You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జీపీఎస్ స్పూఫింగ్: విమానం వందల కి.మీ.లు జంప్ చేసినట్లు అనిపించే ఈ టెక్నికల్ సమస్య ఏంటి, పైలట్లు ఎందుకు భయపడుతున్నారు?
- రచయిత, పీటర్ బాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హెలీ ప్రయాణిస్తున్న బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ జెట్ గతవారం ఎస్టోనియా మీదుగా, రష్యా సరిహద్దుకు సమీపంలో ఎగురుతుండగా ఒక విచిత్రమైన ఘటన జరిగింది.
ఆ విమానం ట్రాన్స్‌పాండర్ అకస్మాత్తుగా కొన్ని క్షణాల ముందు ఉన్న ప్రదేశం నుంచి సుమారు 200 మైళ్లు (300 కిమీ) దూరంలో, రష్యా భూభాగంలో ఉన్నట్లు సంకేతాలు పంపడం మొదలుపెట్టింది. ఆ విమానపు ఫ్లైట్ డేటాను బీబీసీ వరల్డ్ సర్వీస్ పరిశీలించింది.
అది సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలోని ఒక సరస్సు మీద గంటకు కేవలం 11 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నట్లు చూపించింది.
కానీ, అదేదీ నిజం కాదు. జీపీఎస్ స్పూఫింగ్ కారణంగా ఆ విమానం నావిగేషన్ వ్యవస్థ సరిగా పనిచేయలేదు.
జీపీఎస్ ఉపగ్రహాలు పంపే సంకేతాలను అనుకరించే రేడియో సిగ్నల్స్‌తో ఒక ప్రాంతం మొత్తాన్ని నింపివేయడాన్ని జీపీఎస్ స్పూఫింగ్ అంటారు.
స్పూఫింగ్‌ను ఎక్కువగా సైనిక దళాలు ఉపయోగిస్తాయి. జీపీఎస్ నావిగేషన్‌పై ఆధారపడే శత్రు ఆయుధాల గురిని తప్పించడానికి లేదా వాటిని తప్పుదోవ పట్టించడానికి దీనిని ప్రయోగిస్తుంటారు. దీర్ఘ శ్రేణి క్షిపణులు, చిన్న డ్రోన్లు వంటివి ఇలాంటి చర్యల వల్ల అయోమయానికి గురవుతుంటాయి.
చాలా సైనిక దళాలకు ఇందుకోసం ప్రత్యేక యూనిట్లు ఉంటాయి. వారు స్థిరమైన బేస్‌లలో ట్రాన్స్‌మిటర్లను ఏర్పాటు చేస్తారు. లేదంటే వాహనాలపై వాటిని తరలిస్తూ ఉపయోగిస్తారు.
అయితే, కమర్షియల్ ఫ్లైట్స్ కూడా ఈ ఎలక్ట్రానిక్ యుద్ధంలో చిక్కుకుంటున్నాయి.
రాయల్ ఎయిర్‌ఫోర్స్ (రాఫ్) పైలట్లు జీపీఎస్‌కు సమాంతరంగా పనిచేసే పాత, తక్కువ కచ్చితత్వం ఉన్న నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించి ఆ విమానాన్ని నడిపించాల్సి వచ్చింది. విమాన భద్రతకు ఎలాంటి ముప్పు కలగలేదని యుకే రక్షణ శాఖ పేర్కొంది.
వాస్తవానికి ఆ రోజున ప్రభావితమైన ఏకైక విమానం అది మాత్రమే కాదు. స్పూఫింగ్ కారణంగా 100కి పైగా ప్రయాణికుల విమానాలు తప్పు స్థానాలను చూపించాయని విమానయాన కన్సల్టెన్సీ సంస్థ స్కై డేటా సర్వీసెస్ బీబీసీతో పంచుకున్న డేటా ద్వారా తెలుస్తోంది.
యుద్ధ ప్రాంతాల దగ్గర లేదా సైనిక కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్పూఫింగ్, జామింగ్ ఎక్కువగా జరుగుతోందని ఆ డేటా ద్వారా స్పష్టమవుతోంది.
ఉదాహరణకు బాల్టిక్ ప్రాంతం, గల్ఫ్, ఎర్ర సముద్రం, భారత్-పాకిస్తాన్ ప్రాంతం, మియన్మార్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇలా జరుగుతుంది.
గల్ఫ్ ప్రాంతంలో, ఉదాహరణకు ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తర్వాత విమానాలు స్పూఫింగ్‌ను రిపోర్టులు గణనీయంగా పెరిగాయి. మార్చిలో 5,381 విమానాలు స్పూఫింగ్‌కి గురైనట్టు తెలిసింది.
ఫిబ్రవరిలో ఈ సంఖ్య 99, జనవరిలో 14 మాత్రమే అని స్కై డేటా సర్వీసెస్ వెల్లడించింది.
బాల్టిక్ ప్రాంతంలో స్పూఫింగ్ కేసులు 2024లో 17,243 నుంచి 2025లో 59,447కు పెరిగాయని స్కై డేటా సర్వీసెస్ గణాంకాలు చూపిస్తున్నాయి.
ఇది రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ల దాడుల వినియోగం పెరుగుతున్న సమయంలో చోటుచేసుకుంది.
యూరప్, మధ్య ప్రాచ్యం, ఆసియాలోని అనేక రద్దీగా ఉండే విమాన మార్గాలు కూడా స్పూఫింగ్, జామింగ్ సమస్యలను ఎదుర్కొన్నాయి.
ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 800కి పైగా విమానాలు దీనివల్ల ప్రభావితమయ్యాయి.
ఈ సాంకేతికత చాలా దేశాలకు సులభంగా అందుబాటులో ఉండటంతో భవిష్యత్తులో ఇది నిత్యకృత్యంగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత నెలలో సౌదీ అరేబియా నుంచి ఒమన్‌కు నాలుగు సీట్ల విమానం నడిపిన బ్రిటిష్ పైలట్ శామ్ రూథర్‌ఫర్డ్, సౌదీ-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరిహద్దు దగ్గరికి చేరుకున్న సమయంలో ఫ్లైట్ నావిగేషన్, ఆటోపైలట్ వ్యవస్థలు పని చేయడం ఆగిపోయాయి.
మొదట ఇది విమానంలో సమస్య కావచ్చని అనుకున్నారు. కానీ, అదే ప్రాంతంలో ఉన్న అనేక విమాన సంస్థలు కూడా అదే సమస్యను నివేదిస్తున్నట్లు తెలిసింది.
జీపీఎస్ స్పూఫింగ్, జామింగ్ రెండూ ఆయన విమానాన్ని ప్రభావితం చేస్తున్నాయని తర్వాత తెలిసింది.
బ్రిటిష్ ఆర్మీలో ఎనిమిదేళ్లు హెలికాప్టర్లు నడిపిన రూథర్‌ఫర్డ్, తన విమానంలోని మాగ్నెటిక్ కంపాస్‌ను ఉపయోగించండంతోపాటు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి గమ్యస్థానానికి చేరేందుకు సాయం తీసుకున్నారు. సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.
‘‘ప్రతికూల వాతావరణంలో, ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఇలా జరిగితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది" అన్నారాయన.
స్పూఫింగ్ వల్ల ప్రమాదం ఏంటంటే, విమానం తన స్థానాన్ని తప్పుగా గుర్తిస్తే, పైలట్లు భూమినుంచి, ఢీకొట్టే హెచ్చరిక వ్యవస్థల నుంచి వచ్చే అలర్ట్‌లను ఆపేయాలి లేదా పట్టించుకోకుండా ఉండాలని యూరోపియన్ కాక్‌పిట్ అసోసియేషన్ అధ్యక్షురాలు టాంజా హార్టర్ అన్నారు. ఈ సంస్థ సుమారు 40,000 మంది పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
ఈ వ్యవస్థ పైలట్లు భూమికి లేదా పర్వతాలవంటి అడ్డంకులకు ఢీకొట్టే ప్రమాదంలో ఉన్నారని భావించినప్పుడు హెచ్చరిస్తుంది.
పైలట్లు 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పటికీ, వారికి తప్పుగా "పుల్-అప్" (పైకి ఎగరాలి) అనే హెచ్చరికలు వచ్చిన అనేక ఘటనలు ఉన్నాయని టాంజా తెలిపారు.
విమానాలు ప్రతికూల వాతావరణాన్ని తప్పించుకోవడానికి సాయపడే రాడార్ వ్యవస్థలు కూడా పనిచేయకుండా పోవచ్చని ఆమె చెప్పారు.
అనేక విమాన సంస్థలు పైలట్లకు సమాచారం బాగానే అందిస్తున్నప్పటికీ, ఈ సమస్యలన్నీ కలిపి విమానంలోని భద్రతా వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని టాంజా అన్నారు.
"విమానం స్క్రీన్‌లో చూపించిన స్థానానికి, నిజానికి మధ్య చూసిన అతిపెద్ద తేడా లిథువేనియా నుంచి నార్త్ సీ కి ఒక్కసారిగా దూకినట్టు ఉంది" అని రూథర్‌ఫర్డ్ తెలిపారు.
"అది 1,600 కిలోమీటర్లకు పైగా ఉంది" అని ఎస్టోనియాలోని చార్టర్ సంస్థ డైమండ్ స్కై ఏవియేషన్ కోసం ప్రయాణికుల విమానాలు నడిపే ఆర్చర్ రోడియోనోవ్ అన్నారు.
తరుచుగా ఇలాగే జరుగుతుండడంతో స్పూఫింగ్‌ను ఎదుర్కోవడానికి ఆయన కంపెనీ ప్రత్యేక నియమాలు రూపొందించింది. ఇంటర్‌ఫియరెన్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎగురుతున్నప్పుడు పైలట్లు జీపీఎస్ వ్యవస్థను డిస్కనెక్ట్ చేయడం కూడా వాటిలో ఒకటని ఆయన తెలిపారు.
దీనివల్ల విమానం సిగ్నల్స్ స్పూఫింగ్‌కు గురవుతున్నాయా లేదా అని పైలట్ గమనించడానికి వీలవుతుంది. అలా చేయడం వల్ల విమానంలోని ఇతర నావిగేషన్ పరికరాలు గందరగోళానికి గురికాకుండా ఉంటాయి.
అనుభవం తక్కువ ఉన్న పైలట్లకు, విమానంలో మెకానికల్ సమస్యలు లేదా పరికరాల వైఫల్యం వంటి ఇతర సమస్యలు ఎదురైనప్పుడు స్పూఫింగ్ వల్ల పరిస్థితి మరింత కష్టమవుతుందని ఆర్చర్ తెలిపారు.
"ఇది కచ్చితంగా ఒత్తిడిని కలిగించే అంశం" అని ఆయన అంటున్నారు.
దేశాలు జీపీఎస్‌లో జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధం కాదు. ప్రసార సంకేతాలను నియంత్రించే ఐక్యరాజ్యసమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ భద్రత లేదా రక్షణ అవసరాల కోసం దీనిని అనుమతిస్తుంది. అయితే దీని విస్తృత వినియోగం విమానాల భద్రతకు ముప్పుగా మారుతోందని ఆందోళనలు వ్యక్తం చేసింది.
"స్పూఫింగ్ జరిగినప్పటికీ భద్రత కొనసాగేందుకు విమానాల్లో ప్రత్యేక రక్షణ చర్యలు ఉన్నాయి. అలాగే విమానంలోని నావిగేషన్ టెక్నాలజీ , భూమిపై ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కలిసి విమానాన్ని సురక్షితంగా నడిపించగలవు" అని యూరప్ వైమానిక నావిగేషన్ భద్రతా సంస్థ యూరో కంట్రోల్ తెలిపింది.
విమాన తయారీదారులు ఏవియానిక్స్ పరికరాల సరఫరాదారులతో కలిసి స్పూఫింగ్‌కు సాంకేతిక పరిష్కారాలను కనుగొనడానికి కృషి చేస్తున్నారని యూరో కంట్రోల్ వెల్లడించింది.
యూరో కంట్రోల్ వంటి విమానయాన సంస్థలు స్పూఫింగ్‌పై ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయి. "ఇది సాధారణ ప్రజలకు ఉద్దేశించికాదు, అలాగే కాక్‌పిట్ భద్రతా సూత్రాలను పూర్తిగా దెబ్బతీస్తుంది" అని బీబీసీ పరిశీలించిన భద్రతా నివేదికలో ఉంది.
ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"భద్రతా సమస్యలకు త్వరగా పరిష్కారం కావాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి" అని టెక్సస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ టాడ్ హంప్రీస్ చెబుతున్నారు.
"విమానయాన రంగం 20 ఏళ్లకు పైగా పాతదైన జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది. పరిశ్రమకు స్పూఫ్, జామ్-రెసిస్టెంట్ జీపీఎస్ రిసీవర్లు అవసరం" అని ఆయన చెప్పారు.
పటిష్టమైన కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.
‘‘విమాన సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసి ఇన్‌టర్‌ఫెరెన్స్‌ను ఫిల్టర్ చేయడం, డైరెక్షనల్ యాంటెన్నాలు ఉపయోగించి నేల నుంటి వచ్చే తప్పుడు సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా చేయడం, అలాగే జీపీఎస్‌తో పాటు పనిచేసే కొత్త నావిగేషన్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేయడం వంటివి జరగాలి. కానీ భద్రతకు కీలకమైన పరికరాల్లో మార్పులు చేయడానికే సమయం పడుతోంది’’ అని ఆయన అన్నారు.
జీపీఎస్ స్పూఫింగ్, జామింగ్ ప్రభావం కేవలం కమర్షియల్ విమానాలపైనే కాదు. ఓడలు, అలాగే ఫోన్‌లలోని మ్యాప్ యాప్‌లపై కూడా ప్రభావం చూపుతుంది.
"ఇది సముద్ర రవాణా, రోడ్లపై ప్రయాణించే ప్రజలందరినీ ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తులో ఎక్కడైనా యుద్ధాలు మొదలైతే, జీపీఎస్ వల్లే మొదటగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుంది" అని ప్రొఫెసర్ టాడ్ హంప్రీస్ అభిప్రాయపడ్డారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)