You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: మూల్యాంకనం వెనకున్న 'కోఎంప్ట్ ఎడ్యుటెక్' కంపెనీ కథేమిటి?
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలపై వివాదం నెలకొంది. పరీక్ష పేపర్ల మూల్యాంకనం (ఎవాల్యుయేషన్)లో లోపాలు జరిగాయంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి.
డిజిటల్ ఎవాల్యుయేషన్‌లో తప్పులు జరిగాయని పలువురు విద్యార్థులు 'ఎక్స్' వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ వెనుక హైదరాబాద్‌కు చెందిన 'కోఎంప్ట్ ఎడ్యుటెక్' కంపెనీ ఉండటంతో.. ఇప్పుడు ఈ కంపెనీ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
2019లో తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాల సందర్భంగా రేగిన దుమారంలోనూ ఇదే కంపెనీ పాత్ర ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దీనిపై 'ఎక్స్'లో స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, కోఎంప్ట్ మధ్య సంబంధం ఏమిటని, ఎందుకు టెండర్ కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు.
అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఖండించింది. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తోసిపుచ్చింది.
ఈ మొత్తం వివాదంపై కోఎంప్ట్ ఎడ్యుటెక్ సీఈవో వీఎస్ఎన్ రాజుతో మాట్లాడేందుకు బీబీసీ సంప్రదించింది. ఫోన్ కాల్‌కు, మెసేజ్‌లకు ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన అందుబాటులోకి రాగానే, వివరణ అప్‌డేట్ చేస్తాం.
తొలిసారిగా డిజిటల్ ఎవాల్యుయేషన్
12వ తరగతి పరీక్షల్లో ఆన్‌స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) సిస్టమ్ అమల్లోకి తీసుకువస్తున్నట్లు 2026 ఫిబ్రవరిలో సీబీఎస్ఈ ప్రకటించింది. దీని ప్రకారం, విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను డిజిటల్ పద్ధతిలో దిద్దనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా సుమారు 17 లక్షల మంది విద్యార్థులు 2026లో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాశారు.
''ఈ సమస్య నుంచి మేం తప్పుకోవడం లేదు. విద్యార్థులకు అండగా ఉండాల్సిన బాధ్యత మాపై ఉంది. విద్యార్థులకు సంబంధించి 98 లక్షల స్క్రిప్టులు వచ్చాయి. ప్రతి కాపీలో 40 పేజీలు ఉంటాయి. దాదాపు 40 కోట్ల పేజీలను స్కాన్ చేసి సీబీఎస్ఈ మూల్యాంకనం చేసింది'' అని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీడియాకు వివరించారు.
భారత్‌లో ఇప్పటికే చాలా విద్యాసంస్థలు డిజిటల్ మూల్యాంకనం చేస్తున్నాయి. ఈ క్రమంలో సీబీఎస్ఈ కూడా 2026 నుంచి ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. టెండర్ ప్రక్రియను 2025 నవంబరులో పూర్తి చేయగా, కోఎంప్ట్ ఎడ్యుటెక్ కంపెనీ దాన్ని దక్కించుకుంది.
కోఎంప్ట్ కంపెనీ ఎవరిది?
కోఎంప్ట్ కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, 25 ఏళ్లకు పైగా 'ఎడ్ టెక్' రంగంలో తమకు అనుభవం ఉందని చెబుతోంది.
వన్ ఎక్స్, ఆన్ మార్క్, ఈజీ టెస్ట్, డిజీ ట్యాబ్ వంటి వాటిల్లో సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది.
పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం ఈ కంపెనీ ప్రధానంగా నిర్వహిస్తోంది.
ప్రీ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ మేనేజ్‌మెంట్, ఏఐ ఆధారిత పరీక్షలు, జవాబుపత్రాల డిజిటైజేషన్, డిజిటల్ మూల్యాంకనం వంటి సేవలు అందిస్తున్నట్లు కంపెనీ చెబుతోంది.
ఏటా 20 లక్షలమంది విద్యార్థులకు ఆయా సేవలు అందుతున్నట్లు వివరిస్తోంది.
కంపెనీ చైర్మన్‌గా బెంగళూరు ట్రిపుల్ ఐటీ ఫౌండర్ డైరెక్టర్ ప్రొ. సదాగోపన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం.అనంతచారి, సీఈవో అండ్ డైరెక్టర్‌గా వీఎస్ఎన్ రాజు వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్లుగా ఆర్.జయరామన్, ఏవీ నారాయణ ఉన్నారు.
కోఎంప్ట్.. గ్లోబరెనా ఒక్కటేనా?
కోఎంప్ట్ కంపెనీ వివరాలను బీబీసీ పరిశీలించింది. గతంలో గ్లోబరెనా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌గా ఉన్న కంపెనీ పేరు కోఎంప్ట్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మారింది.
ఇదే గ్లోబరెనా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు గ్లోబరెనా ఐటీఈ నాలెడ్జ్ ప్రైవేటు లిమిటెడ్‌గా ఉన్నట్లు 'జౌబా కార్ప్'లో వివరాల ప్రకారం తెలుస్తోంది.
ఇందులోని వివరాల ప్రకారం, కంపెనీ 2000 ఏప్రిల్‌లో ప్రారంభమైనట్లు ఉంది.
కంపెనీ పేరును 2019లో మార్చినట్లు సీఈవో వీఎస్ఎన్ రాజు చెప్పారు. 2019లో తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలపై నెలకొన్న వివాదం తర్వాత కొన్ని నెలలకే గ్లోబరెనా పేరును కోఎంప్ట్ ఎడ్యుటెక్‌గా మార్చారు నిర్వాహకులు.
2019లో తెలంగాణలో ఏం జరిగింది?
2019 ఏప్రిల్‌లో తెలంగాణలో ఇంటర్ ఫలితాలను బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. సుమారు 9.70లక్షల మంది పరీక్షలు రాయగా, 3.20లక్షల మంది ఫెయిలైనట్లు ప్రకటించింది.
జవాబు పత్రాలు స్కానింగ్ సరిగా చేయలేదని, డిజిటల్ మూల్యాంకనంలో తప్పులు దొర్లాయని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తల్లిదండ్రులు, విద్యార్థులు హైదరాబాద్ వచ్చి ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలకు దిగారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ ఫెయిల్ అయిన 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఆ తర్వాత మే నెలలో వచ్చిన రీ వెరిఫికేషన్ ఫలితాల్లో కేవలం 1,137 మంది ఫలితాల్లోనే మార్పులు వచ్చినట్లు బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ప్రకటించింది. వారిలో ఒక విద్యార్థికి ముందుగా ప్రకటించిన ఫలితాల్లో 'జీరో' మార్కులు రాగా, తర్వాత రీ వెరిఫికేషన్‌లో 99 మార్కులు వచ్చినట్లు బోర్డు ప్రకటించింది.
ఈ ఫలితాల్లో తప్పులకు ఇంటర్మీడియెట్ బోర్డుకు సాంకేతిక సాయం అందించిన గ్లోబరెనా కంపెనీదే బాధ్యతని అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి.
ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం కోసం 2017లో ప్రభుత్వం నుంచి గ్లోబరెనా కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది.
''మేం ఇంటర్మీడియెట్ బోర్డు నిర్దేశిత విధానాన్ని పాటించాం. జరిగిన ఘటన దురదృష్టకరం. ప్రాథమికంగా కొన్ని సాంకేతిక సమస్యలు గుర్తించి వెంటనే సరిచేశాం'' అని అప్పట్లో గ్లోబరెనా సీఈవో వీఎస్ఎన్ రాజు బీబీసీతో చెప్పారు.
ఆ తర్వాత ఈ వివాదంపై తెలంగాణ హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
రీ వెరిఫికేషన్ తర్వాత ఎవాల్యుయేషన్ ఎర్రర్ కేవలం 0.16 శాతంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు దృష్టికి ఇంటర్మీడియెట్ బోర్డు తీసుకెళ్లింది. రీ వేల్యుయేషన్, విద్యార్థులకు పరిహారం చెల్లింపు, గ్లోబరెనా కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
ఆ తర్వాత తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం నుంచి గ్లోబరెనాను తప్పించిందని 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' రిపోర్టు చేసింది.
అనంతరం 2022లోనూ ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (ప్రస్తుత ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్) పీజీ డిప్లొమా కోర్సుల జవాబు పత్రాల మూల్యాంకనంపై వివాదం నెలకొంది.
ఏమిటీ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్?
ఆన్‌స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ గురించి ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది.
సాధారణంగా కేంద్ర లేదా రాష్ట్రాల విద్యా బోర్డులు నిర్వహించే పరీక్షల్లో జవాబులను విద్యార్థులు పేపర్లపై రాస్తుంటారు. ఆ జవాబు పత్రాలను సంబంధిత అధ్యాపకులు లేదా సబ్జెక్టు నిపుణులకు ఇచ్చి మూల్యాంకనం చేయిస్తారు.
ఆన్ స్క్రీన్ మార్కింగ్ దీనికి భిన్నంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ తీసుకువచ్చినప్పుడు పరీక్షల కంట్రోలర్‌గా ఉన్న ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ బీబీసీతో మాట్లాడారు.
''ఆన్ స్క్రీన్ మార్కింగ్‌లో భాగంగా విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను స్కాన్ చేసి కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేస్తారు. వాటిని ప్రత్యేక సర్వర్ ద్వారా సబ్జెక్టు నిపుణులు లేదా అధ్యాపకులకు పంపిస్తారు. వారికి ఇచ్చిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అయ్యి జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తారు'' అని వివరించారు.
ఈ ప్రక్రియలో మూల్యాంకనం కంప్యూటర్ స్క్రీన్‌పై చూస్తూ చేస్తారని, ఫిజికల్‌గా జవాబు పత్రాలను దిద్దడం ఉండదని వివరించారు.
ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్‌లో కొన్ని సమస్యలు ఎదురవుతాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు వీలుంటుందని ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ వివరించారు.
''బ్లర్ ఇమేజ్ (జవాబుపత్రం సరిగా స్కాన్ కాకపోవడం) ఉంటే, వెంటనే ఎవాల్యుయేటర్ తిరస్కరించడం లేదా వెనక్కి పంపించే ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని వెనక్కి పంపితే వెంటనే మళ్లీ జవాబుపత్రం స్కాన్ చేసి ఇస్తారు'' అని చెప్పారు.
అలాగే కేవలం విద్యార్థి రాసిన జవాబుల వరకే కాకుండా బుక్‌లెట్ పూర్తిగా స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
''జవాబు పత్రాలకు క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ఉంటాయి. వాటిని విద్యార్థుల క్యూఆర్ కోడ్‌కు మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ సరిగా చేయకపోతే ఒకరి జవాబు పత్రాలు వేరొకరికి వెళ్లే అవకాశం ఉంటుంది. అది చాలా అరుదుగా జరుగుతుంది'' అని ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ వివరించారు.
రాహుల్ గాంధీ ఏమన్నారు? కేంద్రం ఏం చెప్పింది?
సీబీఎస్ఈ ప్రకటించిన 12వ తరగతి ఫలితాలపై రాహుల్ గాంధీ ఒక వీడియోను 'ఎక్స్'లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు.
''నా ఈ ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని అడగండి. ఎందుకు, ఎవరి ద్వారా కోఎంప్ట్ ఎడ్యుటెక్‌కు కేంద్ర ప్రభుత్వం టెండరు కట్టబెట్టింది? ఏ విధానంలో టెండరు ఇచ్చారు? గతంలో ఈ కంపెనీ విషయంలో తలెత్తిన వివాదాలను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? కంపెనీ వివరాలు సమగ్రంగా తెలుసుకున్నారా?'' అని ప్రశ్నించారు.
కోఎంప్ట్ కంపెనీకి టెండరు కట్టబెట్టడానికి కారణాలపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ లేదా సిట్‌తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కొట్టిపారేసింది.
''కోఎంప్ట్ కంపెనీకి టెండరు ఇచ్చే విషయంలో ఆరోపణలు పూర్తిగా నిరాధారం. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయి. ఎలాంటి వాస్తవాలూ లేవు'' అని చెప్పింది.
నిబంధనల ప్రకారం 2025 ఆగస్టు 28న సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో ప్రకటన ఇచ్చిన తర్వాతే క్వాలిఫై అయిన బిడ్డింగ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చామని సీబీఎస్ఈ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ విధానం ప్రకారమే టెండరు ఇచ్చినట్లుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారని పీటీఐ చెప్పింది.
ఈ వివాదంపై ధర్మేంద్ర ప్రధాన్ అధికారులతో సమీక్షించినట్లు పీఐబీ పేర్కొంది.
''విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలను త్వరగా పరిష్కరిస్తాం'' అని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారని పీఐబీ రిపోర్టు చేసింది.
ఇప్పటివరకు 4 లక్షల మంది విద్యార్థులకు చెందిన 11 లక్షల స్కాన్డ్ జవాబు పత్రాలు రీ వెరిఫికేషన్ కింద దరఖాస్తు చేయగా, వాటిని విద్యార్థులకు ఇచ్చినట్లుగా చెప్పారు.
''అంతరాయం లేకుండా విద్యార్థులకు నిరంతర సేవలను అందించడం కోసం.. సీబీఎస్ఈ పోర్టల్ స్థిరత్వం, సర్వర్ సామర్థ్యం, లాగిన్ నిర్వహణ, పేమెంట్ గేట్‌వే అనుసంధాన ప్రక్రియలను సమీక్షించే బాధ్యతను.. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు, డిజిటల్ వ్యవస్థల నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి సాంకేతిక బృందానికి అప్పగించారు'' అని పీఐబీ రిపోర్టు చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)