కామికాజి-'సూసైడ్ డాల్ఫిన్స్’: సోవియట్‌లో శిక్షణ పొందిన వీటిని గతంలో ఇరాన్ ఎందుకు కొన్నది, అమెరికాతో ప్రస్తుత యుద్ధంలో వాటిని వాడుతోందన్న అనుమానాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి సంబంధించి మే 5న పెంటగాన్ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలలో ఓ ప్రశ్న ఆసక్తి రేకెత్తించింది.
అదేంటంటే... ‘ఇరాన్ ఆత్మాహుతి డాల్ఫిన్‌లను ఉపయోగిస్తోందా?’ అని
యుద్ధంలో భాగంగా ‘కామికాజీ డాల్ఫిన్‌ల వాడకం’ గురించి వచ్చిన వార్తల మీద వివరణ ఇవ్వాలని 'ది డైలీవైర్' రిపోర్టర్ అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్‌ను కోరారు.
'మనకు ఆత్మాహుతి డాల్ఫిన్ల దళం ఉందో లేదో నేను ధృవీకరించలేను లేదా ఖండించలేను. అయితే వాళ్ల దగ్గర మాత్రం కచ్చితంగా అలాంటివి లేవు" అని హెగ్సెత్ చెప్పారు.
"ఇది లేజర్‌లు అమర్చిన సొర చేపల కథలా ఉంది కదూ?" అని జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కైన్ అన్నారు.

"అమెరికా దిగ్బంధాన్ని ఛేదించలేకపోతున్న ఇరాన్, దీనికి పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది" అని వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనాన్ని ఉద్దేశించి అధికారులు ఈ వ్యాఖ్యలు చేశారు.
హార్ముజ్ జలసంధిని అమెరికన్ నౌకలు దిగ్బంధించడంతో, ఆ మార్గాన్ని నియంత్రించాలన్న ఇరాన్ వ్యూహం విఫలమైందని, దాన్ని దిద్దుకునేందుకు ఇరాన్ మార్గాన్ని అన్వేషిస్తోందని వాల్ స్ట్రీట్ కథనం తెలిపింది.
"అమెరికా యుద్ధ నౌకలపై దాడి చేసేందుకు జలంతర్గాముల నుంచి ఆత్మాహుతి దళ డాల్ఫిన్ల వరకు గతంలో ఎన్నడూ ఉపయోగించని ఆయుధాలను తెహ్రన్ ఉపయోగించవచ్చని ఇరాన్ అధికారులు చెప్పినట్లు" ఆ కథనం వెల్లడించింది.
"హార్ముజ్ జలసంధి ద్వారా వెళుతున్న ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ హెచ్చరించింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది" అని వాల్ స్ట్రీట్ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
చరిత్రలో ఏం జరిగిందంటే..
సైనిక అవసరాల కోసం డాల్ఫిన్లను ఉపయోగించడం నమ్మశక్యంగా లేకున్నా ఇది దశాబ్ధాలుగా వాడుకలో ఉంది. యుక్రెయిన్ నుంచి ఇరాన్ సూసైడల్ డాల్ఫిన్లను కొనుగోలు చేసిందని బీబీసీ 26 ఏళ్ల కిందట ఓ కథనం రాసింది.
రద్దైపోయిన సోవియట్ నేవీ సభ్యులు శిక్షణ ఇచ్చిన ఈ జలచరాలను తెహ్రాన్ సంపాదించిందని ఆ కథనం తెలిపింది.
అయితే ఆ సమయంలో వాటితో వాళ్లు పర్షియన్ గల్ఫ్‌లో ఏం చేస్తారనే దానిపై స్పష్టత లేదు.
శత్రువుల నౌకలు, డైవర్లపై దాడి చేసేందుకు రష్యన్ నేవీ సిబ్బంది... డాల్ఫిన్లు, ఇతర సముద్ర జీవులకు శిక్షణ ఇచ్చారు.
అయితే సోవియట్ పతనమైన తర్వాత బడ్జెట్ కోతల వల్ల వాటిలో కొన్నింటిని పర్యటకులకు ప్రదర్శనలు ఇచ్చేందుకు ప్రైవేటు ప్రాంతాలకు తరలించారు.
సైనిక, పౌర జీవితంలో వాటికి ప్రధాన గురువు బోరిజ్ జురిడ్. జలంతర్గామి అధికారిగా వృత్తిని ప్రారంభించిన ఆయన తర్వాతి కాలంలో మెడికల్ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు.
ఆ సమయంలో వాటిని పోషించే పరిస్థితి లేనందున వాటన్నింటినీ ఇరాన్‌కు అమ్మేశారని చెప్పుకున్నారు.
"నేను క్రూరుడినైతే సెవస్టపోల్‌లోనే ఉండిపోగలను. కానీ నా జంతువులు ఆకలితో అలమటించడం నేను భరించలేను" అని జురిడ్ అప్పట్లో రష్యన్ పత్రిక కొమ్సోల్సాకాయా ప్రావ్దాతో అన్నారు.
"వేల డాలర్ల ఖరీదు చేసే వాటి మందులు అయిపోయాయి. వాటికి ఆహారం పెట్టడానికి చేపలుగానీ, ఆహార సప్లిమెంట్లుగానీ లేవు" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీ కథనంలో ఏం రాశారు?
బీబీసీ 2000 సంవత్సరంలో రాసిన కథనం ప్రకారం 27 జంతువులను యుక్రెయిన్ నియంత్రణలో ఉన్న క్రైమియా ద్వీపకల్పంలోని సెవస్టపోల్ నుంచి రవాణా విమానంలో పర్షియన్ గల్ఫ్‌కు తరలించారు.
ఈ జంతువులలో డాల్ఫిన్లతో పాటు పోర్పోయిస్‌లు, సీ లయన్స్, సీల్స్, బెలుగా తిమింగలం లాంటివి ఉన్నాయి.
1991లో క్రైమియాకు తరలించడానికి ముందు జురిడ్ పసిఫిక్ నౌకా స్థావరంలో నాలుగు డాల్ఫిన్లు, బెలుగా తిమింగలానికి శిక్షణ ఇచ్చారు.
ఆ జంతువుల వీపులకు హార్పూన్‌లను కట్టి శత్రువులకు చెందిన డైవర్లపై దాడులు చేయడం లేదా వాళ్లను నీటి ఉపరితలానికి లాక్కు వచ్చేలా శిక్షణ ఇచ్చారు.
ఈ డాల్ఫిన్‌లు ఆత్మాహుతి దళంలాగా పని చేస్తాయి. ఓడ బయటి భాగాన్ని తాకగానే పేలిపోయే మందుపాతరలను మోసుకెళ్లి ఆత్మాహుతి దాడులతో శత్రు నౌకలపై దాడి చేస్తాయి.
ప్రొపెల్లర్ల శబ్ధాన్నిబట్టి ఏది సోవియట్‌దో, ఏది విదేశీ జలంతర్గామో తేడాను గుర్తించగలవు.
జురిడ్ పరిశోధన ప్రధానంగా సైనిక అవసరాల మీద దృష్టి పెట్టిందని రాసిన కొమ్సోల్సాకాయా ప్రావ్దా, డాల్ఫిన్లను 'మెర్సినరీలు'గా అభివర్ణించింది.
"వాస్తవానికి మన రహస్య ఆయుధాలను యుక్రెయిన్ నుంచి ఇరాన్ చాలా తక్కువ ధరకు కొన్నది" అని జురిడ్ చెప్పారు.
గతంలో ఇరాన్‌కు రష్యా సైనిక అమ్మకాలను అమెరికా వ్యతిరేకించిందని రష్యన్ పత్రిక పేర్కొంది.
తమ డాల్ఫిన్లను ఏ మిషన్ కోసం ఉపయోగిస్తారో తనకు తెలియదని జురిడ్ చెప్పారు.
"నా జంతువులు సురక్షితంగా ఉంటే చాలు. నేను దేవుడితోనైనా, దెయ్యంతోనైనా వెళతాను" అని ఆయన అన్నారు.
రష్యాతో పాటు అమెరికా కూడా సైనిక ప్రయోజనాల కోసం డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చింది.
కాలిఫోర్నియాలోని శాన్‌డియాలో సముద్ర క్షీరదాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఉత్తర కొరియాతో పాటు మరికొన్ని దేశాల్లో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనధికారిక రిపోర్ట్‌లు వచ్చాయి.
ఉత్తర కొరియాలో డాల్ఫిన్ కేజెస్‌కు సంబంధించిన చిత్రాలను ఉపగ్రహాలూ చూపించాయి. దీంతో ప్యాంగ్యాంగ్ కూడా డాల్ఫిన్లను సైనిక అవసరాలకు వాడే ప్రయత్నం చేస్తోందని ఊహాగానాలు వచ్చాయి.
అయితే డాల్ఫిన్లను సైనిక అవసరాలకు ఉపయోగించుకునే అత్యంత అధునాతన, సుదీర్ఘ కార్యక్రమాలు ఇప్పటికీ రష్యా, అమెరికా వద్ద మాత్రమే ఉన్నాయి.
యుక్రెయిన్‌పై దాడి తర్వాత నల్ల సముద్రంలో తన నౌకాదళాన్ని రక్షించుకోవడానికి, శత్రు డైవర్లను ఎదుర్కోవడానకి సెవస్టపోల్ పోర్ట్‌లో రష్యా సైనిక డాల్ఫిన్ల వాడకాన్ని పెంచింది.

ఫొటో సోర్స్, Getty Images
"అవి ఆజ్ఞలను పాటిస్తాయి"
1989 నుంచి 1997 వరకు ఇరాన్‌ను పాలించిన అక్బర్ హషేమీ రఫ్సంజానీ ఆత్మకథ ‘ఎరా ఆఫ్ రీకన్‌స్ట్రక్షన్’లో సోవియట్ నుంచి తీసుకు వచ్చిన జంతువులను ఉంచిన ప్రదేశానికి తన పర్యటన గురించి ప్రస్తావించారు.
"మేము కిష్ ద్వీపానికి ఆగ్నేయంగా ఉన్న హుస్సేన్ సాబెట్‌కు చెందిన హోటల్ పార్క్‌ను సందర్శించాము. అక్కడ పచ్చదనాన్ని పెంచే పనులు సంతృప్తికరంగా ఉన్నాయి. సముద్ర జీవుల కోసం ఏర్పాటు చేసిన గుంటల నిర్మాణం పూర్తయింది. కొన్ని గుంటల్లో సముద్ర జీవులు ఉన్నాయి. యుక్రెయిన్ నుంచి అనేక ఎలిఫెంట్ సీల్స్, సీ లయన్స్, డాల్ఫిన్లను తీసుకువచ్చారు" అని ఆయన రాశారు.
"గతంలో ఈ జంతువులను సంరక్షించిన యుక్రేనియన్ల బృందం ఒకటి ఇరానియన్లకు శిక్షణ ఇచ్చేందుకు వారితో పాటు ఉంది. మేము వాటర్ పూల్ చూడటానికి వెళ్లినప్పుడు అక్కడున్న జంతు సంరక్షకుడు తాను నేర్చుకున్న నైపుణ్యాలను మాకు చూపించారు. అది చాలా ఆసక్తికరంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
2017లో మరణించిన రఫ్సంజానీ, డాల్ఫిన్లను సైనిక అవసరాలకు ఉపయోగించారన్న వార్తలను తన ఆత్మకథలో ఖండించారు.
"సముద్రంలో మందు పాతరలు అమర్చడానికి లేదా నిర్వీర్యం చేయడానికి డాల్ఫిన్లకు సైనిక శిక్షణ ఇచ్చారని, అందుకోసమే వాటిని ఇరాన్ కొనుగోలు చేసిందని వెస్ట్రన్ మీడియా రాసిన కథనాలను సైనిక జనరల్ ఖండించారు" అని రఫ్సంజానీ రాశారు.

ఫొటో సోర్స్, Yannis Kontos/Sygma via Getty Images
ఈ కథనాలపై తాము కోర్టులో ఫిర్యాదు చేశామని, కోర్టు చర్యలు తీసుకుంటుందని ఆయన ఆత్మకథలో రాశారు. డాల్ఫిన్లలో చాలావరకు 40 ఏళ్లు జీవిస్తాయని, సంతానాన్ని బాగా వృద్ధి చేస్తాయని, చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర జీవులను తింటాయని ఆయన అందులో పేర్కొన్నారు.
"ఎలిఫెంట్ సీల్స్ రెండు టన్నులు, సీ లయన్స్ టన్ను బరువుంటాయి. తిమింగలాలు మూడు టన్నుల బరువుంటాయి. అవి మనుషులకు హాని చేయవు. 2 నుంచి 7 నిముషాలు నీటిలో మునిగి ఉండగలవు. అయితే సీల్స్ 45 నిముషాలు శ్వాసను బిగబట్టగలవు" అని రఫ్సంజానీ పేర్కొన్నారు.
"వాటిలో చాలా భాగం ఆర్కిటిక్ మహాసముద్రంలో చల్లని నీరు ఉండే ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. వేసవిలో కొలను నీటిని చల్లబరచడానికి అవి ఉపయోగపడేవి’’ అని రఫ్సంజానీ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

























