You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అగ్గిపుల్ల ఎలా పుట్టింది, ఎవరు కనిపెట్టారు?
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
అదృష్టవశాత్తో లేదో పొరపాటునో 1826లో జరిగిన ఓ సంఘటన వల్ల మానవజాతికి ఓ గొప్ప ప్రయోజనం కలిగింది. అది తరువాత నిప్పును, వేడిని సృష్టించే విధానాన్ని శాశ్వతంగా మార్చేసింది.
ఇంగ్లండ్‌కు చెందిన ప్రయోగాత్మక ఔషధ తయారీదారు జాన్ వాకర్ పేలుడు పదార్థాల తయారీ ప్రయత్నంలో రసాయనాలు కలుపుతుంటే ఆ మిశ్రమం పూసిన ఒక కర్ర అనుకోకుండా ఆయన ఇంట్లోని పొయ్యి ముందున్న రాయిని తాకింది. వెంటనే ఆ కర్ర నుంచి మంట వచ్చింది.
జాన్ వాకర్ 1781లో యూకేలోని డర్హమ్ ప్రాంతంలోని స్టాక్‌టన్-ఆన్-టీస్ అనే పట్టణంలో పుట్టారు. అది పారిశ్రామిక విప్లవం ఉధృతంగా సాగుతున్న కాలం. ఆ విప్లవానికి ఊతంగా నిలిచిన జేమ్స్ వాట్ ఆవిష్కరించిన ఆవిరియంత్రాన్ని1776లో వాణిజ్యపరంగా ఉపయోగించడం మొదలైంది. అలాగే తొలిసారి ఆవిరి ఇంజిన్‌తో కూడిన రైలు 1825లో స్టాక్‌టన్‌కు వచ్చింది.
చెకుముకి రాళ్లతో కుస్తీ
నాలుగేళ్ల తర్వాత జార్జ్ స్టీఫెన్సన్ తయారుచేసిన రాకెట్ అనే ఆవిరి ఇంజిన్ గంటకు 50కిలోమీటర్ల వేగంతో ప్రయాణికుల రైళ్లను తీసుకెళ్లగలదని నిరూపితమైంది. దీంతో అప్పటి వరకు గుర్రాలపై 12రోజులు పట్టే ప్రయాణం కేవలం 8గంటల్లో పూర్తయ్యేది.
అయితే ఆ యంత్రాలకు అవసరమైన మంట కోసం ప్రజలు చెకుముకి రాళ్లు, ఉక్కు ఉపయోగించాల్సివచ్చేది. లేదంటే నిప్పు ఎప్పుడూ ఆరిపోకుండా కాపాడుకోవాల్సివచ్చేది. అలాంటి సమయంలో వాకర్ చేసిన ఆ అనుకోని ఆవిష్కరణ ప్రపంచాన్ని మార్చింది. మంటను పుట్టించడం, దాన్ని ఉపయోగించడం, ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లగలగడం ఇలా అన్నీ విప్లవాత్మకంగా మారిపోయాయి.
వాకర్ మొదట సర్జన్‌గా పనిచేసేవారు. కానీ 18వశతాబ్దంలో ఆపరేషన్ల సమయంలో రక్తం ఎక్కువ పోయేది. దీంతో ఆయన ఆ పని వదిలి ఔషధాల తయారీదారుగా మారారు.
1826నాటికి మనుషులతో పాటు గుర్రాలు, పశువులు, కోళ్లకు కూడా మందులు తయారుచేయడంలో ఆయన ఎక్కువ సమయం గడిపేవారని ఏ టేల్ ఆఫ్ హోప్ అండ్ డిస్పైర్: నార్త్ ఆఫ్ గ్లండ్ మాచ్ కో వెస్ట్ హార్టల్‌పూల్ 1932-1954 రచయిత అలన్ మిడల్టన్ తెలిపారు.
1827 నుంచి అగ్గిపుల్లల అమ్మకాలు
వాకర్‌కు రసాయనాలపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఆయన వాటితో ప్రయోగాలు చేస్తుండేవాడు.
''వాకర్ చాలా తెలివైన, మంచి మనసున్న వ్యక్తి. విభిన్నంగా ఆలోచించేవ్యక్తని కూడా కొందరు ఆయన గురించి చెప్తుంటారు'' అని మిడల్టన్ చెప్పారు.
వాకర్ తన రైతు స్నేహితుల కోసం తుపాకీలకు ఉపయోగించే పర్కషన్ క్యాప్స్(తుపాకీల్లో నిప్పుపుట్టించడానికి ఉపయోగించే చిన్న లోహపు క్యాప్) తయారుచేయడానికి రసాయనాలు కలిపేవారు.
''ఒకరోజు అలా కలిపిన మిశ్రమాన్ని ఆయన ఎండబెట్టారు. ఎండిన తర్వాత ఆ కర్రను పొయ్యి ముందున్న రాతిపై రుద్దగానే వెంటనే మంట వచ్చింది’’
‘‘అది అప్పటి దాకా ఎవరూ చేయని పని. అప్పటిదాకాఎవరూ చూడని ఓ అద్భుతమైన క్షణం'' అని రచయిత అలన్ మిడిల్టన్ చెప్పారు.
దీనికి వ్యాపార అవకాశాలున్నాయని వాకర్ గుర్తించారు. ఇది 1826లో సరిగ్గా ఏ రోజు ఇది జరిగిందో తెలియదు. కానీ 1827 ఏప్రిల్‌లో మొదటిసారి వాటిని అమ్మారు. వాటికి ఫ్రిక్షన్ మాచెస్ అని పేరు పెట్టారు. వాటిని మొదట్లో చిన్న డబ్బాల్లో వందలసంఖ్యలో కూర్చి అమ్మేవారు.
అగ్గిపెట్టె రూపంలో...
ఈ ఫ్రిక్స్ లైట్స్ చాలా పలుచని చెక్క పుల్లలు. వాటిని ఒక కొసన పొటాషియం క్లోరేట్, యాంటిమొని సల్ఫైడ్, గమ్ అరబిక్, నీళ్లతో తయారుచేసిన మిశ్రమంలో ముంచేవారు. తర్వాత వాటిని శాండ్ పేపర్(రాపిడి కాగితం)పై రుద్దితే వెంటనే మంట వచ్చేది. అలా అగ్గిపుల్ల తయారైంది.
తన ఫార్ములాను వాకర్ రహస్యంగా ఉంచినప్పటికీ పేటెంట్ తీసుకోలేదు. ఆ ఉత్పత్తి చవకగా ఉండేది. దీంతో స్టాక్టన్ ప్రాంతంలో డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి ఉండేది.
అయితే ''వాకర్ తయారుచేసిన అగ్గిపుల్లలు అన్నివిధాలుగా అనుకూలంగా ఉండేవి కావు. కాలుతున్న సల్ఫర్ పూత కొన్నిసార్లు పుల్ల నుంచి కింద పడిపోయేది. దాంతో నేలకైనా లేదా ఉపయోగిస్తున్న వ్యక్తి దుస్తులకైనా నష్టం జరిగే ప్రమాదం ఉండేది.
లండన్‌కు చెందిన సామ్యుయెల్ జోన్స్ 1829నాటికి లూసిఫర్స్ అనే పేరుతో అదే రకం అగ్గిపుల్లలను పెద్ద ఎత్తున తయారుచేయడం ప్రారంభించారు. తర్వాత చాలా మంది దాని రూపాన్ని, నాణ్యతను మెరుగుపర్చారు. మరికొందరు ఈ ఫార్ములాను మరింత మెరుగుపర్చారని బ్రిటిష్ మాచ్‌బాక్స్ లేబుల్ అండ్ బుక్‌మాచ్ సొసైటీ అధ్యక్షుడు డెరెక్ జుడ్ బీబీసీతో చెప్పారు.
అగ్గిపుల్లలను పెట్టే చిన్న బాక్సుల పరిమాణం, ఆకారంలో కూడా మార్పులొచ్చాయి. 1844లో స్వీడన్‌లో రూపొందించిన ఒక కొత్త నమూనా వచ్చిన తర్వాతే ఆధునిక అగ్గిపెట్టె రూపుదిద్దుకుంది.
అదే పేటెంట్ పొందిన తొలి అగ్గిపెట్టె అని డెరెక్ జుడ్ తెలిపారు.
కుటీర పరిశ్రమగా..
అగ్గిపుల్లల తయారీ కుటీరపరిశ్రమగా మారింది. చాలా కుటుంబాలు ఇంట్లోనే అగ్గిపెట్టెలు తయారుచేసి అదనపు ఆదాయం సంపాదించేవి. అయితే ఇది కొంత ప్రమాదకరమైన పనిలానూ ఉండేది.
''ఫ్యాక్టరీ చుట్టుపక్కల నివసించే మహిళలు, పిల్లలు డబ్బు తీసుకుని ఇంట్లోనే అగ్గిపెట్టెలు తయారుచేసేవారు. తర్వాత యంత్రాలు రావడంతో ఇది కోట్లడాలర్ల పెద్ద పరిశ్రమగా మారింది'' అని డెరెక్ జుడ్ చెప్పారు.
‘అగ్గిపుల్ల సృష్టికర్తకు తగిన గుర్తింపు లభించలేదు’
తర్వాత సిగరెట్ లైటర్ ఆవిష్కరణతో అగ్గిపెట్టెల వ్యాపారం కొంత తగ్గింది. ఏళ్లు గడిచేకొద్దీ అగ్గిపెట్టెల మార్కెట్ తగ్గిపోయింది. కంపెనీలు కనుమరుగయ్యాయి. అయినప్పటికీ అగ్గిపెట్టెలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు కొన్ని ప్రత్యేక డిజైన్‌లతో ఉన్న అగ్గిపెట్టెలు ఫ్యాషన్ వస్తువులుగా కూడా మారాయి. కొన్ని అయితే 250డాలర్ల వరకు అమ్ముడవుతున్నాయి.
అయితే ఈ గొప్ప ఆవిష్కరణ చేసిన జాన్ వాకర్ పేరు ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఆయనకు 200సంవత్సరాల తర్వాతైనా మంచి గుర్తింపు రావాలని డేవిడ్ మిడల్టన్, డెరెకె జుడ్ అంటున్నారు.
''ఆయన తన ఆవిష్కరణను పెద్ద వ్యాపారంగా మార్చాలనుకోలేదు. అలా చేసి ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేవారు'' అని జుడ్ తెలిపారు.
స్టాక్‌టన్ ప్రజలు కూడా ఇదే భావిస్తున్నారు. వాకర్ పుట్టిరోజైన మే 29న ప్రారంభమయ్యే 200వ వార్షికోత్సవ కార్యక్రమాల ద్వారా అయినా ఆవిష్కరణకు తగ్గ గుర్తింపు ఆయనకు లభించాలని భావిస్తున్నారు.
అగ్గిపెట్టె ఆవిష్కరణ వల్ల చాలా తక్కువ శ్రమతో మంటను వెంటనే వెలిగించడం సాధ్యమైంది. అగ్గిపుల్లలు వచ్చిన తర్వాత ఇళ్లల్లోనూ, పరిశ్రమల్లోనూ రోజువారీ పనులు చాలా తేలికగా మారాయి. వేగంగా పూర్తయ్యాయి.
ఆయన వెలిగించిన ఆ చిన్న మంట ఇప్పటికీ ప్రజలకు స్ఫూర్తి కలిగిస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)