You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘మంచు తుపానులో బట్టలు విప్పించి, కొట్టి, బలవంతంగా కొండ దాటించారు, మంచులో గడ్డకట్టి 20మంది చనిపోవడం చూశాం’
- రచయిత, మామూన్ దురానీ
- హోదా, బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
"నాకు స్పృహ వచ్చేసరికి నా రెండు కాళ్లు, రెండు చేతులు తొలగించారు. దు:ఖంతో నా గొంతు పూడుకుపోయింది. నోట మాట రాలేదు."
యూరప్ చేరుకోవడానికి ప్రయత్నించిన 13 నుంచి 25 ఏళ్ల వయసు గల ఒక డజను మంది వలసదారులు బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో పంచుకున్న ఆవేదన ఇది. తుర్కియే సరిహద్దు దళాలు కొట్టిన 50 మందిలో ఈ డజను మంది కూడా ఉన్నారు. తుర్కియే దళాలు అందరినీ కొట్టి, బట్టలు విప్పించి, మంచులో వదిలేశారని వారు చెప్పారు.
ఆ 12 మందిలో 13 ఏళ్ల ఆసిమ్ సహా 11 మంది తీవ్రమైన మంచు కారణంగా తమ అవయవాలను కోల్పోయారు. కనీసం మరో 20 మంది మంచులో గడ్డకట్టి చనిపోవడం చూశామని వారిలో ఐదుగురు చెప్పారు.
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో శరణార్థులకు ఆశ్రయం ఇస్తున్నందుకు తుర్కియే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ, మానవ హక్కుల పర్యవేక్షణా సంస్థలు మాత్రం మరోలా చెబుతున్నాయి. సరైన సమీక్ష లేకుండానే తుర్కియే చాలామంది అఫ్గాన్ పౌరులను దేశం నుంచి బహిష్కరిస్తోందని ఆ సంస్థలు అంటున్నాయి.
అయితే, తుర్కియే విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో మాట్లాడుతూ, తమ దేశ సరిహద్దు దళాలు జాతీయ, అంతర్జాతీయ చట్టాలను అనుసరిస్తాయన్నారు.
తుర్కియే సాంస్కృతిక సూత్రాలకు అనుగుణంగా ప్రాథమిక మానవీయ విలువలను, గౌరవాన్ని కాపాడుతామని తెలిపారు. సరైన పత్రాలు లేకుండా వలసదారులు దొరికినపుడు వారికి ఆహారం, నీరు, వైద్యంసహా అవసరమైన సహాయాన్ని అందిస్తామని, ‘‘మానవతా సహాయ ప్రమాణాలను రాజీ లేకుండా అమలు చేస్తామని’’ చెప్పారు.
వాన్ నగరంలో అరెస్టులు
ఈ ఏడాది జనవరి 10 నుంచి 20 మధ్య కాలంలో, ఉష్ణోగ్రతలు మైనస్ 15 డిగ్రీలకు పడిపోయినప్పుడు, పత్రాలు లేని 50 మంది అఫ్గాన్ వలసదారులను వాన్ నగరంలో అరెస్ట్ చేశారు. తూర్పు అనతోలియాలోని ఈ నగరం ఇరాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండటంతోపాటు, వలసదారుల అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా ఉంది.
తాను ఇరాన్ సరిహద్దు దాటి మంచులో ప్రయాణించి, నాలుగో ప్రయత్నంలో ఈ నగరంలోకి ప్రవేశించిన వెంటనే తుర్కియే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని 21 ఏళ్ల షాసవర్ బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో చెప్పారు. సరిహద్దు దాటడానికి మానవ అక్రమ రవాణాదారులు (ట్రాఫికర్స్) సహాయం చేశారని తెలిపారు.
తీవ్ర ఆగ్రహంతో ఉన్న తుర్కియే పోలీసులు, వలసదారులందరినీ ఒక వరుసలో నిలబెట్టి కొట్టడం ప్రారంభించారు.
"తీవ్రంగా కొట్టిన తర్వాత, మమ్మల్ని కొన్నిరాత్రుల పాటు ఒక గోదాములో ఉంచారు. అక్కడ మాపై మంచు కురుస్తూనే ఉంది. రోజుకు ఒక్కసారి మాత్రమే మాకు నీళ్లు, ఎండిపోయిన రొట్టె ఇచ్చేవారు" అని షాసవర్ చెప్పారు.
"అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది" అని నన్‌గర్హార్ ప్రావిన్స్‌కు చెందిన 23 ఏళ్ల మరో అఫ్గాన్ పౌరుడు అలవాల్దిన్ బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌కు వివరించారు.
"వారు మాకు ఆహారం ఇవ్వలేదు. మాతో బలవంతంగా కఠినమైన పనులు చేయించారు. మేం చెక్కలను మోయాల్సి వచ్చింది, మంచును తొలగించాల్సి వచ్చింది" అని ఆయన చెప్పారు.
ఆ సమయంలో తన కుటుంబాన్ని కానీ, తనను యూరప్‌కు తీసుకెళ్తానని మాటిచ్చిన అక్రమ రవాణాదారుడిని కానీ ఆయన సంప్రదించలేకపోయారు.
'బట్టలు విప్పి, వరుసలో నిలబెట్టి'
జనవరి 25న, బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో మాట్లాడిన 12 మంది కూడా తమందరినీ వరుసలో నిలబెట్టి ఇనుప రాడ్లతో కొట్టారని చెప్పారు. బట్టలూడదీసి, చేతులు వెనక్కి కట్టేసి, బోర్లా పడుకోబెట్టి ఒక కొండ వైపునకు బలవంతంగా పాకించారని అలవాల్దిన్ చెప్పారు.
"తుర్కియే సరిహద్దు దళాలు దారుణంగా కొట్టడం వల్ల కొందరి తలలు పగిలి రక్తం భుజాల మీదుగా కారింది" అని ఆయన బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌కు చెప్పారు.
పోలీసులు కొట్టిన దెబ్బలకు కొందరు తమ చేతులను కదిలించలేని స్థితికి చేరుకున్నారని షాసవర్ తెలిపారు.
"వారు మా బట్టలన్నీ తీసేసి, కేవలం ఒక ప్యాంటు మాత్రమే ఉంచారు. మా బూట్లు, సాక్సులు కూడా తీసేసుకుని, ఎనిమిది మంది చొప్పున గ్రూపులుగా విభజించి ఇరాన్ వైపు వేర్వేరు ప్రాంతాల్లో వదిలేశారు" అన్నారు.
అది భారీగా మంచు కురుస్తున్న, కంటిచూపు కూడా సరిగా ఆనని ఒక తుపాను రాత్రి.
"దార్లన్నీ మంచుతో కప్పుకుపోయాయి. ఏ దిశలో వెళ్లాలో మాకు తెలియలేదు, అక్కడే ఉండిపోతే బతుకుతామో లేదో కూడా అర్థం కాలేదు" అన్నారు షాసవర్.
ఆ మంచులో తప్పిపోయిన డానియల్ అనే బాలుడు చనిపోయాడని వారికి తర్వాత తెలిసింది.
ఆకలి, తీవ్రమైన చలి వల్ల అలసిపోయిన షాసవర్ ఒక పెద్ద బండరాయి పక్కన ఆశ్రయం పొందారు. చేతులు పూర్తిగా గడ్డకట్టుకుపోయిన అహ్మద్, ఆసిమ్ అనే చిన్నపిల్లలు కూడా కాసేపటికే ఆయన వద్దకు చేరారు.
"ఉదయం కాగానే ఆసిమ్ ముందుకు సాగారు" అని షాసవర్ బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో చెప్పారు.
"మేం ఎంతగా గడ్డకట్టుకుపోయామంటే కనీసం మాట్లాడలేకపోయాం. అహ్మద్ నా చేతుల్లోనే పడుకుని ఉన్నాడు. కాసేపటి తర్వాత అతను శ్వాస తీసుకోవడం ఆపేసినట్లు నేను గమనించాను" అన్నారు షాసవర్.
తర్వాతి నెలలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆసిమ్ మంచులో దొరకడం కనిపించింది. అందులో, అతను పూర్తిగా తడిసిపోయి, చలికి గడ్డకట్టి, సరిగ్గా బట్టలు కూడా లేని స్థితిలో ఉన్నాడు.
అతన్ని కాపాడినవారు ‘ఒక్కడివే ఉన్నావా' అని అడిగినప్పుడు, చలికి మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆ 13 ఏళ్ల బాలుడు చేత్తో సైగ చేశాడు. తను ఆశ్రయం పొందిన బండరాయి వైపు ఆసిమ్ చేసిన ఆ చిన్న సైగనే తన ప్రాణాలను కాపాడిందని బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌కు షాసవర్ తెలిపారు.
అయితే, ఈ వలసదారుల కష్టాలు అంతటితో తీరలేదు. బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో మాట్లాడిన 12 మంది కథనం ప్రకారం, ఆ తర్వాత ఇరాన్‌లో వారికి చికిత్స అందించడానికి నిరాకరించారు.
అఫ్గానిస్తాన్ ఏమంటోంది?
జనవరి 29న తెహ్రాన్‌లోని అఫ్గాన్ దౌత్య కార్యాలయం (ఎంబసీ) స్పందిస్తూ, ఇరాన్–తుర్కియే సరిహద్దుల్లో తీవ్రమైన చలిలో చిక్కుకుపోయిన పలువురు అఫ్గాన్ వలసదారులను గుర్తించడానికి, వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడానికి అత్యవసర చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
నాలుగు రోజుల తర్వాత, వారిని భూమార్గం ద్వారా అఫ్గానిస్తాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌కు, అక్కడి నుంచి తదుపరి వైద్య చికిత్స కోసం రాజధాని కాబుల్‌కు తరలించారు.
కానీ అప్పటికే, ఆ 12 మందిలో 11 మందిలాగే తీవ్రమైన చలి వల్ల షాసవర్ శరీర భాగాలు నల్లగా మారడం ప్రారంభమైంది. తన చేతులు, కాళ్లలోని ఎముకలు నల్లబడటం చూసినట్లు, శరీరం మొత్తం దురద పెట్టడం మొదలైందని షాసవర్ బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో చెప్పారు.
వారు కాబుల్ ఆసుపత్రికి చేరుకోగానే, ఆయన తండ్రి, సోదరుడు ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేశారు. ఆ వెంటనే షాసవర్‌ను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు, అక్కడ ఆయన రెండు కాళ్లు, చేతులను తొలగించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, సకాలంలో వైద్యం చేస్తే చలి వల్ల దెబ్బతిన్న అవయవాలను నయం చేయవచ్చు. కానీ, దురదృష్టవశాత్తూ ఆ 11 మంది విషయంలో ఆ వైద్యం ఆలస్యంగా అందింది.
ఈ ఆరోపణలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని వాన్ బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ సెంటర్ మైగ్రేషన్ అండ్ అసైలమ్ కమిషన్ చైర్మన్ షఫాక్ బొజ్‌కుర్ట్ బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో చెప్పారు.
" ఈ ప్రాంతంలో వలసదారులను బలవంతంగా వెనక్కి పంపుతుంటారు. తీవ్రమైన చలి వల్ల శరీర ఉష్ణోగ్రత పడిపోయే కేసులు కూడా నమోదైనట్లు మాకు తెలుసు" అని ఆయన పేర్కొన్నారు.
కాబుల్‌లో తాలిబాన్లు అధికారం చేపట్టిన 2021 నుంచి అఫ్గాన్ వలసదారులు ఏటా ఇలాంటి కథనాలను చాలాసార్లు చెబుతున్నారని తుర్కియేకు చెందిన సామాజిక కార్యకర్త జాకిరా హిక్మత్ తెలిపారు. సరిహద్దుల్లో నిఘా పెరగడం వల్ల వారు దేశంలోకి ప్రవేశించడానికి మరింత ప్రమాదకరమైన మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోందని ఆమె వివరించారు.
"వసంతకాలం రావడం, మంచు కరగడంతో ఇక్కడి స్థానికులకు, గొర్రెల కాపరులకు ఈ వలసదారుల మృతదేహాలు కనిపిస్తుంటాయి, ఆ తర్వాత వారు భద్రతా దళాలకు సమాచారం అందిస్తారు" అని జాకిరా చెప్పారు.
వాన్ నగరానికి చెందిన మరో వలసదారుల హక్కుల కార్యకర్త మహ్ముత్ కెచెన్ బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో మాట్లాడుతూ, "అఫ్గాన్ ప్రజలు తుర్కియేలోకి అక్రమంగా ప్రవేశించడానికి ఎక్కువగా ఉపయోగించే కొండ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరం. ఈ సరిహద్దు దాటే ప్రక్రియలు తరచుగా కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో జరుగుతాయి. వీటివల్ల విపరీతమైన చలికి గురికావడం, గాయపడటం, స్మగ్లర్ల చేతిలో దోపిడీకి గురికావడం వంటి ప్రమాదాలు ఉన్నాయి" అన్నారు.
ఇరాన్–తుర్కియే సరిహద్దులోని వాన్ ప్రావిన్స్, పరిసర ప్రాంతాలలో అఫ్గాన్ పౌరులు, ఇతర వలసదారులను చట్టవిరుద్ధంగా, బలవంతంగా వెనక్కి పంపడం, వారి శరణార్థి హక్కులను నిరాకరించడం వంటి అనేక కేసులపై తాను పనిచేశానని ఆయన చెప్పారు.
హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా 2021 అక్టోబర్, 2022 నవంబర్‌లలో తుర్కియే సైనికులు అఫ్గాన్ శరణార్థులను కొట్టడం, శరణు కోరే ప్రక్రియలను నిరాకరించడం, వారిని తిరిగి ఇరాన్ వైపునకు బలవంతంగా పంపడం వంటి ఆరోపణలను రిపోర్ట్ చేసింది.
అంతేకాకుండా, అఫ్గాన్ పురుషులు, మహిళలు, పిల్లలను చట్టవిరుద్ధంగా వెనక్కి పంపించివేస్తున్నట్లు 2022లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా రిపోర్ట్ చేసింది.
ఇరాన్, తుర్కియే అధికారులు అఫ్గాన్ పౌరులపై జరిపిన కాల్పులు, ఏకపక్ష నిర్బంధాలు, హింస, ఇతర దారుణ ప్రవర్తనలను కూడా వారి రిపోర్ట్ "దే డోంట్ ట్రీట్ అస్ లైక్ హ్యూమన్స్" డాక్యుమెంట్ చేసింది.
తుర్కియే ఏమంటోంది?
అయితే, తుర్కియే విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి బీబీసీ అఫ్గాన్ ఫోరెన్సిక్‌తో మాట్లాడుతూ, "ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు, అక్రమ వలసలను అరికట్టడంలో తుర్కియే సాధిస్తున్న విజయవంతమైన ప్రయత్నాలను మసకబార్చేలా చేస్తున్నాయి" అన్నారు.
"వలస మార్గాలలో భౌగోళిక వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉండటం, అత్యధిక సంఖ్యలో వలసదారులు, శరణార్థులకు ఆశ్రయం ఇస్తుండటం వల్ల.. భద్రత, స్వేచ్ఛను సమతూకం చేస్తూ, నాగరిక విలువలకు అనుగుణంగా ఉండే ఒక మానవతా దృక్పథంతో కూడిన, స్థిరమైన వలస నిర్వహణ వ్యవస్థను అమలు చేయడమే తుర్కియే లక్ష్యం" అన్నారు.
"ఈ లక్ష్యానికి అనుగుణంగా, అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కుల సూత్రాలు, ప్రజల భద్రతను సమతూకం చేసే అవగాహనతో తుర్కియే అక్రమ వలసలను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. ఇరాన్‌తో ఉన్న560 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును తుర్కియే నిఘా, నిరంతర పర్యవేక్షణ పరికరాల ద్వారా 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. సరిహద్దుల్లో జరిగే అన్ని సంఘటనలను రికార్డ్ చేస్తుంది" అని తుర్కియే విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అన్నారు.
"తుర్కియే తీసుకున్న సమర్థవంతమైన చర్యలు, అక్రమ వలసలపై సాధించిన విజయవంతమైన పోరాటం కారణంగా, యూరోపియన్ యూనియన్ వైపు సాగే అక్రమ వలసల ప్రవాహం దాదాపు నిలిచిపోయింది" అన్నారు.
ఈ విషయాలపై స్పందన కోసం ఇరాన్ అధికారులను కూడా సంప్రదించాం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)