‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

ఫొటో సోర్స్, @RSSorg
భారత్‌ను విచ్ఛిన్నం చేయడానికి చేసే ప్రయత్నాలు సఫలం కావని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
అధికారం మారితే పరిస్థితి మారుతుందని అనుకోవడం తప్పని గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, భవిష్యత్తులో కూడా అలా జరగదని ఆయన అన్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమాల వల్ల మార్పురాదని, సమస్యలకు పరిష్కారాలు సమాజం నుంచే రావాలని వ్యాఖ్యానించారు.
విజయదశమి సందర్భంగా నాగ్‌పూర్‌లో మోహన్ భగవత్ వార్షిక ప్రసంగం చేశారు. "భారత్ అభివృద్ధి చెందుతోంది కాబట్టి దాన్నే వాళ్లు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా కీలకమైన విధానాలతో భారత్ సాధిస్తున్న పురోగతిని అడ్డుకోలేమని ఈ శక్తులకు తెలుసు... అందుకే వాళ్లు భారత్‌ను, సంఘ్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
నిరసనలు రాజకీయరంగు పులుముకున్నప్పుడు లేదా ఉద్దేశపూర్వకంగా వాటిని రెచ్చగొట్టినప్పుడు ఉద్రిక్తతలు సృష్టించడానికి, గందరగోళం పెంచడానికి, శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి వాటిని ఉపయోగించే ప్రమాదముందని మోహన్ భగవత్ హెచ్చరించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925 సెప్టెంబర్ 27న విజయదశమి రోజున నాగపూర్‌లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. ఈ సంస్థ అధికారికంగా హెడ్గేవార్ ఇంటినుంచే ప్రారంభమైంది.
ఏటా దసరారోజు ఆరెస్సెస్ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. స్వయంసేవకులను ఉద్దేశించి ఆరెస్సెస్ చీఫ్ ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథిని కూడా ఆహ్వానిస్తారు. ఈసారి దైనిక్ జాగరణ్ పత్రిక ప్రధాన సంపాదకులు సంజయ్ గుప్తాను ఆహ్వానించారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
పాశ్చాత్యదేశాల నుంచి తుఫాన్
భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారకుండా కొన్ని శక్తులు అడ్డుకోవాలని చూస్తున్నాయని, భారతీయులు అప్రమత్తంగా ఉండాలని మోహన్ భగవత్ అన్నారు.
"భారత్ ఓడిపోవాలని కోరుకునే శక్తులు ప్రపంచంలో చాలా ఉన్నాయనేది స్పష్టం" అని ఆయన అన్నారు.
"పశ్చిమదేశాల నుంచి ఒక తుఫాన్ వస్తోంది, అది సంస్కృతిని, భద్రతను, వ్యవస్థను ద్వేషిస్తోంది. ప్రతీదాన్నీ నాశనం చేయాలని కోరుకుంటోంది" అని ఆయన అన్నారు.
ఇటీవలి సంవత్సరాలలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగిన ఫ్రాన్స్, బంగ్లాదేశ్, నేపాల్ ఉదాహరణలను కూడా మోహన్ భగవత్ ప్రస్తావించారు.
నేపాల్‌లో జెన్-జెడ్ నిరసనలు సెప్టెంబర్ 2025లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పతనానికి దారితీశాయి. అంతకు ఏడాది ముందు బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు ఒక ప్రజా ఉద్యమంగా తీవ్రరూపం దాల్చి, ఆగస్టు 2024లో షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమయ్యాయి.
పెరుగుతున్న జీవన వ్యయం, ప్రజా సేవల నాణ్యత తగ్గిపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఫ్రాన్స్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ నిరసనల్లో వెయ్యిమందికిపైగా అరెస్టయ్యారు.
భారత్‌లో కూడా కొందరు అలాంటి శక్తుల ఆలోచనలను సమర్థిస్తున్నట్టు కనిపిస్తోందని భగవత్ అన్నారు.
"భారత్‌లో కూడా కొందరు వారి ఆలోచనలతో, అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు...వారికి ఆలోచనాసామర్థ్యం తక్కువగా ఉంది. అధికారంపై ఆశ ఎక్కువగా ఉంది" అని ఆయన అన్నారు.
సమాజం అప్రమత్తంగా ఉండాలని, సమస్యలకు పరిష్కారాలు నిరసనల ద్వారా కాకుండా సమాజం నుంచే లభించేలా ప్రజలు చూసుకోవాలని ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, ANI
‘బెంగాల్ విభజనను అడ్డుకున్నాం...దేశ విభజనను ఆపలేకపోయాం’
బెంగాల్ ఐక్యతకు వందేమాతరం ఒక ప్రతీకగా నిలిచిందని మోహన్ భగవత్ అన్నారు. మత ప్రాతిపదికన బెంగాల్‌ను విభజించడానికి లార్డ్ కర్జన్ ప్రయత్నించినప్పుడు ప్రజలు దానిని తీవ్రంగా వ్యతిరేకించడంతో బ్రిటిష్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసి వచ్చిందని ఆయన చెప్పారు. అయితే 1947లో దేశవిభజనను అడ్డుకోలేకపోయామని అప్పటికి ప్రజలు ద్వేషంలో మునిగిపోయి జాతీయ ఐక్యతను మరచిపోయారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
"హిందువులను, ముస్లింలను వేరు చేయడానికి బెంగాల్‌ను మత ప్రాతిపదికన విభజించడానికి లార్డ్ కర్జన్ ప్రయత్నించినప్పుడు ఒకే భూమిపై నివసించే ప్రజలను మతం ఆధారంగా విభజించాలనే నిర్ణయాన్ని సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో బెంగాల్ విభజన ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసి వచ్చింది. ఆ కాలంలో 'వందేమాతరం' ఆ ఐక్యతకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. విభజన ప్రయత్నం విఫలమైంది.
మరి1947లో అలాంటి ఫలితాన్ని ఎందుకు సాధించలేకపోయాం? ఎందుకంటే మనల్ని విభజించి, పరస్పరం గొడవల్లో ముంచాలని కోరుకున్నవాళ్లు మన మనసుల్లో ఓ భావనను నాటారు. మనం భిన్నంగా కన్పిస్తున్నాము కాబట్టి వేర్వేరుగా ఉండాలని, ఒకరినొకరు దూరం చేసుకోవాలని నమ్మించారు.
మనం భిన్నంగా కనిపించడం వల్ల మనం ఒక్కటి కాదని, ఒకరికొకరం వేరని మతతత్వ, తీవ్రవాద భావజాలాల ప్రభావానికి లోనవ్వడం వల్ల మనం కూడా నమ్మడం మొదలుపెట్టాం. వేర్పాటువాదంపై మక్కువ, రాజకీయ ఆధిపత్యం సాధించాలనే ఆశ, స్వార్థప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే ప్రయత్నాలవల్ల మనల్ని కలిపి ఉంచిన మౌలిక ప్రాథమిక సూత్రాలను మనం క్రమంగా తిరస్కరించడం ప్రారంభించాం. బుజ్జగింపు రాజకీయాల ధోరణి ఈ విభజన ఆలోచనను మరింత పెంచింది. చివరికి దేశం చీలిపోయింది'' అని మోహన్ భగవత్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలపై వివాదం
ఎస్ఐఆర్‌లో అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ఇప్పుడు "అధికార మార్పిడి కోసం జరుగుతున్న నిజమైన పోరాటంగా" మారాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇటీవల అన్నారు. ఈ నేపథ్యంలో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం చెలరేగింది.
"ప్రతిపక్షాలు అధికార మార్పు కోరుకుంటున్నాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడటానికి మేం పోరాడుతున్నాం. కానీ ఇలాగే అణిచివేత కొనసాగితే కచ్చితంగా అధికార మార్పిడి జరుగుతుంది" అని గత వారంలో ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడిచేసింది.
దేశంలో రాజకీయ అశాంతిని సృష్టించడానికి కొన్ని వర్గాలు యువతను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు.
ప్రభుత్వ మార్పు డిమాండ్‌ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ కూడా విమర్శించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్షాలు చేస్తున్నప్రయత్నాలను దాచిపెట్టడానికి ఉపయోగిస్తున్న ఒక 'సాకు' మాత్రమేనని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, @RSSorg
పర్యావరణం, నైతికవిలువల సమతుల్యత
నాగ్‌పూర్ ప్రసంగంలో మోహన్ భగవత్ మరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. మానవాళిపై ప్రతికూల పరిణామాలు లేకుండా అభివృద్ధికి భారత్ కొత్త ప్రమాణాలను రూపొందించాలని అన్నారు.
విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగతి కొనసాగుతున్నప్పటికీ, పర్యావరణాన్ని, నైతిక విలువలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. మతం, భాష, ఆహారపు అలవాట్ల పరంగా భారత్ వైవిధ్యభరితమైనదని ఆ వైవిధ్యాన్ని పరిరక్షించి, గౌరవించాల్సిన అవసరం ఉందని మోహన్ భగవత్ చెప్పారు.
అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు మధ్య ఉన్న అసమతుల్యతకు నేపాల్‌లో ఇటీవల సంభవించిన వరదలు ఉదాహరణ అని ఆయనన్నారు.
"కోల్‌కతాలో జరిగిన (తొక్కిసలాటలో మరణాలు)ఘటన మన స్వయంకృతాపరాధం. కానీ నేపాల్‌లో జరిగింది ప్రకృతి వైపరీత్యం" అని మోహన్ భగవత్ తెలిపారు.
భారత్, నేపాల్, చైనాపరిధిలోని మొత్తం హిమాలయ ప్రాంతం గురించి ఆయన హెచ్చరిస్తూ అభివృద్ధి పేరుతో ఈ ప్రాంతంలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
"భారీస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అభివృద్ధి కొనసాగిస్తూనే, ఆ అభివృద్ధికి మూల్యం మనుషుల ప్రాణాల రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా ఈ రెండింటి మధ్య మనం సమతుల్యత పాటించాలి" అని సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























