తమిళనాడు: 'విజయ్ పార్టీ అధికారంలోకి రావచ్చన్న ఒక ఎగ్జిట్ పోల్ అంచనా'పై అక్కడి రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?

    • రచయిత, జేవియర్ సెల్వకుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 7 నిమిషాలు

తమిళనాడులో డీఎంకే కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, ఒక సర్వే మాత్రం సినీ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం(టీవీకే) సొంతంగా మెజారిటీ సాధించి అధికారాన్ని దక్కించుకుంటుందని చెబుతోంది.

అయితే, ఆ సర్వే చేసిన సంస్థ గత లోక్‌సభ ఎన్నికలలో చేసిన పొరపాటునే ఈసారి సర్వేలో కూడా చేసిందని డీఎంకే, ఏఐఏడీఎంకే సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తీవ్రంగా విమర్శించాయి.

ఎన్నికల ఫలితాలను ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ కచ్చితంగా ప్రతిబింబించలేవు.

ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే ఫలితాలు గతంలో భిన్నంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

తమిళనాడు సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

సర్వేలు ఏం చెబుతున్నాయి?

తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బుధవారం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

ఎక్కువ సర్వేలు డీఎంకే కూటమే విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.

జేవీసీ (టైమ్స్ నౌ), ఓట్ వైబ్ (సీఎన్ఎన్ న్యూస్ 18) సర్వేలు మాత్రం ఏఐఏడీఎంకే అధికార పీఠాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.

ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌ మాత్రం సినీ నటుడు విజయా పార్టీ టీవీకే మెజారిటీ సాధించి, అధికారాన్ని చేపడుతుందని అంచనా వేసింది.

ఈ ఎన్నికలలో డీఎంకే కూటమి, టీవీకే చెరో 35 శాతం చొప్పున ఓట్లను దక్కించుకుంటాయని, ఏఐఏడీఎంకే కూటమి మాత్రం 23 శాతం ఓట్ల షేర్‌తో సరిపెట్టుకుంటుందని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా అంచనా వేసింది.

అలాగే, డీఎంకే కూటమికి 92-110 స్థానాలు వస్తాయని, టీవీకే 98-120 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది.

ఏఐఏడీఎంకే కూటమికి 22 - 32 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది.

దేశంలోని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థల్లో ఒకటిగా పరిగణించే యాక్సిస్ మై ఇండియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో, తమిళనాడులో కొత్త పార్టీ టీవీకే సొంతంగా పూర్తి మెజారిటీ సాధిస్తుందని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

విమర్శిస్తున్న ప్రత్యర్థి పార్టీలు

టీవీకే అధికారంలోకి వస్తుందన్న యాక్సిస్ మై ఇండియా సంస్థ ఎగ్జిట్ పోల్ అంచనాలు ఆ పార్టీ మద్దతుదారులు, విజయ్ అభిమానులకు ఆనందాన్ని కలిగించాయి. కానీ, ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఈ సర్వేను విమర్శిస్తున్నాయి.

తాము క్షేత్రస్థాయిలో పరిశీలించిన దాన్నిబట్టి చూస్తే, యాక్సిస్ మై ఇండియా అంచనాలకు పూర్తి భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి కల్యాణ సుందరం బీబీసీతో అన్నారు.

''గతంలో కొంగునాడు మున్నేట్ర కళగం పార్టీని స్థాపించినప్పుడు, పశ్చిమ ప్రాంతంలోని చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజేతలుగా లేదా రెండో స్థానంలో నిలుస్తారని అంచనా వేశారు. కానీ, వారికి చాలాచోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏఐఏడీఎంకే మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటుంది'' అని ఆయన అన్నారు.

యాక్సిస్ మై ఇండియా సంస్థ గత అంచనాలను, ఎన్నికల ఫలితాలను డీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్.ఎస్.భారతి ప్రస్తావించారు.

''టీవీకే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇప్పుడు అంచనా వేసిన సంస్థే, గత లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 400 కంటే ఎక్కువ స్థానాలలో గెలుస్తుందని అంచనా వేసింది. ఈ తప్పుడు అంచనా వల్ల అప్పట్లో టీవీ చర్చా కార్యక్రమంలో వారు ఏడ్చారు. ఇప్పుడు ఈ అంచనాతో మళ్లీ ఓట్ల కౌంటింగ్ రోజున అదే చేస్తారు'' అని ఆయన తీవ్రంగా విమర్శించారు.

టీవీకే ఏమంటోంది?

టీవీకే 200 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేఏ సెంగొట్టయాన్ ఏప్రిల్ 30న కోయంబత్తూరులో విలేఖరులతో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు.

''టీవీకే 200 స్థానాల్లో గెలుస్తుంది. తమిళనాడును విజయ్ పరిపాలిస్తారు. హరిత విప్లవం, శ్వేత విప్లవం, సోషలిస్టు విప్లవం మాదిరిగానే తమిళనాడులో జరిగే 'విజిల్ విప్లవం' కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది'' అని ఆయన అభివర్ణించారు.

'ఇతర సర్వేల్లోనూ కొంత కనిపించాలి కదా'

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో, ఎన్నికల్లో టీవీకే ప్రభావం ఉండుంటే అది ఇతర సర్వేల్లో కూడా కనీసం కొంచెమైనా ప్రతిబింబించి ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ ప్రియన్ అభిప్రాయపడ్డారు.

ఎగ్జిట్ పోల్స్‌లో మెజారిటీ సర్వేలు డీఎంకే కూటమి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతున్నాయని, అదే సరైన అంచనా అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు.

''పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఆ సంస్థ (యాక్సిస్ మై ఇండియా) అంచనా తప్పింది. వారు మళ్లీ అదే తప్పు చేశారు. ఆ సంస్థ ప్రతి నియోజకవర్గంలో కేవలం 188 మందితో ఫోన్‌లో అభిప్రాయం తీసుకొని, ఈ అంచనాలను విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీని విశ్వసనీయత ఎంతవరకూ ఉంటుందో తెలియదు. టీవీకే 25-30 స్థానాలను గెలుచుకుంటుందని చెబితే నమ్మవచ్చు, కానీ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేస్తుందంటే మాత్రం ఎవరూ నమ్మరు'' అని ప్రియన్ అభిప్రాయపడ్డారు.

‘సర్వేలలో లోపాలు ఉన్నాయి’

టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అంచనాలో అనేక లోపాలు ఉన్నాయని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు గోపన్న అన్నారు.

''ఆ అంచనా క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించడం లేదు. నమూనా సరిగ్గా లేదు. క్షేత్రస్థాయిలో లోతైన పరిశీలన జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేసినట్లుగా అనిపించట్లేదు. పట్టణ, నగర ప్రాంతాల్లో విజయ్‌కు ఎక్కువ మద్దతు ఉందన్న విషయాన్ని కాదనలేం. కానీ, అది ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయిలో ఉందా అంటే, కచ్చితంగా లేదనే చెప్పాలి'' అని ఆయన అన్నారు.

''పార్టీకి సరైన నిర్మాణం లేదు, తగిన అభ్యర్థులను నిలబెట్టలేదు. కేవలం విజయ్‌ని చూసి పడే ఓట్లను చూసి, మొదటి ఎన్నికల్లోనే అధికారాన్ని దక్కించుకుంటుందనడం అతిశయోక్తితో కూడిన కల్పన మాత్రమే. యువత, అభిమానులు, భావోద్వేగానికి లోనయ్యేవారు వేసే ఓట్లు ఎన్నికల ఫలితాల్లో పెద్దగా ప్రభావం చూపవు'' అని గోపన్న అన్నారు.

‘ఆ అవకాశాన్ని టీవీకే చేజార్చుకుంది’

ఎన్నికల వ్యూహకర్త లియో రీగన్ బీబీసీతో మాట్లాడుతూ, ''క్షేత్రస్థాయిలో తగిన కార్యాచరణ, కేడర్ నిర్మాణం లేకపోవడం వల్ల విజయ్‌‌పై ఉన్న ప్రజాభిమానాన్ని ఓట్లుగా మార్చుకునే అవకాశాన్ని టీవీకే చేజార్చుకుందని గమనించాం'' అని చెప్పారు.

''గ్రామీణ నియోజకవర్గాల్లో టీవీకే అభ్యర్థులు ఎవరికీ తెలియదు. పోలింగ్ బూత్ స్థాయిలో సరైన కార్యాచరణ జరగలేదు. అభ్యర్థులకు తగిన మార్గదర్శకాలు లేవు. కేవలం విజయ్ ముఖచిత్రంతోనే ఎన్నికల ప్రచారం అంతా సాగింది. డీఎంకేను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న విజయ్.. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి నియోజకవర్గాల్లో ప్రచారానికే వెళ్లలేదు'' అని అన్నారు.

టీవీకేకి ఎన్ని ఓట్లు రావొచ్చు?

తమిళనాడులో టీవీకే ఎంత శాతం ఓట్లను సాధిస్తుంది? అది ఏ పార్టీ ఓటు బ్యాంకుకు కోత పెడుతుంది? అనే చర్చలు సాగుతున్నాయి.

పార్టీపై అభిమానమే కాకుండా, మార్పు కోరుకుంటూ ఓటు వేసే ఒక వర్గం ఉంటుందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జీకే నాగరాజ్ అన్నారు. కొత్త ఓటర్లతో కలిపి ఎలా చూసినా టీవీకే పార్టీకి 20 శాతం కంటే ఎక్కువగానే ఓట్లు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

చెన్నైలో మాత్రం 30 శాతం వరకూ ఓట్ల శాతం ఉండవచ్చని ఆయన చెప్పారు.

ఏదేమైనా, టీవీకే సగటున 17 నుంచి 22 శాతం ఓట్లను సాధిస్తుందని లియో రీగన్ అన్నారు.

జర్నలిస్ట్ ప్రియన్ కూడా ఇంచుమించుగా అదే అంచనా వేశారు.

''టీవీకే సగటున 20 నుంచి 25 శాతం ఓట్లను సాధించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతానికి తగ్గవచ్చు, పట్టణాల్లో 25 శాతం వరకూ, నగరాల్లో 30 శాతం వరకూ ఉండవచ్చు. అయినప్పటికీ, ఆ పార్టీకి విజయావకాశాలు కేవలం 15 నియోజకవర్గాల్లోనే కనిపిస్తున్నాయి'' అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)