'హార్ముజ్ సమీపప్రాంతాల్లో చిక్కుకున్న 18,000 మంది భారతీయ నావికులు'... వీళ్లను సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పవన్ కాంత్ దిగవల్లి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
హార్ముజ్ జలసంధిలో చమురు నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ సెయిలర్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన 44 ఏళ్ల పట్నాల సురేశ్ కూడా ఉన్నారు.
జూన్ 9న అమెరికా దాడి చేసిన ఎంటీ సెట్టెబెలో నౌకలో పట్నాల సురేశ్ చీఫ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.
ప్రాణాలు కోల్పోయిన మిగిలిన ఇద్దరిలో ఒకరు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాగా మరొకరు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి .
మృతదేహాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు కనీసం నాలుగైదు రోజుల సమయం పట్టొచ్చని, ఇండియా నుంచి ఒక బృందం ఒమన్ వెళ్లి, చనిపోయిన వారిని అధికారికంగా గుర్తించి సర్టిఫై చేయాల్సి ఉంటుందని, దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ స్పెషల్ ఆఫీసర్, ఐఏఎస్ అధికారి అర్జా శ్రీకాంత్ బీబీసీ తెలుగుకు చెప్పారు.

''అక్కడున్న వారిని ఇండియా తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో పరిస్థితులపై కేంద్ర విదేశాంగ శాఖ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు వీలైనంత వేగంగా సమాచారం అందిస్తోంది. ఒమన్‌లోని భారత రాయబారి గొడవర్తి వెంకట శ్రీనివాస్ కూడా తెలుగు వారే కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనతోనూ సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు చేస్తోంది'' అని అర్జా శ్రీకాంత్ చెప్పారు.
గడిచిన వారం రోజుల్లో హార్ముజ్ జలసంధి కేంద్రంగా అమెరికా దాడులు చేసిన మూడు నౌకల్లోనూ ఇండియాకు చెందిన నావికులు ఉన్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు గురువారం దిల్లీలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
సురక్షితంగా బయటపడింది ఎంతమంది?
అమెరికా చేసిన మూడు దాడుల్లో మొత్తం ఎంతమంది భారతీయులున్నారు?
మొదట జూన్ 8న మారివిక్స్ నౌకపై దాడి జరిగింది. ఇందులో ఉన్న 24 మంది భారతీయ నావికులను ఒమన్ అధికారులు సురక్షితంగా రెస్క్యూ చేశారు. వీళ్లు శుక్రవారానికి ఇండియా చేరుకుంటారని కేంద్ర విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది.
ఇక జూన్ 9న రెండవ దాడి జరిగిన ఎంటీ సిట్టెబెలో నౌకలో మొత్తం 28 మంది నావికులుండగా వీరిలో 24 మంది భారతీయులున్నారు. మిగిలిన నలుగురిలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన వారు కాగా, ఒకరు రష్యా పౌరుడు, మరొకరు యుక్రెయిన్‌కు చెందిన వ్యక్తి ఉన్నారని గురువారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకటనలో ఉన్న సమాచారం.
ఎంటీ సిట్టెబెలోలో ఉన్న 24 మంది భారతీయుల్లో 21 మందిని, అమెరికన్ దాడి తర్వాత ఒమన్ అధికారులు రెస్క్యూ చేశారని, ఆరోజు ఆచూకీ లభించని మిగిలిన ముగ్గురూ తర్వాత ప్రాణాలు కోల్పోయిన విషయం జూన్ 10న స్పష్టమైందని కేంద్ర విదేశాంగ అధికారులు మీడియాకు తెలిపారు.
ఇక మూడవ దాడి జూన్ 11న జల్‌వీర్ నౌకపై జరిగింది. ఇందులో ఉన్న 20 మంది భారతీయ నావికులను రెస్క్యూ చేశారని కూడా విదేశాంగ శాఖ తెలిపింది.
అయితే మూడు దాడి ఘటనల్లో రెస్క్యూ చేసిన వారందరినీ ఇండియాకు తీసుకొచ్చేందుకు ఎంత సమయం పడుతుందనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.

ఫొటో సోర్స్, Forward Seamen's Union of India/x.com/FSUIINDIA
‘హార్ముజ్’ సమీపంలో చిక్కుకున్న 18,000 మంది భారతీయులు
మొత్తం గల్ఫ్ ప్రాంతంలో దాదాపు 18,000 మంది భారతీయులు చిక్కుకుపోయారు.
ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులకు కేంద్రంగా మారిన హార్ముజ్ జలసంధిలో భారతీయ జెండాలతో ఉన్న 13 నౌకలున్నాయని, వాటిలో 562 మంది భారత పౌరులున్నారని, మొత్తం హార్ముజ్ జలసంధి సమీప ప్రాంతాలలో 18,000 మందికిపైగా భారతీయ నావికులు చిక్కుకున్నారని, కేంద్ర నౌకాయాన శాఖ అడిషనల్ సెక్రటరీ ముఖేశ్ మంగల్ తెలిపారు.
''మొత్తం హార్ముజ్ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులు 18,000 మందికి పైగానే ఉంటుంది. అయితే వీరిలో అక్కడే ఉండి నౌకల్లో పని చేసుకునేవారు, గల్ప్ ప్రాంతాల్లోనే ఉంటున్నవాళ్లు కూడా ఉన్నారు'' అని ముఖేశ్ మంగల్ అన్నారు.
హార్ముజ్ పరిస్థితులపై, అక్కడ చిక్కుకున్న భారతీయులకు అందించాల్సిన సహాయ ఏర్పాట్లపై గల్ఫ్ దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాల ద్వారా ఆయా దేశాల ప్రభుత్వాలతో భారత ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని, గల్ఫ్‌లో ఉన్న అన్ని భారతీయ ఎంబసీలు, ఈ విషయంపైనే పనిచేస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Patnala Bhargavi
చిక్కుకున్నవారిలో తెలుగు వారెంతమంది?
అమెరికా దాడులు జరిపిన మూడు నౌకల నుంచీ రెస్క్యూ చేసిన వారిలో ఎంతమంది తెలుగు వారున్నారనే దానిపై ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర అధికారిక సమాచారం అందుబాటులో లేదని దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కు చెందిన మరో సీనియర్ అధికారి బీబీసీ తెలుగుతో చెప్పారు.
అయితే హార్ముజ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నుంచి వీళ్లందరినీ సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నాల గురించి, గల్ఫ్ ప్రాంతంలో ఆయా దేశాల్లో ఉండే భారతీయ నావికులకు అందించే సపోర్ట్ ఏవిధంగా ఉందనే వివరాల గురించి, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ అధికారులు కానీ, విదేశాంగ శాఖ అధికారులు కానీ వెల్లడి చేయలేదు.

ఫొటో సోర్స్, Centcom
ఇండియాకు సురక్షితంగా చేరుకున్నది ఎంతమంది?
గల్ఫ్ ప్రాంతం నుంచి ఇప్పటివరకూ 3,537 మందిని సురక్షితంగా కేంద్ర ప్రభుత్వం తరలించింది.
గురువారం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకూ మొత్తం గల్ఫ్ ప్రాంతాల నుంచి 3,537 మందిని సురక్షితంగా ఇండియాకు తరలించే ఏర్పాట్లు జరిగాయని, వీరిలో 31 మంది కోసం గడిచిన 72 గంటల్లోనే ఏర్పాట్లు జరిగాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం...
ఎంటీ సిట్టెబెలో నౌకలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు బాధిత కుటుంబాలకూ విడివిడిగా పది లక్షల రూపాయల చొప్పున సహాయాన్ని అందిస్తామని సీ ఫేరర్స్ వెల్ఫేర్ ఫండ్ సిస్టమ్ ప్రకటించింది.
అయితే బాధితులకు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కానీ ఆర్థిక సహాయం అందుతుందా అనేదానిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
''ప్రస్తుతం దీనిపై కేంద్ర ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇది అంతర్జాతీయ సమస్యలో భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశంగానే చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే విషయంలో ఎలాంటి స్పష్టతా లేదు'' అని అర్జా శ్రీకాంత్ చెప్పారు.
మొత్తంగా గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకున్న వారిలో ఎంతమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారో ఇప్పడే చెప్పడం కష్టమని అర్జా శ్రీకాంత్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























