ఎవరీ ఇర్లింగ్ హాలాండ్?.. బ్రెజిల్ ఓటమి తరువాత ఇంగ్లండ్‌ను భయపెడుతున్న నార్వే స్ట్రైకర్

Erling Haaland

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అద్వైద్ రాజన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఫుట్‌బాల్ మైదానంలో ఇర్లింగ్ హాలాండ్ మెరిసే జుట్టును గుర్తించడం చాలా తేలిక.

హాలాండ్‌ను డిఫెండర్లు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే, అతను గ్రౌండ్‌లోని ఖాళీ ప్రదేశంలోకి వేగంగా దూసుకెళ్తుంటాడు. ఆదివారం మాత్రం అలా జరగలేదు. అయినప్పటికీ హాలాండ్ రెండు గోల్స్ కొట్టాడు. దీంతో బ్రెజిల్‌పై 2-1 తేడాతో గెలిచిన నార్వే, చరిత్రలో తొలిసారి వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.

ఈ లాస్ట్-16 మ్యాచ్‌లో 25 ఏళ్ల హాలాండ్‌కు బాక్స్ లోపల కేవలం నాలుగు సార్లు మాత్రమే బంతిని తాకే అవకాశం దక్కింది. కానీ, అందులో ఒక అవకాశంతోనే ఆయన 79వ నిమిషంలో డెడ్‌లాక్‌ను బ్రేక్ చేస్తూ తొలి గోల్ కొట్టాడు.

ఆ తర్వాత మరో 11 నిమిషాలకే బాక్స్ బయటి నుంచి లో-డ్రైవ్ షాట్‌తో రెండో గోల్ సాధించాడు.

ప్రపంచ ఫుట్‌బాల్‌లో అత్యంత ప్రమాదకరమైన స్ట్రైకర్‌లలో ఒకడైన హాలాండ్‌కు ఉన్న ఫినిషింగ్ నైపుణ్యాన్ని ఈ గోల్ మరోసారి నిరూపించింది.

ఈ డబుల్ గోల్స్‌తో టోర్నమెంట్‌లో మొత్తం ఏడు గోల్స్ కొట్టి, గోల్డెన్ బూట్ రేసులో ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపె, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సితో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు హాలాండ్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
నార్వే, బ్రిజిల్, ఫుట్‌బాల్, ఎర్లింగ్ హాలాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హాలాండ్ రెండు గోల్స్ చేయడంతో బ్రెజిల్ జట్టుపై నార్వే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

స్కాట్లాండ్ మాజీ వింగర్ పాట్ నెవిన్ ఈ విన్నింగ్ గోల్‌ను ఉద్దేశించి బీబీసీ రేడియో 5 లైవ్‌లో "మరే ప్లేయర్ అలా ఆడటం మీరు చూడలేరు" అన్నారు.

"అక్కడ గోల్ చేసే అవకాశమే లేదు. కనీసం అర శాతం, పావు శాతం కూడా లేదు. ఏమీ లేని చోట హాలాండ్ ఆ గోల్ కొట్టాడు" అన్నారు.

"అతను ఎన్నిసార్లు బంతిని టచ్ చేస్తాడనే దాని గురించే అందరూ మాట్లాడుకుంటారు. కానీ, అతను ఎక్కువసార్లు బంతిని తాకాల్సిన అవసరమే రాలేదు" అని ఇంగ్లండ్ మాజీ స్ట్రైకర్ ఇయాన్ రైట్ ఐటీవీలో అన్నారు.

హాలాండ్ సాధించిన గోల్స్ సాయంతో బ్రెజిల్‌పై నార్వే చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

1998 తర్వాత మొదటిసారి వరల్డ్ కప్‌లో ఆడుతున్న స్టాలే సోల్‌బాకెన్ నేతృత్వంలోని నార్వే జట్టు... ఇప్పుడు ప్రపంచ టైటిల్‌కు కేవలం మూడు విజయాల దూరంలో నిలిచింది. మెక్సికోపై 3-2తో విజయం సాధించిన ఇంగ్లండ్‌తో నార్వే తదుపరి మ్యాచ్‌లో తలపడనుంది.

కానీ, మ్యాచ్‌ను ఒంటిచేత్తో తిప్పేయగల హాలాండ్ తమ జట్టులో ఉండటంతో, నార్వే ఏదైనా సాధ్యమేనని నమ్ముతోంది.

"ఈ టోర్నమెంట్‌లో చాలా దూరం వెళ్లగలమనే నమ్మకాన్ని అతను తన దేశ ప్రజలందరిలో నింపాడు" అని వేన్ రూనీ బీబీసీ వన్‌లో వ్యాఖ్యానించారు.

నార్వే, బ్రిజిల్, ఫుట్‌బాల్, ఎర్లింగ్ హాలాండ్

ఫొటో సోర్స్, Getty Images

నార్వే తరఫున హాలాండ్ రికార్డులు

నార్వే తరఫున హాలాండ్ అంతర్జాతీయ కెరీర్ రికార్డుల్లో ఇప్పటికే మోల్డోవాపై ఒకే మ్యాచ్‌లో ఐదు గోల్స్ కొట్టిన ఘనతతో పాటు మరో ఐదు హ్యాట్రిక్‌లు ఉన్నాయి.

"హాలాండ్ అద్భుతమైన నైపుణ్యం, బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆటగాడు" అని ఇంగ్లండ్ మాజీ డిఫెండర్ గ్యారీ నెవిల్ ఐటీవీతో పేర్కొన్నారు.

"ప్రపంచ వేదికపై అతను ఎప్పుడూ రాణించలేదని కొందరు అంటుంటారు, ఆ విమర్శలకు ఇప్పుడు తెరపడింది" అన్నారు.

నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు గోల్స్ సాధించడం ద్వారా హాలాండ్ అతిపెద్ద వేదికపై తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.

ఈ 25 ఏళ్ల ఫార్వర్డ్ ఆటగాడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో ఇరాక్, సెనెగల్‌లపై రెండేసి గోల్స్ కొట్టాడు. ఆ తర్వాత ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే జట్టు పది మార్పులు చేయడంతో పాటు హాలాండ్‌కు విశ్రాంతినిచ్చింది. ఆ మ్యాచ్‌లో నార్వే 4-1 తేడాతో ఓడిపోయింది.

అయితే, ఆ విశ్రాంతి ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు కనిపిస్తోంది. లాస్ట్-32 మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై చివరి నిమిషంలో విన్నింగ్ గోల్ కొట్టిన హాలాండ్, ఇప్పుడు బ్రెజిల్‌పై కూడా డబుల్ గోల్స్‌ సాధించాడు.

హాలాండ్ తన సీనియర్ అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 54 మ్యాచ్‌ల్లో 62 గోల్స్ సాధించాడు. అంటే సగటున ప్రతి 71 నిమిషాలకు ఒక గోల్ కొట్టాడు. ఈ గోల్స్‌లో కేవలం ఆరు మాత్రమే పెనాల్టీల ద్వారా వచ్చినవి.

మాంచెస్టర్ సిటీ స్ట్రైకర్ అయిన హాలాండ్, నార్వే తరఫున ఆడిన గత 14 వరుస అధికారిక మ్యాచ్‌ల్లోనూ గోల్స్ సాధిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను ఏకంగా 27 గోల్స్ ఖాతాలో వేసుకున్నాడు.

అంతర్జాతీయ పోటీల్లో అతను నార్వే తరఫున గోల్ కొట్టని మ్యాచ్ చూడాలంటే... మనం అక్టోబర్ 2024లో నేషన్స్ లీగ్‌లో ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్ వరకు వెళ్లాల్సిందే.

గాబ్రియేల్‌పై హాలాండ్ పైచేయి

బ్రెజిల్, నార్వే మ్యాచ్ ప్రారంభానికి ముందు... హాలాండ్, బ్రెజిల్ సెంటర్-బ్యాక్ (ఆర్సెనల్ ఆటగాడు కూడా) గాబ్రియేల్ మధ్య జరగబోయే పోరుపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

ప్రీమియర్ లీగ్‌లో మొదలైన వీరి పాత పోటీ.. అంతర్జాతీయ వేదికపై జరిగిన ఈ తాజా పోరులో హాలాండ్‌దే పైచేయి అయింది.

మ్యాచ్ తొలి సగం ముగిసేసరికి బాక్స్ లోపల హాలాండ్‌కు కేవలం ఒకే ఒక్కసారి తప్ప బంతి దొరక్కుండా చేయడంలో గాబ్రియేల్ విజయవంతమయ్యాడు. కానీ, మ్యాచ్ రెండో సగంలో ఆట వేగం పుంజుకోవడంతో నార్వే స్టార్ ప్లేయర్‌కు మైదానంలో ఖాళీ స్థలం దొరికింది. చివరకు బ్రెజిల్ దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

నార్వేను ఆధిక్యంలోకి తీసుకెళ్లిన ఆ హెడర్ షాట్ కొట్టేటప్పుడు హాలాండ్... గాబ్రియేల్‌ను దాటుకుంటూనే ఆ గోల్ సాధించాడు. ఇక రెండో గోల్ కొట్టే సమయంలో బ్రెజిల్ డిఫెండర్ కేవలం ప్రేక్ష‌కుడిలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్ మొత్తంలో హాలాండ్ కేవలం 30 సార్లు మాత్రమే బంతిని తాకాడు. హాఫ్-టైమ్‌లోనే మైదానం వీడిన అతని సహచర ఆటగాడు ఆంటోనియో నుసా కూడా ఇన్నేసి సార్లు బంతిని తాకడం గమనార్హం. అలాగే హాలాండ్ కేవలం 13 పాస్‌లు మాత్రమే పూర్తి చేశాడు.

హాలాండ్ ఎక్స్‌పెక్టెడ్ గోల్స్ రేటింగ్ 0.39 మాత్రమే ఉండటం చూస్తే... ఆటపై అతను పూర్తి ఆధిపత్యం చెలాయించలేదని అర్థమవుతోంది. కానీ, నార్వేను గెలిపించిన హీరో అతనే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

"అతను ఎప్పుడైనా ఎక్కువసార్లు బంతిని తాకుతాడా? అంటే.. లేదు. అతని ఆట తీరే అంత, అంతా క్షణాల్లో జరిగిపోతుంది. కీలక సమయాల్లో అతను జట్టుకు అండగా నిలుస్తాడు" అని ఆర్సెనల్ మాజీ డిఫెండర్ మాట్ అప్సన్ బీబీసీ రేడియో 5 లైవ్‌లో చెప్పారు.

హాలాండ్ ఆట గురించి లివర్‌పూల్ మాజీ డిఫెండర్ స్టీఫెన్ వార్నాక్ మాట్లాడుతూ "అతను సగటున ప్రతి 14 టచ్‌లకు ఒక గోల్ చొప్పున కొడతాడు, ఇది అతని ప్రతిభను తెలియజేస్తుంది. అయితే అతను స్వార్థం లేకుండా ప్రత్యర్థి డిఫెన్స్‌ను చీల్చుకుంటూ ముందుకు పరిగెడతాడు. డిఫెండర్లను ఒకే చోట కట్టడి చేస్తూ... మిడ్‌ఫీల్డ్ ఆటగాళ్లు ముందుకు రావడానికి అవకాశం కల్పిస్తాడు" అన్నారు.

తాను ఒక కొత్త శిఖరాన్ని చేరుకుంటున్నట్లు నమ్ముతున్నట్లు హాలాండ్ చెప్పారు.

"ఈ టోర్నమెంట్‌లో నేను కొన్నిసార్లు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను, కానీ అప్పుడప్పుడు సరికొత్త శిఖరాలను అందుకుంటుంటాను. కానీ, నాకు ఒకటి లేదా రెండు అవకాశాలు దక్కితే... చాలావరకు వాటిని గోల్స్‌గా మారుస్తాను. అదెలాగో నాకూ తెలియదు, కానీ నేను చేసే పని ఇదే" అని హాలాండ్ అన్నాడు.

"పూర్తిగా ఆటపై దృష్టి పెట్టడం, దక్కిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యం. మొదటి ప్రయత్నంలో గోల్ కాకపోయినా, సాధారణంగా నాకు అవకాశాలు దక్కుతూనే ఉంటాయి" అని హాలాండ్ అన్నాడు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)