నీట్ పేపర్ లీక్ : ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన శివరాజ్ మోటేగావ్‌కర్ ఎవరు?

ఫొటో సోర్స్, Shivraj Motegaonkar
నీట్ పేపర్ లీక్ కేసులో లాతూర్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు శివరాజ్ మోటేగావ్‌కర్‌ను సీబీఐ పుణేలో అరెస్ట్ చేసింది.
ఆయనను దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు 9 రోజుల సీబీఐ కస్టడీకి పంపినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
కెమిస్ట్రీ ప్రొఫెసరైన మోటేగావ్‌కర్, లాతూర్‌లో నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు.
మోటేగావ్‌కార్ లాతూర్‌లో రేణుకై కెరీర్ సెంటర్ (ఆర్‌సీసీ) శిక్షణా సంస్థను 2003లో ప్రారంభించారు. తొలిరోజుల్లో ఈ సంస్థ మహారాష్ట్ర హోటల్ మేనేజ్‌మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంహెచ్-సీఈటీ)కు శిక్షణ ఇచ్చేది.

మోటేగావ్‌కర్‌ను మే 17న 10 గంటల పాటు ప్రశ్నించారు. 18న కూడా ఇది కొనసాగింది. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు.
ఆదివారం నాటికి ఈ కేసులో సీబీఐ 9 మందిని అరెస్ట్ చేయగా, శివాజీ మోటేగావ్‌కర్ అరెస్ట్‌తో ఈ కేసులో నిందితుల సంఖ్య 10కి చేరింది.
నీట్, జేఈఈ, ఎంహెచ్‌టీ-సీఈటీ ప్రవేశ పరీక్షల కోసం మహారాష్ట్రలో అతి పెద్ద కోచింగ్ నెట్‌వర్క్‌లో ఆర్‌సీసీ ఒకటిగా గుర్తింపు పొందింది.

ఫొటో సోర్స్, Shivraj Motegaonkar
ఎవరీ శివరాజ్ మోటేగావ్‌కర్?
రేణుకై కెరీర్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకారం శివరాజ్ మోటేగావ్‌కర్ ఎంఎస్సీ ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. అయితే ఆయన ఏ యూనివర్సిటీలో చదివారో వెబ్‌సైట్‌లో ప్రస్తావించలేదు.
తమ విద్యార్థులు సెట్/నెట్-జేఆర్ఎఫ్, గేట్, బార్క్, డీఆర్‌డీఓ, టీఐఎఫ్ఆర్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని ఆర్‌సీసీ చెబుతోంది.
మోటేగావ్‌కర్ మొదట్లో ఇంట్లోనే పాఠాలు చెప్పేవారు. తర్వాత 2003లో రేణుకాయి కెమిస్ట్రీ క్లాసెస్‌ను స్థాపించారు.
మోటెగావ్‌కర్ ఇంటి నుంచే బోధన ప్రారంభించి, ఆ తర్వాత 2003లో రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్‌ను స్థాపించారు. తర్వాత ఇది రేణుకై కెరీర్ సెంటర్‌గా విస్తరించింది. మరాఠ్వాడ, పుణే, నాసిక్, నాందేడ్, ఛత్రపతి శంభాజీనగర్‌తో పాటు మహారాష్ట్రలోని మరికొన్ని నగరాల్లో ఆర్‌సీసీ బ్రాంచ్‌లు ఉన్నాయి.
మెడికల్, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా అందిస్తున్నట్టు సంస్థ వెబ్‌సైట్ చెబుతోంది.
మోటెగావ్‌కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా ఆయన విద్యార్థులతో మాట్లాడతారు.
పరీక్షలు, చదువుకునే పద్ధతులు, కెరీర్‌కు సంబంధించిన వీడియోలు, పోస్టులను క్రమం తప్పకుండా పంచుకుంటారు.

ఫొటో సోర్స్, Shivraj Motegaonkar
నీట్ పరీక్ష రద్దువేళ మోటేగావ్‌కర్ ఏమన్నారు?
లాతూర్‌లో నీట్, జేఈఈ పరీక్ష ప్రిపరేషన్ కోసం 11,12వ తరగతి విద్యార్థుల్లో ఆర్‌సీసీకి మంచి గుర్తింపు ఉంది.
11వ తరగతి విద్యార్థులకు వార్షిక కోచింగ్ ఫీజు సుమారుగా రూ. 40వేలు, 12వ తరగతి విద్యార్ధులకు రూ. 50వేలుగా ఉంటుంది
పరీక్షకు ముందు ఇచ్చే గెస్ పేపర్లు, ప్రాక్టీస్ టెస్ట్‌ల వల్ల ఆర్‌సీసీ వేగంగా అభివృద్ధి చెందింది.
నీట్(యూజీ) పరీక్ష 2026 మే 3న పూర్తైన తర్వాత మోటేగావ్‌కర్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో తమ టీచర్ ఇచ్చిన గెస్ పేపర్ నుంచి 42 ప్రశ్నలు నీట్ పరీక్షలో వచ్చాయని ఓ విద్యార్థి చెప్పినట్టుగా ఉంది.
ప్రశ్నాపత్రం లీకైనట్లు తేలడంతో ప్రభుత్వం నీట్ పరీక్షను రద్దు చేసింది. అనంతరం మోటేగావ్‌కర్ తాను క్లాసులో పాఠాలు చెబుతున్న వీడియోను తన యూట్యూబ్ చానల్‌లో విడుదల చేశారు.
పరీక్ష రద్దైనందుకు విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆయన అందులో కోరారు. పరీక్షకు సన్నద్ధం కావడానికి ఆర్‌సిసి ఉచిత ఆన్‌లైన్ తరగతులను తిరిగి ప్రారంభిస్తుందని చెప్పారు.
రీ ఎగ్జామినేషన్ వల్ల సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. "ప్రాక్టీస్ టెస్ట్‌లోని ప్రశ్నలు తప్ప వేరే ప్రశ్నలు ఉండవు" అని ఆ వీడియోలో అన్నారు.
తన విద్యార్థులు మే 3న జరిగిన నీట్ పరీక్షకు హాజరయ్యారని, ఈ పరీక్ష కోసం వారు ఆర్‌సీసీలో కోచింగ్ తీసుకున్నారని అంతకు ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో చెప్పారు.

ఫొటో సోర్స్, Shivraj Motegaonkar
సీబీఐ ఏం చెప్పింది?
మోటేగావ్‌కర్ అరెస్ట్ వివరాలను సీబీఐ మెమోలో పేర్కొంది.
"నీట్-యూజీ2026 పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి పంపిణీ చేసిన నేరంలో పాలుపంచుకున్న ముఠాలో శివరాజ్ రఘునాథ్ మోటెగావ్‌కర్ చురుకైన సభ్యుడని దర్యాప్తులో వెల్లడైంది" అని సీబీఐ తన మెమోలో తెలిపింది.
ఇతర నిందితులతో కలిసి ఆయన నీట్ (యూజీ) 2026 పరీక్షకు ముందే, అంటే 2026 ఏప్రిల్ 23న, ఆ పరీక్ష ప్రశ్నపత్రం, సమాధానాలను సంపాదించారు.
లాతూర్ లోని శివాజీనగర్‌లో ఉన్న శివరాజ్ రఘునాథ్ మోటేగావ్‌కర్ నివాసంలో 2026 మే 14న సోదాలు జరిపినప్పుడు, ఆయన మొబైల్ ఫోన్ నుంచి నీట్ (యూజీ) 2026 లీకైన ప్రశ్నపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
శివరాజ్ మోటెగావ్‌కర్ ఇతర నిందితులతో కలిసి, లీకైన ప్రశ్నపత్రాలు జవాబు పత్రాల కాపీలను వివేక్ పాటిల్‌తో సహా పలువురికి అందించారని సీబీఐ అరెస్ట్ మెమోలో తెలిపింది.
లీకైన నీట్ (యూజీ) 2026 పరీక్ష ప్రశ్నపత్రాల చేతిరాత ప్రతులు ఎవరెవరికి ఇచ్చారనే వివరాలను మోటెగావ్‌కర్ వెల్లడించలేదు.
దర్యాప్తు సమయంలో పరీక్ష తర్వాత లీకైన ప్రశ్నపత్రాలను ధ్వంసం చేయడం ద్వారా నిందితులు సాక్ష్యాలను నాశనం చేయడానికి కూడా ప్రయత్నించారని సీబీఐ మెమోలో తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























