ఇక ఫోన్ నెంబర్ అక్కరలేదు.. యూజర్ నేమ్ చాలు, ఏమిటీ వాట్సాప్ కొత్త ఫీచర్?

    • రచయిత, జొ క్లైన్‌మాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఫోన్ నెంబర్ వెల్లడించకుండా ప్రత్యేక యూజర్ నేమ్‌ల ద్వారా పరస్పరం చాట్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.

రాబోయే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన 300 కోట్ల యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.

ఈ వారం నుంచే వినియోగదారులు యాప్‌లో ముందుగానే తమకు కావాల్సిన యూజర్‌నేమ్‌ను నమోదు చేసుకోవచ్చు. కానీ ఇదేమీ తప్పనిసరి కాదు.

యూజర్లు ఎప్పుడైనా తమ యూజర్‌నేమ్‌ను డిలీట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చని వాట్సాప్ తెలిపింది.

ఈ ఫీచర్ పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత వాట్సాప్ వినియోగదారులు కేవలం యూజర్‌నేమ్‌లను పరస్పరం పంచుకోవడం ద్వారా ఒకరితో ఒకరు అనుసంధానం కావచ్చు. అలాగే అవాంఛిత సందేశాలు పంపేవారిని బ్లాక్ చేయడం, లేదా రిపోర్ట్ చేసే సదుపాయాలు యథావిధిగా కొనసాగుతాయి.

యూజర్‌నేమ్ గరిష్ఠంగా 35 అక్షరాలు ఉండవచ్చు. పేర్ల ఎంపికపై పెద్దగా పరిమితులు ఉండవు. కానీ కొంతమంది ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లను ఇతరులు ఉపయోగించడానికి అనుమతి ఉండదు.

ఉదాహరణకు డోనల్డ్ ట్రంప్ పేరుతో వాట్సాప్‌లో యూజర్‌నేమ్ నమోదు చేసుకునే అవకాశం చాలా తక్కువ.

మెటా ఆధ్వర్యంలోని వాట్సాప్ ఈ యూజర్‌నేమ్‌లను వినియోగదారుల గోప్యతను పెంచే ఫీచర్‌గా అభివర్ణించింది.

ముఖ్యంగా గ్రూప్ చాట్‌లలో ఇతరులతో టచ్‌లో ఉండేందుకు తమ ఫోన్ నంబర్లను పంచుకోవడం ఇష్టం లేదని చాలా మంది యూజర్లు తమకు తెలిపినట్లు వాట్సాప్ ప్రాడక్ట్ హెడ్ ఆలిస్ న్యూటన్-రెక్స్ చెప్పారు.

ఈ ఫీచర్ ద్వారా యాప్‌లో తమను తాము ఎలా పరిచయం చేసుకోవాలనేది వినియోగదారులే నిర్ణయించుకునే స్వేచ్ఛ లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

గోప్యతపై ఆందోళన

మరో మెసేజింగ్ యాప్ సిగ్నల్ కూడా 2024లో ఇదే తరహా ఫీచర్‌ను ప్రారంభించింది.

"ఇది చాలా చక్కని ఫీచర్. ఇది అదనపు ప్రైవసీని కల్పించినప్పటికీ, మొత్తంగా చూస్తే వాట్సాప్ ప్రైవసీ ఫ్రెండ్లీ యాప్ కాదని గుర్తుంచుకోవాలి" అని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న, 'ప్రైవసీ ఈజ్ పవర్' పుస్తక రచయిత కరిస్సా వెలిజ్ అన్నారు.

"మార్కెటింగ్ అవసరాల కోసం వినియోగదారులకు సంబంధించిన మెటాడేటాను ఇది పెద్ద మొత్తంలో సేకరిస్తుంది" అని ఆమె తెలిపారు.

"గోప్యత విషయంలో అత్యంత నిరాశజనకమైన చరిత్ర కలిగిన టెక్నాలజీ సంస్థల్లో మెటా ఒకటని మనం గుర్తుంచుకోవాలి. వాట్సాప్ అదే సంస్థకు చెందింది" అని ఆమె అన్నారు.

వాట్సాప్ వ్యక్తిగత చాట్‌లలోని మెసేజ్‌లను ప్రకటనల కోసం ఉపయోగించదు. అవి ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ కావడంతో మెటా ఆ మెసేజ్‌లను చదవలేదు.

అయితే వినియోగదారులు ఎవరికి మెసేజ్‌లు పంపుతున్నారు, ఎప్పుడు పంపుతున్నారు వంటి సమాచారాన్ని ప్రకటనల కోసం ఉపయోగిస్తుంది.

ఈ కొత్త ఫీచర్ పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత వాట్సాప్‌లో వ్యక్తిగత ఫోన్ నంబర్లు ఇతరులకు కనిపించవు. సాధారణ యూజర్‌నేమ్ డైరెక్టరీ ఉండదు. అయితే వాట్సాప్ ఖాతా సృష్టించుకోవడానికి ఫోన్ నంబర్ మాత్రం తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఈ సేవను వినియోగించడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు.

ఏడేళ్లుగా వాట్సాప్ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్న విల్ క్యాథ్‌కార్ట్ వైదొలగనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు కునాల్ షా వాట్సాప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు మెటా ఇటీవలే ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)