విజయ్: భారీ వాగ్దానాలు చేసి చిక్కుల్లో పడ్డారా? ఖజానా ఖాళీ అయిందన్న ఆయన వ్యాఖ్యలపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారు?

    • రచయిత, కె.శుభగుణం
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ వేదికపైనుంచే ముఖ్యమంత్రిగా తన తొలి మూడు ఉత్తర్వులను జారీ చేశారు.

మొదటిది రెండు నెలల్లో 500 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించే కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. రెండోది ప్రతి జిల్లాలో మాదకద్రవ్యాలను అడ్డుకోవడానికి స్పెషల్ ఫోర్స్. మూడోది మహిళల రక్షణ కోసం "లయన్ విమెన్ టాస్క్ ఫోర్స్"

తర్వాత ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగంలో తమిళనాడు అప్పులు, ఆర్థిక పరిస్థితిపై గత ప్రభుత్వాన్ని విజయ్ విమర్శించారు.

ఇది ఒక పెద్ద రాజకీయ వివాదంగా మారింది.

దీనిపై డీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్పందించారు. "ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్‌లో మేం తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా తెలియజేశాం. మీకు ఓటు వేసిన వారిని తప్పుదోవ పట్టించి గందరగోళానికి గురిచేయవద్దు" అని ఆయన అన్నారు.

‘ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం ఉండాలి’

వీసీకే నేత తిరుమావళవన్ కూడా విమర్శలు చేశారు. "తమిళనాడుకు 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ప్రజలను తప్పదోవ పట్టించడమే" అని అన్నారు.

ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ముఖ్యమంత్రి విజయ్ నిజంగా చెప్పగలరా? డీఎంకే ప్రభుత్వం తమిళనాడుకు ఎలాంటి ఆర్థిక పరిస్థితిని మిగిల్చింది? టీవీకే ప్రభుత్వం రాష్ట్ర అప్పును తగ్గించి అది మరింత పెరగకుండా నిరోధించగలదా?

''గత ప్రభుత్వం ఖజానాను ఖాళీగా వదిలిపెట్టింది. భరించలేని భారాన్ని వదిలివెళ్లారు. అలాంటి పరిస్థితిలో మేం ఈ బాధ్యతను తీసుకున్నాం. పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుంటేనే ఏది ఉందో, ఏది లేదో మనకు తెలుస్తుంది. దీనిని శ్వేతపత్రం రూపంలో ప్రచురించాలని నేను భావిస్తున్నా" అని తొలి ప్రసంగంలో విజయ్ అన్నారు.

ప్రజలు తనకు కొంత సమయం ఇవ్వాలని అన్నారు.

"అధికారంలోకి రాగానే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పడం మొదలుపెట్టకండి. అన్నీ ఉన్నాయి. కావలసిందల్లా ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలించే సామర్థ్యం మాత్రమే" అని స్టాలిన్ విమర్శించారు.

"గత ఐదేళ్లుగా కోవిడ్, వరదలు, నిధుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వపు మోసం వంటి ఎన్నో సమస్యలను అధిగమించి మేము లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశాం. కానీ మీ మొదటి ప్రసంగంలోనే 'గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి రూ.10 లక్షల కోట్ల అప్పును వదిలిపెట్టింది' అని ఆరోపించారు" అని ఎక్స్‌లో స్టాలిన్ పోస్టు చేశారు.

"తమిళనాడు అప్పు పరిమితుల్లోనే ఉంది. గత ఫిబ్రవరి బడ్జెట్‌లో తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా తెలియజేశాము. ఈ విషయం మీకు తెలియదా? తెలిసే మీరు ఇన్ని వాగ్దానాలు చేశారా? మీకు ఓటు వేసిన వారిని తప్పుదోవ పట్టించి, గందరగోళానికి గురిచేయకండి" అని స్టాలిన్ అన్నారు.

తమిళనాడు ఖజానా నిజంగానే ఖాళీ అయిందా?

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముఖ్యమంత్రి విజయ్ చెబుతున్నంత దారుణంగా లేదని ఆర్థికవేత్త కృష్ణమూర్తి ప్రభాకరన్ అంటున్నారు. 'ఖజానా ఖాళీ' అనే వాదన నిరాధారమని, వాస్తవ విరుద్ధమని ఆయన చెప్పారు.

అదే సమయంలో తమిళనాడు అప్పుల నిర్వహణ అద్భుతంగా ఉందని చెప్పే పరిస్థితి లేదు. పెరుగుతున్న వడ్డీ చెల్లింపులు, విద్యుత్ బోర్డు నష్టాలు, సంక్షేమ పథకాలపై ఖర్చు, జీతాలు, పెన్షన్లు వంటివి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు.

ప్రాథమికంగా "బడ్జెట్‌లో రాష్ట్ర వ్యయంపై చర్చిస్తారు. సరైన ప్రణాళికతో నిధులను కేటాయిస్తారు. అంతేకాకుండా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 28.5 శాతం వరకు తమిళనాడు రుణం తీసుకోవచ్చు. ఇప్పటివరకు మొత్తం అప్పు ఆ పరిమితిలోనే ఉంది" అని కృష్ణమూర్తి ప్రభాకరన్ విశ్లేషించారు.

ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ప్రాథమిక అవగాహన ఉన్నవారికి విజయ్ ప్రకటన సముచితం కాదని అర్థమవుతుందని మద్రాసు విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగ విశ్రాంత అధిపతి జ్యోతి శివజ్ఞానం అన్నారు.

"ఆర్థిక వ్యవస్థ ఆదాయ వ్యయాల కొనసాగింపుపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఖర్చు బడ్జెట్‌ను శాసనసభలో ఆమోదింపజేస్తారు. దాని నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయాలన్నా శాసనసభ ఆమోదం అవసరం. అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయమైతే పార్లమెంటు ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది"

"అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయడానికి కాగ్ కూడా ఈ ఖాతాలను తర్వాత ఆడిట్ చేస్తుంది. ఈ ఆర్థిక విధానాలను, వాటి సందర్భాన్నిముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోలేదనిపిస్తోంది" అని జ్యోతి శివజ్ఞానం అన్నారు.

తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏంటి?

15 ఏళ్లుగా వివిధ ప్రభుత్వాల హయాంలో తమిళనాడు అప్పు క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2011, 2021 మధ్య కాలంలో ఈ పెరుగుదల మరీ తీవ్రంగా ఉంది.

ఆ తర్వాత కోవిడ్ సంక్షోభ సమయంలో పెరిగిన సంక్షేమ వ్యయం, లాక్‌డౌన్ సమయంలో తగ్గిన ఆదాయాలు, మౌలిక సదుపాయాలలో పెరిగిన పెట్టుబడులతో ఇది మరింత పెరిగింది. అయితే ఈ కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయమైన వృద్ధిని సాధించిందని నిపుణులు అంటున్నారు.

"రాష్ట్ర రుణం పెరిగింది. కానీ రుణం రూ. 5 లక్షల కోట్లుగా ఉన్నప్పుడు, రాష్ట్ర జీడీపీ సుమారు రూ. 20 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడు అది రెట్టింపు అయి సుమారు రూ. 40 లక్షల కోట్లకు చేరింది. ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో పోలిస్తే రుణంలో పెద్ద తేడా ఏమీ లేదు" అని జ్యోతి శివజ్ఞానం అన్నారు

ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెట్టింపు అయినప్పుడు రుణం కూడా పెరుగుతుంది. కానీ "అప్పు, జీడీపీ మధ్య నిష్పత్తి దాదాపుగా అలాగే ఉంటుంది" అని తెలిపారు.

ఆర్థిక పరిస్థితిని కేవలం అప్పుల ద్వారా నిర్ధరించవచ్చా?

ప్రతి జిల్లాలో విద్యను విస్తరించే, పారిశ్రామిక పెట్టుబడులను ప్రోత్సహించే సంక్షేమ పథకాలలో తమిళనాడు చరిత్రాత్మకంగా పెట్టుబడులు పెట్టింది. ఈ కారణంగానే రాష్ట్ర వృద్ధి రేటు నిలకడగా పెరిగిందని నిపుణులు అంటున్నారు.

"ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అనేక దేశాలకు భారీ అప్పులు కూడా ఉన్నాయి. ఇందులో అమెరికా, చైనా వంటి దేశాలు కూడా ఉన్నాయి. దాదాపు ప్రతి దేశం జీడీపీ ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దానితో పాటు మొత్తం రుణ స్థాయి కూడా పెరుగుతుంది" అని జ్యోతి శివజ్ఞానం విశ్లేషించారు.

అందువల్ల ఒక దేశం లేదా రాష్ట్రం రుణాన్ని దాని మొత్తం రుణం ఆధారంగా మాత్రమే కాకుండా, జీడీపీ, రాబడి, ఆర్థిక వృద్ధి రేటు, భవిష్యత్ వృద్ధి సామర్థ్యం ఆధారంగా కూడా అంచనా వేస్తారు.

"తక్కువ జనాభా, సమృద్ధిగా సహజ వనరులు ఉన్న నార్వే వంటి దేశాలు మినహా ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రభుత్వమూ తమ పరిపాలనకు రుణాలు తీసుకోవలసి వస్తుంది" అని ఆయన అన్నారు.

‘హామీల అమలు భారం’

విజయ్ తన ఎన్నికల హామీల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించారు. వీటిలో ఒకటైన "అర్హులైన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్" హామీని ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకంతోనే నెరవేర్చారు.

రెండు నెలల్లో 500 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.

ఇది కాకుండా ' సమ్మానిత్ మహిళా యోజన' కింద ప్రతి కుటుంబంలోని మహిళా యజమాని బ్యాంకు ఖాతాలో 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రతి నెలా రూ. 2,500 జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో విజయ్ హామీ ఇచ్చారు.

ప్రతి కుటుంబం బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బు జమ చేసి ఆరు ఎల్‌పీజీ సిలిండర్లను కొనుగోలు చేయడం, 'వెట్రి పయన్' పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 'అన్నన్ సీర్ పథకం' కింద వివాహ సమయంలో వధువుకు 8 గ్రాముల బంగారం, పట్టు చీరను ఇవ్వడం, 'తాయి మామన్ గోల్డ్ రింగ్ స్కీమ్ ' కింద ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించిన ప్రతి బిడ్డకు బంగారు ఉంగరం, అవసరమైన వస్తువుల కిట్ ఇవ్వడం వంటి వాగ్దానాలు చేసింది టీవీకే పార్టీ.

ఇది కాకుండా నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 4,000 భత్యం ఇస్తామని, ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని కూడా విజయ్ హామీ ఇచ్చారు.

ఈ హామీలను నెరవేర్చడానికి, "కనీసం రూ. లక్ష కోట్లు అవసరం కావచ్చు. అంత డబ్బు ఎక్కడి నుంచి సమకూరుస్తాకనేదే విజయ్ ముందున్న అతిపెద్ద సవాలు" అని సీనియర్ జర్నలిస్ట్ శివప్రియన్ అంటున్నారు.

"ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తే, అది బడ్జెట్ నిర్వహణ చట్టం కింద నిర్దేశించిన పరిమితులపై ఒత్తిడి కలిగించవచ్చు. కేంద్ర ప్రభుత్వమే కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దీనిని అనుమతించదు. ఈ విషయంపై ఎవరైనా కోర్టుకు వెళితే, సుప్రీంకోర్టు కూడా అనుమతించదు" అని ఆర్థికవేత్త కృష్ణమూర్తి ప్రభాకరన్ అన్నారు.

"విజయ్ గత ఆరు నెలలుగా రాష్ట్ర రుణాల గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ తెలిసినప్పటికీ ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు. ఆయన చెబుతున్నట్టుగా నిజంగానే అంతటి ఆర్థిక సంక్షోభం ఉంటే ఆ పరిస్థితిలో ఈ వాగ్దానాలను నెరవేర్చడం సాధ్యమవుతుందో లేదో ఆయన ముందుగా ఆలోచించి ఉండాల్సింది" అని విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)