You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాట్లలో నాసా, జాబిలిపైకి పంపనున్న వాహనాల జాబితా విడుదల
- రచయిత, జార్జినా రన్నార్డ్
- హోదా, సైన్స్ ప్రతినిధి, బీబీసీ న్యూస్
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
చంద్రునిపై శాశ్వత స్థావరాన్ని నిర్మించాలన్న అమెరికా ప్రణాళికలో భాగంగా.. చంద్రునిపైకి పంపాలనుకుంటున్న రోబోటిక్ ల్యాండర్లు, హాపింగ్ డ్రోన్లు, ఇతర వాహనాల వివరాలను నాసా విడుదల చేసింది.
ఈ మెషీన్లను (వాహనాలను) తయారు చేసేందుకు ఎంపిక చేసిన పలు కంపెనీల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజన్ కూడా ఒకటి.
2029లో అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ పదవీ కాలం ముగిసేలోపే, అమెరికన్లను తిరిగి చంద్రుడిపైకి పంపాలని ఆ దేశం భావిస్తోంది. అయితే, ఈ విషయంలో నాసా చైనాతో పోటీపడుతోంది.
దీంతో, ఈ కొత్త అంతరిక్ష రేసులో తామే గెలుస్తున్నామని చూపించుకోవాల్సిన ఒత్తిడి ఈ స్పేస్ ఏజెన్సీపై ఉంది.
మరోవైపు, 2030 నాటికి చంద్రుడిపైకి మనుషులను పంపాలనే ప్రణాళికలతో చైనా ముందుకు సాగుతోంది.
చైనా షెంజౌ-23 అంతరిక్ష నౌకను సోమవారం లాంచ్ చేసింది. ఈ అంతరిక్ష నౌకలో వ్యోమగాముల బృందాన్ని తమ దేశానికి చెందిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి పంపించింది.
2032 నాటికి చంద్రుడి దక్షిణ ధృవంపై అణు, సౌరశక్తితో నడిచే శాశ్వత స్థావరాన్ని నిర్మించేందుకు 20 బిలియన్ డాలర్ల (రూ.1,91,266 కోట్ల) కార్యక్రమాన్ని నాసా మార్చిలో ప్రకటించింది.
ఈ ప్రకటనల అర్థం ఏంటంటే.. అమెరికా 'చంద్రుడిని ఇక ఎప్పటికీ వదులుకోదు' అని నాసా అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐజాక్‌మన్ మంగళవారం తెలిపారు.
ఈ శాశ్వత స్థావరం వల్ల శాస్త్రీయ ప్రయోగాలకు, విలువైన వనరులను వెలికితీతకు, అంగారకుడిపైకి మరింత తేలికగా ప్రయాణించేందుకు మార్గం సులభతరం కానుంది.
అయితే, నాసా నిర్దేశించుకున్న వ్యవధి ఆచరణ సాధ్యం కానిదని నిపుణులు అంటున్నారు.
ఏప్రిల్‌లో ఆర్టెమిస్ II మిషన్‌లో, చంద్రుని చుట్టూ తిరిగేందుకు నలుగురు వ్యోమగాములను పంపించడంలో అమెరికా విజయం సాధించినప్పటికీ.. చంద్రుని ఉపరితలంపై మనుషులను దింపే తదుపరి దేశం చైనానే అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
చంద్రునిపై మనుషులను దించగల క్రాఫ్ట్‌ను (నౌకను) సిద్ధం చేసుకోవడంలో నాసాకు ఎదురవుతున్న అడ్డంకులను ప్రస్తావిస్తూ... ''చైనా మొదట అక్కడికి చేరుకుంటే నాకు ఏమాత్రం ఆశ్చర్యం కలగదు'' అని ఓపెన్ యూనివర్సిటీకి చెందిన లూనార్ సైంటిస్ట్ (చంద్రునిపై అధ్యయనం చేసే శాస్త్రవేత్త) డాక్టర్ సిమియన్ బార్బర్ బీబీసీ న్యూస్‌కు తెలిపారు.
నాసాకు చెందిన ఇగ్నిషన్ మూన్ బేస్ ప్రోగ్రామ్ మూడు దశల్లో కొనసాగుతుంది.
మనుషులను అక్కడికి పంపడానికి ముందు.. సవాలుతో కూడిన చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించి మ్యాప్ చేసేందుకు (చిత్రీకరించేందుకు) రోబోటిక్ ల్యాండర్లను, హాపింగ్ డ్రోన్లను పంపాలని ఈ అంతరిక్ష సంస్థ కోరుకుంటోంది.
వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపైకి తీసుకెళ్లగలిగే, సమాచార బదిలీకి (కమ్యూనికేషన్స్‌కు) ఉపయోగపడే, శాస్త్రీయ పరికరాలను మోసుకెళ్లగలిగే రవాణా వాహనాలను కూడా అక్కడకు తీసుకెళ్తారు.
బ్లూ ఆరిజన్, ఇంట్యూటివ్ మెషీన్స్, ఆస్ట్రోబోటిక్‌తో సహా పలు కంపెనీలు ఈ వాహనాలను తయారు చేసే కాంట్రాక్టులను పొందాయని నాసా మంగళవారం తెలిపింది.
బ్లూ ఆరిజిన్‌కు చెందిన 'ఎండ్యూరెన్స్' అని పిలిచే లూనార్ ల్యాండర్.. అత్యంత కచ్చితత్వంతో కూడిన ల్యాండింగ్‌లను చేయడంతో పాటు, అటానమస్ నేవిగేషన్ (సొంతంగా దిశానిర్దేశం చేసుకోగలిగే), నియంత్రణ సామర్థ్యాలను కలిగి ఉండాలని నాసా కోరుకుంటోంది.
ఆస్ట్రోబోటిక్ గ్రిఫిన్-1 ల్యాండర్ దక్షిణ ధృవానికి సమీపంలో నోబైల్ క్రేటర్ వద్ద దిగుతుందని భావిస్తున్నారు.
ఈ వాహనాలు నాసాకు చెందిన శాస్త్రీయ పరికరాలను కూడా చేరవేస్తాయి. వీటిల్లో హై-రిజల్యూషన్ కెమెరాలు, సురక్షితంగా దిగేందుకు సాయపడే రిఫ్లెక్టెడ్ లేజర్ లైట్ సాధనాలు వంటివి ఉన్నాయి.
ఈ రోబోటిక్ అన్వేషణ 2029 వరకు సాగుతుందని, ఇందులో భాగంగా చంద్రునిపైకి 25 ప్రయోగాలు చేసి, 4 మెట్రిక్ టన్నుల సరుకును చేరవేస్తామని మూన్ బేస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ కార్లోస్ గార్సియా-గలాన్ మంగళవారం చెప్పారు.
తర్వాత చంద్రునిపై అణు, సోలార్ విద్యుత్ కేంద్రాలను నిర్మించాలనుకుంటోంది నాసా. దీనిలో ఫిషన్ రియాక్టర్లు కూడా ఉన్నాయి.
2032 నాటికి సెమీ-పర్మినెంట్ గృహాల్లో మనుషులు నివసించేలా చేయాలని ఈ అంతరిక్ష సంస్థ భావిస్తోంది.
చంద్రుని దక్షిణ ధృవం చాలా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే, ఇక్కడ గడ్డకట్టిన నీటిని మంచినీటిగా లేదా ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఉపయోగించుకోవచ్చు.
అయితే, మనుషులను చంద్రుడిపైకి సురక్షితంగా తీసుకువెళ్లగల అంతరిక్ష నౌకను సిద్ధం చేయడంపై నాసా ప్రణాళికలు ఆధారపడి ఉన్నాయి.
స్టార్‌షిప్ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ అనే వ్యోమనౌకను తయారు చేసేందుకు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ కాంట్రాక్ట్ పొందింది. కానీ, ఇది అనేక ఎదురుదెబ్బలను, జాప్యాలను ఎదుర్కొంది.
"అంతరిక్ష యాత్రికులను చంద్రుని ఉపరితలంపైకి దించడమే అత్యంత కీలకమైన దశ" అని చంద్రునిపై అధ్యయనం చేసే శాస్త్రవేత్త సిమియన్ బార్బర్ వివరిస్తున్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)