అగ్నిపర్వతం పేలుడు: ''నేనే వాళ్లను కొండమీదకు తీసుకెళ్లా, నా కళ్ల ముందే బండరాళ్ల కింద నలిగి చనిపోయారు''- ప్రత్యక్ష సాక్షి గైడ్ వివరించిన భయంకర క్షణాలు

    • రచయిత, అస్టుడెస్ట్రా అజెంగ్రాస్ట్రి, టెస్సా వోంగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • చదివే సమయం: 6 నిమిషాలు

డుకోనో పర్వతంపైకి వెళ్లిన పర్వతారోహకులు బృందానికి నాయకత్వం వహించిన ఇండోనేషియా గైడ్ శుక్రవారం(మే 8) జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనానికి సంబంధించిన భయంకర క్షణాలను వివరించారు. ఈ ప్రమాదంలో ఆయన బృందంలోని ముగ్గురు సభ్యులు మరణించారు.

అగ్నిపర్వత బిలం నుంచి వెలువడ్డ ఓ భారీ బండరాయి తన మీద పడకుండా రెజా సెలాంగ్ తప్పించుకున్నారు. ఆయన పక్కనే ఉన్న ఇద్దరు పర్వతారోహకులపై ఆ బండరాయి పడింది.

''చెప్పడానికి మాటలు రావడం లేదు. నేను ముక్కలైపోయాననే ఇప్పటికీ అనిపిస్తుది. నేను నమ్మలేకపోతున్నా. ప్రస్తుతం చాలా బాధలో ఉన్నా'' అని ఆయన బీబీసీతో ఫోన్‌లో చెప్పారు.

విస్ఫోటనంలో ఇద్దరు సింగపూర్ వాసులు, ఇండోనేషియాకు చెందిన ఒకరు మరణించారని ఇండోనేషియా అధికారులు చెప్పారు.

ఉత్తర మలుకులో ఉన్న హల్మహేరా దీవిలోని పర్వతం నుంచి మిగిలిన పర్వతారోహకులను సురక్షితంగా తీసుకొచ్చామని తెలిపారు.

మార్చి చివరి నుంచి ఇప్పటిదాకా 200సార్లు బద్ధలైన అగ్నిపర్వతం

సింగపూర్, ఇండోనేషియాకు చెందిన 20మంది పర్వతారోహకుల బృందం పర్వతంపైకి ఎక్కింది. అక్కడకు వెళ్లొద్దని ముందస్తు హెచ్చరికలున్నా వాళ్లు పట్టించుకోలేదు.

మార్చి చివరి నుంచి ఇప్పటిదాకా 200 సార్లు ఈ అగ్నిపర్వతం బద్ధలైంది. ఏప్రిల్ 17నుంచి డుకోనో పర్వతం అధిరోహించడానికి అనుమతులు నిలిపివేశామని అధికారులు చెప్పారు. అగ్నిపర్వత బిలం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రజల సంచారంపై నిషేధం విధించామని తెలిపారు.

సోషల్ మీడియాలో హెచ్చరికలను పోస్ట్ చేశామని, ఎంట్రన్స్‌ల దగ్గర బ్యానర్లు పెట్టామని కూడా అధికారులు తెలిపారు.

యాత్రకు బయలుదేరేటప్పుడు తమకివన్నీ తెలియదని రెజా చెప్పారు.

డుకోనో పర్వతంపైకి బృందాలను తీసుకెళ్లడానికి తనకు సహాయం చేసేందుకు తానెప్పుడూ నియమించుకునే స్థానిక గ్రామస్థులు కూడా నిషేధం గురించి తనకు చెప్పలేదన్నారు.

నిమిషం వ్యవధిలోపే రెండు విస్ఫోటనాలు

ఉత్తర మలుకులో రెజా ఓ పర్యటక కంపెనీ నిర్వహిస్తున్నారు. సాహసయాత్రల నిర్వహణ చూసే సింగపూర్‌కు చెందిన తిమోథీ హెంగ్ అనే వ్యక్తి, గత ఏడాది తనను సంప్రదించారని రెజా చెప్పారు. డుకోనో, ఈ ప్రాంతంలోని ఇతర పర్వతాలు ఎక్కేందుకు పర్వతారోహకుల బృందానికి సహకరించాలని హెంగ్ కోరారని రెజా గుర్తుచేసుకున్నారు.

గత గురువారం మధ్యాహ్నం(మే 7) తమ బృందం డుకోనో ఎక్కడం మొదలుపెట్టినప్పుడు అగ్నిపర్వతం బద్ధలయ్యే సంకేతాలేమీ కనిపించలేదని, విస్ఫోటనంలాంటివేమీ లేవని ఆయన తెలిపారు.

మరుసటి రోజు ఉదయం పర్వతశిఖరాన్ని చేరుకున్నప్పుడు కూడా అంతా ప్రశాంతంగా ఉందని, పర్వత బిలాన్ని పరిశీలించడానికి డ్రోన్ కెమెరా ఉపయోగించినప్పుడు కూడా ఏమీ కనిపించలేదని, పొగ కూడా లేదని ఆయన గుర్తుచేసుకున్నారు.

ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా దిగిపోయేటట్టయితే పర్వత బిలం దగ్గరకు వెళ్లొచ్చని ఆయన ఆ బృందంతో చెప్పారు. హెంగ్ సహా మొత్తం 14మంది అక్కడకు వెళ్లగా, రెజా, మిగిలిన వాళ్లు కింద ఉండిపోయారు.

స్థానిక కాలమానం ప్రకారం 7.40 గం.లకు తాను డ్రోన్ కెమెరా ఉపయోగించి బృందంలోని సభ్యులను పరిశీలిస్తున్నానని, ఒక్క నిమిషం తర్వాత అగ్నిపర్వతం బద్ధలయిందని రెజా తెలిపారు.

''ఒక్క నిమిషం వ్యవధిలో రెండు విస్ఫోటనాలు జరిగాయి. మొదట విస్ఫోటనంలో పొగ మాత్రమే వచ్చింది. బహుశా 15 నుంచి 20 సెకన్ల తర్వాత రెండో విస్ఫోటనం జరిగింది'' అని ఆయన తెలిపారు.

రెండువైపుల నుంచీ బండ రాళ్లు పడుతుండగా...

బృందంలోని సభ్యులు భయపడి పర్వతంపై నుంచి కిందకు పరుగులు తీశారని, డ్రోన్ కెమెరా ఉపయోగించి తానో వ్యక్తిని గుర్తించానని, సింగపూర్ పర్వతారోహకుడు షాహిన్ ముహ్రెజ్ బిన్ అబ్దుల్ హమీద్ పర్వత బిలానికి దగ్గర కింద పడిపోయారని రెజా చెప్పారు.

షాహిన్‌ను రక్షించేందుకు రెజా వెళ్లారు. గ్రూప్‌లో మొదట తప్పించుకున్న హెంగ్ కూడా వెనక్కి పరుగెత్తారు.

రెండువైపులా రాళ్లు పడుతుండగా ఇద్దరం కలిసి షాహిన్‌ను శిఖరం దిగువకు లాక్కొచ్చామని రెజా గుర్తుచేసుకున్నారు.

''తర్వాత పర్వత బిలం నుంచి 6.5 అడుగుల వెడల్పు ఉన్న బండ బయటకు వచ్చింది. దొర్లుతూ మావైపు రాసాగింది.

''హెంగ్ వెనక్కి తిరిగారు. ఒక్క క్షణం వ్యవధిలో ఆయన షాహిన్‌ను కౌగిలించుకున్నారు. ఆ బండ హెంగ్, షాహిన్‌ మీద పడడంతో వాళ్లు నలిగిపోయారు''

''నేను ఒక్క క్షణం స్థాణువైపోయాను. దాదాపు ఓ నిమిషంపాటు అలా ఉన్నానేమో. వెంటనే ఆ షాక్ నుంచి బయటపడి నా ప్రాణాలను కాపాడుకునేందుకు పర్వతం కిందకు పరుగులు తీశాను'' అని రెజా ఘటన జరిగిన తీరును వివరించారు.

ఘటన గురించి సమాచారమందించడంతో అధికారులు వెంటనే ఆ ఇద్దరి కోసం, కనిపించకుండాపోయిన మరో వ్యక్తి ఏంజెల్ క్రిషెలా కోసం గాలింపు, సహాయక చర్యలను ప్రారంభించారు.

గ్రూప్‌లోని మరో సభ్యునితో కలిసి సెర్చ్ ఆపరేషన్‌లో సహకరించేందుకు రెజా అక్కడే ఉండిపోయారు.

శనివారం శిఖరానికి దగ్గర ఏంజెల్ మృతదేహం కనిపించింది. హెంగ్, షాహిన్ ముహ్రెజ్ అవశేషాలను వెలికితీశారు.

సహాయక చర్యల అధికారులు బీబీసీకి ఓ వీడియో ఇచ్చారు. ఓ పెద్ద బండ కింద నల్లగా, దట్టంగా ఉన్న బూడిద పొరను తవ్వుతూ ఎముకల అవశేషాలను వెలికితీస్తున్న కార్మికులు ఆ వీడియోలో కనిపించారు.

ప్రమాదం నుంచి బయటపడిన పర్వతారోహకులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి గాయాలకు చికిత్స అందించారు. మిగిలిన సింగపూర్ పర్వతారోహకులు ఇళ్లకు తిరిగి వెళ్లారు.

'నిర్లక్ష్యం ఉందా?'

శుక్రవారం ఘటన తర్వాత అధికారులు డుకోనో పర్వతానికి దారితీసే అన్ని ఎంట్రన్స్‌లను శాశ్వతంగా మూసివేశారు. పర్వతం ఎక్కడంపై ఉన్న నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు చెప్పారు. టూరిజం ఆపరేటర్లు లేదా వ్యక్తుల నిర్లక్ష్యం ఉండిఉండొచ్చన్న సంకేతాలిచ్చారు.

స్థానిక పోలీసులు తనను విచారించారని రెజా చెప్పారు. తన డ్రోన్ కెమెరా ఫుటేజ్‌ను ఆధారాల కోసం వారికి ఇచ్చానని తెలిపారు.

పర్వతాన్ని అధిరోహించడం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని ఉత్తర హల్మహేరా పోలీసులు ఓ ప్రకటనలో చెప్పారు. రెజా టూర్ కంపెనీకి చెందిన ఇద్దరిని ప్రశ్నించామని, వారిలో ఒకరి ఇంటిపేరు రెజా ఇంటిపేరులానే ఉందని తెలిపారు.

ప్రస్తుతం ఈ ఘటనకు ఇద్దరిని ప్రత్యక్ష సాక్షులుగా భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదకర పర్వతారోహణ నిర్వహించిన ప్రతి ఒక్కరినీ దర్యాప్తులో భాగంగా ప్రశ్నిస్తామని అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు. పర్యటకుల ప్రాణాలు పోవడానికి కారణమైనవారి నిర్లక్ష్యాన్ని సహించబోమని చెప్పారు.

''నేను సిద్ధంగా, ఉన్నా లేకపోయినా చట్టపరంగా ఎలాంటి పరిణామాలున్నా నేను వాటిని అంగీకరించాల్సిందే. అది త్వరలోనే అయిపోతుందని భావిస్తున్నా'' అని రెజా చెప్పారు.

పర్వతారోహణపై నిషేధం ఉందన్న విషయం తనకు తెలియదని రెజా చెబుతున్నప్పటికీ ఇండోనేషియాలోని ఫోర్-టైర్ అగ్నిపర్వత విస్ఫోటన హెచ్చరిక వ్యవస్థలో డుకోనో పర్వతం లెవల్ 2లో ఉందన్న విషయం తెలుసని అంగీకరిస్తున్నారు.

అగ్నిపర్వత విస్ఫోటనం జరిగే అవకాశం పెరిగినప్పుడు స్పష్టంగా పరిశీలించగల అవకాశం లెవల్ 2లో ఉంటుంది. విస్ఫోటనం ప్రమాదం కనిపిస్తే ఆ ప్రత్యేక ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా నిషేధం విధిస్తారు.

టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనే పసిఫిక్‌లోని ''రింగ్ ఆఫ్ ఫైర్'' ప్రాంతంలో ఉండే ఇండోనేషియాలో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు తరచుగా జరుగుతుంటాయి.

‘‘మోకాళ్లపై కూర్చుని క్షమాపణ అడగాలనుంది’’

దాదాపు ప్రతి నెలా తాను డుకోనో పర్వతం ఎక్కుతానని రెజా చెబుతున్నారు. లెవల్ 2 పర్వతాలుగా భావించే రింజని వంటి వాటిపై ఇప్పుడు కూడా పర్వతారోహణ కొనసాగుతోందన్నారు.

ఇండోనేషియాలో పర్వతారోహణకు అత్యంత ప్రసిద్ధిగాంచిన పర్వతాల్లో ఒకటి రింజని. ఇది కూడా లెవల్ 2 పరిధిలో ఉంది. దాని పర్వతాబిలానికి దగ్గర కార్యకలాపాలపై నిషేధం ఉంది.

డుకోనోలాగానే ఇండోనేషియాలో అనేక అగ్ని పర్వతాలు, పర్వతారోహకులను ఆకర్షిస్తుంటాయి. పర్వత బిలం దగ్గర అధిరోహణ చేస్తూ గత ఏడాది జూన్‌లో ఓ బ్రెజిల్ మహిళ చనిపోయారు.

శుక్రవారం ప్రమాదంపై దర్యాప్తు పూర్తయ్యేవరకు ఎదురుచూస్తానని రెజా చెప్పారు.

''చనిపోయినవారి విషయంలో, వారి కుటుంబాల విషయంలో నాకు చాలా బాధ ఉంది. నేను సింగపూర్ వెళ్లి మోకాళ్లపై కూర్చుని బాధితుల తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని క్షమాపణ అడగాలనుకుంటున్నా'' అని రెజా ఆవేదన వ్యక్తంచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)