విజయ్-టీవీకే: డీఎంకే, అన్నా డీఎంకేలను దాటి మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం ఎలా సాధించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కె.శుభగుణం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
తమిళనాడు శాసనసభ ఎన్నికలలో డీఎంకే, అన్నాడీఎంకే వంటి రెండు ప్రధాన ద్రవిడ పార్టీలను వెనక్కినెట్టి, విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలను గెలుచుకుంది.
చివరకు డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పోటీ చేసిన కొళత్తూరు నియోజకవర్గంలో కూడా ఆయన్ను వెనక్కినెట్టి, టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం సాధించారు.
అంతేకాదు, స్టాలిన్ మంత్రివర్గంలోని అనేకమంది మంత్రులు ఓడిపోయారు.
ఈ ఎన్నికల సరళిని చూస్తే, తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తమిళనాడులో 76 ఏళ్ల చరిత్ర కలిగిన డీఎంకేను, 54 ఏళ్ల నాటి అన్నాడీఎంకేను వెనక్కినెట్టి, కేవలం మూడేళ్ల కంటే తక్కువప్రాయం ఉన్న ఒక పార్టీ అధికార పీఠాన్ని చేజిక్కించుకునే స్థాయికి చేరుకుంది.
తమిళనాడు రాజకీయ రంగస్థలంలో ఏం జరిగింది? విజయ్ ఎలా నెగ్గుకొచ్చారు? అనేది ఆసక్తికరం.


ఫొటో సోర్స్, TVK
అంచనాలను మించి ఆశ్చర్యరిచిన టీవీకే
తమిళనాడు ప్రజలు మార్పు కోసమే ఓటు వేశారని తాజా ఎన్నికల ఫలితాలను బట్టి స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ రాము మణివణ్ణన్ అభిప్రాయపడ్డారు.
''ఈ ఎన్నికలలో ప్రజలు సిద్ధాంతపరంగానో లేదా సమస్య ప్రాతిపదికనో ఓటు వేశారని చెప్పలేం. ద్రవిడ ఆధిపత్యంలో ఉన్న తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పు రావాలనే ప్రాథమిక ఉద్దేశంతోనే వారు ఓటు వేసినట్లు కనిపిస్తోంది'' అని రాము మణివణ్ణన్ చెప్పారు.
''ముఖ్యంగా, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో అంతర్గతంగా ఉందనే విషయాన్ని ఈ ఫలితాలు చాటిచెబుతున్నాయి. దీన్ని కేవలం ద్రవిడ రాజకీయాలకు వ్యతిరేకమైన మనస్తత్వంగా మాత్రమే చెప్పలేం. ఎందుకంటే, అన్నాడీఎంకే కూడా గణనీయమైన నియోజకవర్గాల్లో గెలిచింది. దీన్నిబట్టి, డీఎంకే ప్రభుత్వంపై తమకున్న వ్యతిరేకతను ప్రజలు ఈ ఎన్నికల్లో వెల్లడించారని తెలుస్తోంది'' అని ఆయన వివరించారు.
తమిళనాడు శాసనసభ ఎన్నికల చరిత్రలో ఇటీవల కాలంలో ఎన్నడూ ఊహించని ఫలితాలు ఈసారి వెలువడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈసారి ఎన్నికల తీర్పులో విజయ్, ఆయన పార్టీ టీవీకే కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేసినప్పటికీ, ఇంత పెద్దస్థాయిలో ప్రభావం చూపించడం ఆశ్చర్యం కలిగిస్తోందని ప్రొఫెసర్ రాము మణివణ్ణన్ అన్నారు.
యువత, మహిళల మద్దతు గణనీయంగా టీవీకే పార్టీకే ఉంటుందని, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఓట్లలో కొంత భాగం విజయ్ వైపు మళ్లుతుందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అంచనా వేశారు.
అయితే, టీవీకేకు ఇంతటి భారీ విజయాన్ని అందించే స్థాయిలో మద్దతు లభిస్తుందని ఎవరూ ఊహించలేదని జర్నలిస్ట్ దివ్య అన్నారు.
''డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు లభించిన ఓట్లను గమనిస్తే... స్టాలిన్, పళనిస్వామిలను సమర్థించేవారి ఓట్లు, దీర్ఘకాలంగా రెండు ద్రవిడ పార్టీలకు మద్దతునిస్తున్న సంప్రదాయ ఓటు బ్యాంకు, అలాగే పాలనా యంత్రాంగంలో ఒక స్థిరమైన కొనసాగింపు ఉండాలని కోరుకునేవారి ఓట్లు... ఇలా పలు వర్గాల నుంచి లభించిన ఓట్లు ఉన్నాయి'' అని ఆమె చెప్పారు.
''టీవీకే విషయానికొస్తే, ప్రధానంగా విజయ్ వ్యక్తిత్వానికే ఇంత పెద్దఎత్తున మద్దతు లభించింది. డీఎంకే ప్రభుత్వంపై ప్రజల్లో నిగూఢమై ఉన్న వ్యతిరేకతను విజయ్ అందిపుచ్చుకున్నప్పటికీ, అంతకుమించి ఎలాంటి రాజకీయ నేపథ్యంలేని ఆయన ఒక సరికొత్త పార్టీతో సాధించిన ఈ విజయం... పూర్తిగా స్టార్ ఇమేజ్ కలిగిన వ్యక్తిత్వానికి దక్కిన విజయంగానే చూడాల్సి ఉంటుంది'' అని దివ్య అభిప్రాయపడ్డారు.
డీఎంకే సుమారు 60 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలను అభ్యర్థులుగా నిలబెట్టింది. సెంథిల్ బాలాజీ తరహాలోనే 24 చోట్ల రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాలను మార్చుకుని పోటీచేశారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను డీఎంకే ముందే గ్రహించిందన్న విషయాన్ని ఇది సూచిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
విజయ్ కూడా తన ఆఖరి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ, ''మిమ్మల్ని (ఓటర్లను) చేతులెత్తి మొక్కుతున్నాను. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లండి. స్టాలిన్ నుంచి తమిళనాడును, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అని కోరారు.
ఆయన విజ్ఞప్తి ప్రభావం ఓటింగ్ శాతంలో ప్రతిబింబించిందని సీనియర్ జర్నలిస్ట్ మాలన్ అభిప్రాయపడ్డారు.
ప్రజలు 1967, 1977, 1991 ఎన్నికలలో ఏవిధంగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారో, ఈసారి కూడా అదే తరహాలో కొత్త నాయకత్వాన్ని ఆశిస్తూ ఎంతో ఉత్సాహంగా ఓటు వేయడం కనిపించిందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, TVK
'యువత, మహిళలను ఆకట్టుకున్న విజయ్'
టీవీకే విషయానికొస్తే, విజయ్ ప్రచారం చాలా తక్కువ ప్రాంతాలకే పరిమితమైంది. అందులోనూ, కారైకుడి వంటి ప్రాంతాల్లో కూడా ఆయన కొద్దిసేపు ప్రజలకు ముందుకొచ్చినా ఏమీ ప్రసంగించకుండానే వెనుదిరిగారు.
అయినప్పటికీ విజయ్‌కు ఇంత పెద్దఎత్తున మద్దతు లభించిందంటే, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయాన్ని ఇది తేటతెల్లం చేస్తోందని మాలన్ పేర్కొన్నారు.
ముఖ్యంగా, తన సిద్ధాంతపరమైన శత్రువు బీజేపీ అని, రాజకీయ శత్రువు డీఎంకే అనే విషయాన్ని విజయ్ తన ప్రచారం ప్రారంభం నుంచీ స్పష్టంగా చెబుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో పోటీ కేవలం డీఎంకే, టీవీకే మధ్యే ఉండబోతోందనీ నొక్కి చెప్పారు.
క్షేత్రస్థాయిలో కార్యాచరణ కంటే, యువతను ఎక్కువగా ఆకర్షించే సోషల్ మీడియాలో ప్రచారంపైనే టీవీకే పూర్తి స్థాయిలో చురుగ్గా వ్యవహరించిందని, తద్వారా యువత మద్దతును భారీగా పొందిందని మాలన్ విశ్లేషించారు.
ఆయన అభిప్రాయంతో రాము మణివణ్ణన్ కూడా ఏకీభవించారు.
''విజయ్ ప్రత్యక్ష ప్రచారం ద్వారా ఎక్కువ ప్రభావాన్ని చూపారని చెప్పడంకంటే, సోషల్ మీడియా ద్వారా యువత, మహిళల్లో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పడమే కరెక్ట్ '' అని ఆయన అభిప్రాయపడ్డారు.
''పలు పథకాల ద్వారా మహిళల మద్దతును పొందేందుకు డీఎంకే ప్రయత్నించింది. అయితే, విజయ్ వాటన్నింటినీ అధిగమించి మహిళల మద్దతును తనవైపు తిప్పుకున్నారు. మొదటిసారి ఓటుహక్కు పొందిన యువత, మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేయగల వర్గాలుగా భావించారు. ఆ ఓట్లను విజయ్ పూర్తిగా తనవైపు ఆకర్షించారని తాజా ఫలితాలు చాటిచెబుతున్నాయి'' అని రాము మణివణ్ణన్ అన్నారు.
ఈ ఎన్నికల్లో విజయ్ రంగప్రవేశం, ఇప్పటివరకూ డీఎంకేకు అండగా ఉంటూ వచ్చిన మహిళలు, యువత, మైనారిటీ ఓట్లను చీల్చిందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
చెన్నైలోని నందనంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విజయ్ మాట్లాడుతూ, మతాతీత సామాజిక న్యాయమే తన సిద్ధాంతమని, హిందూ, ముస్లిం, క్రైస్తవులందరికీ ప్రతినిధిగా తాను ఎప్పుడూ ఉంటానని చెప్పారు.
ఆ విధంగా, డీఎంకేకు బలంగా ఉన్న మైనారిటీ ఓట్లను చీల్చి, టీవీకే వైపు మళ్లించారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఫొటో సోర్స్, TVK
డీఎంకే కూటమిలో లుకలుకలు
కూటమిలో ఉన్న వీసీకే, వామపక్షాలు, కాంగ్రెస్‌లకు, డీఎంకేకు మధ్య ఒక సుహృద్భావ వాతావరణం లేదనే విషయం స్పష్టంగా కనిపించిందని ప్రొఫెసర్ రాము మణివణ్ణన్ చెప్పారు.
''కూటమిలో నెలకొన్న చిక్కులు, సమస్యలు, ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీలు నిర్మాణాత్మకంగా పాల్గొనకుండా అడ్డంకి అయ్యాయి. దాని ఫలితాలను ఇప్పుడు డీఎంకే చూస్తోంది'' అని ఆయన పేర్కొన్నారు.
ఇదే పరిస్థితి అన్నాఏడీఎంకే కూటమిలో కూడా ఉందని చెప్పారు.
ఈ రెండు ద్రవిడ పార్టీలు తమ కూటములను సరిగ్గా మేనేజ్ చేయడంలో విఫలంకావడం నుంచి టీవీకే ప్రయోజనాన్ని పొందిందని మణివణ్ణన్ విశ్లేషించారు.
''డీఎంకేలో మంత్రులు, ఎమ్మెల్యేలకు, ప్రజలకు మధ్య దూరం బాగా పెరగడాన్ని గమనించవచ్చు. ఇది కూడా ఫలితాల్లో ప్రతిబింబించింది'' అని మాలన్ అన్నారు.
''తిరిగి అధికారంలోకి వస్తామనే గట్టి నమ్మకంతో డీఎంకే ఉంది. ఆ కారణంతోనే కూటమి పార్టీల విషయంలో అతిగా ఆధిపత్యం చెలాయించింది. దీని నుంచి పుట్టిన అసంతృప్తి క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల పనితీరును దెబ్బతీసింది'' అని కూడా ఆయన చెప్పారు.
''2024 పార్లమెంటు ఎన్నికల నుంచే డీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని మనం గమనించవచ్చు. అయితే, డీఎంకే అంతర్గత నిర్మాణం చాలా బలంగా ఉంటుంది. అటువంటి బలమైన పార్టీలో కూడా, ముఖ్యంగా స్థానిక నాయకత్వాలపై అసంతృప్తి నెలకొంది. దానిని చక్కదిద్దడంపై దృష్టి పెట్టడంలో పార్టీ విఫలమైంది'' అని దివ్య అన్నారు.
ఇప్పుడీ సమయంలో, డీఎంకే కూటమిలోని పార్టీల తదుపరి పరిస్థితి ఏమిటో కూడా చూడాల్సి ఉంది.
విజయ్ తన ప్రచార సమయంలో, తనతో కూటమి కట్టే పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం ఇస్తానని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో, ''ఎన్నికల ఫలితాలనుబట్టి డీఎంకే కూటమిలో ఉన్న పార్టీలు టీవీకే వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి" అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సీనియర్ జర్నలిస్ట్ శిఖామణి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
''కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో కూటమిలో ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో వాటి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇతర పార్టీలు కూడా టీవీకేకు మద్దతు ఇచ్చే నిర్ణయం తీసుకోవచ్చు. ఆ దిశగా టీవీకే ప్రయత్నించే అవకాశం ఉంది'' అని ఆయన అన్నారు.
అన్నాడీఎంకే కూటమిలో ఉన్న పీఎంకే కూడా టీవీకే వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఇవేవీ ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం'' అని శిఖామణి అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో, ఈ ఎన్నికల ఫలితాలు అనేక సందేశాలను ఇస్తున్నాయని, ద్రావిడ పార్టీలకు ఇది ఒక హెచ్చరిక లాంటిదని నిపుణులు అంటున్నారు. వీటిని లోతుగా విశ్లేషించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































