You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత మామిడి పండ్లు జపాన్‌కు ఎందుకు చేదయ్యాయి? నిషేధం వెనక కారణమేంటి?
- రచయిత, మృదులిక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ప్రపంచంలోనే మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం భారత్. ఈ దేశంలో అనేక రకాల మామిడి పండ్లు పండుతాయి, వీటి రుచిని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఇష్టపడతాయి.
భారత్ మామిడి పండ్లను ఇష్టపడే దేశాల్లో జపాన్ ఒకటి. కానీ ఈ ఏడాది, ఆ దేశంలో ప్రజలు ఈ మామిడి పండ్ల రుచి చూడలేరు.
జపాన్ ఈ ఏడాది భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించింది. పురుగులు, తెగుళ్ల నివారణ ప్రక్రియలో లోపాలు గమనించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ అధికారులు చెబుతున్నారు.
1980ల ప్రారంభంలో కూడా భారత్ నుంచి మామిడి పండ్ల కొనుగోళ్లను జపాన్ నిలిపివేసింది.
ఈ నిషేధం ముందస్తు చర్యల్లో భాగమే. భారత్ నుంచి పండ్ల ఈగలు, తెగుళ్ల గుడ్లు లేదా లార్వాలు తమ దేశానికి చేరి, జపాన్ వ్యవసాయానికి నష్టం కలిగించవచ్చని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది.
సుమారు రెండు దశాబ్దాల తర్వాత.. భారత మామిడి పండ్లకు జపాన్ తలుపులు తెరిచింది. కానీ, చరిత్ర పునరావృతమవుతున్నట్లు కనిపిస్తోంది. రెండు దశాబ్దాల తర్వాత.. మళ్లీ భారత్ నుంచి మామిడి పండ్లను దిగుమతి చేసుకోవడాన్ని జపాన్ నిలిపివేసింది.
భారత పండ్ల శుద్ధి కేంద్రాలలో లోపాలను గుర్తించిన తర్వాత జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి, మామిడి పండ్ల సీజన్లో ప్రతేడాది జపాన్ తమ ఇన్స్పెక్టర్ల (తనిఖీ అధికారుల) బృందాన్ని భారత్‌కు పంపుతుంది.
ఈ అధికారులు వాపర్ హీట్ ట్రీట్మెంట్ అని పిలిచే ప్రత్యేక ప్రక్రియ ద్వారా మామిడి పండ్లను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియను కీటకాలు, వాటి గుడ్ల నుంచి మామిడి పండ్లను కాపాడేందుకు ఉపయోగిస్తారు. పండును కొద్ది సమయంపాటు ఒక హీట్ ఎయిర్ చాంబర్లో పెడతారు. అప్పుడు మామిడి పండు లోపల ఉన్న కీటకాలు, లార్వాలు చనిపోతాయి.
ఈ ఏడాది తనిఖీ సందర్భంగా.. మామిడి పండ్ల ట్రీట్మెంట్ ప్రాసెస్‌లో (శుద్ధి ప్రక్రియలో) లోపాలను గుర్తించారు అధికారులు.
ఈ లోపాలను గుర్తించిన తర్వాత.. జపాన్ యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ (మొక్కల సంరక్షణ సంఘం) ఒక ప్రకటనను జారీ చేసింది. భారత మామిడి పండ్ల స్వీకరణను నిలిపివేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.
జపాన్ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందే వరకు.. భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతులను నిలిపివేస్తామని ఈ అసోసియేషన్ పేర్కొంది.
మామిడి పండ్లు విపరీతంగా వచ్చే సీజన్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అనేక దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇప్పటికే ఎగుమతిదారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు.
సముద్ర మార్గాల్లో అంతరాయం కారణంగా షిప్పింగ్ ఇన్సూరెన్స్ పెరిగింది. షిప్పింగ్ కంపెనీల ఖర్చులూ పెరిగాయి.
ఇది మామిడి పండ్ల ఎగుమతిపైనే కాక, ఇతర వస్తువుల ఎగుమతిపై కూడా పడింది.
నిపుణులు ఏం చెబుతున్నారు?
''సరుకులో నిర్దేశించిన పరిమితికి మించి అవశేషాలు లేదా ఇతర లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే, వెంటనే దాన్ని నిలిపివేస్తారు. ప్రతి దేశానికి సొంతంగా నిబంధనలు ఉంటాయి. కానీ, అత్యంత కఠినమైన మార్కెట్లలో జపాన్ ఒకటి. అక్కడి అధికారులు చిన్న లోపాలను కూడా వదిలిపెట్టరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వేపర్ హీట్ ట్రీట్మెంట్ను ప్రవేశపెట్టారు. పండ్ల ఈగలను (కీటకాలను) నివారించాలని వారు కోరుకుంటున్నారు'' అని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ట్రాపికల్ హార్టికల్చర్ మాజీ రీసెర్చ్ డైరెక్టర్ శైలేంద్ర రాజన్ బీబీసీతో అన్నారు.
జపాన్ దిగుమతిని నిలిపివేయడం ఇతర దేశాల్లో భారత మామిడి పండ్ల వినియోగాన్ని తగ్గిస్తుందా? అనే ప్రశ్నకు స్పందించిన శైలేంద్ర రాజన్.. భారత్ తన మామిడి పండ్లను ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తుందని, అక్కడ నిబంధనలు జపాన్‌లో ఉన్నంత కఠినంగా ఉండవని అన్నారు.
ఈ నిషేధం వల్ల పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని చెప్పారు.
ప్రతి దేశానికి సొంత నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు ఉంటాయని, ఎగుమతి చేసే దేశాలు వాటికి అనుగుణంగా తమను తాము సిద్ధం చేసుకోవాలని ఆయన అన్నారు.
భారత్ కూడా వాటికి అనుగుణంగా తన వ్యవస్థను మెరుగుపరుచుకుంటోంది.
జపాన్ ఈ సమస్యను గతంలోనూ ఎదుర్కొంది
అనేక దేశాలు పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకునే ముందు, వాటి నుంచి ఎలాంటి వ్యాధులు సోకకుండా నివారించేందుకు వేపర్ హీట్ ట్రీట్మెంట్ను తప్పనిసరి చేశాయి. ఈ విషయంలో జపాన్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని పేరు.
నిబంధనలను కఠినంగా పాటించే విషయంలో జపాన్‌కు సుదీర్ఘ అనుభవం ఉంది. 1970ల్లో దేశంలో దక్షిణాదిన పండ్ల ఈగలు విపరీతంగా వ్యాపించాయి. అవి మామిడి పంటను, బొప్పాయి తోటలను, అనేక ఇతర పండ్ల పంటలను దెబ్బతీశాయి.
ఈ సమస్యకు ముగింపు పలికేందుకు, జపాన్ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది చాలా సంవత్సరాలు పట్టిన సుదీర్ఘమైన, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ.
ఈ అనుభవం పంటలు, దిగుమతి విషయంలో కఠినమైన నిబంధనలకు దారితీసింది. నేడు జపాన్ తెగుళ్లను అసలు సహించడం లేదు.
రెండు దశాబ్దాల నాటి నిషేధాన్ని తొలగించేందుకు భారత్‌లో అనేక వేపర్ హీట్ ట్రీట్మెంట్ (వీహెచ్‌టీ) ప్లాంట్లను తెరిచారు. ఎగుమతులు ప్రారంభమయ్యాయి.
భారత్‌లో అత్యధికంగా మామిడి పండ్ల ఉత్పత్తి
భారత్ మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్టు డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) డేటా ప్రకారం.. ప్రపంచంలో మొత్తం మామిడి పండ్ల ఉత్పత్తిలో సుమారు 40 శాతం నుంచి 45 శాతం భారత్‌నే ఉత్పత్తి చేస్తుంది.
ఇక్కడ సుమారు వెయ్యి రకాల మామిడి పండ్లు దొరుకుతాయి. ఈ పండ్లలో ఎక్కువ భాగం దేశంలోనే వినియోగిస్తారు.
ఉత్తరం నుంచి దక్షిణం వరకు.. వివిధ రకాల మామిడి పండ్లు, భిన్నమైన రుచుల్లో దొరుకుతుంటాయి. మామిడి పండ్లను అప్పటికప్పుడు తాజాగా తినడమే కాకుండా.. వివిధ పద్ధతుల్లో నిల్వ కూడా చేస్తారు. ఫలితంగా అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, మామిడి పండ్ల ఎగుమతులు తక్కువగానే ఉన్నాయి.
ఏపీఈడీఏ ప్రకారం.. 2024-25లో సుమారు 30 వేల టన్నుల తాజా మామిడి పండ్లను భారత్ ఎగుమతి చేసింది. వాటిల్లో ఎక్కువగా యూఏఈ, అమెరికా, బ్రిటన్, కువైట్, ఖతార్‌కు ఎగుమతి అయ్యాయి.
జపాన్, భారత్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. అల్ఫోన్సో, కేసర్, బంగినపల్లి, లంగ్రా, చౌసా, మల్లికా వంటి కొన్ని ప్రత్యేక రకాల మామిడి పండ్లను ఎగుమతి చేశారు.
అల్ఫోన్సో మామిడి పండ్లను ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి, దేవ్గఢ్లో పండించే ఈ మామిడి పండు దాని రుచి, సువాసన, గుజ్జు వల్ల తనకంటూ ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ రకం మామిడి పండును జపాన్ మార్కెట్లో ఒక లగ్జరీగా పరిగణించేవారు. కానీ, ప్రస్తుతం దాని ఎగుమతులను నిరవధికంగా నిలిపివేశారు.
పలు ట్రేడ్ రిపోర్టుల ప్రకారం.. భారత్ నుంచి జపాన్‌కు ఎగుమతి అయ్యే మామిడి పండ్లు ఏటా కొన్ని వందల టన్నుల నుంచి రెండు వేల మెట్రిక్ టన్నుల వరకు ఉంటాయి.
మొత్తం ఎగుమతుల్లో ఇవి ఒక శాతం కంటే తక్కువగానే పరిగణిస్తారు.
నిషేధం గురించి ఎందుకీ గొడవ?
ఇక్కడ సమస్య పరిమాణం గురించి కాదు, నాణ్యత గురించి అని నిపుణులు అంటున్నారు. నాణ్యత నియంత్రణకు పేరుగాంచిన ఒక దేశం, భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతులను నిలిపివేసింది.
జపాన్ లాంటి దేశానికి ఇదొక మామిడి పండ్ల సమస్య కాదని, మొత్తం ఎగుమతి వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్న అని అంటున్నారు.
నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఇదొక హెచ్చరిక. ఎందుకంటే, ఇతర వ్యక్తులు లేదా దేశాలు కూడా ఇదే విధంగా ఆలోచించడం మొదలుపెట్టేలా ఈ నిర్ణయం ప్రభావం చూపొచ్చు.
అంటే, ఈ ప్రభావం కేవలం జపాన్‌కు మాత్రమే పరిమితం కాదని, ఇతర విదేశీ మార్కెట్లకు కూడా సంకేతంగా మారొచ్చు.
మామిడి పండ్ల పంట ముఖ్యంగా అనేక ప్రీమియం రకాలు దెబ్బతిన్నప్పుడు భారత్‌కు ఈ సంక్షోభం ఎదురైంది.
''జపాన్ నుంచి ఒక బృందం వచ్చి మామిడి పండ్లను తిరస్కరించింది. ఎగుమతిదారుల ద్వారా ఈ విషయం మాకు తెలిసింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి'' అని లఖ్‌నవూలోని మాంగో గ్రోవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎస్.ఇన్స్రామ్ అలీ బీబీసీకి చెప్పారు.
''శీతాకాలంలో తీవ్రమైన చలి, ఆ తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతలు పండ్ల ఉత్పత్తిపై ప్రభావం చూపాయి. ఉత్తరప్రదేశ్‌లో మామిడి ఉత్పత్తి గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. పండిన పంట కూడా తుపానుల వల్ల దెబ్బతింది" అని మామిడి పండ్ల ఉత్పత్తి గురించి మాట్లాడుతూ అలీ అన్నారు.
''ఈ ఏడాది మామిడి పండ్ల సీజన్ జూన్‌లోనే ముగిసిపోవచ్చు" అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)