విశాఖ: సముద్రంలో 4 మీటర్ల ఎత్తున అలలు, 50 కి.మీ. వేగంతో గాలుల మధ్య ఆరుగురు మత్స్యకారులను రక్షించే ప్రయత్నాలు

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83
ఫొటో క్యాప్షన్, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

‘ఇంకో గంటలో ఇంటికి వస్తున్నాం’ అని తమవారికి ఫోన్ చేసిన కొద్ది గంటల్లోనే ఆ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి.

విశాఖపట్నం తీరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో బోటు బోల్తాపడటంతో అందులోని ఏడుగురు మత్స్యకారుల్లో ఆరుగురి ఆచూకీ తెలియడం లేదు. ఏడుగురిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.

గల్లంతైన ఆరుగురి కోసం భారత తీర రక్షక దళం, నౌకాదళం, మెరైన్ పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

వేటకు వెళ్లి గల్లంతైన తమ వారి రాక కోసం తీరం ఒడ్డున మత్స్యకార కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

సముద్రంలో ఏమి జరిగింది? వారికి ఏమైంది?

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన ఏడుగురిలో బోటు యజమాని కర్రి చిన్న మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ఆరుగురు గల్లంతయ్యారు. అసలేం జరిగిందో కర్రి చిన్న మాటల్లో...

జులై 1 తెల్లవారుజామున సుమారు 3 గంటలకు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బోటు (IND-AP-MM-V5-83) లో మొత్తం మేం ఏడురుగు మత్స్యకారులం వేటకు బయలుదేరాం.

ఎప్పుడూ వెళ్లే జట్టే మాది. వేట బాగా సాగింది. ఇంతలో వాతావరణం బాగాలేదని వార్తలు వస్తున్నాయి. సముద్రంలో పరిస్థితి కూడా కల్లోలంగానే ఉంది. దాంతో హార్బర్ కు వచ్చేయాలని నిర్ణయించుకున్నాం.

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, 1) చిన్నఅమ్మోరు 2) కర్రి చిన్న 3) కె.గరగయ్య 4) అమర అప్పలరాజు 5) రాగుతు బండియ్య 6) కె.సీతోడు 7) కె.చిన్నయ్య

జులై 4న తిరుగు ప్రయాణం అయ్యాం. మధ్యాహ్నం 2 గంటల సమయంలోమా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాం. తుపాను ఉందని చెప్పాం. మరో గంటలో అంటే మధ్యాహ్నం 3 గంటల కల్లా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌కు చేరుకుంటామని చెప్పాం.

దాదాపుగా ఇక వచ్చేశామని అనుకున్నాం. అంటే విశాఖ ఫిష్పింగ్ హార్బర్ సుమారు 20 కిలోమీటర్లు దూరంగా ఉందనగా ఎత్తైన అలలు బోటును బలంగా ఢీకొట్టడం మొదలైంది. వాటి తాకిడికి బోటు తిరగబడింది. మేం ఏడుగురు మత్స్యకారులు తిరగబడిన ఆ బోటును పట్టుకున్నాం. ఇంతలో మేం పట్టుకున్న బోటు కూడా మునిగిపోవడం మొదలైంది. అప్పుడు బోటు నుంచి చెల్లాచెదురైన తాళ్లు, చెక్కముక్కులు, అట్టలు వంటివి పట్టుకుని ఈదడం మొదలు పెట్టాం.

అప్పుడు రాత్రి 11 గంటలై ఉంటుంది. అందరికి ఓపిక పోయింది. అదే సమయంలో మాలో ఒకరు "చచ్చిపోతాను రా.." అన్నాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియ లేదు. ఆ సమయంలో దూరంగా ఒక నౌక కనిపించగా అక్కడికి వెళ్దామనుకున్నాం. దాన్ని అందుకునేందుకు నలుగురం వెళ్లాం. బలమైన అలల తాకిడికి నౌకను చేరుకోవడం కష్టంగా మారింది. మిగిలిన ముగ్గురు ఆ నౌకను చేరలేకపోయారు. నేను నౌక దగ్గరకు చేరుకుని దాని యాంకర్‌ను గట్టిగా పట్టుకుని...అన్నా...అన్నా...అని అరవడం మొదలు పెట్టాను. అది చూసిన నౌకలోని సిబ్బంది నాకు ఒక లైఫ్ జాకెట్ విసిరారు.

మిగిలిన ముగ్గురు నౌక దగ్గరకు రాలేకపోయారు. వారేమయ్యారు తెలియడం లేదని కర్రి చిన్న చెప్పారు.

కర్రి చిన్న ప్రస్తుతం మర్చంట్ నేవీ నౌకలోనే ఉన్నారని, ఆయనను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83

ఫొటో సోర్స్, UGC

కర్రి చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా కోస్ట్ గార్డు సిబ్బంది రంగంలోకి దిగారు.

చివరిసారిగా వచ్చిన సిగ్నల్స్, బోటు ప్రయాణించిన దిశ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. కోస్టుగార్డు నౌక, హెలికాప్టర్‌తో ఆ ప్రాంతానికి అన్నివైపులా గాలించారు.

నిన్న (ఆదివారం) చీకటి పడే వరకు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ గల్లంతైన మత్స్యకారులు అచూకీ లభించలేదు. దీంతో ఇవాళ (సోమవారం) కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

గల్లంతైన వారిలో భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన కర్రి చిన్నను మర్చెంట్ నేవీ సిబ్బంది కాపాడారు. ఇంకా సీతోడు, చిన్నయ్య, అప్పలరాజు, గరగయ్య, చిన్న అమ్మోరు ఆచూకీ తెలియడం లేదు. వీరితో పాటు విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం నాగమయ్యపాలెంకు చెందిన బండియ్య గల్లంతయ్యారు.

వీరంతా చేపల వేట కోసం తమ స్వగ్రామాల నుంచి వచ్చి విశాఖపట్నంలో జాలారిపేటలో నివాసం ఉంటున్నారు.

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83
ఫొటో క్యాప్షన్, నూకమ్మ

ఫోన్లు స్విచ్ ఆఫ్...

మధ్యాహ్నం 3 గంటల కల్లా వచ్చేస్తామని చెప్పిన తమ కుటుంబ సభ్యులు ఇంకా రాకపోవడంతో...మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. వారి ఫోన్లకు ప్రయత్నిస్తే...వారి ఫోన్లు స్విచ్ ఆఫ్‌ వచ్చాయి. దీంతో తమకు ఆందోళన మొదలైందని భీమిలికి చెందిన బండియ్య సోదరి కోదండ కన్నీళ్లు పెట్టుకున్నారు.

విశాఖ ఫిష్పింగ్ హార్బర్ వద్ద ఉన్న మత్స్యశాఖ కార్యాలయానికి చేరుకుని తమ వారి ఆచూకీ కోసం పడిగాపులు కాస్తున్నారు. అధికారుల్ని ఏమైనా తెలిసిందా అని అడుగుతూ కనిపించారు.

"ఈ నెల 4న మధ్యాహ్నం 2 గంటలకు తీరానికి చేరుకుంటామని ఫోన్‌ చేశారు. కానీ రాలేదు. వచ్చేస్తామని ఫోన్ చేసి రెండు రోజులైపోతోంది. ఏం చేయాలో అర్థంకావడం లేదు" అని మరో మత్స్యకార మహిళ నూకమ్మ బీబీసీతో చెప్పారు.

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83
ఫొటో క్యాప్షన్, గల్లంతైన మత్స్యకారుల కుటుంబీకులు

'మా వారి జాడ తెలిసిందా...'

హార్బర్ వద్ద బాధిత కుటుంబాలు వచ్చి అందోళన చేస్తున్నాయి. తమ వారి ఆచూకీ కనిపెట్టాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు.

'మా వారి జాడ తెలిసిందా' అంటూ బాధిత కుటుంబ సభ్యులు హార్బర్ లో కనిపించిన ప్రతి ఒక్కర్నీ అడుగుతూ కన్నీరు పెట్టుకోవడం కనిపించింది.

బీబీసీతో మాట్లాడిన నూకమ్మ మనవడు అప్పలరాజు వేట వెళ్లి గల్లంతైన వారిలో ఒకరు. అతనికి ఇటీవలే వివాహమైంది.

'ఏదో పని దొరకుతుందని భోగాపురం నుంచి వైజాగ్ వచ్చాం. నా మనవడు అప్పలరాజు ఏమయ్యాడో తెలియడం లేదు. మిగతా వారు కూడా మా బంధువులే. వీరు తిరిగి రాకపోతే మా కటుంబాలను ఆదుకునేదెవరు?' అని నూకమ్మ అందరి వైపు చూస్తున్నారు. ఎవరైనా ఏదైనా సమాచారం చెప్పకపోతారా అని.

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83
ఫొటో క్యాప్షన్, జానకిరామ్

‘మత్స్యకారులని కాపాడాలి’

తుపాను ప్రభావంతో సముద్రంలో ఎత్తైన అలలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఆరుగురు మత్స్యకారులు గల్లంతవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ బీబీసీతో చెప్పారు.

"తెలిసిన వెంటనే గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పాం. అలాగే జిల్లా కలెక్టర్, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి మత్స్యకారులను సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. మత్స్యకారులను కాపాడేందుకు ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపడం లేదు, గాలింపు చర్యలు వేగవంతం చేయాలి." అని జానకిరామ్ డిమాండ్ చేశారు.

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ఐజీ గోపినాధ్ జెట్టి

గల్లంతైన మత్స్యకారుల కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ, ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారని విశాఖ రేంజ్ ఐజీ గోపినాధ్ జెట్టి వెల్లడించారు.

గత 4వ తేదీ అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో బోట్ మిస్ అయినట్లు సమాచారం అందిందని ఆయన తెలిపారు. నిన్న (5వ తేదీ) ఉదయం నుంచే ఇండియన్ నేవీకి చెందిన రెండు షిప్పులు, కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు షిప్పులు రంగంలోకి దిగి బోట్ మిస్సయిన ప్రాంతంలో గాలింపు చర్యలు ప్రారంభించామన్నారు. వీటితో పాటు కోస్ట్ గార్డ్‌కు చెందిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్, నేవీ హెలికాప్టర్ కూడా నిన్నటి నుండి నిరంతరాయంగా ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయని ఐజీ వివరించారు.

ప్రమాదానికి గురైన బోటులో నుంచి సురక్షితంగా బయటపడి ప్రస్తుతం మర్చంట్ నేవీకి చెందిన నౌకలో ఉన్న కర్రి చిన్నను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

విశాఖ తీరం, మత్స్యకారుల గల్లంతు, బోటు బోల్తా, ఫింషింగ్ హార్బర్,బోటు IND-AP-MM-V5-83

ఫొటో సోర్స్, Getty Images

సముద్రంలో కల్లోల వాతావరణం...

సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటం, దాదాపు 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతుండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్‌కు కొంత ఆటంకం కలుగుతోందని ఐజీ పేర్కొన్నారు.

కోస్ట్ గార్డ్ లేదా నేవీ షిప్పులు ఆ మర్చంట్ వెసల్ దగ్గరకు వెళ్తే ఒకదానికొకటి ఢీకొనే ప్రమాదం ఉందని, పైగా గాలి వేగం కూడా గంటకు 50 కిలోమీటర్ల మేర ఉండటంతో హెలికాప్టర్ ద్వారా కూడా రక్షించడం ప్రస్తుతానికి రిస్క్‌తో కూడుకున్న పని అని వివరించారు.

వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోనే బోటు గల్లంతైనట్లు బోటులోంచి సురక్షితంగా బయటపడిన మర్చెంట్ నేవీ నౌకలు ఉన్న మత్స్యకారుడు కర్రి చిన్న చెప్పారు. సముద్రంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని చిన్న చెప్పారు. అదే విషయాన్ని సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి కూడా చెప్పారు.

వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాల్లోని ఏర్పడిన వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి ఉత్తర ఒడిశా బాలాసోర్ సమీపంలో తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందన్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఉంటాయని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)