ఇంట్లో ఏడు మూటల ఉత్తరాలు దాచిన పోస్ట్‌మ్యాన్.. కుక్కకాటుతో బయటపడిందిలా..

- రచయిత, జేవియర్ సెల్వకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
తమిళనాడులోని తిరుపూర్ జిల్లా వెల్లకోయిల్కు చెందిన ఓ పోస్ట్‌మ్యాన్.. గత కొన్నేళ్లుగా ప్రజలకు వచ్చిన ఉత్తరాలను పంపిణీ చేయకుండా తన ఇంట్లోనే దాచిపెట్టిన ఘటన తాజాగా వెలుగుచూసింది.
ప్రస్తుతం ఉన్నతాధికారులు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఆ ఉత్తరాలను తిరిగి సంబంధిత వ్యక్తులకు చేరవేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
స్నేహం, ప్రేమ వంటి ఎన్నో అనుబంధాలను... స్కూళ్లు, కాలేజీల అడ్మిషన్లు, ఉద్యోగ అవకాశాలు వంటి భవిష్యత్తును నిర్ణయించే కీలక సమాచారాలను ఉత్తరాల రూపంలో మోసుకొచ్చే పోస్ట్‌మ్యాన్ కోసం ఎదురుచూసిన ఒక కాలం ఉండేది. ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ మయం కావడంతో సమాచార మార్పిడి మొత్తం ఈ-మెయిళ్లు, సోషల్ మీడియా ద్వారానే సాగుతోంది.
అయినప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపే సమాచార లేఖలు, ఆధార్ వంటి ధ్రువీకరణ పత్రాలు, పెళ్లి పత్రికలు, చట్టపరమైన నోటీసులు ఇప్పటికీ పోస్టల్ శాఖ ద్వారానే సంబంధిత వ్యక్తులకు అందుతున్నాయి.
అలాంటి ఉత్తరాలే ఈ పోస్ట్‌మ్యాన్ ఇంట్లో బస్తాల కొద్దీ పేరుకుపోయాయి.


ఫొటో సోర్స్, Handout
కుక్క కరవడంతో వెలుగుచూసిన ఘటన
తిరుపూర్ జిల్లా వెల్లకోయిల్లో ఒక సబ్ పోస్టాఫీస్ ఉంది.
మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉత్తరాలను చేరవేసేందుకు ఇక్కడ నలుగురు పోస్ట్మ్యాన్లు పనిచేస్తుండగా, వారిలో సెంథిల్ కుమార్ ఒకరు.
ఆయన వెల్లకోయిల్‌లోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో కొన్నేళ్లుగా ఉత్తరాలను పంపిణీ చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.
ఆయన ఇల్లు పక్కనే ఉన్న కాంగేయం మున్సిపాలిటీ పరిధిలోని తట్టాన్తోటంలో ఉంది. సెంథిల్ కుమార్ ఇంటి పక్కనే పళనియమ్మాళ్ అనే మహిళకు చెందిన ఖాళీ స్థలం ఉంది. గత జూన్ 24న పళనియమ్మాళ్ ఆ స్థలం దగ్గరికి వెళ్లినప్పుడు, సెంథిల్ కుమార్ ఇంట్లో పెంచుకుంటున్న ఐదు కుక్కలు ఆమెపై దాడి చేశాయి. దీంతో, ఆమె అక్కడే స్పృహతప్పి పడిపోయారు.
పళనియమ్మాళ్ కూతురు శివగామి, అల్లుడు కరుప్పుసామి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత ఘటనపై వెల్లకోయిల్ పోలీస్ స్టేషన్లో, మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, Handout
సెంథిల్ కుమార్ ఇంటికి పోలీసులు వెళ్లినప్పుడు, అక్కడ కొన్ని గుర్తింపు కార్డుల కవర్లతో పాటు ఉత్తరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషయం పోస్టల్ అధికారులకు తెలియడంతో వారు సెంథిల్ కుమార్ ఇంటికి వచ్చి, వాటిని ఏడు మూటల్లో తిరుపూర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి తరలించారు.
అనంతరం, పోస్ట్‌మ్యాన్ సెంథిల్ కుమార్‌ను విధుల్లోంచి సస్పెండ్ చేశారు.
ఈ నేపథ్యంలో బీబీసీ తమిళ్ వెల్లకోయిల్ ప్రాంతానికి వెళ్లింది.
కాంగేయం ప్రధాన పోస్టాఫీస్ పరిధిలోని వెల్లకోయిల్ సబ్ పోస్టాఫీస్‌లోనే సెంథిల్ కుమార్ పనిచేసేవారు.
''పోస్ట్‌మ్యాన్ సెంథిల్ కుమార్ ఇక్కడే పనిచేసేవారన్నది నిజమే. కానీ, ఆయన ఇంట్లో ఉత్తరాలను దాచిపెట్టినట్లు మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు. తిరుపూర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి సమాచారం అందడంతో, వారే నేరుగా వచ్చి ఆ ఉత్తరాలను తీసుకెళ్లారు. ప్రస్తుతం వారే విచారణ జరుపుతున్నారు. దీనిపై నేను ఇంతకుమించి చెప్పలేను'' అని అక్కడి పోస్ట్‌మాస్టర్ సుందరమూర్తి బీబీసీకి చెప్పారు.
ఆయన ఉత్తరాలు పంచే ప్రాంతాల నుంచి ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదా? అని బీబీసీ ప్రశ్నించగా, ''మాకు ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదూ రాలేదు'' అని చెప్పారు.
ఆయన రోజువారీగా ఎన్ని ఉత్తరాలను తీసుకునేవారు, వాటి రికార్డులను ఎలా నిర్వహించేవారనే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు పోస్ట్‌మాస్టర్ నిరాకరించారు.

ఫొటో సోర్స్, Handout
స్థానికులు ఏమంటున్నారు?
పోస్ట్‌మ్యాన్ సెంథిల్ కుమార్ ఉత్తరాలు పంపిణీ చేసే ప్రాంతాల వివరాలను తెలుసుకున్న బీబీసీ బృందం.. వెల్లకోయిల్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తూరు రోడ్, కచ్చేరి వలసు, ఇందిరా నగర్ వంటి కొన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడింది.
''ఆయన నాకు నాలుగైదేళ్లుగా తెలుసు. ఇక్కడికి వచ్చినప్పుడు అడ్రసుల గురించి ఏవైనా సందేహాలుంటే అడిగేవారు. మాకు తెలిసినంతలో మేం సాయం చేసేవాళ్లం. ఆయనకు తోడుగా ఒక మహిళ కూడా కొన్నిరోజులు వచ్చేది. సోషల్ మీడియాలో చూసిన తర్వాతే ఆయన ఇంట్లో ఇన్ని ఉత్తరాలు దొరికాయనే విషయం మాకు తెలిసింది'' అని కచ్చేరి వలసు ప్రాంతానికి చెందిన రాజ్ బీబీసీతో చెప్పారు.
ఇందిరానగర్ ప్రాంతంలో ఫర్నిచర్ షాప్ నడుపుతున్న వలర్మతి మాట్లాడుతూ.. ''నాకు తెలిసినంత వరకు ఆయన ఇక్కడ చాలాకాలంగా పనిచేస్తున్నారు. మాకు అరుదుగా ఉత్తరాలు వస్తుంటాయి, వాటిని ఆయనే ఇచ్చేవారు'' అని తెలిపారు.
అక్కడ ఉన్న మిగతా వారు కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

వెల్లకోయిల్కు చెందిన ఇద్దరు లాయర్లు.. తమకు రావాల్సిన కోర్టు కేసులకు సంబంధించిన ఎన్నో ఉత్తరాలు సక్రమంగా అందడం లేదని గతంలో ఫిర్యాదు చేసినట్లు లాయర్ శివగామి తెలిపారు.
ఫిర్యాదు చేసిన ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పటికే చనిపోగా, మరో లాయర్ విజయ్ బీబీసీతో మాట్లాడారు.
''ఆయన మా ప్రాంతానికి చెందిన పోస్ట్మ్యానే. గత ఆరేడేళ్లుగా చాలా ఉత్తరాలు అందక మేం తీవ్రంగా నష్టపోయాం. ముఖ్యంగా మాలాంటి లాయర్లు ఎవరికైనా రిజిస్టర్డ్ పోస్ట్ పంపినప్పుడు.. దానికి సంబంధించిన 'పోస్టల్ అక్నాలెడ్జ్మెంట్' (రసీదు)ను కోర్టులో కీలక ఆధారంగా సమర్పించాల్సి ఉంటుంది. కానీ, పోస్ట్‌మ్యాన్ సెంథిల్ వాటిని ఇచ్చేవారు కాదు. కొన్నిరోజుల తర్వాత గట్టిగా నిలదీస్తే.. 'సారీ, మర్చిపోయాను' అంటూ తెచ్చి ఇచ్చేవారు'' అని విజయ్ చెప్పారు.
పోస్ట్‌మ్యాన్ సెంథిల్ కుమార్ ఇంట్లోనే ఏడు మూటల నిండా పంపిణీ చేయని ఉత్తరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని కూడా బీబీసీ సందర్శించింది.

తట్టాన్తోటంలో, కోయంబత్తూర్ మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒక వీధిలోని సందు లోపల సెంథిల్ కుమార్ ఇల్లు ఉంది. ఆ సందు గుండా మాత్రమే ఆయన ఇంటికి వెళ్లే వీలుండగా.. లోపలికి అడుగుపెట్టగానే మూడు కుక్కలు ఒక్కసారిగా మొరుగుతూ భయపెట్టాయి.
''మా స్థలంలో చాలా ఆధార్ కార్డులు, పాన్ కార్డుల పత్రాలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూశాం. కొన్ని ఏటీఎం కార్డుల కవర్లు కాలిపోయి ఉన్నాయి. దీనిపై తిరుపూర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయానికి నేనే ఫిర్యాదు చేశా'' అని పళనియమ్మాళ్ అల్లుడు కరుప్పుసామి బీబీసీతో చెప్పారు.
''కాంగేయం ప్రధాన పోస్టాఫీస్ అధికారులు తనిఖీకి వచ్చినప్పుడు వారిని ఇంటి లోపలికి రానివ్వలేదు. ఆ తర్వాత పోలీసు రక్షణతో ఇల్లు సోదా చేయడంతోనే సెంథిల్ కుమార్ దాదాపు 7 మూటల ఉత్తరాలను దాచిపెట్టిన విషయం వెలుగుచూసింది. వాటిని అధికారులు తీసుకెళ్లారు'' అని కరుప్పుసామి అన్నారు.
ఆ కుక్కల భయంతో పోస్ట్‌మ్యాన్ ఇంటి వైపు వెళ్లడమే తగ్గించేశామని పలువురు స్థానికులు చెప్పారు.
అధికారులపై చర్యలుంటాయా?
ఈ ఘటనపై వివరణ కోరేందుకు బీబీసీ బృందం సెంథిల్ కుమార్ ఇంటికి వెళ్లగా, ఇల్లు తాళం వేసి ఉంది. సెంథిల్ కుమార్ మొబైల్ నంబర్‌కు సంప్రదించగా, సర్వీస్ తాత్కాలికంగా నిలిపివేసి ఉన్నట్లు వచ్చింది.
మరోవైపు, ఉత్తరాలను ఇంట్లో దాచిపెట్టిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లకోయిల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ దురైసామి బీబీసీకి తెలిపారు.
ఈ విషయమై తిరుపూర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ పట్టాభిరామ్‌తో బీబీసీ మాట్లాడింది.
''పోస్ట్‌మ్యాన్ ప్రతీసారి ఇలా చేసినట్లు అనిపించడం లేదు. కొన్ని ఉత్తరాలను పంపిణీ చేయకుండా దగ్గరే పెట్టుకున్నాడు. ఇప్పటివరకు ఎన్ని ఉత్తరాలు ఉన్నాయనేది లెక్కించలేదు. కానీ, 2022, 2023, 2024 సంవత్సరాలకు సంబంధించిన ఉత్తరాలే ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కాలంలో పంపిణీ చేయాల్సిన ఉత్తరాలేవీ వాటిలో లేవు'' అని ఆయన తెలిపారు.
ఆయన పంపిణీ చేయని వాటిలో ఎక్కువగా ఆహ్వాన పత్రికలు, అంతగా ప్రాధాన్యత లేని లేఖలే ఉన్నాయని పట్టాభిరామ్ చెప్పారు. గుర్తింపు కార్డులు, పాన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయన్న వార్తలను ఆయన ఖండించారు.
''సెంథిల్ కుమార్ పక్షవాతం బారిన పడ్డారు. అయినప్పటికీ విధులకు హాజరయ్యేవారు. కార్యాలయం నుంచి ఉత్తరాలను తీసుకెళ్లిన తర్వాత, వాటిలో ప్రాధాన్యత లేనివిగా భావించినవి ఇంట్లోనే ఉంచేసుకున్నట్లు మా ప్రాథమిక విచారణలో సెంథిల్ కుమార్ చెప్పారు. బాధితుల తరఫున ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆయన్ను మళ్లీ విచారిస్తాం'' అని పోస్టల్ సూపరింటెండెంట్ పట్టాభిరామ్ వివరించారు.
పోస్ట్‌మ్యాన్ సెంథిల్ కుమార్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఉత్తరాలను సంబంధిత వ్యక్తులకు అందిస్తామని, వారి అభిప్రాయాలనూ సేకరిస్తామని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























