విజయవాడ: సాయికృష్ణ ‘అదృశ్యం’ వివాదం ఏంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, BBC/Kanakadurga
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
''నా బిడ్డను అరెస్టు చేస్తే ఎక్కడున్నాడో ఆచూకీ చెప్పండి.. నేను ఒక్కసారి చూసి వస్తా..లేదా మీరు కొట్టి చంపేస్తే శవాన్నైనా ఇవ్వండి.. చివరి చూపు చూసుకుంటా. లేదూ.. చంపేసి కాల్చేశారా.. కనీసం బూడిదైనా ఇవ్వండి.. కర్మకాండలు చేసుకుంటా...'' అంటూ విజయవాడ కృష్ణలంకకు చెందిన విజయలక్ష్మి విలపిస్తూ వేడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
పలు కేసుల్లో నిందితుడైన సాయికృష్ణ అనే యువకుడి తల్లే విజయలక్ష్మి.
ఒక్కసారైనా తన కొడుకును చూపించాలని మే 9 నుంచి కృష్ణలంక పోలీసుల కాళ్లావేళ్లా పడుతున్నాననీ, నీ కొడుకును చంపేస్తాం అని హెచ్చరించిన సీఐ నాగరాజు చివరకు అన్నంత పనీ చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు.
పోలీసులు తన కుమారుడిని చిత్రహింసలు పెట్టి చంపేసి శవం కూడా కనపడనివ్వకుండా కాల్చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. సాయికృష్ణ ఆచూకీ చెప్పాలంటూ విజయలక్ష్మితో పాటు ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న పోరాటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో అసలేం జరిగింది.. సాయికృష్ణ అదృశ్యం ముందు..ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలేంటి అన్న అంశాలపై బీబీసీ రిపోర్ట్.


ఫొటో సోర్స్, Kanakadurga
ఎవరీ సాయికృష్ణ
విజయవాడ నగరం కృష్ణలంక ప్రాంతంలోని నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన గాదె సాయికృష్ణ అలియాస్ పిళ్లా సాయి 9వ తరగతితోనే చదువు మానేశారు. తండ్రి చనిపోవడంతో తల్లి విజయలక్ష్మి, సాయికృష్ణ ఇద్దరే స్థానికంగా నివసించేవారు.
స్థానిక కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌తో పాటు నగరంలోని మాచవరం, పటమట స్టేషన్లలో సాయికృష్ణపై గంజాయి, పోక్సో సహా వివిధ అభియోగాలపై కేసులు నమోదయ్యాయి.
కొన్ని కేసులు కొట్టేయగా, మరికొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి.

గతేడాది డిసెంబర్‌లో హత్య కేసులో అరెస్టు
కాగా, 2025 డిసెంబర్ 5న చిల్లకల్లు పోలీస్‌స్టేషన్ పరిధిలో అలవాల నవీన్‌రెడ్డి అనే యువకుడి హత్య కేసులో ఎ–1 నిందితుడిగా సాయికృష్ణపై హత్య కేసు నమోదు చేసినట్టు ఆ కేసు విచారణ అధికారి జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు బీబీసీకి తెలిపారు.
ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపగా, ఈ ఏడాది మార్చి 12 వరకు జైలులోనే ఉన్నారని సీఐ వెల్లడించారు.
మార్చి నుంచి మే మొదటి వారం వరకు మార్కాపురంలోనే...
హత్య కేసులో బెయిల్ నుంచి బయటకు వచ్చాక గొడవలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న సాయికృష్ణ... విజయవాడ నగరానికి కూడా దూరంగా మార్కాపురంలో ఉన్నాడని ఆయన తల్లి విజయలక్ష్మి, మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు బీబీసీకి తెలిపారు.
అక్కడ చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ రోజూ తనతో ఫోన్‌లో మాట్లాడేవాడని ఆయన తల్లి విజయలక్ష్మి తెలిపారు.
మే9 నుంచి అదృశ్యం
ఈ క్రమంలో మే 9వ తేదీ నుంచే తన కుమారుడు అదృశ్యం అయ్యాడని విజయలక్ష్మి విలపిస్తూ బీబీసీకి వివరించారు.
‘‘మే 9వ తేదీన కృష్ణలంక పోలీసులు నా దగ్గరికి వచ్చి సీఐ నాగరాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడని చెప్పారు. ముందుగా నా ఫోన్ తీసేసుకున్నారు. నేను పరుగు పరుగున పోలీస్‌స్టేషన్‌కి వెళ్లాను. నన్ను చూడగానే సీఐ దుర్బాషలాడారు. నీ కొడుకు ఎక్కడున్నాడని అడిగారు. దూరంగా ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడని చెప్పాను. ఆ తర్వాత పంపించి వేశారు. ఆ రోజు నుంచి నా కుమారుడు నాకు ఫోన్ చేయలేదు. టచ్‌లోకి రాలేదు. నా ఫోన్ కోసం స్టేషన్‌కి వెళ్తే మూడు నాలుగు రోజులు తిప్పించుకుని ఫోన్ తిరిగిచ్చారు. కానీ ఆ ఫోన్‌లో నా కొడుకుతో మాట్లాడిన కాల్ వివరాలు, ఫోటోలు అన్నీ డిలీట్ చేశారు’’ అని బీబీసీతో చెప్పారు విజయలక్ష్మి.

''చంపేస్తాం అని సీఐ చెప్పారు''
‘‘నీ కొడుకును చంపేస్తా’’ అని సీఐ నాగరాజు తనను ముందుగానే హెచ్చరించారని విజయలక్ష్మి బీబీసీతో అన్నారు.
‘‘నేను ఏదో అనుమానం వచ్చి నా కుమారుడిని ఏమైనా మీరు తీసుకొచ్చారా.. తీసుకొస్తే చూపించండి.. అని ప్రాథేయపడ్డా.. నేను కింద బిల్డింగ్‌లో స్టేషన్ అంతా చూశాను కనిపించలేదు. సీఐ వద్దకు వెళ్లి ఒక్కసారి నా బిడ్డను చూపించండి.. అని ప్రాధేయపడ్డా.. అందుకు ఆయన ‘‘నీకొడుకుని చంపేస్తాం.. దండ రెడీ చేసుకో.. ’’ అని మాట్లాడారు. మొదట్లో ఏదో బెదిరించడానికి అలా అంటున్నారని అనుకున్నా, తర్వాత్తర్వాత నిజంగానే చంపేశారని అర్ధమైంది’’ అని విజయలక్ష్మి విలపించారు
‘‘చంపేసి కాల్చేశారు.. ’’
''మా మేనల్లుడు సాయికృష్ణ ను ఏదైనా కేసులో ఇరికించాలని చూశారో ఏమో... పూర్తిగా ఎందుకు చేశారో తెలియదు కానీ చంపేసిన మాట నిజం.. చాలా దారుణంగా హింసించి చంపేసి, శవాన్ని బాత్‌రూమ్‌లో పడేశారు. ఆ తర్వాత ఓ అర్ధరాత్రి టూవీలర్‌పై ఇద్దరు కానిస్టేబుళ్లు శవాన్ని మధ్యలో పెట్టుకునివెళ్లి కృష్ణలంక స్మశాన వాటికలో దహనం చేశారు. అందుకు ఆధారాలున్నాయి కాబట్టే మేం మాట్లాడుతున్నాం. న్యాయస్థానానికి ఆ ఆధారాలు అప్పగిస్తాం’’ సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు బీబీసీతో అన్నారు.
స్పందించని సీఐ, ఏసీపీ
సాయికృష్ణ కుటుంబ సభ్యుల ఆరోపణౖలపె కృష్ణలంక సీఐ నాగరాజుతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. ఫోన్ చేయగా ఈ విషయంపై ఇప్పుడు తాను ఏమీ మాట్లాడలేనని ఆయన అన్నారు.
విజయవాడ సౌత్ ఏసీపీ డాక్టర్ మానస దగ్గర బీబీసీ ఈ విషయం ప్రస్తావించగా, ఆమె స్పందించేందుకు నిరాకరించారు.

హైకోర్టుకు వెళ్లిన సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి
సాయికృష్ణ ఆచూకీ తెలపాలంటూ ఆయన తల్లి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా, జూన్ 29 లోపు సాయికృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం.
కాగా, సాయికృష్ణపై పోలీసులు లేనిపోని దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆయన తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు ఆరోపించారు. సాయికృష్ణను తీవ్రవాది, ఉగ్రవాదిగా చూపిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రెండు మూడు కేసులున్నమాట నిజమే. చిన్నపిల్లాడు.. తెలిసీ తెలియని వయస్సులో తప్పులు చేసుండొచ్చు. మనిషిలో మార్పు వచ్చి విజయవాడకి దూరంగా చిన్న ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నాడు. సోషల్ మీడియాలో అతనేదో డాన్ అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. అదే నిజమైతే మేం ఇంత సామాన్యంగా ఎందుకు బతుకుతాం? అయినా కేసులుంటే పోలీసులు చంపేయొచ్చా. అలాగైతే కేసులు లేనిదెవరికి, పోలీసులకు ఎవరిచ్చారు ఆ అధికారం’’ అని సాయికృష్ణ తల్లి, మేనమామ ప్రశ్నించారు.

సీఎం సమీక్ష, సీఐ సస్పెన్షన్
సాయికృష్ణ వ్యవహారంపై అటు సోషల్ మీడియాలో విమర్శలు రావడం, ఇటు విపక్షాలు కూడా స్పందించడంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారంగా మారింది.
రెండు రోజుల సింగపూర్ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పరిణామాలపై బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.
సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. మొత్తంగా ఈ వ్యవహారంపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని సీఎం స్పష్టం చేశారు.
సీఎం సమావేశం నేపథ్యంలో విజయవాడ తూర్పు శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్, గురువారం ఉదయం సాయికృష్ణ తల్లిని పరామర్శించి, ఈ విషయంలో ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందన్న ఆరోపణపై ‘‘జరిగిన ఘటన తెలిసేందుకు కొంత సమయం పట్టింది. కానీ వారికి తప్పకుండా న్యాయం చేస్తాం’’ అని బీబీసీతో అన్నారు గద్దె రామ్మోహన్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.




























