పల్లెగామ హేమరథన: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బౌద్ధ సన్యాసి అరెస్ట్

ఫొటో సోర్స్, Facebook | DGI Sri Lanka
15 ఏళ్ల బాలికపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై శ్రీలంకలో ఒక ఉన్నత స్థాయి బౌద్ధ సన్యాసిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.
బౌద్ధ ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన పదవుల్లో ఒకటి, శ్రీలంకలోని ఎనిమిది పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రధాన భిక్షువుగా పల్లెగామ హేమరథన థేరో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ కేసులో అనుమానితుడిగా ఆయన పేరు ఉన్నప్పటికీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయకపోవడంపై గతంలో విమర్శలు చేసిన దేశ బాలల సంరక్షణ సంస్థ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పల్లెగామ హేమరథనను అరెస్ట్ చేశారు.
పల్లెగామ హేమరథన ఈ అభియోగాలపై బహిరంగంగా ఇంకా స్పందించలేదు. మే 12న ఆయనను కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు.
ఈ ఆకృత్యానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలి తల్లిని కూడా అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.

శనివారం ఆయన్ను అరెస్ట్ చేసినప్పుడు కొలంబోలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొలంబో జైలు ఆస్పత్రికి పల్లెగామ హేమరథనను తరలించాలని మెజిస్ట్రేట్ నిర్ణయించారు.
పల్లెగామ హేమరథన దేశం విడిచి పారిపోకుండా చూసుకోవాలని ఇమ్మిగ్రేషన్ అథారిటీలకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
శ్రీలంకలో రాజకీయంగా శక్తిమంతంగా ఉండే, సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా ఉండే బౌద్ధ సన్యాసులు, మరీ ముఖ్యంగా అంతటి అత్యున్నత స్థాయి వ్యక్తి అరెస్ట్ కావడం అసాధారణం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































