You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మంచి మార్కులు సాధించారు... విమానంలో విహరించారు- ప్రతిభ చూపిన సర్కారు బడి విద్యార్ధులకు అబ్బురపరిచే ప్రోత్సాహం
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
విమానంలో ప్రయాణించడం ఇప్పటికీ చాలామందికి కల. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అయితే అది మరింత దూరమైన అనుభూతి.
కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో కొందరు పదో తరగతి విద్యార్థులకున్న ఈ కలను వారు తెచ్చుకున్న మార్కులు నిజం చేశాయి.
మంచి మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తానని కొందరు ఉపాధ్యాయులు ఇచ్చిన మాట...ఆ విద్యార్థుల జీవితాల్లో మరిచిపోలేని జ్ఞాపకంగా మారింది.
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న సత్యారావు ఆరుగురు విద్యార్థులను విమానంలో ట్రిప్‌కు తీసుకెళ్లారు.
"మంచి మార్కులు వస్తే… విమానం ఎక్కిస్తాం" అని ఉపాధ్యాయులు చెప్పిన మాటను విద్యార్థులు మొదట సరదాగా తీసుకున్నారు. కానీ పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన తర్వాత ఆ మాట నిజమైంది.
కేవలం ఉపాధ్యాయులే కాదు రాష్ట్రంలోని కొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇలాగే చేశారు.
ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టాప్ మార్కులు సాధించిన కొందరు విద్యార్థులకు విమాన ప్రయాణం బహుమతిగా వస్తే, మరికొందరికి భూమి, ఇంకొదరికి నగదు లభించాయి.
అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు? విద్యార్థులకు తొలి విమాన ప్రయాణ అనుభవం ఇచ్చిన ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారు? విద్యార్థులు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లారు? విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు?
విద్యార్థుల విమాన ప్రయాణం
"టెన్త్‌లో మండలం ఫస్ట్ వస్తే విమానం ఎక్కిస్తానని సత్యారావు సర్ చెప్పారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం మమ్మల్ని విమానంలో తీసుకెళ్లారు" అని విజయనగరం జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం విద్యార్థిని విజయలక్ష్మి చెప్పింది.
చదువుపై ఆసక్తి పెంచేందుకు విజయనగరం జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు.
అందులో భాగంగా మంచి మార్కులు సాధించిన విద్యార్థులను విమాన ప్రయాణానికి తీసుకెళ్తున్నారు. మొదటిసారి విమానం ఎక్కిన విద్యార్థులు తమ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నామన్నారు.
"ఇంత చిన్న వయసులో విమానం ఎక్కడం చాలా సంతోషంగా అనిపించింది. పర్యటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను చూసి చాలా ఎంజాయ్ చేశాం" అని విజయలక్ష్మి అన్నది.
ఈ విమానప్రయాణం తమలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని విద్యార్థులు చెబుతున్నారు.
"ఫస్ట్ టైమ్ విమానం ఎక్కాను. ఆనందంతో పాటు కొంచెం టెన్షన్ కూడా అనిపించింది. నేను మంచి మార్కులు తెచ్చుకోవడానికి సత్యారావు మాస్టారు పెట్టిన విమాన ప్రయాణం బహుమతి కూడా ఒక కారణమే" అని మరో విద్యార్థిని లిఖిత బీబీసీతో అన్నది.
"రిజల్ట్ వచ్చిన రోజు సర్ ఫోన్ చేసి మంచి మార్కులు వచ్చాయి కాబట్టి విమానం ఎక్కిస్తానన్నారు. చాలా ఆనందంగా అనిపించింది" అని దినేశ్ అనే విద్యార్థి అన్నాడు.
పోటీతత్వం పెరుగుతుంది: ఉపాధ్యాయులు
ఈ ప్రయత్నం పిల్లల్లో పోటీతత్వాన్నిపెంచుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.
"నేను ఇప్పటివరకు విమానం ఎక్కలేదు. కానీ మా విద్యార్థులు విమానంలో ప్రయాణించడం చాలా ఆనందంగా అనిపించింది. ఇది పిల్లల్లో చదువుపై మరింత ఆసక్తి పెంచుతుంది" అని విజయనగరం జిల్లా గొర్ల మండలం జెడ్పీహెచ్ఎస్ వల్లపురం ప్రధానోపాధ్యాయుడు అప్పారావు బీబీసీతో చెప్పారు.
"మమ్మల్ని విమానం ఎక్కిస్తారని చెప్పినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజులకి నిజంగానే ఎక్కిస్తారని తెలిసింది. అప్పటినుంచి ఇంకా బాగా చదవాలి, పోటీ పడాలి అనిపించింది" అని విద్యార్థి దినేశ్ అన్నాడు.
తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో సంతోషంగా ఉన్నారు. తమ పిల్లలు మంచి మార్కులు సాధించడమే కాకుండా విమాన ప్రయాణం చేయడం తమకు తృప్తినిచ్చిందని వారు చెబుతున్నారు.
"మేం తీసుకెళ్లలేకపోయినా మా పిల్లలు విమానంలో వెళ్లగలిగారు" అని విద్యార్ధిని విజయలక్ష్మి తండ్రి కార్తీక్ అన్నారు.
"వివిధ ప్రదేశాలు చూపించి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అక్కడ చూసిన విషయాలన్నీ మాతో పంచుకున్నాడు. మా బాబు కళ్లలో ఆనందం స్పష్టంగా కనిపించింది" అని విద్యార్థి దినేశ్ తండ్రి నారాయణరావు అన్నారు.
విమాన ప్రయాణం బహుమతి ఎందుకంటే...
ఈ ఆలోచనకు తన చిన్ననాటి కోరికే కారణమని తెలుగు ఉపాధ్యాయుడు సత్యారావు చెప్పారు.
"నేను చిన్నప్పుడు విమానం ఎక్కాలని అనుకునేవాడిని. ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటిసారి ఎక్కాను. మా తల్లిదండ్రులను కూడా ఎక్కించాను. అయితే ఆ అనుభూతిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఇవ్వాలనిపించింది. అందుకే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపించిన వారికి ఈ విమాన ప్రయాణ బహుమతి పెట్టాను" అని ఆయన చెప్పారు.
"గతేడాది ఇలాగే చేశాను. ఇప్పడు ఆరుగురుని తీసుకెళ్లాను. వచ్చే ఏడాది కూడా ఈ బహుమతిని కొనసాగిస్తాను" అని సత్యారావు తెలిపారు.
"ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు గుర్తుండిపోయే అనుభూతి ఇవ్వాలనుకున్నాం. అందుకే ఈ ఆఫర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకే ఇస్తున్నాం" అని సత్యారావు చెప్పారు.
అలాగే విజయనగరం జిల్లాకే చెందిన మిరియాల కృష్ణారావు కూడా ఉత్తమ ఫలితాలు చూపించిన విద్యార్థులను విమానం ఎక్కించారు.
ప్రజా ప్రతినిధులు కూడా...
సత్యారావు ఒక్కరే కాదు...రాష్ట్రంలో మరికొందరు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కూడా మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 'కలలకు రెక్కలు' అనే పేరుతో విద్యార్థులు విమాన ప్రయాణం చేసే వీలుకల్పించగా...మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు స్థలం ఇస్తానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రకటించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా ఆరుగురు విద్యార్థులను విజయవాడ నుంచి హైదరాబాద్ విమానంలో తీసుకుని వెళ్లారు.
చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తే తమ కలలు కూడా ఆకాశాన్ని తాకుతాయని పిల్లలకు పరోక్షంగా చాటిచెప్పే ప్రయత్నమే ఇదని ఆమె అన్నారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తన నియోజకవర్గానికి చెందిన పదో తరగతి టాపర్లు జస్మిత, సాయి పూజిత, మోహిత్ చరణ్‌లకు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి మూడు సెంట్ల స్థలం ఇస్తామని ప్రకటించారు.
"ఇది ఇతర విద్యార్థులకు కూడా చదువులో రాణించి తమ లక్ష్యాలను సాధించాలనే స్ఫూర్తిని ఇస్తుంది" అని ఆయన అన్నారు.
పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించి, ప్రభుత్వ పాఠశాలల కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులను విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అభినందించారు.
ప్రభుత్వ పాఠశాలలో 590కి పైగా మార్కులు సాధించడం అనేది విద్యార్థులలోని అసాధారణ ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఏకాగ్రత దెబ్బతినకుండా, ఉన్నత చదువులలో రాణించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన వారికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న నాణ్యమైన విద్యకు ఈ విద్యార్థులే అసలైన బ్రాండ్ అంబాసిడర్లని కొనియాడారు.
"టెన్త్ తర్వాత సరైన దారిని ఎంచుకోవాలి. ఆసక్తికి తగ్గ కోర్సును ఎంపిక చేసుకోవాలి. విజయాన్ని తలకెక్కించుకోకుండా నియంత్రణలో ఉంచుకోవాలి" అని రాంసుందర్ రెడ్డి సూచించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)