాలు తీశారు. దాంతో అందరూ తెగ ఎగ్జైట్మెంట్కు గురయ్యారు" అని ఆయన చెప్పారు.
2026 నాటి పరిస్థితులతో పోలిస్తే అప్పటి వివాదం తీవ్రతను ఊహించడం కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. మోరాన్ తన ఆట కన్నా 1949లో వింబుల్డన్ సంప్రదాయవాద ప్రపంచాన్ని కుదిపేసిన క్రీడాకారిణిగానే ఎక్కువగా గుర్తింపు పొందారు. 1927 నుంచి ఆటగాళ్ల సమన్వయకర్తగా పనిచేసిన టిన్లింగ్ను క్లబ్ సభ్యత్వం నుంచి తొలగించారు. అనంతరం మూడు దశాబ్దాలకుపైగా ఆయనకు తిరిగి ఆహ్వానం అందలేదు.
మోరాన్‌కు ముందే మహిళల దుస్తులు వివాదాలకు దారితీశాయి. 1919లో ఫ్రాన్స్ క్రీడాకారిణి సుజాన్ లెంగ్లెన్ కార్సెట్‌లు, పొడవాటి స్కర్టులు, వెడల్పాటి టోపీలకు బదులుగా జీన్ పాటూ రూపొందించిన పొట్టి చేతుల దుస్తులు ధరించి వింబుల్డన్‌లో ఆడడం చర్చనీయాంశమైంది.
1931లో స్పెయిన్ క్రీడాకారిణి లిలీ డి అల్వారెజ్ ఎల్సా షియాపరెల్లీ రూపొందించిన కులోట్స్ ధరించి బరిలోకి దిగడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. అవి స్కర్టులా కనిపించినప్పటికీ ఆమె ఎగిరి బంతిని అందుకునే సమయంలో అవి ప్యాంటులని ప్రేక్షకులకు తెలిసేది. మహిళల సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటానికి ఆ దుస్తులు ప్రతీకగా అనేకమంది విశ్లేషకులు భావిస్తారు.
2014లో బ్రాలు, లోదుస్తులు, పట్టీలు, లేస్, షూ అడుగులు తదితర వస్తువులు కూడా దాదాపు పూర్తిగా తెలుపు రంగులోనే ఉండాలనే కఠిన నిబంధనను వింబుల్డన్ అధికారికంగా అమలు చేసింది.
దీంతో సెరీనా విలియమ్స్ ఊదా, గులాబీ రంగు లోదుస్తులు ధరించడం వల్ల నిబంధనలను ఉల్లంఘించిన క్రీడాకారిణిగా నిలిచారు. అలాగే రోజర్ ఫెదరర్ అడుగున నారింజ రంగు ఉన్న షూ వేసుకోవడం వల్ల వాటిని మార్చాలని అధికారులు సూచించారు.
గత 20 ఏళ్లలో వింబుల్డన్ దుస్తుల నిబంధనలు అత్యంత కఠినంగా మారాయని క్రిస్టోఫర్ బవర్స్ తెలిపారు.
"ప్రస్తుతం దీనికి ప్రధాన కారణం బ్రాండింగ్. వింబుల్డన్ తనను 'ఇంగ్లిష్ గార్డెన్లో టెన్నిస్'గా అంటే పాతకాలపు బ్రిటన్ గార్డెన్లలో ఆడే టెన్నిస్గా భావిస్తుంది. తెలుపు దుస్తులు, ఆకుపచ్చ మైదానాలు, వర్జీనియా క్రీపర్ మొక్కలు, స్ట్రాబెర్రీలు, క్రీమ్ అన్నీ కలిసి దాని బ్రాండ్‌లో భాగమయ్యాయి. ఆటగాళ్లు కూడా అదే సంప్రదాయాన్ని అనుసరించాలని ఆశిస్తారు" అని ఆయన అన్నారు.
వింబుల్డన్ సంప్రదాయాలను కొనసాగించడంలో ప్రధాన ఉద్దేశం తన ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవడమేనని సునీతా కుమార్ నాయర్ తెలిపారు.
"వింబుల్డన్‌ను ఒక అద్భుతమైన ఫెయిరీ టెయిల్ లాంటి భావనతో చూస్తారు. చాలా కాలంగా కొనసాగుతున్న ఆ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి నిర్వాహకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు" అని ఆమె చెప్పారు.
తన పుస్తకంలో వింబుల్డన్ ప్రత్యేక వాతావరణాన్ని ఆమె ఇలా వర్ణించారు.
"గ్రంథాలయంలో ఉండే నిశ్శబ్దాన్ని తలపించే వాతావరణం, కోర్టుల పక్కన తెరిచే షాంపైన్ సీసాల మృదువైన శబ్దం, కొత్తగా కత్తిరించిన పచ్చిక మైదానాల సువాసన, మెరిసే తెల్లటి దుస్తుల్లో కనిపించే క్రీడాకారులు. ఇదే ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రాకెట్ క్లబ్. ఇది గతంలో ఎలా ఉందో, ఇప్పుడు అలాగే ఉంది. భవిష్యత్తులోనూ అలాగే కొనసాగుతుంది"
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)