పసిడి, వెండిపై దిగుమతి సుంకాన్ని ఎందుకు పెంచారు, నగల ధరలు పెరుగుతాయా?

దిగుమతి సుంకాల పెంపు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

భారత్ బంగారం, వెండిపై దిగుమతుల సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచింది. ఈమేరకు బుధవారం నోటిఫికేషన్ జారీచేసింది.

విదేశాల నుంచి పుత్తడి కొనుగోలును తగ్గించడం, విదేశీ మారక నిల్వలపై భారాన్ని తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

కనీసం ఏడాదిపాటైనా బంగారునగలు కొనుగోలు చేయవద్దని ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.

''బంగారం కొనుగోలుతో విదేశీ మారక వినియోగం పెరుగుతోంది. సంక్షోభ సమయాలలో దేశం కోసం బంగారాన్నివిరాళం ఇచ్చే సంప్రదాయం ఉండేది. ప్రస్తుతం అలా విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఒక ఏడాది పాటు ఎటువంటి బంగారు నగలు కొనకూడదని నిర్ణయించుకుందాం'' అన్నారు.

'బంగారాన్ని కొనకుండా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం ద్వారా మన దేశభక్తిని చాటుకుందాం'' అని మోదీ చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బంగారం

ఫొటో సోర్స్, Getty Images

బంగారం, వెండి దిగుమతులపై 10 శాతం ప్రాథమిక కస్టమ్స్ సుంకం, 5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్సు విధించడంతో 6 శాతం ఉన్న దిగుమతి సుంకం 15 శాతానికి చేరింది.

అంటే దీనర్థం భారత్‌లోకి వచ్చే బంగారు, వెండి, వ్యాపారులకు నగల వ్యాపారుల ద్వారా అంతిమంగా వినియోగదారుడికి అధిక ధరలతో చేరతాయి. అయితే ఈ నిర్ణయం అంతర్జాతీయ పసిడి ధరలపై ఎటువంటి ప్రభావం చూపనప్పటికీ దేశీయ పుత్తడి,వెండి ధరలను ప్రభావితం చేస్తుంది.

దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచడం ప్రత్యక్షంగా సామాన్యులపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, ‘బంగారం కొనొద్దు, నూనె తక్కువగా వాడాలి’ - ప్రధాని మోదీ సూచనలపై ప్రజల రియాక్షన్ ఏమిటి?

దిగుమతి సుంకాన్ని ఎందుకు పెంచారు?

బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను పెంచడం కేవలం ధరలకు సంబంధించింది మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడం కూడా దీని ప్రధాన ఉద్దేశం. 'రాయిటర్స్' నివేదిక ప్రకారం, 2025-26లో భారత్ బంగారు దిగుమతులు 71 బిలియన్ డాలర్లకు మించిపోతాయని అంచనా. కచ్చితంగా చెప్పాలంటే, ముడి చమురు తర్వాత దేశ దిగుమతి బిల్లులో బంగారం రెండో అతిపెద్ద అంశంగా మారుతోంది.

బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి భారత్ విదేశీ కరెన్సీని (డాలర్లను) ఖర్చు చేయాల్సి ఉంటుంది, ఇది నేరుగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, డాలర్లకు విపరీతమైన డిమాండ్ పెరగడం వల్ల రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయిలో ఉంది.

రష్యా-యుక్రెయిన్, ఇరాన్ యుద్ధాల కారణంగా, పెట్టుబడిదారులు బంగారంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. దీనివల్ల గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా పసిడి ధరలు గణనీయంగా పెరిగాయి, తద్వారా దేశ దిగుమతి బిల్లు కూడా పెరిగింది.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

డిమాండ్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

భారతదేశంలో కుటుంబాల పొదుపు, ఖర్చులలో బంగారం ఒక ముఖ్యమైన భాగం. అందుకే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు మార్కెట్లలో ఒకటిగా ఉంది.

2023లో 45.54 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారు దిగుమతులు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 51.4 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా వేశారు. అంటే 2024-25లో సుమారు 13.7 శాతం పెరుగుదల నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

" ఊహించినట్టుగానే 'కరెంట్ ఖాతా లోటు' ను నియంత్రించడానికి ప్రభుత్వం సుంకాన్ని పెంచింది. అయితే, ఇప్పటికే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, ఈ నిర్ణయం డిమాండ్‌పై ప్రభావం చూపవచ్చు" అని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా 'ఎకనామిక్ టైమ్స్'తో పేర్కొన్నారు.

గత ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్ నుంచి ఆశించిన లాభాలు రాకపోవడం, మరోవైపు బంగారం ధరలు పెరుగుతుండటంతో.. పెట్టుబడి సాధనంగా బంగారంపై ఆసక్తి పెరిగింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే, మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడులు 186% పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గత నెలలో వెల్లడించింది.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో, బంగారం వ్యాపారంలో ఉన్న కంపెనీల షేర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. గత రెండు రోజుల్లోనే టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వంటి కంపెనీల షేర్లు 10 నుండి 15 శాతం వరకు పతనమయ్యాయి.

రూపాయి, డాలర్

ఫొటో సోర్స్, Getty Images

బంగారు కొనుగోళ్లు రూపాయిని ప్రభావితం చేస్తాయా?

ఆర్థికవేత్తలు బంగారాన్ని సాధారణ వినియోగ వస్తువుగా చూడరు. రవాణా, విద్యుత్, పారిశ్రామిక అవసరాలకు చమురు లేదా ఇంధనం ఎంత అవసరమో.. బంగారం కొనుగోళ్లను విచక్షణతో కూడిన ఖర్చుగా లేదా ఒక పెట్టుబడి ఎంపికగా మాత్రమే పరిగణిస్తారు.

ప్రజలు పెద్ద మొత్తంలో బంగారం లేదా నగలను కొనుగోలు చేసినప్పుడు, ఆ బంగారాన్ని దిగుమతి చేసుకోవడానికి దేశం ఎక్కువ డాలర్లను వెచ్చించాల్సి ఉంటుంది. ఇది దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసాన్ని సూచించే 'కరెంట్ ఖాతా లోటు'ను పెంచుతుంది.

కరెంట్ ఖాతా లోటు పెరిగినప్పుడు రూపాయి బలహీనపడుతుంది. ఎందుకంటే దేశం సంపాదించే విదేశీ మారకద్రవ్యం కంటే ఖర్చు చేసేదే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వాలు బంగారు దిగుమతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంటాయి.

గతంలో కూడా ఆర్థిక ఒత్తిడి ఉన్న సమయాల్లో మితిమీరిన బంగారు దిగుమతులను నిరుత్సాహపరచడానికి భారత్ పలు చర్యలు తీసుకుంది. దిగుమతి సుంకాలను పెంచడంతో పాటు, సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ చర్యలన్నీ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడిని తగ్గించి, రూపాయి విలువను స్థిరీకరించడమే లక్ష్యంగా తీసుకున్నవి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.