You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఓ అరగంటసేపు కూర్చోవడం తగ్గిస్తే ఎంత ప్రయోజనమో తెలుసా?
- రచయిత, మెలిస్సా హోగెన్‌బూమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మన నిత్య జీవితంలో శారీరక శ్రమను క్రమంగా కొంచెం కొంచెం పెంచుకోవడం ద్వారా, ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఇది మన శరీరాన్ని, మనసును ఆరోగ్యకరంగా ఉంచడమే కాకుండా, అకాల మరణం సంభవించే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని తెలిసింది.
రోజుకు కేవలం ఐదు నిమిషాల వ్యాయామం చేయడం వల్ల ప్రతి పది మరణాలలో ఒకదానిని నివారించవచ్చని ది లాన్సెట్‌లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనంలో వెల్లడైంది.
ఉదాహరణకు.. ఎవరైనా కేవలం ఐదు నిమిషాలు వేగంగా నడిచినా, సైకిల్ తొక్కినా లేదా మెట్లు ఎక్కినా వారు ఈ ప్రయోజనాన్ని పొందగలరు.
ఈ వ్యాయామాలు లక్షల మంది ప్రజలు ఎక్కువ కాలం జీవించేందుకు సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన శరీరం కోసం వ్యాయామాలు విపరీతంగా చేయాల్సిన అవసరం లేదని చాలా మంది నిపుణులు నమ్ముతున్నారు. దీని బదులుగా, శారీరక శ్రమను క్రమంగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.
అయితే, కేవలం ఐదు నిమిషాల వ్యాయామం మిమ్మల్ని పూర్తిగా ఆరోగ్యవంతులుగా చేస్తుందని అర్థం కాదు. ఏమీ చేయకుండా ఉండటం కంటే శారీరక శ్రమను కాస్త పెంచుకోవడం ద్వారా మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందనడానికి ఇది సూచనగా నిలుస్తుంది.
ఇప్పటికే చురుకుగా, శారీరకంగా దృఢంగా ఉన్న వ్యక్తులలో ఇలాంటి ఐదు నిమిషాల వ్యాయామ ప్రభావం తక్కువగా ఉండవచ్చని కూడా ఈ అధ్యయనం సూచిస్తోంది.
కానీ చాలా సాధారణ కసరత్తులు చేయడం కూడా శక్తిమంతమైన ప్రభావం చూపుతోందని ఇది చెబుతోంది.
"శారీరక వ్యాయామం అధిక ఒత్తిడిని, అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ శారీరక కార్యకలాపాలు ఒక వ్యక్తి తన జీవితాంతం లేదా చివరికి మరణించే సమయానికి ఎంత ఆరోగ్యంగా ఉంటాడో నిర్ణయించగలవు" అని అమెరికాలోని రోడ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో కైనెసియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నికోల్ లోగాన్ చెప్పారు.
"శారీరక పనితీరు, కండరాల బలం,నాణ్యత, ఎముకల బలం వృద్ధాప్యంలో మరణాన్ని అంచనా వేయడానికి చాలా మంచి సూచికలని మనకు తెలుసు. కాబట్టి ఎక్కువ కాలం జీవించడమే కాదు, ఎక్కువ కాలం ఆరోగ్యంగానూ జీవించాలి'' అంటారు ఆయన.
ఆయుర్దాయాన్ని పెంచుతుంది
ఈ కొత్త పరిశోధనలో యూకే, అమెరికా, స్కాండినేవియా దేశాలకు చెందిన 1,50,000 మంది పెద్దల డేటాను పెద్ద ఎత్తున విశ్లేషించారు.
''కేవలం ఐదు నిమిషాల వ్యాయామం, రోజువారీ దినచర్యలో మార్పులు, అకాల మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపుతుందని తెలుసుకుని మేం ఆశ్చర్యపోయాం'' అని ఈ పరిశోధన ప్రధాన రచయిత, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ స్పోర్ట్‌లో ఫిజికల్ యాక్టివిటీ,హెల్త్ ప్రొఫెసర్ ఉల్ఫ్ ఎకెలుండ్ చెప్పారు.
ఈ ఆవిష్కరణల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రయోజనం పొందారని కూడా ఆయన పేర్కొన్నారు.
వారానికి 150 నిమిషాల పాటు ఒక మోస్తరు నుంచి తీవ్రత కలిగిన వ్యాయామాన్ని పెద్దలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన సిఫార్సులను పాటించాలని ఉల్ఫ్ ఎకెలుండ్ చెప్పారు.
అయితే, జిమ్‌కు వెళ్లడం లేదా స్పోర్ట్స్ క్లబ్‌లలో చేరడం కష్టంగా భావించే వారు కూడా తమ దైనందిన జీవితంలో కొంత వ్యాయామాన్ని చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలరని ఈ అధ్యయనం నిరూపించింది.
ఎక్కువ సేపు కూర్చోకపోతే, ఎక్కువ కాలం బతుకుతాం
శారీరక కదలికలు పెంచుకోవడం ద్వారా మరణ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఈ అధ్యయనంలో వెల్లడైంది.
రోజువారీ కూర్చునే సమయాన్ని 30 నిమిషాలు తగ్గించడం వల్ల అకాల మరణం 7 శాతం తగ్గుతుందని తెలిసింది.
ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే శారీరక కదలిక లేకపోవడం అనేది దీర్ఘకాలిక వ్యాధులకు, అకాల మరణానికి ఒక ప్రధాన కారణంగా ఉంది.
కండరాల బలాన్ని పెంచుకోండి
''మీ దినచర్యలో వ్యాయామం స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం'' అని తాజా అధ్యయన పరిశోధకుడు ఎకెలుండ్ చెప్పారు.
''మెల్లగా మొదలుపెట్టి, క్రమంగా మీ వర్కవుట్ల తీవ్రతను పెంచుకోవాలి. కానీ, ఇది ప్రతి ఒక్కరి సామర్థ్యం, వారి ఎంపికలకు అనుగుణంగా ఉండాలి'' అని చెప్పారు.
కండరాలను బలోపేతం చేసే పనులు కూడా ప్రయోజనకరమని ఒక అమెరికా అధ్యయనం చెబుతోంది.
''వ్యాయామం చేయని వారితో పోలిస్తే, ఏరోబిక్ వ్యాయామం, కండరాలు బలపడే పనులు చేసిన 60, 70 ఏళ్ల వ్యక్తులు ఎక్కువ కాలం జీవించారు. వారిలో మరణ ప్రమాదం కూడా తక్కువగా ఉంది'' అని ఈ అధ్యయనం గుర్తించింది.
''ఎక్సర్‌సైజు స్నాకింగ్'' అంటే ఏమిటి?
ఇటీవల పలు అధ్యయనాలు ''ఎక్సర్‌సైజు స్నాకింగ్'' ప్రయోజనాలను నొక్కి చెప్పాయి. దీని ప్రకారం.. రోజంతా అప్పుడప్పుడు చిన్న చిన్న మొత్తాలుగా శారీరక వ్యాయామాలు చేయడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
రోజంతా అప్పుడప్పుడు తక్కువ సమయం పాటు చేసే వ్యాయామాలు(ఎక్సర్‌సైజు స్నాకింగ్) పెద్దవారిలో కండరాలు అలసిపోకుండా ఎక్కువసేపు పనిచేయగల సామర్థ్యాన్ని పెంచాయని ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశోధనలపై చేసిన ఒక విశ్లేషణ పేర్కొంది.
80 శాతం మందికి పైగా సీనియర్లు ఎక్సర్‌సైజు స్నాకింగ్‌ను తమ దినచర్యలో భాగంగా చేర్చుకోవడం ద్వారా తేలికగా ఈ వ్యాయామాలు కొనసాగించగలిగారని పరిశోధకులు గుర్తించారు.
జిమ్ మాదిరి కాకుండా.. ఎక్సర్‌సైజు స్నాకింగ్ రోజంతా మీ దినచర్యలో భాగంగా మారుతుంది.
''రోజులో అప్పుడప్పుడు కొద్దిసేపు వ్యాయామం చేయడం వల్ల... మీ మెటబాలిజం ఎక్కువసార్లు ఉత్తేజమయ్యే అవకాశం ఉంటుంది'' అని బ్రిటన్‌లోని అల్స్టర్ యూనివర్సిటిలో సైకాలజీ ప్రొఫెసర్ మేరీ మార్ఫీ . బీబీసీ ''జస్ట్ వన్ థింగ్'' అనే పాడ్‌కాస్ట్‌లో చెప్పారు.
ఒకవేళ వ్యాయామం చేయడం ఆపివేసినా.. మెటబాలిజం కొంత సమయం పాటు ఎక్కువ స్థాయిలోనే ఉంటుందన్నారు.
అందుకే, ''ఎక్సర్‌సైజు స్నాకింగ్ మీ జీవక్రియ వ్యవస్థను చురుకుగా ఉంచుతాయి'' అని తెలిపారు.
ఎక్సర్‌సైజు స్నాకింగ్‌కు సంబంధించిన ప్రయోజనాల గురించి ప్రజలకు చెప్పినప్పుడు వారు చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని పలు అధ్యయనాలు సూచించాయి. ఈ వైఖరి వ్యాయామం పట్ల ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది.
ఆరోగ్యకరమైన మార్పులను అలవాటుగా చేసుకోండి
చిన్న చిన్న సూచనలు కూడా ఎంతో మార్పును తీసుకురాగలవు అని పరిశోధకులు చెబుతున్నారు. ఉదాహరణకు.. లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ ఎక్కడానికి బదులుగా మెట్లు ఎక్కాలని ప్రజలను ప్రోత్సహించడం ద్వారా ఎక్కువ మంది మెట్లు ఎక్కవచ్చు.
చిన్న మార్పులు కూడా కాలక్రమేణా అర్థవంతమైన ప్రభావాన్ని చూపగలవని బ్రిటన్‌లోని లౌబరో యూనివర్సిటీలో బిహేవియరల్ ప్రొఫెసర్ అమండా డాలీ చెప్పారు.
"క్రమంగా ఈ మార్పులు మనం ఆలోచించాల్సిన అవసరం లేని అలవాట్లుగా మారిపోతాయి. ఉదాహరణకు, ఎవరైనా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకుంటే, వారికి ఎలివేటర్ వాడాలనే ఆలోచన కూడా రాదు. వారు ఆటోమేటిక్‌గా మెట్ల వైపు వెళ్తారు" అని తెలిపారు.
పనిచేసేటప్పుడు తేలికపాటి స్ట్రెచింగ్ చేయండి
‘‘ప్రజలు సాధారణంగా వారు భావించే అన్ని అడుగులు ప్రతిరోజూ నడవాల్సిన అవసరం లేదు’’ అని గతంలో బీబీసీ నివేదించింది.
ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు కేవలం 2 వేల అడుగులు నడవడంతో పోలిస్తే.. 2,517 నుంచి 2735 అడుగులు నడవడం వల్ల గుండె జబ్బుల ముప్పు 11 శాతం తగ్గుతుందని తెలిసింది.
మీరెలా వ్యాయామం చేయాలి అన్న విషయానికొస్తే.. ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
కొండలు ఎక్కడం చేయచ్చు. డ్యాన్స్ క్లాస్‌లలో చేరవచ్చు లేదా హై-ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ లాంటి తీవ్రమైన వ్యాయామాన్ని ప్రయత్నించవచ్చు.
ఇవి శరీరంలో కొవ్వును తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులను, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.
మార్కెట్ నుంచి సరుకులు ఇంటికి తీసుకురావడం పెద్ద పనిగా అనిపించినప్పటికీ, ఇబ్బందిగా ఉండే పనులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని ప్రొఫెసర్ డాలీ అన్నారు.
వంటగదిలో పనిచేస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నప్పుడు కొద్దిగా శరీరాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల కూడా ప్రజలు ప్రయోజనం పొందగలరని ప్రొఫెసర్ డాలీ సూచిస్తున్నారు.
వీటినే 'ఎక్సర్‌సైజు స్నాక్స్' అంటారు. వీటి గురించి ఎప్పుడూ అపరాధభావనకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రొఫెసర్ డాలీ అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)