తిరుపతి: ‘‘ఆఫీసు గేటు తీయగానే చిరుతపులి కనిపించింది’’

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ సమీపంలో చిరుతపులుల సంచరిస్తున్నాయనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఒక చిరుతపులి ఏకంగా యూనివర్సిటీలోని ఓ కార్యాలయంలోకి దూరడం ఉద్యోగులను ఆందోళనకు గురిచేసింది.

ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలోని క్లినికల్ సైన్సెస్ బ్లాక్‌లోకి దూరిన చిరుతపులిని చివరకు అటవీశాఖ అధికారులు సురక్షితంగా బంధించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

మే 24వ తేదీ ఆదివారంనాడు చిరుతపులి ఈ కార్యాలయంలోకి దూరిందని భావిస్తున్నారు.

మే 25వ తేదీ ఉదయం 9గంటలకు ల్యాబ్ టెక్నీషియన్ ఆఫీసు గేటు తీయగానే చిరుతపులి కనిపిచండంతో ఆందోళన చెందారు.

‘‘గేటు తీసి లోపలకు వచ్చాను. నా రూమ్ తాళం తీయడానికి కీస్ తీయగానే, ఓ మూలన ఏదో తిరుగుతున్నట్టుగా కనిపించింది. ముందు దాని తోక, వెనుకభాగం కనిపించాయి. డార్క్ కలర్‌లో ఉంది. ఇదేదో పులిలా ఉందని భయమేసింది’’ అని ల్యాబ్‌టెక్నీషియన్ రాజ్యలక్ష్మి వివరించారు.

‘‘అయితే ఏమాత్రం అరవకుండా వెనక్కి పరిగెత్తి గేటు దగ్గరకు వచ్చేశాను. మా సార్‌కు కాల్ చేద్దామని ఫోన్ తీస్తుండగా ఆయన వచ్చేశారు'' అని రాజ్యలక్ష్మి తెలిపారు.

క్లినికల్ సైన్సెస్ బ్లాక్ సమీపంలో చెట్లు ఎక్కువగా ఉండటం, అక్కడే పశువులు మేస్తుంటాయని, ఈ కారణాల వల్లే పులి ఆ ప్రాంతానికి వచ్చి క్లినికల్ సైన్సెస్ విభాగంలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు.

యూనివర్సిటీ సమీపంలో చిరుత పులుల సంచారం సాధారణమే అయినప్పటికీ, ఈసారి ఏకంగా ఆఫీసులోకే రావడంతో ఇప్పుడు ఆఫీసుకు రావాలంటేనే భయమేస్తోందన్నారు రాజ్యలక్ష్యి.

''తాళం తీస్తుండగానే ఏదో తిరుగుతున్నట్టు అలికిడిగా అనిపించింది. నేనిక్కడ 22 ఏళ్లుగా పనిచేస్తున్నా. కానీ ఇలా ఆఫీసులోనే ఎప్పుడూ పులిని చూడలేదు. అప్పుడప్పుడు హాస్టల్ దగ్గరికి వచ్చిందనో, హాస్పిటల్ వైపు వచ్చిందనో విన్నాం కానీ, ఇప్పుడు డైరెక్టుగా చూసే సరికి ఆఫీసుకు రావాలంటేనే భయంగా ఉంది. '' అన్నారు రాజ్యలక్ష్మి.

రాజ్యలక్ష్మి చిరుతపులి గురించి తన పైఅధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అటవీ శాఖ సిబ్బందిని పిలిపించారు.

దాడి చేయడానికి వచ్చిందనుకున్నాం

చిరుత దాడి చేయడానికి వచ్చిందనుకున్నారు. కానీ అది మనుషులను చూసి కూడా నిశ్శబ్దంగా వాష్ రూమ్‌లోకి వెళ్లిపోయిందని క్లినికల్ డిపార్ట్ మెంట్ హెడ్ జగపతి బీబీసీతో చెప్పారు.

''అది ఒక కాంప్లెక్స్. మార్నింగ్ ఒపెన్ చేయగానే మా ఉద్యోగి చూశారు. అది చిరుతా లేక కుక్కపిల్లా అని మాకు క్లారిటీ లేదు. ఈ కాంప్లెక్స్‌లోకి రెండు ఎంట్రెన్స్‌లు ఉంటాయి. మా వాళ్లు రావడం చూసి అది బాత్రూమ్‌లోకి వెళ్లిపోయింది. తర్వాత డోర్స్ అన్నీ మూసేసి అది బయటకు వెళ్లకుండా క్లోజ్ చేశాం. పారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాం. వాళ్లు వచ్చి పట్టుకున్నారు. అది చెట్ల మీద నుంచి ఆఫీసు బ్లాక్‌లోకి దూకి ఉండొచ్చు' అని చెప్పారు.

చిరుత వయసు ఏడాది

ఎస్వీ వెటర్నరీ వర్సిటీ క్లినికల్ సైన్సెస్ విభాగంలోని బిల్డింగ్‌లో ఏడాది వయసున్న చిరుత కూనను సురక్షితంగా బంధించామని తిరుపతి ఇన్‌ఛార్జి డీఎఫ్ఓ మహబూబ్ బాషా బీబీసీకి చెప్పారు.

''ఆ కూనకు మత్తు ఇంజెక్షన్ కూడా ఇవ్వలేదు. అది వాష్ రూంలో ఉన్నప్పుడు సింపుల్‌గా డోరు ఎదురుగా బోను సెట్ చేసి, వాష్‌రూమ్ తలుపు తీయగానే, నేరుగా బోనులోకి వచ్చేసింది. అది ఓపెన్ ప్లేస్‌ అయి ఉంటే కష్టం అయ్యేది. దానికి ఎలాంటి గాయాలూ కాలేదు. జూకు తరలించాం. యూనివర్సిటీ వెనక అంతా అడవే. కాబట్టి అది అడవిలోంచే వచ్చి ఉంటుంది. దాన్ని జూలోనే ఉంచాలా లేక అడవిలో వదిలేయాలా అనే విషయం ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయిస్తాం'' అని బాషా చెప్పారు.

అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటం వల్ల తరచూ ఈ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ఉంటుందని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఓ వన్యప్రాణిని ఎలాంటి పరిస్థితులలో బంధిస్తారో జూపార్క్ క్యూరేటర్‌గా పనిచేసిన సెల్వం బీబీసీకి వివరించారు.

''మనుషులకు ప్రమాదం కలిగే పరిస్థితి ఏర్పడితేనే మనం వాటిని పట్టుకుంటాం. ఆ పరిస్థితి వచ్చినపుడు మేం ట్రాప్ కేజెస్ సిద్ధం చేస్తాం. అవి చాలా సులభంగా ఉంటాయి. అంతే సులభంగా బోనులోనూ పడతాయి. ఒకవేళ అలా పడకపోతే మత్తు ఇంజెక్షన్లు వాడి బంధిస్తాం’’ అన్నారు.

ఇక బంధించిన జంతువులను అడవిలో వదలడానికి కొన్ని ప్రమాణాలు పాటిస్తామని సెల్వం వరించారు.

''అడవిలో వదిలే జంతువులు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. సొంతంగా వేటాడే పరిస్థితిలో ఉండాలి. గాయాలేవీ ఉండకూడదు. నయం కాని గాయాలు ఉంటే అలాంటి వాటిని అడవిలో వదలం. అవి గాయాలనుంచి సంపూర్ణంగా కోలుకున్నప్పుడే అడవిలో వదిలిపెడతాం.. జంతువులను బంధించినప్పుడు వాటికి మానవ సాంగత్యం లేకుండా చూస్తాం. ఎందుకంటే వాటిని తిరిగి అడవిలోకి వదిలిపెట్టినప్పుడు అవి తమ ఆటవిక లక్షణాన్ని మరిచిపోకూడదు. అందుకే వాటికి మనుషులతో మసిలే అవకాశాలను బాగా తగ్గిస్తాం’’ అన్నారు.

ఎక్కడ వదిలిపెడతారు?

బంధించిన వన్యప్రాణులను ఎక్కడ వదలాలి అనే విషయంలోనూ కొన్ని ప్రమాణాలు పాటించాలని చెప్పారు సెల్వం.

''దానికి కూడా కొన్ని ప్రోటో కాల్స్ ఉన్నాయి. ఆ జంతువుకు అనువైన ప్రాంతంలోనే వదలాలి. ఉదాహరణకు చిరుతను అడవిలో వదలాలి అనుకుంటే దానికి తగిన పరిసరాలు, నీటి వనరులు, ఉన్నాయా అనే అంశాలు పరీక్షించి వదులుతాం. ఆంధ్రప్రదేశ్‌లో చిరుతలకు ఎక్కడెక్కడ అనువైన ప్రాంతాలు ఉన్నాయో మా విభాగానికి తెలుసు. మేం వాటిని గుర్తించి పెట్టాం. మానవ ఆవాసాల్లోకి వచ్చిన చిరుతులను బంధించినప్పుడు వాటిని మేం గుర్తించిన ప్రాంతాల్లో వదిలేస్తాం. తనకు అనువైన ప్రదేశం కాకపోతే చిరుతలు మళ్లీ వెనక్కు వచ్చేస్తాయి’’ అన్నారు సెల్వం.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)