దళిత యువకుడిని పెళ్లి చేసుకున్న మహిళను కారులో కిడ్నాప్-రెండున్నర గంటల్లోనే పోలీసులు ఎలా రక్షించారు?

ఫొటో సోర్స్, AjithKumar
- రచయిత, నందిని వెళ్లైసామి
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
‘‘నా భార్యను ఆమె కుటుంబ సభ్యులు కారులో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆపేందుకు నేను, మా అమ్మ చాలా ప్రయత్నించాం. కానీ, ఆపలేకపోయాం. నా భార్యను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, వేగంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు'' అని అజిత్ కుమార్ చెప్పారు.
జూలై 4న (గత శనివారం) దిండిగల్-తిరుచ్చి జాతీయ రహదారిపై ఈ సంఘటన జరిగింది.
అజిత్ కుమార్ భార్య చిత్రవల్లిని కారులో అపహరించడానికి ప్రయత్నించినప్పుడు, ఆయన, ఆయన తల్లి విజయలక్ష్మి అడ్డుకోవడానికి ప్రయత్నించిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పట్టపగలు జరిగిన ఈ ఘటన ఆ వైరల్ వీడియోతో వెలుగులోకి వచ్చింది.
అజిత్ కుమార్ షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి. వెనుకబడిన తరగతి (బీసీ)కి చెందిన చిత్రవల్లిని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు.

అయితే, కిడ్నాప్ జరిగిన సుమారు రెండున్నర గంటల్లోనే పోలీసులు ఆ మహిళ ఉన్న ప్రాంతాన్ని కనిపెట్టారు.
ఆమెను రక్షించి మళ్లీ భర్త అజిత్ కుమార్ వద్దకు చేర్చారు.
ఈ ఘటనలో అసలు ఏం జరిగింది?
మణప్పరైలోని చిత్తనాథం గ్రామస్థుడైన అజిత్ కుమార్ షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు. ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.
ముడుక్కుపట్టి గ్రామానికి చెందిన చిత్రవల్లి అనే యువతితో ఆయన గత రెండున్నరేళ్లుగా ప్రేమలో ఉన్నారు.
చిత్రవల్లి అత్యంత వెనుకబడిన తరగతికి చెందిన మహిళ. మణప్పరైలో చిత్రవల్లి తన సోదరికి చెందిన ఒక దుకాణంలో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడి, ఆ తర్వాత అది ప్రేమగా మారింది.
''చిత్రవల్లి ఇంట్లో మా పెళ్లికి కచ్చితంగా అంగీకరించరని తెలుసు. వారింటికెళ్లి, మా విషయం చెప్పాలంటే నాకు భయంవేసింది. చిత్రవల్లిని ఏదైనా చేస్తారేమోనని భయపడ్డా. అందుకే, అక్కడకు వెళ్లలేదు'' అని అజిత్ కుమార్ బీబీసీకి చెప్పారు.
ఈ ఇద్దరూ చిత్రవల్లి కుటుంబ సభ్యులకు తెలియకుండా జూన్ 25న పెళ్లి చేసుకున్నారు. అదేరోజు, అజిత్ కుమార్, చిత్రవల్లి కలిసి మణప్పరై ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
అక్కడ చిత్రవల్లి తల్లిదండ్రులకు ప్రశాంతంగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, వాళ్లు తమ పెళ్లిని అంగీకరించకుండా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారని అజిత్‌కుమార్ చెప్పారు.
ఆ తర్వాత, చిత్రవల్లి భర్త అజిత్‌కుమార్ ఇంట్లోనే ఉండిపోయారు.
''కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వీడియో జూలై 1న రికార్డు కావడానికి రెండు రోజుల ముందు, ఆమె అక్క భర్త (బావ) మురుగేశన్, నా కులాన్ని ప్రస్తావిస్తూ దారుణంగా అవమానించారు. నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. నేను ఆయన్ను బెదిరించానని చెబుతూ పోలీస్ స్టేషన్‌లో నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు'' అని అజిత్ కుమార్ తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
అజిత్ కుమార్ జూలై 4న మణప్పరై పోలీస్‌స్టేషన్‌కు భార్య చిత్రవల్లిని, తల్లి విజయలక్ష్మిని, సోదరుడిని తీసుకొని విచారణ కోసం వెళ్లారు. అయితే, ఆ రోజు ఫిర్యాదు చేసిన మురుగేశన్ రాకపోవడంతో, ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చే రోజు తిరిగి వచ్చి విచారణకు సహకరిస్తామని వారు లేఖ రాసినట్లు అజిత్ కుమార్ తెలిపారు.
వారు ఆటోలో తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు దిండిగల్-తిరుచ్చి జాతీయ రహదారిపై చిత్రవల్లిని కిడ్నాప్ చేశారు.
''పోలీస్ స్టేషన్ నుంచి మేం ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నాం. ఆ సమయంలో, ఒక కారులో వచ్చిన చిత్రవల్లి బావ మురుగేశన్, ఆయన తమ్ముడు ప్రకాశ్ మా ఆటోను అడ్డుకుని, చిత్రవల్లిని బలవంతంగా కారులోకి ఎక్కించారు. చిత్రవల్లి అన్నయ్య మలైసామి, తమ్ముడు అళగర్ కారు తలుపులు మూసి, వేగంగా నడుపుకుంటూ అడవివైపుకు వెళ్ళిపోయారు" అని అజిత్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరో కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అజిత్ కుమార్‌ను పక్కకు లాగారని ఫిర్యాదులో చెప్పారు.
ఆమెను కిడ్నాప్ చేయకుండా అజిత్ కుమార్, ఆయన తల్లి విజయలక్ష్మి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ.. కారు వేగంగా వెళ్లినట్లు వైరల్ అయిన వీడియోలో కనిపిస్తుంది.
''వారు నాపై, నాభార్యపై ముఖం మీద దాడి చేశారు. వాళ్ల నడుములకు కత్తులు ఉన్నాయి. నేను, మా అమ్మ ఎంతగా ఏడ్చి బతిమిలాడినా ఏమీ చేయలేకపోయాం. 'వదిలేయండి, వదిలేయండి' అంటూ కారును గట్టిగా కొట్టాను. మా అమ్మ కూడా గట్టిగా అరిచింది" అని అజిత్ కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అక్కడున్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత అజిత్ కుమార్ వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
‘‘ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు జరిగింది. దర్యాప్తు కోసం మా వద్ద ఇప్పటికే నిందితుడు మురుగేశన్ మొబైల్ నంబర్ ఉంది. ఆయన నెంబర్‌ను ట్రాక్ చేశాం. అలా మహిళను దాచిన ప్రదేశాన్ని కనుగొన్నాం. రెండున్నర గంటల్లోపే ఆ మహిళను రక్షించాం. ఆ మహిళ ప్రస్తుతం ఆమె భర్త ఇంట్లో ఉన్నారు’’ అని తిరుచ్చి ఎస్పీ డోంగరే ప్రవీణ్ ఉమేశ్ బీబీసీతో చెప్పారు.
చిత్రవల్లిని ఆమె అమ్మమ్మ ఇంట్లో బందీగా ఉంచగా, పోలీసులు ఆమెను రక్షించారు.
''ఆమె కుటుంబ సభ్యులు చిత్రవల్లిని బెదిరిస్తున్నారు. 'అజిత్ కుమార్‌ను వదిలేయ్. లేదంటే చంపేస్తాం' అంటున్నారు'' అని ఆ దంపతుల న్యాయవాది ఆనందన్ చెప్పారు.
చిత్రవల్లి సోదరి భర్త మురుగేశన్, ఆయన తమ్ముడు ప్రకాశ్, చిత్రవల్లి అన్నయ్య మలైసామి, తమ్ముడు అళగర్‌తో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న ఐదుగుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఎస్‌సీ/ఎస్‌టీ (ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) యాక్ట్, మానవ అక్రమ రవాణా, బెదిరింపులు, ఇతర నేరాల కింద వీరిపై కేసులు నమోదు చేశారు.
ఈ షాక్, భయం నుంచి చిత్రవల్లి ఇంకా కోలుకోలేదని అజిత్ కుమార్ తెలిపారు. చిత్రవల్లి కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























