ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి? - బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్‌

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 11 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగి ఏడాది దాటింది.

2025 మే 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెలగపూడిలో పైలాన్ ఆవిష్కరించి రెండోసారి అమరావతి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది.

ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి? పాలకులు మాటల్లో చెబుతున్న వేగం క్షేత్రస్థాయిలో పనుల్లో కనిపిస్తోందా?

అసలు అక్కడ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? దీనిపై బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్‌.

గతంలో ఏం జరిగింది?

2014 జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విభజన తర్వాత 2015 ఏప్రిల్‌ 23న అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిగా అమరావతి పేరును అధికారికంగా ప్రకటించింది.

అదే ఏడాది అక్టోబర్‌ 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఉద్దండరాయునిపాలెంలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

ఆ తర్వాత అప్పటికే ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరించిన భూముల్లో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు నిర్మాణాలను పూర్తి చేశారు. శాశ్వత నిర్మాణాలు కొన్ని మొదలుపెట్టారు.

2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో అమరావతి నిర్మాణాల్లో అనిశ్చితి మొదలైంది.

ఆ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అదే పరిస్థితి కొనసాగింది.

ఈ రెండేళ్లలో ఏం జరిగింది?

2024 జూన్‌లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాగానే మళ్లీ అమరావతి పనుల్లో కదలిక వచ్చింది.

2025 మే 2న మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులకు మరోసారి శంకుస్థాపన జరిగింది.

ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది.

దీనికి లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం తర్వాత రాష్ట్రపతి ముర్ము అధికారికంగా ఆంధ్ర ప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరరణ – సవరణ బిల్లుకి ఆమోదం తెలిపారు.

అమరావతి రాజధాని కోర్‌ క్యాపిటల్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.

మరి ఆ మేరకు రాజధాని నిర్మాణ పనుల్లో వేగం కనిపిస్తోందా?

భూసమీకరణ

పదేళ్ల క్రితం మొదలుపెట్టిన తొలి దశ ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియే ఇంకా 100 శాతం పూర్తి కాలేదు.

రాజధాని నిర్మాణానికి తొలిదశలో భూసమీకరణ విధానం ద్వారా 35,170 వేల ఎకరాలను సేకరించారు.

ఆ భూములిచ్చిన 30,753 మంది రైతుల్లో ఇప్పటి వరకు 30,079 మందికి ప్లాట్లు కేటాయించారు.

ఇంకా 674 మందికి ప్లాట్లు కేటాయించాలని భూ వివాదాలు, కోర్టు కేసుల వల్ల సమస్య వచ్చిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ బీబీసీకి తెలిపారు.

ఇది అతి త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు.

కాగా అమరావతి నిర్మాణ పనులు, ప్లాట్ల అభివృద్ధిపై ఇప్పటికి కాస్త నమ్మకం వచ్చిందని, నిర్మాణ పనులు బాగానే సాగుతున్నాయని అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని రైతు వీరాంజనేయులు బీబీసీతో అన్నారు.

తాను ఐదు ఎకరాలు రాజధానికి ఇచ్చానని, ప్లాట్లు వేసి అభివృద్ధి చేశారని, ఇప్పుడు రాజధాని నిర్మాణ పనులు కూడా వేగంగానే సాగుతున్నాయని చెప్పారు.

వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతు గుర్రం శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడుతూ తాను రెండు ఎకరాల పొలం ఇచ్చానని, ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు కానీ రోడ్లు, డ్రైనేజీ పనులైతే జరుగుతున్నాయని చెప్పారు.

తమ ప్లాట్లు త్వరలోనే ఇస్తామని చెబుతున్నారని, ఇప్పుడు నమ్మకం వచ్చిందని చెప్పారు. భూమి కౌలు కూడా గతేడాది వరకు అప్‌డేట్‌గా ఇచ్చారని, ఈ ఏడాది కౌలు కూడా వచ్చే నెల ఇస్తామని చెప్పారని శ్రీనివాసరావు తెలిపారు.

మలి విడత భూసమీకరణపై కొందరు రైతుల్లో అసంతృప్తి

2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రెండోసారి భూసమీకరణ ప్రకటన చేసింది.

అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ నిర్మాణాల కోసం మలివిడతగా, అమరావతి మండలం పరిధిలో 16,667 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడత మాదిరిగానే ల్యాండ్‌ పూలింగ్‌ ప్యాకేజీ వర్తింపజేస్తామని వెల్లడించింది.

అయితే, ఈసారి ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా భూములిచ్చేందుకు కొందరు రైతులు అయిష్టత వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

దీనిపై రైతులతో చర్చిస్తున్నామని 40 శాతానికి పైగా రైతులు భూములిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని, మిగిలిన వారు కూడా ముందుకు వస్తారన్న నమ్మకం ఉందని మంత్రి నారాయణ బీబీసీతో అన్నారు.

"మలి విడత భూసేకరణ ప్యాకేజీపై రైతుల్లో చాలా అసంతృప్తి ఉంది. ఇంకా 30 శాతం మంది కూడా ముందుకు రాలేదు. ప్రధానంగా ఉండవల్లి, పెనుమాక ప్రాంత రైతులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. సీఆర్‌డీఏ అధికారులు వారితో చర్చించి ఒప్పించాలి కానీ బలవంతంగా భూసేకరణ ద్వారానో, అవార్డు ప్రకటన ద్వారానో తీసుకుంటామంటే కుదరదు" అని అమరావతి ప్రాంత సీపీఎం కార్యదర్శి ఎం.రవి బీబీసీతో చెప్పారు.

కొంతమంది రైతులు మొదట్లో సుముఖత వ్యక్తం చేసి, తర్వాత భూములు ఇవ్వకపోవడం వల్ల పనులకు ఆటంకం కలుగుతోందని, రాజధాని నిర్మాణానికి, రోడ్ల అభివృద్ధికి రైతులు ముందుకు రావాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ విజయ రామరాజు కోరారు.

తప్పని పరిస్థితుల్లో భూసేకరణ ద్వారా పనులను శరవేగంగా పూర్తి చేస్తామని ఆయన బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

నిర్మాణాలు, కీలక ప్రాజెక్టుల పనులు ఎలా ఉన్నాయి?

అమరావతిలో ఇప్పటివరకు వందశాతం పూర్తయిన ఏకైక శాశ్వత నిర్మాణం సీఆర్‌డీఏ భవనం.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సీఆర్‌డీఏ) భవన నిర్మాణాలకు 2016 అక్టోబర్‌లో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు.

నాలుగు ఎకరాల స్థలంలో దాదాపు రూ.373 కోట్లతో ఏడు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనాన్ని 2025 అక్టోబర్‌లో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

ఆలిండియా సర్వీసెస్‌ ( ఏఐస్‌) అధికారుల ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. రాయపూడిలో 2017లో ఈ నిర్మాణాలను మొదలుపెట్టారు.

పిన్సిపల్‌ సెక్రటరీలు, సెక్రటరీలు.. మొత్తం 144 మంది అధికారులు ఒకేచోట నివాసం ఉండేలా అవసరమైన బంగ్లాలు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం తుది దశలో ఉంది.

విద్యుదీకరణ, ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయని త్వరలోనే ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లు దాదాపుగా పూర్తయ్యాయి. 12 టవర్లలో మొత్తం 288 ప్లాట్లను నిర్మిస్తున్నారు.

ఎమ్మెల్యేల నివాస భవనాలు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి అప్పగించే దశలో ఉండగా, ఎమ్మెల్సీల క్వార్టర్లలో ఇంటీరియర్‌ పనులు జరుగుతున్నాయి.

త్వరలోనే కేటాయింపులు జరుపుతామని అధికారులు చెబుతున్నారు.

హైకోర్టు న్యాయమూర్తుల ఇళ్లు దాదాపుగా సిద్ధమయ్యాయి.

తుళ్లూరు మండలం కొండమరాజుపాలెం వద్ద రూ.210 కోట్ల వ్యయంతో 33 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 36 నివాస గృహాలను నిర్మిస్తున్నారు.

ఒక్కో బంగ్లా 18 వేల చదరపు అడుగులు ఉంటుంది. ఏపీ జ్యూడీషియల్‌ అకాడమీ, హైకోర్టు అతిధి గృహం నిర్మాణాలకు ఈ ఏడాది మార్చిలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ శంకుస్థాపన చేశారు. ఆ పనులు కొనసాగుతున్నాయి.

మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులను చూస్తే... అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో భాగంగా, మంత్రుల కోసం నిర్మితమవుతున్న 35 బంగ్లాలు తుది దశకు చేరుతున్నాయి. 26.09 ఎకరాల విస్తీర్ణంలో జీ+1 తరహాలో 35 బంగ్లాలు నిర్మిస్తున్నారు. స్విమ్మింగ్‌ పూల్, ఆసుపత్రి, క్లబ్‌ హౌస్‌ వంటివి ఇక్కడ అందుబాటులోకి తెస్తున్నారు.

గ్రూప్‌–1 నుంచి గ్రూప్‌–4 వరకు ఉన్న ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న టవర్ల పనులు కూడా తుదిదశకు చేరుకున్నాయి.

త్వరలోనే వీటీని జీఏడీకి అప్పగించనున్నామని పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు.

పునాదుల దశలోనే జీఏడీ, హెచ్‌వోడీ టవర్లు

అమరావతి నిర్మాణంలో కీలకమైన సచివాలయం, జీఏడీ, హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పాలి.

జీఏడీ టవర్‌ 47 అంతస్తులతో, మిగతా నాలుగు హెచ్‌వోడీ టవర్లను 40 అంతస్తులతో నిర్మిస్తున్నారు.

53 లక్షల చదరపు అడుగుల బిల్డ్‌ ఏరియాతో రూ.4,688 కోట్ల అంచనా వ్యయంతో ఈ 5 టవర్ల నిర్మాణం చేపడుతున్నారు.

అన్ని కార్యాలయాలు, అధికార యంత్రాంగం ఒకేచోట ఉండేలా ఈ టవర్లను డిజైన్‌ చేశారు.

డయాగ్రిడ్‌ విధానంలో ఈ ఐకానిక్‌ టవర్ల పనులు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే మార్చి నెలలో టవర్‌ –1కు సంబంధించి మొదటి స్టీల్‌ డయాగ్రిడ్‌ అమర్చే పనులు ప్రారంభమయ్యాయి.

ఈ టవర్‌లోనే సీఎం ఆఫీస్‌ ఉంటుంది. టవర్‌ టెర్రస్‌పై హెలిప్యాడ్‌ నిర్మించనున్నారు. 2028 ఆగస్టు నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు.

శాశ్వత అసెంబ్లీ, హైకోర్ట్ భవనాల నిర్మాణ పనులు

అమరావతిలో శాశ్వత అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులు మొదలయ్యాయి.

104 ఎకరాల విస్తీర్ణంలో రూ.617 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనం పనులను ఎల్‌ అండ్‌ టీ సంస్థకు అప్పగించారు.

200 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో గ్లోబల్‌ డిజైన్‌ ప్రమాణాలతో ఈ భవనాలను నిర్మిస్తున్నారు.

గ్రౌండ్‌ లెవల్‌ నుంచి 250 మీటర్ల ఎత్తున నిర్మాణం చేపడుతున్నట్టు సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు.

శాశ్వత హైకోర్టు భవనాల నిర్మాణ పనులకు ఇటీవలే పునాదులు పడ్డాయి.

రాఫ్ట్‌ ఫౌండేషన్‌ ప్రక్రియ మొదలైంది. 21లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు ఏడు అంతస్తులు ఉండేలా దీన్ని నిర్మిస్తున్నారు.

52 కోర్టు హాళ్లు నిర్మించాలని భావిస్తున్నారు.

2027 చివరికల్లా ఈ రెండు భవనాలూ పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

మొదలైన సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ ఫేజ్‌–2, ఫేజ్‌–3 పనులు

సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ - అమరావతిని విజయవాడ నగరానికి, జాతీయ రహదారులకు అనుసంధానించేందుకు ఈ రోడ్‌ను 2014లో ప్రతిపాదించారు.

2016లో సీఎం చంద్రబాబు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తంగా మూడు దశల్లో 21.7 కి.మీ. మేర చేపట్టాలని ప్రతిపాదించారు.

2019 నాటికి ఫేజ్‌–1లో భాగంగా 14 కి.మీ. నిర్మాణం పూర్తయింది. దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు ఇది అందుబాటులోకి వచ్చింది.

రెండో దశ.. మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 4.2 కి.మీ. నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైంది.

ఇప్పటికే దీనిలో 1.5 కి.మీ. మేర పూర్తై, అందుబాటులోకి వచ్చింది. మిగిలిన రోడ్డు నిర్మాణం భూసేకరణ సమస్యతో మొదలు కాలేదు.

రైతులతో చర్చిస్తున్నామని, భూములిచ్చేందుకు కొందరు ముందుకు వస్తున్నారని, ముందుకురాని రైతుల నుంచి భూములను తీసుకునేందుకు భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశామని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

త్వరలోనే మిగిలిన రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెబుతున్నారు.

ఇక మూడో దశ.. ప్రకాశం బ్యారేజీ నుంచి చెన్నై–కోల్‌కతా నేషనల్‌ హైవేను కలిపే విధంగా 3.5 కి.మీ. మేర ఆరు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ఇటీవలే సీఆర్‌డీఏ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది.

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు ఫేజ్‌–1, 2 పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ ఎన్‌సీసీనే ఫేజ్‌–3 పనులను సైతం దక్కించుకుంది.

ఆ బ్రిడ్జిల పనులు పూర్తయితే..

విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధానిలోకి వచ్చేవారి కోసం బకింగ్‌హాం కాలువపై స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ఈ బ్రిడ్జి మీదుగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులోకి నేరుగా ప్రవేశించవచ్చు.

ఈ స్టీల్‌ బ్రిడ్జితో పాటు కొండవీటి వాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ముందుగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును పాత జీటీ రోడ్డుతో అనుసంధానిస్తారు.

దాంతో రాజధాని అమరావతిలోకి రాకపోకలు సజావుగా సాగించేందుకు వెసులుబాటు లభిస్తుంది.

ప్రస్తుతం కృష్ణా కరకట్టే ప్రధాన రహదారిగా ఉన్నది.

స్టీల్‌బ్రిడ్జి నిర్మాణం రెండు నెలల్లో పూర్తవుతుందని, కొండవీటి వాగు, గుంటూరు ఛానళ్లపై బ్రిడ్జి నిర్మాణాలు మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

వరద నివారణ - వాగుల వెడల్పు పనులు

చినుకు పడితే చిత్తడిగా మారిపోయే అమరావతిని శాశ్వత వరద రహిత నగరంగా మార్చేందుకు వివిధ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌వీఆర్‌ శ్రీనివాస్‌ బీబీసీకి తెలిపారు.

రూ.2,062 కోట్ల అంచనా వ్యయంతో, వందేళ్ల గరిష్ఠ వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్‌ చేసిన వరద నివారణ పనులన్నీ 2028 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

దీనిలో భాగంగా కొండవీటి వాగు, పాలవాగులను వెడల్పు చేసి, లోతు పెంచి వరద నీరు నిల్వ ఉండకుండా కృష్ణా నదిలోకి మళ్లిస్తారు.

అదేవిధంగా వరదలను నియంత్రించడానికి నీరుకొండ, శాఖమూరు తదితర ప్రాంతాల్లో ఆరు జలాశయాలను నిర్మిస్తున్నారు.

వీటిలో శాఖమూరు రిజర్వాయర్‌ నిర్మాణం చివరి దశకు చేరిందని ఎస్‌వీఆర్‌ శ్రీనివాస్‌ బీబీసీకి తెలిపారు.

2028 ఆగస్టు కల్లా కోర్‌ క్యాపిటల్‌ నిర్మాణం పూర్తి: నారాయణ

"రాజధాని అమరావతిలో ప్రధాన భవనాల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ కనీస మౌలిక సదుపాయాల కొరత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీలు కనీస స్థాయిలో కూడా లేకపోవడం వల్ల నిర్మాణ సామగ్రి తీసుకువెళ్లే వాహనాలు కూడా సరిగ్గా వెళ్లలేని పరిస్థితి ఉంది" అని అమరావతి ప్రాంత సీపీఎం కార్యదర్శి రవి బీబీసీతో అన్నారు.

అమరావతిలో ప్రస్తుతం మూడు షిఫ్టుల్లో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2028 ఆగస్టు కల్లా కోర్‌ క్యాపిటల్‌ పనులు, మౌలిక సౌకర్యాల కల్పనతో సహా అన్ని రకాల పనులూ పూర్తవుతాయని మంత్రి నారాయణ బీబీసీతో చెప్పారు.

హైకోర్టు శాశ్వత భవనాలతో సహా జీఏడీ, హెచ్‌వోడీ టవర్లు 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.

కోర్‌ క్యాపిటల్‌ నిర్మాణ పనులకు రూ.54 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు నారాయణ తెలిపారు.

రాజధాని నిర్మాణ పనులు నిరంతరాయంగా, గతంతో పోలిస్తే వేగంగా జరుగుతున్న మాట వాస్తవమే, కానీ ఇదే వేగంతో ఇకపైనా కొనసాగితేనే ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందని అమరావతిపై అధ్యయనం చేస్తున్న సీనియర్‌ జర్నలిస్ట్‌ వల్లభనేని సురేష్‌ బీబీసీతో అన్నారు.

నిధుల లభ్యత, అనుమతులతో పాటు కోర్టు కేసులు, రైతుల అభ్యంతరాలను పరిష్కరించుకోవడంపై ఇది ఆధారపడి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)